తెలంగాణ

వర్గీకరణ చట్టబద్ధతకు సమష్టి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 29: ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధించేందుకు పార్టీలకు అతీతంగా సమిష్టిగా పోరాడుదామని అఖిలపక్ష సమావేశం అఖిలపక్షం తీర్మానించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అధ్యక్షతన వర్గీకరణ చట్టబద్ధత అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాజీకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజాగాయకుడు గద్దర్, న్యూడెమొక్రసీ నాయకులు గోవర్ధన్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌తో పాటు పలువురు రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళతామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ పూర్తి మద్దతు నిస్తుందని, ఈ అంశంపై పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలవనున్నట్టు చెప్పారు. ఏళ్లతరబడి నానుతున్న వర్గీకరణ అంశాన్ని ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకువెళుతున్నామని, కొన్ని చట్టపరమైన సాంకేతిక అంశాలవల్ల జాప్యం జరుగుతుందని బిజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఈ అంశంపై ఈనెల 31న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిషాతో కలిసి చర్చించనున్నట్టు చెప్పారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన అంశంపై టీఆర్‌ఎస్ నాన్చుడి ధోరణి వహించడం సరికాదని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళతామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నించారు. మాదిగ సమాజం తమ న్యాయమైన డిమాండ్‌ను సాధించుకునేందుకు శాంతియుతంగా నిరసన తెలిపినా సహించలేని స్థితిలో ఇక్కడి ప్రభుత్వం ఉండటం విచారకరమన్నారు. అధికార పార్టీ ప్రజాస్వామిక హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించడం ఆవేదన కలిగిస్తోందని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కును కూడా అణిచివేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఈ అంశంపై అన్ని పార్టీలు కూర్చుని చర్చించుకోవాల్సి ఉందని అన్నారు. న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు జేఏసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని, దీనికోసం శాంతియుతంగా జరిగే అన్ని కార్యక్రమాల్లో జేఏసీ ప్రతినిధులు పాల్గొంటారని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేందుకు సహకరించక పోతే మిగితా పార్టీలన్నీ కలిసికట్టుగా ఢిల్లీకి వెళ్లి వర్గీకరణ బిల్లు పార్లమెంట్ ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. దీని ద్వారా అధికార పక్షం చేయని పని మనం చేసినట్టు అవుతుందన్నారు. అదే సమయంలో ఎంఆర్‌పీఎస్ మద్దతు ఇస్తున్నంత మాత్రమే జేఏసీ మాలలకు వ్యతిరేకం కాదని ప్రకటించారు. మందకృష్ణ మాట్లాడుతూ కేంద్రం ఓబీసీ, కాపు రిజర్వేషన్లపై చర్చిస్తుంది కాని 24 ఏళ్లుగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. టిఆర్‌ఎస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే అఖిల పక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకువెళ్లి ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేలా చూడాలన్నారు. వర్గీకరణ కోసం జరిగే ప్రతీ కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని సీపీఐ, సీపీఎం, తెలంగాణ ఇంటి పార్టీ, న్యూడెమొక్రసీలు ప్రకటించాయి.

చిత్రం.. సమావేశంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, గద్దర్,
మందకృష్ణ మాదిగ, చాడ వెంకటరెడ్డి తదితరులు