తెలంగాణ

కువైట్ రాయబార కార్యాలయం వద్ద బారులుతీరుతున్న ప్రవాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 31: ఏజెంట్ల మోసాలకు గురై కువైట్‌లో చిక్కుబడిపోయిన వారంతా స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు అక్కడి రాయబార కార్యాలయం వద్ద బారులుతీరుతున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా కువైట్‌లో అక్రమంగా ఉంటున్న వారు వారివారి స్వస్థలాలకు తరలివెళ్లేందుకు వీలు కల్పిస్తూ కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటనను జారీ చేసింది. జనవరి 29 నుండి ప్రస్తుత ఫిబ్రవరి మాసం 22వ తేదీ వరకు వెళ్లేందుకు అనుమతించింది. దీంతో ఏజెంట్లు, దళారులు, అక్కడి యజమానుల మోసాలకు గురై కువైట్‌లో చట్ట ప్రకారం ఉండే అవకాశం లేక, మరోవైపు స్వదేశానికి తిరిగి వెళ్లే మార్గం లేక మనోవేదనకు గురవుతున్న వేలాది మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఉపాధి అనే్వషణలో భాగంగా ఒక్క తెలుగు రాష్ట్రాల నుండే సుమారు ఐదు లక్షల మంది వరకు కువైట్‌కు వెళ్లి అక్కడ వివిధ వృత్తుల్లో కొనసాగుతుండగా, వారిలో సుమారు 50వేల మందికి సరైన అనుమతి పత్రాలు లేకపోవడంతో స్వదేశానికి వచ్చేందుకు వీలుపడక సంవత్సరాల తరబడి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. నకిలీ వీసాలు అంటగట్టి కొందరు ఏజెంట్ల మోసాలకు బలవగా, కువైట్‌కు వెళ్లిన తరువాత అక్కడి యజమానులు కొందరు పాస్‌పోర్టును లాక్కోవడం, ఆదేశ అనుమతి పత్రమైన బతాఖాను అందించకపోవడం వల్ల పోలీసుల కంటబడకుండా, దొంగచాటుగా దొరికిన పనులను చేసుకుంటూ జీవచ్ఛవాల్లా దుర్భర బతుకులు వెళ్లదీస్తున్నారు. స్వస్థలానికి రావాలంటే సరైన ఆధారాలు, సంబంధిత పత్రాలు చూపాల్సి ఉంటుంది. అవి లేనిపక్షంలో అక్రమంగా తమ దేశంలో నివసిస్తున్నట్టు గుర్తించి కువైట్ ప్రభుత్వం భారీ మొత్తంలో జరిమానా, జైలు శిక్షలు విధిస్తుంది. ఈ కారణంగా వేలాది మంది పరిస్థితి అనుకూలించే వరకు అక్కడే తలదాచుకోవడం ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చి చాటుమాటుగా దొరికిన పనులు చేసుకుంటూ, పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటన చేస్తూ, ఎలాంటి జరిమానాలు, జైలుశిక్షలు లేకుండా స్వస్థలాలకు వెళ్లే అవకాశం కల్పించడంతో అక్కడ చిక్కుబడిపోయి నరకయాతన అనుభవిస్తున్న వారంతా ఎంతో ఊరట చెందుతున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి చేరుకోవాలనే ఆతృతను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో గడచిన మూడు రోజుల నుండి కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద అనునిత్యం వేలాది మంది ప్రవాసులు బారులు తీరుతున్నారని తెలుస్తోంది. వీరి సంఖ్యను చూసి ఎంబసీ వర్గాలతో పాటు కువైట్ అధికార వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నట్టు సమాచారం. మొదటి రెండు రోజుల పాటు మహిళలకు ఎక్కువగా అవకాశం కల్పించడంతో, బుధవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే వేలాది సంఖ్యలో ప్రవాసులు ఎంబసీ వద్దకు చేరుకుని క్యూ లైన్‌లో నిల్చుండడం సమస్య తీవ్రతను చాటింది. అక్కడ అనుమతి పత్రాలు లేని వారంతా ప్రస్తుతం భారత రాయబార కార్యాలయానికి వెళ్లి తమ వద్ద అందుబాటులో ఉన్న ఆధారాలను సమర్పిస్తే, వాటిని పరిశీలించిన మీదట ఎంబసీ అధికారులు భారత్ రావడానికి అనుమతిస్తూ అవుట్ పాస్ జారీ చేస్తారు. ఈ అవుట్‌పాహ్‌ను ఇమిగ్రేషన్ కార్యాలయంలో సమర్పిస్తే, కువైట్‌లో కేసులేవీ లేనట్టు ధ్రువీకరించుకుని ఇమ్మిగ్రేషన్ స్టాంపు వేసి, విమాన టిక్కెట్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు వారం రోజుల వ్యవధి పడుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా నెలలు, సంవత్సరాల తరబడి అక్కడ చిక్కుబడిపోయిన వారంతా జరిమానాలు, జైలు శిక్షలకు ఆస్కారం లేకుండా స్వస్థలాలకు చేరుకునే వెసులుబాటు ఏర్పడడంతో వేలాది మంది ఎంబసీ వద్ద క్యూ కడుతున్నారు.