విశాఖపట్నం

బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 10: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటించాలని కోరుతూ శనివారం విపక్షాలు నిర్వహించిన బంద్ పాక్షికంగాను, ప్రశాంతంగా సాగింది. చెదురు,మదురు సంఘటనలు మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తలేదు. ముందస్తు అరెస్టులు, ముఖ్యమైన ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మొహరించడం వంటి చర్యలతో విశాఖ నగరంలో బంద్ ప్రభావం పెద్దగా చూపలేదు. అదీ ఉదయం సమయంలో కొద్దిసేపు ఆయా పార్టీలకు చెందిన నాయకులు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేశారు. తప్పితే జనజీవనానికి ఎటువంటి అసౌకర్యం కలుగలేదు. దీంతో వ్యాపారాలు సైతం యదావిధిగా కొనసాగాయి. కాంగ్రెస్‌పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో మద్దిలపాలెం జంక్షన్ వద్ద వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ రహదారి ద్రిగ్భంధం చేశారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుండు గీయించుకుని వినూత్న నిరసన తెలియజేశారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు అరెస్టుచేసేందుకు ప్రయత్నించగా వీరి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ద్రోణంరాజు శ్రీనివాస్ రహదారిపై పడిపోవడంతో స్వల్పగాయాలయ్యాయి. అలాగే మద్దిలపాలెం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన జాతీయ రహదారిమీదనే బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బలగాలు మొహరించి వీరందర్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు, పోలీసుల మధ్య వాగ్వివాదం నెలకొంది. చేతికందిన వారిని అందినట్టుగానే అరెస్టులు చేసి వ్యాన్‌లోకి ఎక్కించి సమీప పోలీసు స్టేషన్లకు వీరందర్ని తరలించారు. ఈ విధంగా అరెస్టు అయిన వారిలో సిపిఐ నాయకులు జెవి సత్యనారాయణమూర్తి, మార్కండేయులు, స్టాలిన్, విమల, సిపిఎం నాయకులు సిహెచ్.నర్సింగరావు, బి.గంగారాం, కుమార్, పీఓడబ్ల్యూ నేత లక్ష్మిలను పోలీసులు అరెస్టు చేశారు. మద్దిలపాలెం వద్ద వైసీపీ నేత వంశీకృష్ణ, కొండా రాజీవ్‌గాంధీ, కాంగ్రెస్ నేతలు బెహరా భాస్కరరావు, పేడాడ రమణికుమారి, సీపీఐ మహిళా నేత విమల, పీఓడబ్ల్యూ నాయకురాలు లక్ష్మి తదితరులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
స్తంభించిన ట్రాఫిక్
మద్దిలపాలెం జాతీయ రహదారి, పిఠాపురంవైపు వెళ్ళే మార్గంలో ఆందోళనకారులు తీవ్ర నిరసన కార్యక్రమం చేపట్టడంతో అరగంటకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. నగరంలోని వన్‌టౌన్, జగదాంబ జంక్షన్, కలెక్టరేట్ కార్యాలయ జంక్షన్, గురుద్వారా, అక్కయపాలెం, తాటిచెట్లపాలెం, అల్లిపురం మార్కెట్ ఏరియా, కంచరపాలెం, మర్రిపాలెం, ఎన్‌ఏడి జంక్షన్ల వద్ద కొద్దిసేపు తప్పితే బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆందోళనకారులు నినాదాలతో నిరసనలు తెలియజేశారు.
నేతలకు గాయాలు
పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో సిపిఎం నాయకులు సిహెచ్.నర్సింగరావు కంటికి గాయం కాగా, పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ రోడ్డుపై పడటంతో స్వల్పగాయాలయ్యాయి. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్‌ను అరెస్టు చేస్తున్న సందర్భంలో పోలీసు అధికారితో నెలకొన్న వాగ్వివాదం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆయా పార్టీలకు చెందిన నాయకులను అదుపులోకి తీసుకున్న సందర్భంలో తోపులాట జరిగింది.
బ్యాంకులు, కార్యాలయాలకు సెలవు
రెండవ శనివారం కావడంతో బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్యాలయాలు ముందుగానే సెలవు ప్రకటించారు. దీనివలన కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇక పాఠశాలల, కాలేజీలకు సైతం ముందుగానే సెలవులు ప్రకటించేశారు. దీనివల్ల ఆందోళనకారులు నగరంలోని ప్రధాన కూడళ్ళ వద్ద నిరసనలు, జాతీయ రహదారి దిగ్భ్రంధం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఏఐటియుసి, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
పూర్తిస్థాయిలో నడిచిన బస్సులు, ఆటోలు
శనివారం వేకువజాము నుంచే ఆర్టీసీ బస్సులు యదావిధిగా నడిచాయి. డిపోల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయలుదేరిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసులతోపాట సిటీ సర్వీసులు రోజు మాదిరిగానే నిర్వహించగలిగారు. వీటికి ఎక్కడా ఆటంకాలు కలుగలేదు. అలాగే ఆటోలు సైతం ఉదయం నుంచి రోడ్డెక్కాయి. దీంతో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. వ్యాపారాలు యదావిధిగా సాగాయి.
సిఎం దిష్టబొమ్మ దగ్ధం
వై ఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్ (ఎపి) ఆధ్వర్యంలో మద్దిలపాలెం జనశిక్షణాసంస్థ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు మాట్లాడుతూ సిఎం, ప్రధాని మోదీ 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని రెండున్నర ఏళ్ళు గడిచినా నేటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారన్నారు. నిజంగా ఏపీ ప్రజల మీద సిఎంకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో ఉన్న టిడిపి కేంద్రమంత్రులతో రాజీనామా చేయించాలని, అలాగే ప్రత్యేక హోదా ఇవ్వని బిజెపితో తెగతెంపులు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు భయంతోనే చంద్రబాబునాయుడు డ్రామాలు ఆడుతున్నారన్నారు. తమ యూనియన్ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు విద్యాసంస్థలు బంద్‌ను ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ఆళ్ల స్వామి, కె.్ధరజ్, అశోక్, కోటిలను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులే ఎక్కువ
జగదాంబ, సెప్టెంబర్ 10 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ నగరంలో నామమాత్రంగానే ప్రభావం చూపింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో నిరసనకారుల కంటే పోలీసులు, అధికారులే ఎక్కువగా కనిపించారు. దీంతో ఇది పార్టీలు, ప్రజా సంఘాల నిరసన... లేక పోలీసుల నిరసన అన్నట్లు కనిపించింది. ముఖ్యంగా మద్దిలపాలెం కూడలిలో ఈ విధమైన దృశ్యాలు ఎక్కువగా కనిపించాయి. రోడ్ల మీద ఎక్కడ చూసినా పోలీసులే బారులు తీరి, గుంపులు గుంపులుగా కనిపించారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో పౌరుల్లో కనిపించింది. ఆందోళన చేయడానికి పూనుకున్న కొందరు నాయకులను ముందుగానే హౌస్ అరెస్టు చేయడం, నిరసనకు దిగిన వారిని వెనువెంటనే అదుపులోకి తీసుకుని వాహనాల్లో స్టేషన్లకు తరలించడంతో బంద్‌పై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా వైకాపా నేతలను ముందుగా హౌస్ అరెస్టు చేయడంతో బంద్ పెద్దగా ప్రభావవంతం కాలేకపోయింది. సిపిఐ, సిపిఎం,ఎ ఐటియుసి, కాంగ్రెస్ నాయకులను సైతం ఎక్కడా ఏ విధంగా ఆందోళనలు చేయనివ్వకపోవడంతో ఉదయం ఆరు నుండి ప్రారంభమైన ఆందోళనలు తొమ్మిది గంటలకే సద్దుమణిగిపోయి బంద్ వాతావరణమే కనిపించలేదు. పోలీసులు మాత్రం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎక్కడ పడితే అక్కడే బారులుతీరి కనిపించారు. దీనికి తోడు మధ్యాహ్నం నుండి వర్షం పడడంతో బంద్ పూర్తి నీరుగారిపోయినట్లు అయింది. మద్దిలపాలెం, జగదాంబ, కంచరపాలెం, వెంకోజీపాలెం, గురుద్వారా, ఎన్‌ఎడి ప్రాంతాల్లో కూడా బంద్ అంతంతమాత్రంగానే జరిగింది. మొత్తం మీద నిరసనకారులు పది మంది ఉంటే పోలీసులు మాత్రం వందల సంఖ్యలో కనిపించడం విశేషం.
బంద్ విచ్ఛిన్నానికి సిఎం కుట్ర
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 10: రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం విపక్షాలు నిర్వహించిన రాష్ట్ర బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన తీరుపై విపక్ష రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. రాష్ట్ర బంద్‌ను ఎలాగైనా విఫలం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పెద్దఎత్తున పోలీసు బలగాలను దించి, ఆందోళనను అణచివేసే చర్యలకు పూనుకోవడం దారుణమని ఆరోపించారు. జాతీయ రహదారిపై ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ డిపోలు, ముఖ్య ప్రాంతాల్లో వందల సంఖ్యలో పోలీసులను మోహరించి బంద్‌ను అణచివేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం అసరించిందని ఆరోపించారు. పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలను నిలువరించే ప్రయత్నంలో పోలీసులు కాస్త అతిగా ప్రవర్తించారని మండిపడ్డారు. తీవ్రవాదులు, ఉగ్రవాదుల మాదిరి మాదిరి ఉద్యమ కారులను బలవంతంగా ఈడ్చుకెళ్ళిన పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా వ్యవహరించారని ఆరోపించారు. నగరంలో బంద్ సందర్భంగా పోలీసులు 38 కేసులు నమోదు చేసి, 538 మందిని అరెస్టు చేశారు.
రాష్ట్ర శ్రేయస్సు తాకట్టు
తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర శ్రేయస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు తాకట్టుపెట్టారని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అందరితో కలిసి పోరాడాల్సిన తరుణంలో విపక్షాలు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేసే చర్యలకు ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. తీవ్ర వాదుల మాదిరి తమను అరెస్టు చేయడం దారుణమన్నారు.
మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ హోదా సాధించాల్సిన తరుణంలో ప్రభుత్వం ప్యాకేజీకి ఆశపడి రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టిందని ఆరోపించారు. పోలీసుల తీరు తీవ్ర అభ్యంతర కరమని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వారు వ్యవహరించడం మంచి పద్దతి కాదన్నారు. సిపిఎం, సిపిఐ ప్రతినిధులు నర్శింగరావు, జెవి సత్యనారాయణ మాట్లాడుతూ బంద్‌ను నీరు గార్చేందుకు ప్రభుత్వం అనుసరించిన తీరు అత్యంత దారుణమని అన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడలేని చంద్రబాబు విపక్షాలు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు మాత్రం ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు.
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు
రెండు వారాల గడువు

* తిరస్కరించిన దరఖాస్తుల పునః పరిశీలన * కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 10: ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్దీకరించేందుకు ప్రభు త్వం ఇచ్చిన గడువును మరో రెండు వారాలు పొడిగించినట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జారీ చేసిన 296, 118 జిఓల మేరకు వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోనున్నట్టు తెలిపారు. జిఓ 296 ప్రకా రం 100 చదరపు గజాల లోపు స్థలాల్లో నిర్మించుకున్న భవనాలను క్రమబద్ధీకరించనున్నట్టు తెలిపారు. 100 చదరపు గజాలకు పైబడిన స్థలాల్లో భవనాలను జిఓ 118 మేరకు అదనపు ధరను చెల్లించి నిరభ్యంతర సర్ట్ఫికెట్ పొందాలని సూచించారు. జిల్లాలో 118 జిఓ ప్రకారం 3,094 దరఖాస్తులు అందాయని తెలిపారు. జిఓ 296 ప్రకారం జిల్లా వ్యాప్తంగా 64,660 దరఖాస్తులు అందాయని, వీటిని పరిశీలించి 27,022 దరఖాస్తులు క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా గుర్తించినట్టు తెలిపారు. మరో 28,659 దరఖాస్తులను తిరస్కరించినట్టు వెల్లడించారు. చెరువులు, వాగులు, శ్మశాన వాటికలు, రహదార్లు తదితర అభ్యంతరకర స్థలాల్లో నిర్మాణాలను మాత్రమే తిరస్కరించామన్నారు. తిరస్కరించిన దరఖాస్తులను మరోసారి పునః పరీశీలించేందుకు సిబ్బందికి బాధ్యతలు అప్పగించామన్నారు. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారిలో 9,897 మంది ఇప్పటి వరకూ 49.48 లక్షలు చెల్లించారన్నారు.
గాజువాక హౌస్ కమిటీ భూములకు సంబంధించి గతంలో జిఓ 166 ద్వారా కొంతమంది భూములను క్రమబద్ధీకరించడం జరిగిందన్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జిఓ ప్రకారం కమిటీకి చెందిన 900 ఎకరాల్లో భూముల క్రమబద్ధీకరణకు 1,011 దరఖాస్తులు అందాయని, మరో 10వేల దరఖాస్తులు రావచ్చని అభిప్రాయపడ్డారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ జె నివాస్ పాల్గొన్నారు.

పరిశ్రమల
నిర్మాణాల్లోప్లాన్ పాటించాలి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 10: పరిశ్రమల నిర్మాణాల్లో ప్లానింగ్‌ను పాటించాలని, బిపిఎస్ పాలసీని ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. జిల్లాలో పరిశ్రమలను స్థాపించడానికి అన్నివిధాలుగా ప్రోత్సహిస్తామని వాటికి కావాల్సిన అన్ని వౌ లిక వసతులను కల్పిస్తామన్నారు. శనివారం ఇక్కడి కలెక్టరేట్ సమావేశ మం దిరంలో ఆయన అధ్యక్షతన జరిగిన జిల్లా పరిశ్రమల ప్రోత్సహాక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు చేసుకున్న ధరఖాస్తులను పరిశీలించి సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులను మంజూరు చేయాలని సంబంధిత శాఖ ల అధికారులను ఆదేశించారు. ప్రస్తు తం పెండింగ్‌లో ఉన్న ధరఖాస్తులకు సంబందించి త్వరగా అనుమతులను మంజూరు చేయాలన్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి సమావేశం అనంతరం సింగిల్ డెస్క్ పాలసీకి సంబంధించిన సమావేశాన్ని నిర్వహించి పెండింగ్ లేకుండా చూడాలన్నారు. చిన్నతరహా, సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి మొత్తం 12 క్లైమ్‌లకు 10 క్లైమ్‌లు సిఫారసు చేశారని రూ.1,11,22,806లు సబ్సిడీకి క్లెయిమ్‌లను కలెక్టర్ అనుమతించారు. పరిశ్రమల స్థాపనకు అనుమతులు మంజూ రు, స్థలాల కేటాయింపు, అవసరమైన ప్రోత్సహకాలు, వౌలిక వసతులకల్పన తదితర అంశాలపై శాఖలవారీగా కలెక్టర్ సమీక్షించారు. సింగిల్‌విండో, సింగిల్‌డెత్ విధానం ద్వారా పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తుల్లో ఎన్నింటిని పరిష్కరించారు, ఇంకా ఎన్నింటిని పరిష్కరించాల్సి ఉంది, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారుల చేపట్టిన చర్యలపై సమీక్షించారు. కాలుష్య నియంత్రణ బోర్డు, పరిశ్రమలు, జీవిఎంసి, వుడా, అగ్నిమాపక, విద్యుత్, ఐలా, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖ ల్లో ఇంకా పరిష్కారం కాని దరఖాస్తులకు సంబందించి అనుమతులను మంజూరు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ పాలసీకి సంబందించి వివిధ శాఖల నుండి ఆన్‌లైన్ ద్వారా 23 దరఖాస్తులు రాగా వాటిలో 21 పరిష్కారం కాగా రెండు ధరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయని పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ కలెక్టర్‌కు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ రామలింగేశ్వరరాజు, జెడ్‌ఎం యతిరాజులు, కాలుష్య నియంత్రణబోర్డు, పరిశ్రమలు, జీవిఎంసి, వుడా, అగ్నిమాపక, విద్యుత్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, భూగర్భ జలశాఖ, ఆటోనగర్ ఇండస్ట్రీయల్ అసోసియేషన్ సభ్యులు, పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎయులో ఔషధ మొక్కల పార్క్
* పిఎంవితో ఒప్పందం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 10: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం తన వంతు చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన పర్యావరణ విధానాల నమూనాలను వర్సిటీ ఆవరణలో అభివృద్ధి చేసి విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా పర్యావరణ మార్గదర్శి వైశాఖి (పిఎంవి) సంస్థతో ఎయు శనివారం ఒప్పందం చేసుకుంది. ఎయు పాత పోస్ట్ఫాస్ వెనుక ఔషధ గుణాలున్న మొక్కలు, చెట్లు, తీగలతో ఒక పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఇందులో తూర్పు కనుమల్లో లభించే వివిధ రకాల ఔషధ మొక్కలను సేకరించి ఇక్కడ పెంచనున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోని లభించే ఔషధ మొక్కలను సేకరించి భవిష్యత్ తరాలకు వాటిని పరిచయం చేసేందుకు పెంచనున్నారు. ఔషధ గుణాలున్న మొక్కల, చెట్ల నర్సిరీ, దోమల నివారణకు ఉపకరించే మొక్కల నర్సిరీ, భూగర్భ జలాలను పెంచే నమూనా, పాలేకర్, చౌహాన్ మిశ్రమ వ్యవసాయ విధానాల నమూనాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఉత్పత్తి అయ్యే చెత్త సమస్యకు పరిష్కార నమూనా, వ్యర్థాలను ఎరువుగా మార్చడం, ఇళ్లు, కార్యాలయాల వద్ద ఆకు, కాయగూరల పెంపకానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందచేసేందుకు వీలుగా ఎయు ఒప్పందం చేసుకుంది. స్థానిక రకాలకు చెందిన దేశీయ విత్తన నిధి, వర్సిటీ వసతి గృహాల్లో కిచెన్ గార్డెన్‌ల ఏర్పాటు వంటివి ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందంపై ఎయు వీసీ ఆచార్య నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఉమా మహేశ్వరరావు, విజయ్ నిర్మాణ సంస్థ అధినేత, పిఎంవి ప్రతినిధి ఎస్.విజయకుమార్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ డాక్టర్ మాధవ బాబు, డీన్స్ వెంకటకృష్ణ, బాల ప్రసాద్, రెక్టార్ ఇఎ నారాయణ, సైన్సు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సివి రామన్, తదితరులు పాల్గొన్నారు.

బంద్ పాక్షికం
* ఎక్కడికక్కడే మోహరించిన పోలీసులు * ఆందోళనకారుల అరెస్టు
* మూతబడిన వాణిజ్య సముదాయాలు

అనకాపల్లి, సెప్టెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉభయ కమ్యునిస్టు పార్టీలతోపాటు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ శనివారం అనకా పల్లి పట్టణంలో చేపట్టిన బంద్ పాక్షికంగా జరిగింది.బంద్ దిగ్విజయాన్ని పర్యవేక్షిస్తున్న వివిధ పార్టీలకు చెందిన నేత లను ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఎక్కడి కక్కడ అరెస్టు చేయడంతో పట్టణంలో బంద్ ప్రభావం పెద్దగా కానరాలేదు. డిఎస్పీ పురుషోత్తం ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోలీస్ బలగాలు ఎక్కడికక్కడే మొహరించి బంద్ అమలు కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణ వైసీపీ నేత జానకిరామరాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుగానే స్థానిక ఆర్టీసీ కాం ప్లెక్స్‌కు వెళ్లి బస్సులు తిరగకుండా చేసిన ప్రయత్నాలను పోలీసు లు బెడిసికొట్టించాయి. పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్‌లోను బంద్ అమలు చేసేందుకు వైసీపి, సిపిఐ, సిపిఎం పార్టీలు చేసిన ప్రయత్నాలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డగించారు. నెహ్రూచౌక్ జంక్షన్‌లో పట్టణ వైఎస్సాఆర్ సిపి అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు ఆధ్వర్యంలో నిరసన దీక్షా శిబిరాన్ని ఏర్పాటుచేసి పట్టణంలో బంద్ సమర్ధవంతంగా అమలు జరిగేలా వివిధ బృందాలు పర్యవేక్షించాయి. పట్టణ వైఎస్సాఆర్ సిపి యువజన విభాగం అధ్యక్షులు తమ అనుచరులతో గాంధీనగరం, చోడవరం రోడ్డు తదితర ప్రాంతాల్లో బంద్ అమలుకు చర్యలు చేపట్టారు. టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌తోపాటు ఇతర పోలీస్ అధికారులు వైసీపి నేతలను ఎక్కడికక్కడే బలవంతంగా అడ్డగించి ఎక్కడికక్కడే అరెస్టులు చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయం నుండి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివెళ్లి బంద్ అమలును పర్యవేక్షించారు. పార్టీ జెండాలు చేతబూని ఎర్రకండువాలు దరించి ప్రత్యేక ఆంధ్రా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పట్టణ సిపిఐ కార్యదర్శి వైఎన్ బద్రం, మండల కార్యదర్శి ఆడారి అప్పారావు, ఎఐటియుసి కార్యదర్శి కోన లక్ష్మణ్, పార్టీ నాయకులు కోరిబిల్లిశంకరరావు, విత్తనాల పోతురాజు, మాజీ కౌన్సిలర్ తాకాశి వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. బస్సుల రాకపోకలను అడ్డగిస్తున్న ఈ ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సిపిఎం అనకాపల్లి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. బంద్ అమలును ర్యాలీగా పర్యవేక్షిస్తుండగా అనకాపల్లి పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సిపిఎం జిల్లా కమిటీ కన్వీనర్ ఎ.బాలకృష్ణ, గంటా శ్రీరామ్, బుద్ధ శ్రీను తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 60మందిని అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌కు అక్రమంగా తరలించగా అక్కడ సంబంధిత నిరసనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా సాధించేవరకు వామపక్షాలు చేపట్టే ఆందోళనలకు ప్రజలు మద్దతు పలకాలని వారు పిలుపునిచ్చారు. పట్టణ వైఎస్సాఆర్ సిపి ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు, కుండల రామకృష్ణ, ఒమ్మి రాముయాదవ్, మామిడి నూకరాజు, సిపిఐ, సిపిఎం పార్టీల నేతలు, కార్యకర్తలు ఈ ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్సుల రాకపోకలు యథావిధిగా సాగడం, బ్యాంక్‌లకు సహజంగానే సెలవుదినం కావడంతో బంద్ ప్రభావం అంతగా అనకాపల్లిలో కానరాలేదు. బంద్ సందర్భంగా వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డాయి.

జి.సి.సి. సబ్బుల తయారీ కార్మికుల సమ్మె బాట
అరకులోయ, సెప్టెంబర్ 10: స్థానిక గిరిజన సహకార సంస్థ (జి.సి.సి.) సబ్బుల తయారీ కేంద్రంలో పనిచేస్తున్న గిరిజన కార్మికులు శనివారం సమ్మె చేపట్టారు. గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సొసైటీ (జి.పి.సి.ఎం.ఎస్.) కార్యాలయం ప్రహరీ గోడ ఎదురుగా ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి గిరిజన కార్మికులు సమ్మెకు దిగారు. సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో సమస్యల సాధన కోసం విధులు బహిష్కరించి 25 మంది గిరిజన కార్మికులు సమ్మెలో కూర్చున్నారు. సబ్బుల తయారీ కేంద్రం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వైస్ చైర్మన్ ఎ.ఎస్.పి.ఎస్. రవిప్రకాష్‌కు సమ్మె నోటీసు ఇచ్చి కార్మికులు సమ్మె బాట పట్టారు. సబ్బుల తయారీ కేంద్రంలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న తమకు నెల వేతనం నిర్ణయించి కనీస వేతనం అమలు చేయాలని, పీస్ రేటు రద్దు చేయాలని, 2014వ సంవత్సరంలో కార్మికులతో చర్చించి ఒప్పం దం చేసుకున్న హామీలను తక్షణమే అమలు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని చట్ట ప్రకారం మహిళలకు జీతం కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, కార్మికులకు మెడికల్ అలవెన్స్, బీమా కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో జి.సి.సి. సబ్బుల తయారీ కేంద్రం కార్మికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎస్.రాంబాబు, వి.సింహాద్రి, కె.సత్యారావు, బి.ప్రభాకర్, వి.పద్మ, ఎం.లక్ష్మి, కె.కుమారిలతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.