విశాఖపట్నం

రైతు బజార్లు, పూర్ణా మార్కెట్‌లో కంపోస్ట్ తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 10: స్వచ్ఛ భారత్‌లో భాగంగా నగర పరిధిలో తడి, పొడి చెత్త సేకరణ, విభజన ఉత్పత్తి కేంద్రంలోనే జరగాలని జివిఎంసి కమిషనర్ హరినారాయణన్ అన్నారు. జివిఎంసి సమావేశ మందిరంలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, బల్క్ వేస్ట్ ప్రొడ్యూసర్స్‌తో శనివారం నాడిక్కడ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి చెత్తను కంపోస్ట్‌గా మార్చుకుంటే చెత్త సమస్య సగం తీరినట్టేనన్నారు. ఈ నెల 15 నుంచి ప్రాథమిక దశలోనే తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం, తడిచెత్తను కంపోస్ట్ ఎరువుగా మార్చే కేంద్రాలకు తరలించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ విధానం ఆచరణలో భాగంగా నగరంలోని ఆరు రైతు బజార్లతో పాటు, పూర్ణా మార్కెట్‌లో కంపోస్ట్ తయారీ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే అపార్ట్‌మెంట్‌లు, ఇళ్ల నుంచి సేకరించే చెత్తను సైతం ప్రాథమిక స్థాయిలోనే కంపోస్ట్‌గా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. దీనికోసం అన్ని వార్డుల్లో కంపోస్ట్ ఎరువు తయారీ యంత్రాలను ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. దీనికి క్షేత్ర స్థాయిలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల సహకారం అవసరమన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలు, ప్రాధాన్యతలను వివరిస్తూ గతేడాది స్వచ్ఛ సర్వేక్షన్‌లో విశాఖ 78 నగరాలతో పోటీపడి 5వ స్థానం దక్కించుకుందని, 2017లో 500 నగరాలు పోటీ పడుతున్నాయని, ఈ సారి మరింత మెరుగైన ర్యాంకు సాధించే దిశగా నగర ప్రజలు, జివిఎంసి అధికారులు సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉందన్నారు. ఎక్సెల్ ఇండస్ట్రీస్ ప్రతినిధి అరుణా శేఖర్ తడిచెత్తను కంపోస్ట్‌గా మార్చే విధానం, యంత్రాల పనితీరు, దీనివల్ల ఎదురయ్యే లాభాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భారీ ఎత్తున చెత్త ఉత్పత్తయ్యే కేంద్రాలకు, గృహాల్లో వినియోగించే చెత్తతో కంపోస్ట్ ఉత్పత్తి చేసే యంత్రాల పనితీరుపై అవగాహన కల్పించారు. విశాఖ నగర హోటలియర్స్ అసోసియేషన్ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కంపోస్ట్ ఎరువుల తయారీ యంత్రాల పనితీరును చూసిన మీదట వాటిని ఏర్పాటు చేసుకునేందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే ఉత్పత్తయిన ఎరువురు నిల్వ చేసేందుకు ప్రత్యామ్నాయం చూడాలని కోరారు. కార్యక్రమంలో సిఎంహెచ్‌ఓ డాక్టర్ ఎ హేమంత్, అన్ని జోన్ల నుంచి జోనల్ కమిషనర్లు, ఎఎంహెచ్‌ఓలు పాల్గొన్నారు.