విశాఖపట్నం

ఘరానా మోసగాడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 10: నకిలీ అభరణాలపై బంగారు పూత పూసి వాటిని బంగారు ఆభరణాలుగా బ్యాంక్ సిబ్బందిని నమ్మించి తనఖా పెట్టి రూ. ఆరు కోట్ల మేర నగదు కాజేసిన ఓ మోసగాడిని, అతనికి సహకరించిన మరో పదకొండు మందిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులను శనివారం ఎంవిపిజోన్ పోలీసు స్టేషన్ ఆవరణలో జరిగిన విలేఖరుల సమావేశంలో హాజరు పరిచి, కేసు వివరాలను అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు తెలిపారు. ఒడిషాకు చెందిన సుంకురు నీలమాధవ్‌సుబుద్ధి (34) సుమారు పదేళ్ల క్రితం విశాఖకు చేరుకుని, ఇక్కడ పిఎంపాలెంలోని ఎంకె రెసిడెన్సీలో ఉంటున్నాడు. తర్వాత నీలమాధవ్ అనేక వ్యాపారాలు చేశాడు. వాటిల్లో నష్టం రావడంతో అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని భావించాడు. ఒడిషాలోని భువనేశ్వర్‌లో ఉంటున్న ఉమాశంకర్‌పాత్రోకు చెందిన బంగారు దుకాణంలో పని చేస్తున్న ప్రద్యామ్‌పాండే సహాయంతో నకిలీ అభరణాలపై బంగారు పూత వేయించి వాటిని నగరంలోని ఎంవిపి డబుల్‌రోడ్డులో గల కొటక్ మహేంద్ర బ్యాంక్‌లో తనఖా పెట్టి రూ.ఆరు కోట్లు రుణంగా తీసుకున్నాడు. అయితే నెలవారీ వాయిదాలను నీలమాధవ్ సరిగ్గా చెల్లించకపోవడంతో వాటిని వేలంలో విక్రయించడానికి బ్యాంక్ సిబ్బంది సిద్ధమయ్యారు. ఈ తరుణంలో నీలమాధవ్ పెట్టిన బంగారం ఆభరణాలు నకిలీవిగా గుర్తించిన బ్యాంక్ మేనేజర్ లక్ష్మీశ్రీనివాస్ ఈనెల ఏడో తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా అసలు విషయం బయట పడింది. వివిధ బినామీ పేర్లతో 18ఎకౌంట్లను కొటక్ బ్యాంక్‌లో తెరిచి, ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో నగదు డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు తన తల్లి శ్యామల పేరుతో రూ.కోటి రుణంగా తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అదే విధంగా బ్యాంక్‌లోని ఐదుగురు ఉద్యోగులు నిందితుడుతో కలిసి బ్యాంక్‌ను తప్పుదోవ పట్టించి, తాకట్టు పెట్టిన బంగారం 22కారెట్ల బంగారమేనని రిపోర్టు ఇచ్చినట్టు ఎసిపి తెలిపారు. నిందితుడు కొటక్ బ్యాంక్‌నే కాకుండా ఇతర బ్యాంక్‌లను కూడ పై విధంగా మోసం చేశారని, వాటి గుర్తించి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రధాన నిందితుడు, అతని తల్లితో పాటు బినామీ పేర్లతో ఎకౌంట్ తీసుకున్న జి.వినోధ్‌కుమార్, కె.శ్రీనివాసరెడ్డి, పిల్లా కళావతి, జల్లి నగేష్, పి.యల్లయ్యరెడ్డిలతో పాటు బ్యాంక్ ఉద్యోగులు కోసన భానోజీరావు, ఎ.శివకుమార్, ఎస్.మణిభూషణ్, ఆర్.పాండురంగా, డి.వీరభద్రస్వామిలను అరెస్టు చేసినట్టు ఆయన వెల్లడించారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎసిపితో పాటు ఎంవిపిజోన్ సిఐ కె.పైడపునాయుడు, ఎస్సై తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.
పేదల అభ్యున్నతికి టిడిపి నిరంతర కృషి
వేపగుంట, డిసెంబర్ 10 : పేద ప్రజల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. జివి ఎంసి జోనల్ కార్యాలయం ఆవరణలో శనివారం అర్హులైన పేదలకు మంజూరైన పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. అవి పేదలకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బి ఆర్‌టి ఎస్ కారిడార్‌లో స్థలాలు కోల్పోయిన వారికి డబుల్ టిడి ఆర్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అడ్డాల రామరాజు, గంట్ల పెంటారావు, టి. కనకరాజు, కర్రి పైడిరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.