విశాఖపట్నం

మృత్యుకెరటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరవాడ, జూన్ 17:ఒక గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృత్యువాత పడగా మరో యువకుడు సముద్రంలో గల్లంతైన విచారకర సంఘటన పరవాడ ప్రాంతాన్ని శోక సముద్రంలో ముంచింది. మృతుల స్వగ్రామమైన పరవాడ మండలం, వెనె్నలపాలెం ప్రజలచే కన్నీళ్లు పెట్టించింది. వేర్వేరు చోట్ల పని చేస్తూ జీవనం సాగిస్తున్న యువకులంతా ఆదివారం తిక్కవానిపాలెం సముద్ర తీరంలో గెట్ టూ గెదర్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా పరవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007-08 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన వారే. విద్యార్థి దశను మరోసారి గుర్తు చేసుకునేందుకు ఈ గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో భాగంగా విద్యార్థులంతా తిక్కవానిపాలెం సముద్ర తీరంలో ఆత్మీయ కలయిక పేరుతో ఆదివారం కలిశారు. మధ్యాహ్నం వరకు సరదాగా గడిపిన యువకులు పయిల మహేష్ (28), సిరపురపు రామకృష్ణ (27), వెనె్నల నరేష్ (27), లాలం నర్సింగరావు (27), సందీప్ అనే అయిదుగురు సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. స్నానం చేస్తుండగా ఒక కెరటం వచ్చి వారిని లాక్కుపోయింది. దీంతో వారంతా గోల చేస్తుండగా తీరంలో ఉన్న స్నేహితులంతా చూశారు. వెంటనే వారిని రక్షించేందుకు సముద్రంలోకి దిగారు. కెరటాల్లో చిక్కుకున్న పయిల మహేష్, సిరపురపు రామకృష్ణ, వెనె్నల నరేష్, సందీప్ అనే నలుగురు యువకులను బయటికి తీసుకు వచ్చారు. అప్పటికే మహేష్, రామకృష్ణ, నరేష్ అపస్మారక స్థితికి చేరుకున్నారు. సందీప్ మాత్రం బాగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే లాలం నర్సింగరావు ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అపస్మారక స్థితికి చేరుకున్న ముగ్గురు యువకులను వెంటనే గాజువాకలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిని పరిశీలించి మృతి చెందినట్లు నిర్థారణ చేశారు. గాజువాక ప్రైవేటు ఆసుపత్రి నుండి నేరుగా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను పోలీసులు తరలించారు. గాజువాక ప్రైవేటు ఆసుపత్రి వద్దకు ఎమ్మెల్యే బండారు కుమారుడు అప్పలనాయుడు, వెనె్నలపాలెం ఎంపీటీసీ పయిల రథాల సన్యాసిరావు చేరుకున్నారు. వీరితో పాటు మహేష్ భార్య, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను చూసిన బండారు కుమారుడు అప్పలనాయుడుతో పాటు బంధువులు కూడా కంట తడి పెట్టారు. మహేష్ భార్య గౌతమిని ఆపడం ఎవరి తరం కాలేదు. మృతులు ముగ్గురితో పాటు గల్లంతైన మరో యువకుడు లాలం నర్సింగరావుతో సహా అంతా వారి వారి తల్లిదండ్రులకు ఏకైక కుమారులు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒక్కగానొక్క కుమారులు ఇలా మృత్యవాత పడడంతో తల్లిదండ్రులు, తోబుట్టువులను ఆపడం ఎవరి తరం కాలేదు. మృతుల్లో ఒకడైన పయిల మహేష్‌కు మాత్రమే వివాహం అయింది. మహేష్‌కు భార్య గౌతమితో పాటు ఒక కుమార్తె ఉంది. మృతదేహాలను పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. మృతులు ముగ్గురితో పాటు గల్లంతైన నర్సింగరావుది ఎమ్మెల్యే బండారు స్వగ్రామమైన వెనె్నలపాలెం. మృత్యుంజయుడిగా బయటికి వచ్చిన సందీప్‌ది కూడా వెనె్నలపాలెం గ్రామమే. సంఘటన జరిగిన వెంటనే పరవాడ సబ్ ఇన్‌స్పెక్టర్ చిన సోమునాయుడు తీరానికి చేరుకుని సంఘటన ఎలా జరిగిందన్న విషయాన్ని తోటి స్నేహితులను అడిగి తెలుసుకున్నారు.