విశాఖపట్నం

మంచినీటి కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 17: జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యానికి ఫలితమే విశాఖలో తాగునీటి ఎద్దడికి కారణమని జిల్లా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. నగరంలోని ప్రభుత్వ అతిధిగృహంలో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి అవసరమైన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితులు తలెత్తేవికాదన్నారు. గోదావరి, ఏలేరు నుంచి నీటిని తీసుకునే క్రమంలో జివిఎంసి అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇదే పరిస్థితులు తలెత్తినప్పుడు రూ.540 కోట్లతో కాతేరు నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా తెచ్చామని గుర్తు చేశారు. సుమారు 5 టిఎంసిల నీటిని కాతేరు నుంచి తెచ్చుకునే అవకాశం ఉండగా, కేవలం 3 టిఎంసిల నీటిని మాత్రమే తెచ్చుకుంటున్నారన్నారు. ఇప్పటికీ కాతేరు నుంచి నీటిని పంపింగ్ చేసుకుని నీటిని ఏలేరు కాలువ ద్వారా తెచ్చుకోవచ్చన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన చర్చలో పుష్కర ఎత్తిపోతల నుంచి నీటిని ఏలేరు కాలువ ద్వారా నగరానికి రప్పిం చే అంశం ప్రస్తావనకు వచ్చిందన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలోని తాండవ, రైవాడ రిజర్వాయర్ల నుంచి నీటిని తరలించే అంశాన్ని జిల్లా యంత్రాంగం తెరపైకి తేవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాండవ జలాశయం కింద రైతులకు సంబంధించి 52వేల ఎకరాల ఆయకట్టు ఉందని, వారి సాగు అవసరాల నీటిని పరిశ్రమలకు తరలించే నిర్ణయం సరికాదన్నారు. ఇక తాండవ జలాశయం పరిధిలోని పలు గ్రామాల్లో 198 చెరువులు ఉన్నాయని, ఆ ప్రాంతంలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పశువులకు సైతం నీళ్లు లేని పరిస్థితు లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం తాండవ జలాశయంలో కేవలం 0.46 టిఎంసిల నీరు మాత్రమే ఉందని, దీనిలో 0.25 టిఎంసిల నీటిని విశాఖ తరలించేందుకు ప్రతిపాదించారన్నారు. అయితే తాండవ పరిధిలోని చెరువులను పూర్తిగా నింపిన తర్వాతే మిగిలిన నీటిని తీసుకునేందుకు రైతులను తాను ఒప్పిస్తానన్నారు. అది కూడా నగర ప్రజల తాగునీటి అవసరాలకే పరిమితమని స్పష్టం చేశారు. తాండవ నీటిని తరలించాలంటే అధికారిక కమిటీ, రైతుల అంగీకారం అవసరమని యంత్రాంగం గుర్తించాలన్నారు. అధికారుల్లో ముందుచూపు కొరవడడం వల్లే తాగునీటి ఇబ్బందులు తలెత్తాయని మంత్రి అయ్యన్న మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిమిత్తం కేంద్రం మంజూరు చేసిన రూ.50 కోట్ల నిధులను నగరంలో తాగునీటి వనరుల్లో పూడికతీతకు మళ్లించుకుంటే ఈ పరిస్థితులు దాపురించేవి కావన్నారు. మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ, గంభీరం, గోస్తనీ రిజర్వాయర్లలో పూడికతీతకు ఈ నిధులు కేటాయిస్తే తాము కూడా తోడ్పాటునందిస్తామన్నారు. ఇక స్టీల్‌ప్లాంట్ కూడా తన నీటి వనరులను వృద్ధి చేసుకునే విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరించిదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తపడాలని సూచించారు. ఇక పోలవరం ఎడమ కాలువ పూర్తయితే వచ్చే నీటిని నిల్వచేసుకునేందుకు అవసరమైన రిజర్వాయర్లను గుర్తించి, ఇప్పటి నుంచి పనులు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉందని అధికారులకు సూచించారు.