విశాఖపట్నం

అణువిద్యుత్ కేంద్రాన్ని అడ్డుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 17: ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలను నాశనం చేసే కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటును అడ్డుకోవాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ఏర్పాటు చేయనున్న అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఎయు అసెంబ్లీ హాల్‌లో ఆదివారం జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సు ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ జీవనోపాధి దెబ్బ తింటుందని, మత్స్యకారులు వెళ్లిపోవాల్సి ఉంటుందన్నారు. జపాన్‌లోని పుకుషిమా అణు విద్యుత్ కేంద్రం ప్రమాదం జరిగి మూడు సంవత్సరాలు కావస్తున్నా, ఇప్పటికీ ఆ కేంద్రం పరిసరాల్లోకి వెళ్లలేని విధంగా రేడియో ధార్మికత వెలువడుతోందని వివరించారు. సైనిక మిత్రునిగా ఒప్పందం చేసుకున్నాము కనుక, అమెరికా నుంచి రియాక్టర్లను కొనుగోలు చేసి విద్యుత్ కేంద్రం ఏర్పాటు సరికాదన్నారు. ప్రమాదం జరిగితే భారీ నష్టం జరుగుతుందని తెలిపారు. అమెరికాతో ఒప్పందం చేసుకుని ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా, ఒక అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు కాలేదని, కూడన్‌కుండ్రంలోని 25 సంవత్సరాల క్రితం రష్యాతో చేసుకున్న ఒప్పందం ఫలితమని గుర్తు చేశారు. ప్రమాదం జరిగితే రియాక్టర్లు సరఫరా చేసిన అమెరికన్ సంస్థ బాధ్యత వహించాల్సి రావడమే అణు ఒప్పందం తరువాత ఒకటీ కూడా ఏర్పాటు కాకపోవడానికి కారణమన్నారు. గరిష్ఠంగా 1500 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని మోదీ ప్రభుత్వం ఒప్పించినా, దాని ప్రిమీయం కూడా భారత్ చెల్లించేలా అమెరికన్ సంస్థలకు సహకరిస్తోందని గుర్తు చేశారు. లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసే ఈ కేంద్రం ఏర్పాటును అంగీకరించకూడదని పిలుపునిచ్చారు. దీనిని ప్రజా ఉద్యమంగా మార్చాలన్నారు. కేంద్ర ఇంధన శాఖ మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఇఎఎస్ శర్మ మాట్లాడుతూ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు స్థలం ఎంపిక చేసేందుకు వచ్చిన కమిటీ భూకంపాల ప్రభావంపై అధ్యయనం చేయాలని ఆదేశించి ఏళ్లు గడుస్తున్నా, ఆ పని జరుగలేదన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియచేయకుండా మభ్య పెడుతుతున్నారు. పుకుషిమాలో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకూ జపాన్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, కొవ్వాడలో ప్రమాదం జరిగితే రాష్ట్ర ఖజనా దివాళా తీస్తుందన్నారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్, యుపి తదితర రాష్ట్రాలు వద్దన కాలుష్య, ప్రమాదకారక పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. రాష్ట్రం ఒక డంపింగ్ యార్డుగా మారిందని విమర్శించారు. 2000 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న అణు విద్యుత్ కేంద్రం చుట్టూ 1.6 కిలోమీటర్ల మేర ఏమీ ఉండకూడదని, 5 కిలోమీటర్ల మేర ఎగ్జిక్యూటివ్ జోన్ అని తెలిపారు. దీని పరిధిలో 20 గ్రామాలు వస్తాయని, ఈ గ్రామాల్లో జనాభా పెరుగకుండా ఉండేందుకు వీలుగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరని వివరించారు. మరో 16 కిలోమీటర్లను ఎమర్జెన్సీ ప్లానింగ్ జొన్‌ను, 30 కిలోమీటర్లను ఇంపాక్ట్ అసెస్‌మెంట్ జోన్‌గా ప్రకటిస్తారన్నారు. అమెరికాలో ఈ పరిధిని 80 కిలోమీటర్లుగా చేసి మాక్ డ్రిల్ నిర్వహించారన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు లక్షల మందిని 30 నిమిషాల్లో లారీల్లో తరలించాల్సి ఉంటుందన్నారు. ఇది అసాధ్యమని అమెరికా గుర్తించిందని గుర్తు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న 1000 మెగావాట్ల రియాక్టర్లను తొలిసారిగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ప్రయోగం చేయనున్నారన్నారు. భూసేకరణ చట్టం కూడా అమలు చేయడం లేదని, ప్రతి జిల్లాలో పారిశ్రామిక వినియోగానికి కేటాయించిన భూముల వివరాలు ప్రభుత్వం ప్రకటించడం లేదన్నారు. కాలిఫోర్నియాలో అణువిద్యుత్ కేంద్రం వద్దని నిర్ణయించారని, చివరి కేంద్రాన్ని 2024 నాటికి మూసి వేసేందుకు నిర్ణయించారని తెలిపారు. ఈ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రపంచ బ్యాంక్ రుణం ఇస్తుందా? ప్రమాదం జరిగితే నష్టపరిహారాన్ని ప్రైవేట్ బీమా సంస్థలు చెల్లించేందుకు ముందుకు వస్తాయా? అని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కేంద్రానికి రాష్ట్ర ప్రజలంటే చులకన భావం ఉందని, ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర విధ్వంసానికి కారణమయ్యే ఈ ప్రాజెక్టు కొవ్వాడలో ఏర్పాటు చేయడం దురదృష్టకరమన్నారు. సిపిఐ రాష్టక్రార్యదర్శివర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధి పేరుతో ఇతర దేశాల అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తిగా సిఎం చంద్రబాబు మిగిలిపోతారన్నారు. కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం వద్దని, ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమిస్తే వెనుకడుగు వేయరని గుర్తుచేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ ప్రతి దశలోనూ, ప్రతి అంశంలోనూ ఉల్లంఘనలు ఉన్నాయని, దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ కె.బాబూరావు, జైతాపూర్ అణు విద్యుత్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు డాక్టర్ వివేక్ మోంటైర్, అద్వైత్ ఫెడ్నేకర్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమక్రసీ నేత వై.కొండయ్య, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ నేత జి.సత్యనారాయణ, సిపిఐ ఎంఎల్ నేత రమణ, సిపిఎం నేతలు లోకనాథం, గంగారాం, తేజేశ్వరరావు, ఫార్వర్డ్ బ్లాక్ నేత సుందరరావు, ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, ప్రొఫెసర్ శివాజీరావు తదితరులు ప్రసంగించారు.