వీక్లీ సీరియల్

ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!! -14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేద కూడా వసంత్‌ని తొందర పెట్టదలచుకోలేదు. ఆలోచించుకునే వ్యవధి ఇవ్వదలచి తను వౌనంగా ఉండిపోయాడు.
‘‘అఖిల్ అల్లరి బాలుడో... అద్భుత బాలుడో... వాణ్ని చూస్తూ చూస్తూ మీ డిపార్ట్‌మెంట్‌కి అప్పగించి ప్రమాదపు అంచుల్లోకి తోసేయమంటారా? దయచేసి మా వాడిని వదిలిపెట్టండి. వాడి ఉజ్వల భవిష్యత్‌ని నేల రాసే ప్రయత్నం చేయకండి. ఆ చిన్నారి మీ యజ్ఞంలో ఒక సమిధ కావడానికి నేను ససేమిరా ఒప్పుకోను. మీకిచ్చన మాటని వెనక్కి తీసుకుంటున్నాను ఐ యామ్ వెరీ సారీ.’’
ఎలాంటి మొహమాటం లేకుండా తన మనోభావాల్ని వెల్లడించాడు.
‘‘పొరపడుతున్నారు మిస్టర్ వసంత్‌కుమార్. మీరు అంతగా భయపడాల్సింది, బెంగపెట్టుకోవాల్సింది, అనుమానించాల్సింది ఏమీ లేదు. అనవసరంగా ఏవేవో ఊహించుకోకండి. భయాందోళనలు చెందాల్సింది కూడా ఏమీ లేదు. మీవాడికేమీ కాదు. నా మాట సావధానంగా వినండి.
నేను చెబుతున్న కేసు మిస్టరీ ఇప్పటికైనా వీడకపోతే ఈ నగరానికే ప్రమాదం. మన జాతికే అవమానం. కొమ్ములు పెంచి, కోరలు చాచి, తమ వికృత హస్తాలతో కొన్ని మాఫియా భూతాలు సమాజంలోని జన జీవనాన్ని అల్లకల్లోలపరుస్తున్నాయి.
అందులో భాగమే ఊహించని మనీమనీ కోఆపరేటివ్ బ్యాంక్ దోపిడీ. ప్రజల ఆస్తుల్ని భద్రపరిచే బ్యాంక్‌నే కొల్లగొట్టి నిర్భయంగా తిరుగాడుతున్నారంటే... ఆ నేరస్థులు మా డిపార్ట్‌మెంట్‌నే ఛాలెంజ్ చేస్తున్నట్టుంది.
వారు నిర్భీతితో విసురుతున్న సవాల్‌కి ధీటైన వజ్రాయుధం మీ వాడు.’’
కర్తవ్య పరాయణత్వం వేద ధ్యేయం. అది గుర్తించాడు వసంత్.
అయినా ఇబ్బందిగా ఫీలవుతున్నాడతను.
‘‘అఖిల్ అద్భుత శక్తి ప్రపంచం దృష్ట్యా ఇంకా వెలుగు చూళ్లేదు. నాకు తెలిసి ఆ విషయం చాలా సీక్రెట్‌గానే ఉంది. మీకో షాకింగ్ న్యూస్ ఏమిటంటే... బెలూన్‌ల సాహసం అనంతరం మీ వాడిపై రహస్య నిఘా ఏర్పాటు చేయించాను. ఆ రోజు హాస్పిటల్‌లో సైతం అఖిల్‌ని డాక్టర్ టెస్ట్ చేస్తున్నప్పుడు నా మనిషి అక్కడే ఉన్నాడు’’ అంటూ వసంత్ భావాల్ని పసిగడుతున్నాడు వేద.
అతను చెబుతున్న విషయాలు ఒక్కొక్కటిగా వింటుంటే వసంత్ ముఖం పాలిపోతోంది.
‘‘ఆ అతీంద్రియ శక్తి మీ అబ్బాయితో పాటు డెవలప్ అవుతుందో... సడెన్‌గా అంతరించిపోతుందో... తేల్చి చెప్పలేని సంకట పరిస్థితి. అందుకే వాడిలో ఈ శక్తి మాయమవ్వక ముందే ఒక మంచి పని పూర్తవ్వడానికి మీరు ఒప్పుకోండి. మీ వాడిలోని శక్తిని సమాజ శ్రేయస్సుకై ఉపకరించనివ్వండి.’’
వసంత్ మైండ్‌ని డైవర్ట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు వేద.
యస్సై చెప్పే విషయాలేవీ వసంత్‌కి మింగుడు పడడం లేదు. మనసంతా బ్లాంకయిపోయింది.
పట్టువదలని విక్రమార్కుడిలా చెప్పుకుపోయాడు వేదవ్యాస్.
‘‘ఎంతమంది తమ రక్తాన్ని చిందిస్తే ఈ సుందర స్వప్నం మనకి దక్కింది. ఎందరు మహనీయులు అహర్నిశలు శ్రమించి పోరాడితే ఈ దేశం మనదయ్యింది. ఎందరు త్యాగధనులు ఆత్మార్పణం గావిస్తే మనకీ స్వాతంత్య్రం సిద్ధించింది. ఒకసారి మననం చేసుకోండి. ఆ త్యాగం మీ నుండి నేను కోరుకోవడం లేదు. జస్ట్ చిన్న హెల్ప్.
ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతున్నందుకు మీ అబ్బాయికి ఎవరి నుండి కూడా చిన్న అపాయం జరగదు. జరగనివ్వను. అసలు వాడికి ఈ కేసుతో సంబంధమున్నట్లే తెలియనివ్వనెవరికీ. చివరకి మీ మిసెస్ కూడా. మీకూ నాకూ తప్ప మూడో కంటిక్కూడా తెలియదు.
రియల్లీ ఐయామ్ ప్రామిసింగ్ విత్ యూ. బిలీవ్ మి.
ఈ దేశ పౌరుడిగా సదాశయంతో ఒక్క క్షణం నిదానంగా ఆలోచించండి. నన్ను మనస్ఫూర్తిగా నమ్మి మీ అబ్బాయిని నాకు అప్పగించండి. ప్లీజ్ కాదనకండి. నేను చెప్పేది వినండి.’’
ఒక పోలీసాఫీసర్ నిస్వార్థంగా తన కర్తవ్య నిర్వహణ కొరకై అంతగా అభ్యర్థించడం... వసంత్‌లో కొంచెం మార్పు కలగడానికి దారి తీసింది.
అధికారం చెలాయించడం లేదు. వేదలోని ఆ సుగుణమే వసంత్‌ని ఆకట్టుకుంది.
తన స్వార్థం గురించి ఆలోచించేవాడు అథముడు. స్వకుటుంబం ప్రయోజనం కోసం మదనపడేవాడు మధ్యముడు. సమాజ శ్రేయస్సు కొరకు నిరంతరం పాటుపడేవాడే ఉత్తముడు అనేమాటలు ఎప్పుడో చదివినట్టు గుర్తు.
వేదవ్యాస్ అలాంటి ఉత్తమ లక్షణాల్ని పుణికి పుచ్చుకున్నాడనిపించింది వసంత్‌కి.
వసంత్‌లోని సంఘర్షణని , సందిగ్ధావస్థని పసిగట్టాడు వేద.
ఆ అవకాశాన్ని జారవిడుచుకోదలుచుకోలేదతను.
అందుకే తుది ప్రయత్నంగా తన గొంతు విప్పి మళ్లీ చెప్పాడిలా.
‘‘మిమ్మల్ని నేను బలవంతం చేయడం లేదు. ఒత్తిడి అసలే చేయడం లేదు. అలాగే బెదిరించడం లేదు. ఒక పోలీస్ ఆఫీసర్‌గా కాకుండా కేవలం సామాన్య వ్యక్తిగా మిమ్మల్నీ సహాయం చేయమని కోరుతున్నాను.
పై ఆఫీసర్లతో పట్టుపట్టి నా సెల్ఫ్ ఇంట్రెస్ట్‌తో ఈ కేసుని ఓపెన్ చేయించాను. ఎలాగైనా నేరస్థుల్ని పట్టుకోవాలన్నదే నా దృఢ సంకల్పం. మీ అబ్బాయిలోని అతీంద్రియ శక్తిని వినియోగించుకుని దోషుల్ని చట్టానికి అప్పగించాలని నా ఉద్దేశం.
అలా అని పూర్తిగా అఖిల్ మీదే ఆధారపడి నేనీ కేసు ఫైల్‌ని తెరవలేదు. మీరు కాదు అంటే నా పంథా మార్చుకుంటాను. మరొక రకంగా పథకానికి వ్యూహరచన చేస్తాను. ఎలాగైనా విజయం సాధించి తీరతాను. ఎందుకంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడి తీరాలి. నేరస్థులు తప్పించుకు తిరగకూడదు. మీరు ఒప్పుకుంటే అఖిల్ సహాయంతో కేసు మిస్టరీ కాస్త సులువుగా, మరింత తొందరగా వీగిపోయే అవకాశం ఉంది. అందుకే మిమ్మల్ని ఇంతగా అభ్యర్థించడం.
చివరిసారిగా చెబుతున్నాను.
మీ వాడి ప్రాణాలకు నా ప్రాణాలడ్డం పెడతానని నేనీ క్షణంలోనే మీకు మాటిస్తున్నాను. మీ వాడికి ఏ విపత్తు సంభవించకుండా పూర్తి బాధ్యత స్వీకరిస్తాను. నా కంటిపాపలా కాపాడుకుంటాను. ఇది నా ప్రామిస్. ఇక తుది నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. మీ సమాధానం ఇప్పుడే తెలపాల్సిన అవసరం ఏమీ లేదు. బాగా ఆలోచించండి. కాస్త సమయం తీసుకుని వీలైన తొందర్లో పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదో ఒకటి చెప్పండి. గుడ్‌బై.’’
వసంత్‌కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వేదవ్యాస్ వచ్చినంత వేగంగా వెళ్లిపోయాడక్కడి నుండి.
అతని వెంట వెళ్లలేకపోయాడు వసంత్.
అక్కడే ఆగిపోయాడు. ఒంటరిగా కాసేపు గడపాలన్న ఉద్దేశంతో.
వసంత్ బుర్రని ఆలోచనలు చుట్టుముట్టాయి. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. అఖిల్‌ను వేదవ్యాస్‌కి అప్పగించడమా, మానడమా అనే డైలమాలో పడిపోయాడు.
అలా అరగంట గడిచింది. ఇక ఆలస్యం చేయదలచుకోలేదతను.
చివరికి ఒక నిర్ణయం తీసుకున్న వాడిలా వసంత్ ఉద్యోగంతో కదిలాడక్కడి నుండి.
* * *
వసంత్ ఆఫీసుకి వెళ్లిన మరుక్షణం వేదవ్యాస్‌కి ఫోన్ చేశాడు.
అతడు తప్పక ఫోన్ చేస్తాడని యస్సైకి తెలుసు. అందుకనే బయటకు వెళ్లే పని ఉన్నా వెళ్లకుండా స్టేషన్‌లోనే ఎదురు చూస్తున్నాడు.
‘‘నేను వసంత్‌ని మాట్లాడుతున్నాను. మీ ప్రపోజల్‌కి అంగీకరిస్తున్నాను. అఖిల్‌ని మీకు అప్పగించబోతున్నాను’’ అనే మాటలు అలల్లా సాగిపోయాయి అవతలి వైపుకి.
వసంత్ గొంతు స్టేషన్‌లోని రిసీవర్‌లో ప్రతిధ్వనించిన అనంతరం..
వేద పెదాలపై విద్యుత్ స్ఫులింగంలా మెరిసిందొక చిరునవ్వు. అది విన్న వెంటనే ఫోన్ క్రెడిల్ చేశాడు.
* * *
ఆదివారం.
మనీ మనీ బ్యాంక్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాక పాండవీయం మానసిక ఒత్తిడికి గురవుతూనే ఉన్నాడు.
సెలవు రోజు నాడు కూడా పూర్తి టైమ్ ప్రణిత కొరకు స్పెండ్ చేయలేకపోతున్నాడు.
అందుకని భర్త మీద కాస్త కినుకు వహించింది ప్రణిత.
ఆ విషయం తెలిసినా చేసేదేం లేక తన లక్ష్యం మీద దృష్టి సారించడంలో నిమగ్నమై పోతున్నాడు పాండవీయం.
‘‘ఎంత వరకు వచ్చింది బ్యాంక్ వ్యవహారం. ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ కన్పిస్తుందా?’’
భర్త పక్కన కూర్చుంటూ అడిగింది ప్రణిత.
పెదవి విరిచాడు పాండవీయం.
‘‘ప్రయత్నిస్తున్నా. అంత తొందరగా సాల్వ్ అయ్యేది కాదుగా. ఈ బ్యాంక్ ప్రాబ్లమ్.’’
‘‘ఎవరు ఇంట్రెస్ట్ చూపుతారండీ! భద్రత లేని బ్యాంకులో తమ డబ్బు భద్రంగా ఉంటుందని ఎవరు నమ్ముతారు?’’
‘‘ఆ నమ్మకం పెంచడానికేగా నా శ్రమ.’’
‘‘పాత డిపాజిట్‌దార్లకే డబ్బింకా తిరిగి చెల్లించబడలేదు. కొత్త వాళ్లకి ఎలా కల్గుతుంది విశ్వాసం.’’
‘‘కాస్త టైమ్ పడితే పట్టొచ్చు. కానీ ఎప్పటికైనా డబ్బు వారికి ఇవ్వడమేగా!’’
‘‘అప్పటికి చూడొచ్చు. అయినా ఎందుకండీ మీరు అనవసరంగా కష్టపడ్డం. మీది వృధా ప్రయాస అన్పిస్తోంది.’’
చప్పున భార్య వంక అదోలా చూశాడు పాండవీయం.
‘‘ఎప్పటికీ కాదు. నా మీద అపారమైన నమ్మకంతోనే పై అధికారులు నాకీ బాధ్యత అప్పచెప్పారు. నీవు డిస్కరేజ్ చేసినంత మాత్రాన విరమించుకుంటానా! మళ్లీ మనీ మనీ బ్యాంక్ కస్టమర్ల మనీ బ్యాంక్‌గా విశిష్ట స్థాయిని చేరుకునే వరకు విశ్రమించేది లేదు’’ దృఢంగా చెప్పాడు పాండవీయం.
భర్త ముఖంలోని సీరియస్‌నెస్ చూసి కాస్త తగ్గింది ప్రణిత.
‘‘అయినా ఎందుకండీ మీరు స్వయంగా వెళ్లి ప్రతి ఒక్కర్నీ కలవడం. వాళ్లని ఒప్పించడం. వ్యక్తిగతంగా రిస్క్ తీసుకుంటున్నట్టనిపిస్తోంది.’’ అనునయంగా అంది.
‘‘మానేయమంటావా?’’ కటువుగా అడిగాడు.
‘‘బెటర్’’ అంటూ భర్త మూడ్‌ని మార్చే ప్రయత్నంగా గబగబా నవ్వింది.
భార్య నవ్వడంతో కాస్త ఫేసు ప్రసన్నంగా మార్చాడు పాండవీయం.
దాన్ని ఆసరాగా చేసుకొని మళ్లీ ప్రణిత అంది.
ఏదైనా మహాద్భుతం జరిగితే తప్ప మనీ మనీ బ్యాంక్ కస్టమర్ల రాకపోకలతో బిజీ అవుతూ తిరిగి కలకలలాడడమన్నది జరగని పని.’’
సర్రున చూశాడు ప్రణిత వైపు.
మళ్లీ ఎక్కడ ఆయన మూడ్ మారుతుందోనని అలా అంటూనే కళ్లు చిట్లించింది చిలిపిగా.
మనీ మనీ బ్యాంక్ గురించి కస్టమర్లకి అర్థం చేయిస్తే చాలు జనం సానుకూలంగా స్పందిస్తారని నాకుంది.
జనంలోకి చొచ్చుకుపోవడానికి ప్రచార సాధనాలను మాధ్యమంగా ఉపయోగించబోతున్నాను. అంతే తప్ప మహాద్భుతమేదీ జరగాల్సిన పనే్లదు’’ అన్నాడు పాండవీయం.
కానీ ఆ దంపతులకి తెలియదు.
మనీ మనీ బ్యాంక్ విషయంలో మహాద్భుతమే జరగబోతోందని!
అందుకు రంగం సిద్ధమవుతోందని!
సర్వం తెలిసిన వాళ్లు కూడా ఒకోసారి ఘోరమైన తప్పిదాలు చేస్తుంటారు.
తమపై తమకు ఉండే అధిక నమ్మకం, తొందరపాటు వాళ్ల చేత అలా చేయిస్తాయి. పొరపాటు జరిగి నష్టం వాటిల్లాక గానీ వారు విషయాన్ని గ్రహించరు. కష్టానికి ఎదురీదడం వలన కలిగే కష్టనష్టాల్ని తలచుకుంటూ తర్వాత పశ్చాత్తాపం చెందుతుంటారు.
సరిగ్గా యస్సై వేదవ్యాస్ విషయంలో కూడా అలా చింతించాల్సిన పరిస్థితి ఊహించని విధంగా ఎదురైంది. అదెలా జరిగిందంటే-
మనీమనీ బ్యాంక్ కేసు ఇనె్వస్టిగేషన్‌లో కీలకమైన వ్యక్తిగా పరిగణింపబడుతున్న అఖిల్‌ని వినియోగించుకోవడానికి వసంత్ ఒప్పుకోవడంతో ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు వేదవ్యాస్. అనాలోచితంగా తన పథకం సిద్ధం చేసుకున్నాడు. అదెంత తొందరపాటో తర్వాత అనుభవంతో తెలిసివచ్చిందతనికి.
యస్సై ఈ ఎసైన్‌మెంట్ ప్రారంభించే ముందు మొట్టమొదట శత్రువుల గురించి తీవ్రంగా ఆలోచించాడు.
ఆ వర్గంలో ఎలాంటి కదలికలేర్పడుతున్నాయో అతను ఊహించగలడు.
వేదకి అందిన రిపోర్ట్స్ ప్రకారం శత్రువులు తన ఇనె్వస్టిగేషన్ పెద్దగా పట్టించుకోవడం లేదని అసలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అందుకే ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు.
అయితే వేద ఊహించిందే కరెక్ట్ అని శత్రువర్గం తనకి అందించిన సమాచారం పూర్తిగా తప్పని త్వరలోనే అనుభవంలోకి రాబోతోందతనికి.
పోతే మనీ మనీ బ్యాంక్ మేనేజర్ పాండవీయానికి ఒక్కడికే వేదవ్యాస్ అల్లిన వ్యూహ రచన పూర్తిగా తెలుసు.
ఉదయం పదకొండు.
అఖిల్‌ని వెంటేసుకుని బ్యాంక్‌కి వెళ్లాడు వేద. అత్యంత శక్తివంతమైన మైక్రోఫోన్ ఆ కుర్రాడికి అమర్చబడింది.
ఏ ఫలితాన్నాశించి భగవంతుడి అద్భుత ప్రక్రియని అఖిల్‌లో ప్రేరేపించాడో
తెలీదు కానీ-
అతడి సహకారంతో చరిత్రలోనే అత్యద్భుతాక్షరాలతో లిఖించదగ్గ ఓ ప్రక్రియకి వేదవ్యాస్ శ్రీకారం చుడుతున్నాడు.
అందుకే ఉద్విగ్నంగా ఉందతనికి.
ఏ వైపు నుండి ఎలాంటి విపత్తు సంభవించినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్న సాయుధులైన పోలీసులు కస్టమర్ల రూపంలో మనీమనీ బ్యాంక్‌లో తిరుగుతున్నారు అప్రమత్తంగా.
యస్సై పడే హడావిడి గమనిస్తున్నాడు అఖిల్. ఎందుకో అనీజీగా ఫీలవుతున్నాడా కుర్రాడు. అటూఇటూ బెరుగ్గా చూస్తున్నాడు. కట్టేసినట్లుందతనికి. పెదవి విప్పి ఒక్క మాటా మాట్లాడటం లేదు.
తనని బ్యాంక్‌కి తీసుకురావడం, ప్రత్యేకంగా చూడడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో వాడి బుర్రకి అర్థం కావడం లేదు. ఎన్నో సందేహాలు వాడి మెదడుని తొలిచేస్తుంటే తట్టుకోలేకపోయాడు.
‘‘అంకుల్...అంకుల్...’’ అంటూ ఏదో అడగబోయాడు. వెంటనే అడ్డు తగిలాడు వేద.
‘‘అఖిల్ నేనొక విషయం చెబుతాను. చాలా జాగ్రత్తగా విను. కోనేరు హంపి అనే చిన్న బాలిక ఆ మధ్య ఫ్రాన్స్ దేశంలో జరిగిన చెస్ పోటీలో పాల్గొంది. అక్కడకి వచ్చిన 75 దేశాల ప్రత్యర్థుల్ని అవలీలగా తన మేథస్సుతో ఓడించి ‘అండర్-10’ బాలికల ప్రపంచ టైటిల్ సాధించింది. భారతదేశానికే గర్వ కారణమైంది.
ప్రపంచమంతా ఆ అమ్మాయిని వండర్ గాళ్ అని ప్రశంసించని వారు లేరు. బోలెడంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అలా నీకూ గొప్ప పేరు రావాలంటే ఒక పని చేయాలి నువ్వు’’ అంటూ ఆగాడు.
అఖిల్ తన వైపే ఆసక్తిగా చూడ్డం గమనించాడు.
నిజమే! మమీ, డాడీ కూడా చెప్పారు. ఆపాప వాళ్ల అమ్మా నాన్నకి పేరు తెచ్చినట్టుగా మాకూ గొప్ప పేరు తేవాలి అని.
అందుకే హుషారుగా అన్నాడా కుఅరాడు. ‘‘మీరు చెప్పినట్టు చేస్తాను చెప్పండి అంకుల్’’ అని.
‘‘వెరీ గుడ్!’’ అంటూ వెన్ను తట్టి అభినందించాడు.
‘‘కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో, ఈ బ్యాంకులో ఎవరూహించని విధంగా ఒక రాబరీ జరిగింది. 26.3 కోట్లు డబ్బు గల్లంతయ్యింది. ఇప్పటికీ ఆ దోపిడీ దొంగలెవరో ఆచూకీ కనుగొనబడలేదు. నేరస్థులు యథేచ్చగా తప్పించుకు తిరుగుతున్నారు. ఆ దొంగతనం అసలెలా జరిగింది. ఎవరు చేశారు లాంటి వివరాలు నీవు నాకు తెలియజేయాలి. కేవలం నీ ఒక్కడి వలనే ఈ రాబరీ మిస్టరీ వీడిపోతుంది. జరిగింది జరిగినట్లు నీవు చెప్పావంటే నీకు చాలా గొప్ప పేరు వస్తుంది. అవార్డు కూడా ఇప్పిస్తాను.’’ చెప్పడం ఆపి కుర్రాడ్ని చూశాడు వేద.
ఆశ్చర్యచకితుడై వింటున్న అఖిల్ ఏదో చెబుదామని పెదవి విప్పాడు అలర్టయ్యాడు వేద!
* * *
అదే సమయంలో-
షణ్ముగం తన ముఖ్య అనుచరులైన కొందరి సమక్షంలో సమావేశమై కూర్చున్నాడు.
తను చేపట్టబోతున్న న్యూ బిజినెస్ వివరాలని వాళ్లకి తెలియబరచి వాళ్లని భాగస్థుల్ని చేయడానికి పిలిపించాడు అందరినీ.
సమావేశాన్ని ప్రారంభిస్తూ చెప్పడం ప్రారంభించాడు.
‘‘రహస్యంగా ఉండి, చీకటి వ్యాపారాలు చేస్తూ డబ్బులు గడించే రోజులకి కాలం చెల్లింది. ప్రజలు తెలివి మీరిపోతున్నారు. నిజం చెప్పాలంటే అతి మూర్ఖులైపోతున్నారు. కొన్న వస్తువులపై పర్సెంటేజీలన్నా, ఉచితం అన్నా, సరికొత్త స్కీములన్నా తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. చదువుకున్న వాళ్లు. ఉద్యోగస్థులే ఇలాంటి వాటికి ఆకర్షితమవ్వడం మరీ విడ్డూరం. అందుకే వ్యాపారస్థులు వాళ్లని మోసం చేయడం తేలికైపోతుంది.
వినియోగదారులకి తెలిసేలా దర్జాగా బిజినెస్‌లు ఓపెన్ చేయడం. అమాయకంగా వాళ్లని నమ్మించడం. ఎవరూ చేతుల్ని వారి తల మీదే పెట్టేసి డబ్బుని దోచేయడం నేడు లేటెస్ట్‌గా జరుగుతున్న ప్రక్రియ. అందులో భాగంగానే మన ఫర్మ్ నుండి కూడా రకరకాల బిజినెస్‌లకి రూపకల్పన చేశాము.
అవి మంచి ఫామ్‌లో ఉన్నాయి. అందులో నుండి కాల పరిమితి ముగిసిన వాటిని త్వరలో ఎత్తివేయబోతున్నాం. ఈలోగా కొత్త వాటికి రంగం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. లేకపోతే శాఖోపశాఖలుగా విస్తరించిన మన సంస్థ కూకటివేళ్లతో సహా పెకలిపోయే ప్రమాదముంది. అందుకే ఒక చక్కని ప్లాన్ కొత్త బిజినెస్ కొరకై సిద్ధమైంది’’ అంటూ ఆగాడు.
మంత్రముగ్ధులై వింటున్నారంతా.
షణ్ముగం బ్రెయిన్‌లో రూపుదిద్దుకునే వ్యాపారాలెన్నింటినో భాగస్వాములై, తమ తమ వాటాల కింద చాలా సొమ్ము కూడబెట్టుకున్నారు అక్కడ కూర్చున్నవాళ్లు.
‘‘మీ ఆలోచనలు త్వరగా చెప్పేయండి. ఎవరు ఏ పనిని స్వీకరించి తమ వంతు పాత్ర నిర్వహించాలో వివరిస్తే తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆలోచిద్దాం.’’ అన్నాడొక బిజినెస్ పార్టనర్.
నాగస్వరం విన్న త్రాచుల్లా తలలు ఊపారు మిగతా వాళ్లు.
అందరి ముఖాల్లో కనబడుతున్న అతృతని పసిగట్టిన వాడిలా షణ్ముగం అసలు విషయం ప్రకటించాడు.
‘‘ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా నా సొంత ఆలోచన మాత్రం కాదు. మ్యాగజైన్‌లో పడిన న్యూస్ నా దృష్టిలో పడింది. దాన్ని కూడా జోడించి కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్త ప్యాకేజీగా మలిచాను. ఇది ప్లాట్‌ల బిజినెస్‌కి రిలేటెడ్ అనుకోవచ్చు. లేదా అపార్ట్‌మెంట్స్ వ్యాపారంగా పరిగణించవచ్చు. దీనికి ముందు ఆ మ్యాగజైన్‌లో ప్రచురితమైన మ్యాటరేమిటో వినండి.’’
అందరూ సైలెన్స్ అయిపోయారు.
షణ్ముగం తనదైన ధోరణిలో చెప్పుకుపోసాగాడిలా.
( ఇంకా ఉంది)

-ఎనుగంటి వేణుగోపాల్ 9440236055