జిల్లాలు

మళ్లీ రగిలిన చెరువుల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 22: ఏలూరు మండలం పరిధిలోని ప్రత్తికోళ్లలంక గ్రామంలో చాలాకాలంగా రగులుతున్న వివాదం మరోసారి వేడెక్కింది. చెర్వుల కేంద్రంగా ప్రారంభమైన ఈవివాదంలో శనివారం మరో మలుపు చోటుచేసుకుంది. దీంతో గ్రామంలోని మహిళలు ఆందోళన బాట పట్టడంతో స్వల్ఫ ఉద్రిక్తత నెలకొంది. పోలీసు బలగాలు కూడా భారీగానే మోహరించాయి. అదే విధంగా మండల తహశీల్దార్ కెవి చంద్రశేఖరరావు, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ రవిచంద్ర, వి ఆర్‌వోలు కూడా అక్కడకు చేరుకున్నారు. చివరకు ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జోక్యంతో సమస్య పరిష్కారమైంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి సంబంధించిన చెర్వుల విషయంలో ఎంతోకాలంగా వివాదం సాగుతున్న విషయం తెల్సిందే. ఇంతకుముందు మాజీ సర్పంచ్ ఘంటశాల మహాలక్ష్మిరాజు వర్గం ఈవిషయంలో గ్రామస్తులకు అన్యాయం చేశారంటూ ఈవివాదం పెరుగుతూ వచ్చింది. చెర్వులకు సంబంధించి ఆదాయ, వ్యయాల లెక్కలు చెప్పటం లేదంటూ గ్రామస్తులంతా ముక్తకంఠంతో ఆందోళన బాట పట్టారు. ఆనేపధ్యంలోనే ఈ రెండువర్గాల మధ్య మరిన్ని వివాదాలు చెలరేగి చివరకు వ్యవహారం న్యాయస్ధానం పరిధిలోకి కూడా వెళ్లింది. ఎప్పటికప్పుడు చెర్వుల వివాదం కేంద్రంగా గ్రామంలో ఉద్రిక్తపరిస్ధితులు నెలకొంటూనే ఉన్నాయి. ఈనేపధ్యంలో గత కొద్దిరోజులుగా గ్రామానికి చెందిన చెర్వుల లీజుకు సంబంధించిన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈవిషయంలోనూ గ్రామస్తులు రెండువర్గాలుగా విడిపోవటంతో మరో వివాదం చెలరేగింది. తాజాగా శనివారం దాదాపు 360 ఎకరాల చెర్వులకు సంబంధించి లీజుల నిర్ధారణకు చర్యలు చేపట్టారు. గ్రామంలోనే వేలంపాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈపరిణామాలు ముందుగానే తెలుసుకున్న రెండువర్గాలు కూడా అప్రమత్తం అయి తమ మాట నెగ్గాలంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఈకారణంగా రెండుగ్రూపులకు సంబంధించిన పెద్దసంఖ్యలో మహిళలు ఆప్రాంతంలో బైఠాయించి ఆందోళనకు దిగారు. ఒక వర్గం మహిళలు చెర్వులను తమకే లీజుకు ఇవ్వాలంటూ నినాదాలు చేయగా, మరోవర్గం మాత్రం పాట పెట్టాలంటూ భీష్మించారు. వీటిమధ్య వ్యవహారం ముందడుగు పడక ప్రతిష్ఠంభనకు గురైంది. దీంతో స్వల్ఫ ఉద్రిక్తత పరిస్దితులు నెలకొనడంతో పెద్దఎత్తున పోలీసు బలగాలు గ్రామానికి చేరుకున్నాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారు అప్రమత్తంగానే కొనసాగారు. అయితే ఈ రెండువర్గాల మధ్య వాదనలు పీటముడి పడి సమస్య పరిష్కారం కాకుండా ఉండిపోవటంతో స్దానికుల విజ్ఞప్తి మేరకు దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, కొల్లేరు నేత సైదు సత్యనారాయణ, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన కొల్లేరు సంఘ పెద్దలు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు శనివారం మధ్యాహ్నం గ్రామానికి చేరుకున్నారు. ఈసందర్భంగా మహిళలు మరోసారి తమ వాదనను విన్పిస్తూ తమకే ఈసారి చెర్వులను కేటాయించాలని కోరారు. అలాగే మరోవర్గం కూడా తమ వాదనకు పట్టుపట్టింది. దీంతో మెజార్టీ తేల్చేందుకు చింతమనేని కొన్ని ప్రయత్నాలు చేసినా వాటి వల్ల సరైన ఫలితాలు రాకుండాపోయాయి. దీంతో చింతమనేని మాట్లాడుతూ చెర్వుల విషయంలో ఈవిధంగా వివాదాలు పెంచుకుంటూ పోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదని స్దానికులను హెచ్చరించారు. ఏదొఒకరకంగా సమస్యను పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. చివరకు ఎకరం 80వేల రూపాయల చొప్పున పాట నిర్ణయిస్తూ తీర్మానించారు. దీంతో సమస్య సర్దుమణిగింది.

రూ. 2వేల కోట్ల ధాన్యం కొనుగోలు లక్ష్యం
స్ర్తి, శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖల మంత్రి సుజాత
జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 22: జిల్లాలో ఈ ఏడాది 160 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రెండు వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖల మంత్రి పీతల సుజాత వెల్లడించారు. మండలంలోని దేవులపల్లిలో శనివారం వెలుగు ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన దేవులపల్లి, జంగారెడ్డిగూడెం, పంగిడిగూడెం, శ్రీనివాసపురం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 18వందల కోట్ల రూపాయల ధాన్యం కొనుగోళ్లు జరిగినట్టు తెలిపారు. మెట్ట ప్రాంతంలో ఎర్రకాల్వ ప్రాజెక్టు ఆయకట్టులో ముందుగా ధాన్యం కోతకు వచ్చినందున త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎ గ్రేడు ధాన్యం క్వింటాల్ 1,450 రూపాయలకు, బస్తా 1087.50 రూపాయలకు కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. కామన్ రకం ధాన్యం క్వింటాల్ 1,410 రూపాయలకు, బస్తా 1,057.50 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది ధాన్యం కొనుగోళ్ళ మూలంగా జిల్లాలో డ్వాక్రా మహిళలు 35 కోట్ల రూపాయల కమిషన్ పొందినట్టు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2015-16 ఖరీఫ్ సీజన్‌లో 174 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 7.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు చెప్పారు. దీని విలువ 1,045 కోట్ల రూపాయలని, డ్వాక్రా మహిళలకు 26.12 కోట్ల రూపాయల కమిషన్ లభించిందని తెలిపారు. రబీ సీజన్‌లో 158 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 5.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోళ్ళు జరిగాయని, దీని విలువ 733 కోట్లు కాగా, డ్వాక్రా మహిళలకు 18.48 కోట్ల రూపాయల కమిషన్ లభించిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత ధాన్యం కాటాలువేసి, నాణ్యత పరిశీలించారు. నాలుగు కేంద్రాలకు ఒకే చోట నాలుగు కాటాలను మంత్రి ప్రారంభించారు. వెలుగు ఎపిడి కార్యక్రమానికి హాజరు కాక పోవడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నేత మండవ లక్ష్మణరావు, ఎంపిపి కొడవటి మాణిక్యాంబ, జడ్పీటిసి శీలం రామచంద్రరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, వెలుగు ఎసి సిహెచ్ సుబ్బారావు, ఎపిఎం నంబూరి ఝాన్సీ, వ్యవసాయ సహాయ సంచాలకులు కె కమలాకరశర్మ, తహసీల్దారు జివివి సత్యనారాయణ, ఎంపిడిఒ పి శ్రీదేవి, కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ దల్లి కృష్ణారెడ్డి, మండల సర్పంచ్‌ల ఛాంబర్ అధ్యక్షుడు గంటా రామారావు, కోఆప్షన్ మెంబర్ ఎస్‌ఎస్ ఇస్మాయిల్, మండల టిడిపి అధ్యక్షుడు ముళ్ళపూడి శ్రీనివాసరావు, తెలుగుదేశం నేతలు వందనపు రాము, కొండ్రెడ్డి సోమరాజు, కొడవటి సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కొట్టు అరెస్టు
బెయల్‌పై
విడుదల

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 22: బిజెపి, వైసిపిల ఫ్లెక్సీ వివాదంలో పట్టణ పోలీసులు మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత కొట్టు సత్యనారాయణను శనివారం హౌసింగుబోర్డు కాలనీ సమీపంలో అరెస్టు చేశారు. పట్టణ ఎస్సై వీర్రాజు నేతృత్వంలో పోలీసుల బృందం కొట్టు సత్యనారాయణను అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఏరియా వైద్యశాలకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లారు. మెజిస్ట్రేట్ ఎంవిఎన్ పద్మజ ముందు ప్రవేశపెట్టారు. బెయిల్ మంజూరు కావడంతో ఆయనను విడుదల చేశారు. అనంతరం కార్యకర్తలతో ర్యాలీగా కొట్టు సత్యనారాయణ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్లెక్సీ వివాదంలో కార్యకర్తలను సర్ధుబాటు చేసేందుకు వెళితే అక్రమంగా కేసు నమోదు చేశారన్నారు. సంఘటనకు, కేసులకు, సెక్షన్లకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసులు నమోదు చేశారన్నారు. వైసిపి కార్యకర్తలు సంయమనంతో, శాంతియుతంగా ఉండాలని పేర్కొన్నారు.

భూ సేకరణ ప్రక్రియ వేగవంతం
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, అక్టోబర్ 22 : జిల్లాలో జల రవాణాకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే విస్తరణ పనుల ప్రగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇన్‌ల్యాండ్ వాటర్ వేవ్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో 74 కిలోమీటర్ల పొడవునా ఏలూరు కాలువను ఆధునీకరించి పెద్ద ఎత్తున జల రవాణాను ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. జిల్లాలో రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించడమే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ సామాగ్రిని తరలించడానికి జల రవాణాను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. నిడదవోలు నుండి ఏలూరు వరకు ఏలూరు కాలువను వెడల్పు చేసి భారీ ఓడలు ద్వారా సరుకులను పెద్ద ఎత్తున రవాణా చేసేందుకు అనువుగా 35 గ్రామాలలో, ఏలూరు, తాడేపల్లిగూడెం నగరాలలో అవసరమైన భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని చెప్పారు. రెండు రోజుల్లో 21 గ్రామాల పరిధిలో భూసేకరణకు సంబంధించి షెడ్యూల్స్ సిద్ధం చేయడం జరిగిందని, రెండురోజుల్లో మరో ఏడు గ్రామాల్లో భూసేకరణకు అవసరమైన నివేదికను సిద్ధం చేస్తామని చెప్పారు. ఏలూరు, తాడేపల్లిగూడెం నగరాలతోపాటు మరో ఆరు గ్రామాలలో రీ సర్వే నిర్వహించి ఏ మేరకు ఎక్కడెక్కడ ఎంత భూమి సేకరించాలో వారం రోజుల్లో తగు నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జల రవాణా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన నిధులను మంజూరు చేయడానికి సిద్ధంగా వున్నాయని ఇటువంటి స్థితిలో క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్టు విజయవంతం చేయాలంటే అధికారుల మధ్య సమన్వయం అవసరమని చెప్పారు. వెయ్యి టన్నులకు పైగా సరుకులను ఓడలో రవాణా చేయడానికి అనువుగా కాలువను విస్తరిస్తామని దీని వల్ల రవాణా ఖర్చులు తగ్గి సరుకుల ధరలు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలుగుతామని, బహుళ ప్రయోజనాలు కలిగిన జల రవాణాను ప్రోత్సహించేందుకు ప్రజలు కూడా భూసేకరణ విషయంలో ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పధకాలకు సంబంధించి మేనర్, సబ్ మైనర్ కాలువలతోపాటు ఫీల్డు ఛానల్స్ త్రవ్వి శివారు ప్రాంత భూములకు సైతం సాగునీరు అందేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పది సంవత్సరాల నుండి ఫీల్డు ఛానల్స్ త్రవ్వకంపై ఏజెన్సీ ప్రతినిధులు శ్రద్ధ వహించలేదని, ఇప్పటికైనా సర్వే పనులు పూర్తి చేసి రైతు పొలాలలో పిల్లకాలువలు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పధకం పూర్తయ్యే లోగానే నాలుగు వేల కిలోమీటర్ల పొడవునా ఫీల్డు ఛానల్స్ తవ్వకం పనులను గాయత్రీ ఏజెన్సీ చేపట్టాలని దీని వల్ల లిఫ్టు ఇరిగేషన్ పూర్తయితే త్వరితగతిన రైతుల పంట భూములకు నేరుగా నీరు సరఫరా చేసే పరిస్థితి కలుగుతుందని, అంతేకాకుండా నాలుగు వేల కిలోమీటర్ల పొడవునా భూగర్భ జలాలు కూడా పెరిగి మెట్ట ప్రాంతం డెల్టాను తలపించేలా తీర్చిదిద్దగలుగుతామని చెప్పారు. పోణంగి పుంత 7.6 కిలోమీటర్లు పొడవునా కాలువ తవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 5.2 కిలోమీటర్లు మాత్రమే తవ్వారని మిగిలిన 2.4 కిలోమీటర్లు డిసెంబరు నెలలోగా కాలువ తవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. పోగొండ రిజర్వాయర్ పనులు కూడా వెంటనే పూర్తి చేయాలని, మరో 31 ఎకరాల భూసేకరణ కార్యక్రమాన్ని త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. తాడిపూడి లిఫ్టు ఇరిగేషన్ పరిధిలో 1206 కిలోమీటర్ల పొడవునా పిల్ల కాలువల తవ్వకం పనులను జాతీయ ఉపాధి హామీ పధకం కింద చేపట్టాలని ఈ పనులు త్వరితగతిన పూర్తిచేయడానికి అవసరమైతే పలువురు అధికారులను డిప్యుటేషన్‌పై నియమించడానికి చర్యలు తీసుకోవాలని డ్వామా పిడి వెంకటరమణను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో యనమదుర్రు డ్రైన్‌పై ఏర్పాటు చేయాల్సి వున్న ఎనిమిది షెల్టర్లకు సంబంధించి మెటీరియల్‌ను వచ్చే వారానికి ఆయా ప్రాంతాలకు తరలించాలని, కాలువలు మూసే సమయంలో షెట్టర్లు బిగించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, జెసి-2 ఎంహెచ్ షరీఫ్, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ భాను ప్రసాద్, ఐటిడి ఏ పివో షాన్ మోహన్, నరసాపురం సబ్ కలెక్టర్ ఎ దినేష్‌కుమార్, ఆర్‌డివోలు శ్రీనివాసరావు, లవన్న, ఇరిగేషన్ ఎస్ ఇ శ్రీనివాసరావు, పోలవరం ఎస్ ఇ శ్రీనివాస యాదవ్, డ్వామా పిడి వెంకటరమణ, హౌసింగ్ పిడి శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఎస్ ఇ నిర్మల ఇతర శాఖల అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆలయ రికార్డులు అపహరణ యత్నం
ఏలూరు, అక్టోబర్ 22 : వివాదంలో వున్న ఆలయ రికార్డులను అపహరించేందుకు ప్రయత్నించారంటూ పోలీసులకు ఫిర్యాదు అందడం మరింత సంచలనంగా మారింది. పత్తేబాదలోని కనకదుర్గమ్మ ఆలయ నిర్వహణ విషయంలో గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పలు వివాదాలను సృష్టిస్తూ వచ్చాయి. వీటిని పరిష్కరించేందుకు అధికారులు రికార్డులు సీజ్ చేయగా కొన్ని రికార్డులు మాయం కావడం గమనార్హం. ఈ అంశం తాజాగా శనివారం మరో సంచలనానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే...ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో పత్తేబాదలో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సంబంధించిన రికార్డులను ఈ నెల 7వ తేదీన ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ దుర్గాప్రసాద్ పెద్దల సమక్షంలో గదిని సీజ్ చేశారు. ఈ ఆలయానికి సంబంధించిన నిర్వహణ సక్రమంగా లేదని, అమ్మవారికి వచ్చే ఆదాయాలు ఆలయానికి చెల్లడం లేదని, నిర్వహిస్తున్న ఇన్‌ఛార్జీలు సక్రమంగా విధులు నిర్వహించడం లేదనే ఫిర్యాదు నేపధ్యంలో ఎసి ఈ నెల 7న పరిశీలించగా ఆ సమయంలో నిర్వాహకులు లేకపోవడంతో కార్యాలయాలకు, బీరువాలను సీజ్ చేశారు. ఆలయానికి ఇన్‌ఛార్జి కార్యనిర్వహణాధికారిగా ఎ రవిశంకర్‌ను అప్పటికప్పుడే నియమించారు. నాటి నుంచి రవిశంకర్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో నిర్వహించిన అలవా శ్రీనివాస్, ట్రస్టుబోర్డు ఛైర్మన్ కాళిదాసు ననె్నమ్మలను రికార్డులు అప్పగించాలని రవిశంకర్ 7వ తేదీ నుంచే కోరుతున్నప్పటికీ శనివారం ఆలయానికి వారు వచ్చారు. బీరువాను, కార్యాలయాన్ని తెరచి రికార్డులు అప్పగించే ప్రయత్నంలో భాగంగా వారు రెండు బ్యాగుల్లో అమ్మవారికి సంబంధించిన వస్తువులు, రికార్డులు, కొంత నగదు సర్ధి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు యువకులు ఒక బ్యాగ్‌ను అర్చకుడు ప్రయాగ వెంకట రామ్మూర్తి నుంచి స్వాధీనపర్చుకున్నారు. అయితే మరో బ్యాగ్ మాత్రం కనిపించలేదు. దీనితో రవిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాలయానికి సంబంధించిన రికార్డులు, వస్తువులు అపహరించేందుకు శ్రీనివాస్, ననె్నమ్మ, అర్చకుడు రామ్మూర్తి సహకారంతో ప్రయత్నిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోడకూలి ఇద్దరు కూలీలు దుర్మరణం
తాడేపల్లిగూడెం, అక్టోబర్ 22: రూరల్ మండలం ఆరుగొలనులో గోడకూలి ఇద్దరు కూలీలు మృతిచెందినట్లు రూరల్ ఎస్సై వి చంద్రశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆరుగొలనులో గెడ్డం అంజయ్యకు చెందిన పాత పెంకుటిల్లును తొలగించడానికి అయిదుగురు కూలీలు శనివారం పనిలోకి వెళ్లారు. గోడ కూలడంతో కండెల్లి రాముడు (55), గోపిశెట్టి శ్రీనివాసులు (40) మృతిచెందారు. విఆర్వో ఏలేటి వెంకట మంగరాజు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

చిన్న తరహా పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
ఏలూరు, అక్టోబర్ 22 : జిల్లాలో డ్వాక్రా మహిళల ఆర్ధిక పురోభివృద్ధికి చిన్న తరహా పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం జిల్లా సమాఖ్య తయారు చేసిన హ్యాండ్ వాష్, టాయిలెట్ క్లీనింగ్ లిక్విడ్‌ల నాణ్యతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన హ్యాండ్ వాష్, టాయిలెట్ క్లీనింగ్ లిక్విడ్‌లను పెద్ద ఎత్తున ప్రతీ మండలంలో ఒక ఒక చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసే స్థాయికి ప్రతీ మహిళా ఎదగాలని ఆయన కోరారు. డ్వాక్రా మహిళలు ప్రతీ ఏటా 1500 కోట్ల రూపాయలు రుణాలను పొందుతున్నారని వాటిని కేవలం వడ్డీ వ్యాపారానికో ఇతర ఆర్ధిక లావాదేవీలకో వినియోగిస్తే అభివృద్ధి సాధించలేమని పది మందికి ఉపాధి కలిగించే చిన్న తరహా యూనిట్లను స్థాపించే దిశగా జిల్లా సమాఖ్య ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని కోరారు. పది హేను లక్షల రూపాయల వ్యయంతో ఏలూరులో జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో నెలకొల్పిన టాయిలెట్ క్లీనింగ్, హ్యాండ్ వాష్ క్లీనింగ్ వ్యాపారం మరింత విస్తరించాలని ప్రతీ మండలంలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొత్త తరహా యూనిట్లు స్థాపించాలని దాని వలన వేలాది మంది డ్వాక్రా మహిళలు భవిష్యత్తులో వ్యాపారరంగంలో కూడా రాణించగలుగుతారని చెప్పారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఈ ఉత్పత్తులను ఖచ్చితంగా ప్రతీ పాఠశాలలో, విద్యాసంస్థల్లో వినియోగించేలా చర్యలు తీసుకున్నామని దీని వలన ప్రతీ నెలా జిల్లా సమాఖ్యకు ఆరు లక్షల రూపాయల వరకూ ఆదాయం సమకూరే అవకాశం కల్పించామని నూతన ఆలోచనలతో పలు కొత్త కొత్త యూనిట్లను స్థాపిస్తే వాటికి ప్రత్యేక పేరు పెట్టి వివిధ ప్రాంతాలలో వాటిని విక్రయించే వెసులుబాటును కూడా కల్పిస్తామని చెప్పారు. మండల పరిధిలో 25 మంది డ్వాక్రా మహిళలకు ఫినాయిల్, సెంటెడ్ బాత్‌రూమ్ క్లీనింగ్ లిక్విడ్ తయారీలో శిక్షణ ఇచ్చామని భవిష్యత్తులో డిమాండ్‌ను బట్టి పలు మండలాల్లో ఆధునిక యంత్రాలతో ఫినాయిల్, తదితర వస్తువుల తయారీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డి ఆర్ డి ఏ పిడి శ్రీనివాసులును ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్య తయారు చేసిన హ్యాండ్ వాష్, బాత్‌రూమ్ క్లీనింగ్ లిక్విడ్‌ల నాణ్యతను కలెక్టర్ పరిశీలించి నాణ్యత విషయంలో మరింత వ్రద్ధ వహించాలని ఆకర్షించే రీతిలో వివిధ రంగుల్లో బాత్‌రూమ్ క్లీనింగ్ లిక్విడ్‌లు రూపొందించాలని ప్రస్తుతం పసుపు, గులాబీ, బ్లూ, లెమన్ కలర్స్ మరింత ఆకర్షణీయంగా ఉండేలా చూడాలని చెప్పారు. సమావేశంలో అన్న సంజీవని, డిజిటల్ లిటరసీ, ఎంపి ఆర్ రికవరీ, వర్మీకంపోస్టు, ఎస్‌హెచ్‌జిల గ్రేడింగ్‌పై సమీక్షించారు. సమావేశంలో డి ఆర్‌డి ఎ పిడి శ్రీనివాసులు, వివిధ మండలాల ఎపి ఎంలు, వివిధ మండలాల ఏరియా కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

రమణరాజు వైద్యశాలలో విజయవంతంగా కార్నియా మార్పిడి
* చూపుకోల్పోయిన ముగ్గురికి శస్తచ్రికిత్సలు

భీమవరం, అక్టోబర్ 22: ఇటీవల కాలంలో చాలా మందికి నల్ల గుడ్డులో ఉండే తెల్లని మచ్చ కారణంగా పూర్తిగా చూపుకోల్పోవడం జరుగుతోంది. ఈ సమస్య సామాన్య, మధ్య తరగతి వర్గాల్లో ఎక్కువ చోటు చేసుకుంటోంది. ఈ విధంగా చూపు కోల్పోయిన ముగ్గురికి జిల్లాలో తొలిసారిగా ప్రారంభించిన కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ (నల్ల గుడ్డు మార్పిడి) శస్తచ్రికిత్సలు చేసి వారికి తిరిగి చూపును ఇవ్వగలిగారు భీమవరానికి చెందిన డాక్టర్ యువి రమణరాజు ఆసుపత్రి వైద్యులు. కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ స్పెషలిస్టు డాక్టర్ యు మధు గత పదేళ్లుగా బాధపడుతున్న ఎం వెంకన్న, మరో ఇద్దరికి ఎపి ప్రభుత్వం ప్రారంభించిన ఎన్టీఆర్ వైద్య సేవా పధకంలో ఉచితంగా చేసినట్టు స్పెషలిస్టు డాక్టర్ మధు శనివారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో చెప్పారు. వీరి ముగ్గురికీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేసి డోనార్ కార్నియ అమర్చామన్నారు. మధు ఇప్పటికే 700కు పైగా ఆపరేషన్లు చేసిన అనుభవం కలిగి ఉన్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా నేత్ర వైద్యులు ఉద్దరాజు మధు, డి శ్రీదేవిలను ప్రత్యేకంగా అభినందించారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించేందుకే జనచైతన్య యాత్ర
ఏలూరు, అక్టోబర్ 22 : ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించడంతోపాటు ప్రభుత్వ పధకాలను ప్రజలకు వివరించేందుకు నవంబరు 1వ తేదీ నుండి జన చైతన్య యాత్రలను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే బడేటి బుజ్జి చెప్పారు. స్థానిక విజయవిహార్ సెంటర్ నుండి శనివారం అశ్వరధంపై బడేటి నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ జన చైతన్య యాత్రల ప్రధానోద్దేశాన్ని వివరించారు. బడేటి బుజ్జితోపాటు మేయర్ షేక్ నూర్జహాన్ అశ్వరధంపై ఏలూరులో ఊరేగుతూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయ్యిందని, మిగిలిన రెండున్నర సంవత్సరాల్లో ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తర్చిదిద్దేందుకు పటిష్టమైన ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ పేద కుటుంబం సత్వం ఇంట్లో స్వేచ్ఛగా ఆనందంగా జీవించాలనే ఉద్దేశ్యంతో ఏలూరు నగరంలో త్వరలోనే నాలుగు వేల కుటుంబాలకు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి స్వంత ఇంటికలను ప్రతీ పేద కుటుంబానికి సాకారం చేస్తామని చెప్పారు. ప్రజల ఆశలను, ఆకాంక్షలను స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో నవంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వాడవాడలా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని, ఈ జన చైతన్యయాత్రలో పార్టీ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయడానికి నేడు అశ్వరధ యాత్ర చేపట్టామని చెప్పారు. విజయవిహార్ సెంటర్ నుండి ప్రారంభమైన అశ్వరధయాత్ర అయిదుగుళ్ల సెంటర్, పత్తేబాద, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల గుండా సాగింది. దారికి ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రజలకు బడేటి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్, ఎం ఆర్‌సి యువసేన అధినేత మాగంటి రాంజీ, డిప్యూటీ మేయర్ రామచంద్ర కిషోర్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, కొల్లేపల్లి రాజు, పృధ్వి శారద, పార్ధసారధిలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సమన్వయంతో పని చేయాలి : ఆర్డీవో లవన్న
జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 22: స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 31 నుండి నిర్వహించే కార్తీకమాస మహోత్సవాలకు ఐదు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఉత్సవ కమిటీ ఛైర్మన్, ఆర్డీవో ఎస్ లవన్న కోరారు. శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయ కార్తీకమాస త్రివింశతి వార్షిక సప్తాహ మహోత్సవాలు, కార్తీకమాస మహోత్సవాల విజయవంతం కోసం శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మంగళ, శనివారాలలో దేవస్థానంతో పాటు ఇతర శాఖల అధికారులు కూడ అప్రమత్తంగా ఉండాలన్నారు. దేవస్థానం చైర్మన్ యిందుకూరి రంగరాజు, కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు(శివ) మాట్లాడుతూ ఈ నెల 31 నుండి నవంబర్ 29 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రం నలుమూలల నుండి ఐదు లక్షలకుపైగా భక్తులు వచ్చే అవకాశమున్నందున పోలీసు శాఖ అన్నదాన సత్రం వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన రహదారిలో తోపుడుబండ్ల మూలంగా ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. డిఎస్పీ జె వెంకటరావు మాట్లాడుతూ ఈ ఏడాది బందోబస్తు పెంచుతామని, మహిళా కానిస్టేబుళ్లను కూడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పార్కింగ్, బ్యారికేడింగ్‌లను త్వరలో స్వయంగా పరిశీలించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా పార్కింగ్, ఇతర అవసరాలకు ఆలయ సమీపంలో భూసేకరణకు ప్రతిపాదనలు పంపాలని ఆర్డీవో లవన్న దేవస్థానం అధికారులను కోరారు.

అమెరికా విశ్వవిద్యాలయానికి విష్ణు విద్యార్థులు
* విష్ణు దంతవైద్య కళాశాలలో ఘనంగా స్నాతకోత్సవం* హాజరైన బిడిఎస్, ఎండిఎస్ విద్యార్థులు

భీమవరం, అక్టోబర్ 22: విష్ణు ఎడ్యుకేషనల్ సోసైటీ ఆధ్వర్యంలో విష్ణు దంతవైద్య కళాశాలలో బిడిఎస్, ఎండిఎస్ కోర్సులను పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం క్యాంపస్‌లో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మణిపాల్ దంతవైద్య కళాశాలకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ కీర్తిలత ఎం పాయ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులబట్టి మనలోని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. రోగుల పట్ల మానవతా దృక్పధంతో వ్యవహరించాలన్నారు. బిడిఎస్, ఎండిఎస్‌లలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు, జాతీయ స్థాయిలో జరిగిన పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు నగదు పురాస్కారాలను డాక్టర్ కీర్తిలత బహూకరించారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రథమ స్థానం సాధించిన డాక్టర్ ఇందుకూరి సాయి లక్ష్మీదుర్గను అమెరికాలోని బోస్టన్‌లోని టిష్ట్స్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు కళాశాల ఛైర్మన్ కెవి విష్ణురాజు, వైస్ ఛైర్మన్ ఆర్ రవిచంద్రన్ పంపిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికా దేశంలోని విశ్వవిద్యాలయాలకు విష్ణు విద్యార్థులు వెళ్లనున్నారు. డైరెక్టర్ డాక్టర్ ఎస్ సుందర రాజన్, కళాశాల డైరెక్టర్ ఎంఎకెవి రాజు, ప్రిన్సిపాల్ సురేష్ సజ్జన్, వైస్ ప్రిన్సిపాల్ ఎవి రామరాజు తదితరులు పాల్గొన్నారు.