అంతర్జాతీయం

పాక్‌తో చర్చలు సాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: ఉగ్రవాదం, చర్చలు కలిసి ముందుకు సాగలేవు, ఉగ్రవాదం ఆగనంత కాలం పాకిస్తాన్‌తో చర్చలు జరపటం సాధ్యం కాదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బ తీస్తున్న ‘ఒక బెల్ట్, ఒక రోడ్డు’ చైనా పథకాన్ని సమర్థించే ప్రసక్తే లేదని ఆమె ప్రకటించారు. సుష్మా స్వరాజ్ సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మూడేళ్ల ఎన్‌డిఏ పాలనలో విదేశాంగ శాఖ సాధించిన విజయాల గురించి వివరించారు. పాకిస్తాన్‌తో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకునేందుకు భారతదేశం ప్రయత్నించిన ప్రతిసారి అటువైపు నుండి పఠాన్‌కోట్ తదితర ఏదో ఒక ఉగ్రదాడి జరిగిందని ఆమె ఆరోపించారు. ఒకవైపు ఉగ్రదాడులు కొనసాగిస్తూ మరోవైపు చర్చలు జరుపుదామంటే కుదరదని సుష్మా స్వరాజ్ తెలిపారు. పాకిస్తాన్‌తో మనకున్న పలు సమస్యలను కోర్టుద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె తెలిపారు. హైదరాబాద్ ఆస్తుల వివాదం, గూఢచారిగా ముద్రవేసిన జాధవ్ సమస్యలను అంతర్జాతీయ కోర్టుద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రతి వేదికపై ప్రస్తావిస్తున్నామని ఆమె చెప్పారు. పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ఉగ్రవాదంతో సంబంధం ఉన్నదనేది అన్ని దేశాలకు వివరిస్త్తున్నామని ఆమె తెలిపారు. భారతదేశంపై దాడులు చేసే వారిని స్వాతంత్య్ర సమరయోధులంటూ సత్కరిస్తున్న పాకిస్తాన్‌తో చర్చలు ఎలా సాధ్యమవుతాయని ఆమె ప్రశ్నించారు. చర్చలు జరిపేందుకు అనువైన వాతావరణం ఉండాలా, వద్దా? అని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఆహ్వానించినందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన నుండి స్వదేశం వస్తూ లాహోర్ వెళ్లారని ఆమె ఒక ప్రశ్నకు బదులిస్తూ చెప్పారు. ద్వైపాక్షిక చర్చలద్వారా మాత్రమే భారత-పాక్ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తాము, ఇందులో మధ్యవర్తిత్వానికి ఎలాంటి అవకాశం లేదని ప్రకటించారు.
చైనా ఆక్రమిత కాశ్మీర్ మీదుగా పాకిస్తాన్‌లో నిర్మిస్తున్న ‘ఒక బెల్ట్, ఒక రోడ్డు’ పథకంలో చేరే ప్రసక్తే లేదని ఆమె తెలిపారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని పట్టించుకోకుండా ఈ పథకాన్ని చేపడుతున్నారని విమర్శించారు. చైనా సైన్యానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఉత్తరాఖండ్‌లోకి చొచ్చుకురావటం నిజమేనని సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ సంఘటన గురించి చైనాతో చర్చిస్తామని తెలిపారు. భారత, చైనాల సరిహద్దులపై ఇంకా స్పష్టత రానందున ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని, చర్చలద్వారా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకుంటున్నామని వివరించారు. చైనాను నిలువరించేందుకు ఏదైనా వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? అని ఒక విలేఖరి అడుగగా భారతదేశ ప్రయోజనాలను కాపాడుకునే విధంగా తమ వ్యూహం ఉంటుంది తప్ప ఒక దేశాన్ని నిలువరించేందుకు వ్యూహం ఉండదని స్పష్టం చేశారు. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో భారతదేశానికి తప్పకుండా సభ్యత్వం లభిస్తుంది, ఈ రోజు లభించకపోతే రేపు లభిస్తుందని సుష్మా స్వరాజ్ చెప్పారు. నాన్-ఎన్‌పిటి దేశాలకు సభ్యత్వం ఇవ్వకూడదంటూ చైనా చేస్తున్న వాదనలో పసలేదని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ నాన్-ఎన్‌పిటి దేశమైనప్పటికీ దీనికి ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం ఇచ్చారు, ఇదేవిధంగా భారతదేశానికి సభ్యత్వం ఇవ్వాలన్నది తమ వాదన అని ఆమె వివరించారు. భారత దేశం నాన్-ఎన్‌పిటి దేశమైనప్పటికీ తమ వ్యవహార సరళిని పరిశీలించిన అనంతరం ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం ఇవ్వాలన్నది తమ వాదన అని ఆమె చెప్పారు. చైనా తప్ప ఎన్‌ఎస్‌జిలోని అన్ని సభ్యత్వ దేశాలు భారత దేశానికి మద్దతు ఇస్తున్నాయని ఆమె చెప్పారు. ఎన్‌ఎస్‌జిలో భారతదేశ సభ్యత్వం గురించి చైనాను ఒప్పించాలని రష్యాను కోరినట్లు సుష్మా స్వరాజ్ చెప్పారు. నిధులు లేదా ఒత్తిడి మూలంగా ప్యారిస్ వాతావరణ ఒప్పందంపై భారత దేశం సంతకం చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణను తీవ్రంగా ఖండించారు.
కాశ్మీర్ సమస్యను ఐసిజె దృష్టికి తీసుకెళ్లలేరు
కాశ్మీర్ సమస్యను పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) ముందుకు తీసుకెళ్లలేదని, ఈ సమస్యను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని భారత్ పునరుద్ఘాటించింది. పాక్‌తో అన్ని సమస్యలను చర్చలద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ కోరుకుంటోందని, అయితే ఉగ్రవాదం, చర్చలు కలసికట్టుగా ముందుకు సాగలేవని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు పాక్ పట్ల తమ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిలో ఎటువంటి మార్పు లేదన్నారు. కాశ్మీరు సమస్యను అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని పాకిస్తాన్ న్యాయాధికారి ఒకరు చేసిన వ్యాఖ్యల గురించి విలేఖరులు ప్రశ్నించగా, అది సాధ్యమయ్యే పని కాదని, ఈ సమస్యకు పరిష్కారం ద్వైపాక్షికంగానే సాధ్యమవుతుందని తెలిపారు.