క్రీడాభూమి

ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: వచ్చేనెల గ్లాస్గో (స్కాట్‌లాండ్)లో జరిగే బాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటుతామని, పతకాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని భారత స్టార్, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశాడు. శనివారం ఇక్కడ జరిగిన శ్రీకాంత్ సన్మాన సభ జరిగింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ నుంచి సన్మానం అందుకున్న తర్వాత శ్రీకాంత్ మాట్లాడుతూ తనతోపాటు సాయి ప్రణీత్, అజయ్ జయరామ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నట్టు చెప్పాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు ఆశించినంత సులభం కాకపోయినప్పటికీ, నిలకడగా రాణిస్తే, లక్ష్యాలను అందుకోవడం అసాధ్యమేమీ కాదని వ్యాఖ్యానించాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30-35 స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సమర్థులేనని, అందుకే, మేజర్ టోర్నీల్లో పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పాడు. ర్యాంకింగ్స్‌లో 29వ స్థానంలో ఉన్న ప్రణయ్ ఇండోనేషియా ఓపెన్‌లో వరుసగా చెన్ ఆలంగ్, లీ చాంగ్ వెయ్ వంటి మేటి ఆటగాళ్లను ఓడించిన విషయాన్ని శ్రీకాంత్ గుర్తుచేశాడు. టాప్ ఆర్డర్‌లో పోటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమేనని ఇటీవల వరుసగా మూడు సూపర్ సిరీస్ టోర్నీల్లో ఫైనల్ చేరి, రెండు టైటిళ్లను సాధించిన శ్రీకాంత్ అన్నాడు. గత నెల తన ఆటతీరు సంతృప్తికరంగా సాగిందన్నాడు. మోకాలి గాయం నుంచి కోలుతున్న తర్వాత తన ఆటతీరు మారిందని అంటూ, ఆ సమయంలో తనకు అండగా నిలిచిన జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, కోచ్ మల్యో హండొయో (ఇండోనేషియా)లకు కృతజ్ఞతలు తెలిపాడు. కెరీర్‌లో ఇంత వరకూ నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లను సాధించిన శ్రీకాంత్‌ను అంతకు ముందు కేంద్ర మంత్రి గోయల్ సన్మానించారు. ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అని శ్లాఘిస్తూ ప్రశంసా పత్రాన్ని అందచేశారు.
క్రీడలకు పెద్దపీట: గోయల్
కేంద్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని మంత్రి గోయల్ అన్నారు. మురికివాడల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి అత్యుత్తమ శిక్షణను ఇప్పించాలనే ఉద్దేశంతో శనివారం జరిగిన ‘చైతన్య పరుగు’ను ఆయన ఆరంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సమర్థులను గుర్తించడానికి వీలుగా ఒక పోర్టల్‌ను త్వరలోనే ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. యువతీయువకులు ఎవరైనా తమతమ క్రీడా విభాగాల్లో నైపుణ్యాన్ని తెలియజేసే వీడియోలను అందులో అప్‌లోడ్ చేయవచ్చని మంత్రి అన్నారు. వాటిని పరిశీలించి, ప్రతిభాపాటవాలున్న వారిని గుర్తించి, వారికి అత్యుత్తమ శిక్షణను ఇప్పిస్తామని చెప్పారు. ప్రపంచ క్రీడల్లో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతున్నదని అన్నారు. 2020 ఒలింపిక్స్‌లో భారీ సంఖ్యలో పతకాలు సాధిస్తామన్న నమ్మకం తనకు ఉందన్నారు.