Others

వయోజన విద్యపై చిన్నచూపేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కాలంలో చదువు అందరికీ దక్కకపోవటానికి కారణాలు అనేకం ఉన్నాయి. భారతీయ సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థ, అగ్ర కుల ఆధిపత్యం కూడా కొన్ని కులాలను చదువుకు దూరం చేశాయి. ఆ నాటి సమాజంలో చదువుకు వున్న ప్రాధాన్యత, సమాజంలో వున్న ఎగుడు దిగుళ్లు, గతంలో వయోజన విద్యా వ్యాప్తికి జరిగిన ప్రయత్నాలు ఈనాడు కీలకమైన చర్చనీయాంశాలు కానున్నాయి. గత సమాజంలో వున్న చారిత్రకమైన పరిస్థితులు కూడా అందరూ చదువుకోకపోవటానికి కారణమైంది. అందుకు కారణాలు తెలియనివి కావు. రాచరిక, ఫ్యూడల్, పెత్తందారీ వర్గాలు కొన్ని వర్గాలకు చదువును దక్కకుండా చేశాయి. అన్ని వర్గాల వారూ చదువుకుంటే తమ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తారనే ఆందోళన వారిలో ఉంది. తెలంగాణలో ఫ్యూడల్ కాలం వరకు చదువు కొన్ని వర్గాలకే పరిమితమైంది. అందుకే తెలంగాణలో చదువుకున్నవారి సంఖ్య 40 ఏళ్ళ క్రితం చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇప్పుడంటే మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం, విద్యపై పెరిగిన ఆకాంక్షల నేపథ్యంలో అన్ని వర్గాల్లో చదువుకోవాలనే కుతూహలం పెరిగింది. ప్రభుత్వ రంగం నుంచే కాక, ప్రైవేట్ రంగం నుంచి కూడా విద్యను కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికీ అట్టడుగు దళిత, బహుజన, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ వర్గాల పిల్లల్లో ‘డ్రాప్ అవుట్’ (మధ్యలో బడిమానేసే వారు) ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రభుత్వానికి విద్యా శాఖ అధికారులు చూపిస్తున్న లెక్కల కంటే అత్యధికంగా డ్రాప్‌అవుట్‌లు జరుగుచున్నాయి. అందుకు తల్లిదండ్రులు కూడా సంపూర్ణ అక్షరాస్యులు కాకపోవటం ఒక ప్రధాన కారణం. అందుకే ‘వయోజన విద్య’ ఇప్పటికి కూడా అత్యవసరమైనది. ఈనాడు దాని రూపం మారి అది ‘దూర విద్య’గా వ్యవహరించబడుతోంది. ‘దూరదర్శన్’ విద్య కావచ్చును. ఏది ఏమైనా తల్లిదండ్రులలో అక్షరాస్యుల శాతం ఎంత ఎక్కువగా పెరిగితే రాబోయే తరంలో విద్యా ప్రమాణాలు అంత ఎక్కువగా ఉంటాయి.
వయోజన విద్యపై చర్చ ఇప్పుడు ‘అవుట్ డేటెడ్’ అనే మేధావులూ ఉన్నారు. ఆ భావన సరికాదు. ఈ తరం పిల్లలు అత్యాధునిక సాంకేతిక డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టడానికి కారణం వారి తల్లిదండ్రులు ఎక్కువ శాతం మంది చదువుకున్నవారు కావడమేనని గుర్తించాలి. ప్రధానంగా చదువుకోని తల్లిదండ్రుల పిల్లలే అత్యధికంగా డ్రాప్ అవుట్ అవుతున్నారని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఆ నివేదికల ఆధారంగానే వయోజన విద్యకు ప్రా ధాన్యత ఎంత అత్యవసరమో తెలుస్తుంది. తల్లిదండ్రులు అక్షరాస్యులు కాకపోతే ఆ సమాజమే నిరక్షరాస్య సమాజంగా మారుతుంది. వయోజన విద్య అంటే సంతకాలు నేర్చుకునే చదువు కాదు. తమ జీవిత పాఠాల్ని అధ్యయనం చేసే విస్తృత ‘సమాజ తరగతి గది’ అది.
అక్షరాస్యత లేనటువంటి వర్గం అనుభవాలను మేధావులు తక్కువగా అంచనా వేశారు. ఇప్పటికి అలాంటి అంచనాలు వేస్తున్నారు. నేను మా వూరు గూడురుకు వెళ్లినపుడు రాములు, అతని స్నేహితులతో కూర్చుంటాను. వా రడిగే ప్రశ్నలు, దాంతోపాటు వారి అనుభవాలు చెబుతూ వుంటే అవి ఏ పుస్తకంలోనూ లేనటువంటివి అని బోధపడుతుంది. వీళ్ల మేధస్సుకు ఆ అంశాలు ఎలా వచ్చాయో కదా! అదే మాదిరిగా కనపడనటువంటి వనరులను, జ్ఞానాన్ని వారు తమ ప్రశ్నల ద్వారా, అనుభవాల ద్వారా చూపిస్తారు. కారణం వారి జీవితమే వాళ్లకు నిజమైన అనుభవం. అనుభవమే వారికి జీవిత పాఠం. ఫలానా నాడు ఇలా జరిగిందని చెప్పి నన్ను సవరించిన సందర్భాలు ఉన్నాయి. వయోజన విద్య వలన ఇప్పటివరకు కనపడని జ్ఞానం లేక వనరులు సమాజం ముందుకొస్తాయి.
కొన్ని కుల వృత్తుల వారితో నేను సేంద్రియ వనరుల గురించి మాట్లాడుతుంటే అడ్డుపడేవారు. గొర్రెల మందలు పెట్టే ఎరువులే కదా సేంద్రియ ఎరువులు అని అన్నారు. ఉట్నూరు పోతే అక్కడి గిరిజనులు చెబుతున్న అంశాలు ఆశ్చర్యపరిచాయి. రక్తప్రసరణ సక్రమంగా జరగాలంటే ఫలానా చెట్టు ఆకు కడితే మంచి వైద్యం అంటారు. నాకో చిన్న గాయమైతే ఒక చెట్టు పసరు పోసి కట్టుకట్టారు. తెల్లారేకల్లా ఆ గాయం మానిపోయింది. అనుభవమే వారి జ్ఞానం. ఆ అనుభవ పరిశోధనలే ఒకనా టి వైద్య రంగం. వయోజన విద్యలో ఇవన్నీ రికార్డు చేసుకోవాలి. గ్రామాలలో తిరుగుతున్నపుడు సమాజంలో వచ్చిన పండుగలు, పోచమ్మ గుడి, కట్ట మైసమ్మ.. వీటన్నింటి గురించి రికార్డు చేసుకుని రాబోయే ఉపాధ్యాయులకు అందజేస్తే తరగతి గదిలో డ్రాప్ అవుట్స్‌ను నివారించవచ్చు. ‘ఈ ఉపాధ్యాయుడికి మన పరిసరాలు తెలుసు. ఈ టీచర్ మన మనిషి’ అని ఆ ప్రాంతం అనుకుంటుంది. డ్రాప్ అవుట్ అయ్యే పిల్లలకు ఈ సంఘటనలు చెబుతుంటే ఈనాటి వరకూ బడికి రానివారు సైతం తరగతి గదిలో మమేకమైపోతారు. వయోజనులకు బ్రహ్మాండమైన రాజకీయ పరిజ్ఞానం వుంటుంది. ఏ నాయకుడు ఏ కాలంలో ఏ ఎత్తుగడలు వేశారు? తమను, తమ వర్గాల్ని ఏయే నాయకులు ఎలా అణిచారో వారు చెబుతుంటే వీరు చాణక్యులు కాదా? అనిపించింది.
మా వూర్లో వెంకయ్య పంతులు తన ఇంటికి నర్సింగరావును దత్తత తెచ్చుకున్నాడు. దత్తత తీసుకున్న ఇంట్లోగాకుండా నర్సింగరావు తన వూరికి వెళ్లాడు. 15 ఏళ్ల తర్వాత నర్సింగరావు మా గూడూరుకు వచ్చాడు. దత్తతకు సాక్ష్యం ఏమిటని కోర్టు అడిగింది. ఒక వ్యక్తి అందుకు దొంగ సాక్ష్యం చెప్పటంతో కోర్టువారు ఆ దత్తతను ఒప్పుకున్నారు. ‘దొంగ సాక్ష్యం’ చెప్పటానికి కొందరు ఎలా తర్ఫీదు పొంది వుంటారో మా వూరికి పోతే అక్కడివారు చెప్పేవారు. దీనికి లాయర్లు ఏం చేస్తారో చెప్పేవారు. సామాజిక అంశాలపై, గత కాలపు పద్ధతులపై, వయోజన విద్యపై రీసెర్చ్ జరుగుతోంది.
విశ్వవిద్యాలయంలోని ఎక్స్‌టెన్షన్ వారు వయోజన కేంద్రాలను గిరిజన గూడెంలో పెడితే వాళ్ల పరిసరాల నుంచి జ్ఞానం గ్రహించవచ్చును. మనం అక్షరం చెప్పటం కాదు, వాళ్ల దగ్గర నుంచి గొప్ప అనుభవాలను తెలుసుకుంటాం. కనపడకుండా దాగివున్న జ్ఞానాన్ని మనం వయోజన విద్య ద్వారా బైటకు తేవచ్చును. అది కొత్త సాహిత్యానికి భూమిక అవుతుంది.

- చుక్కా రామయ్య