క్రీడాభూమి

చివరి రేస్‌కు ‘జమైకా చిరుత’ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 2: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ దగ్గరపడుతున్న కొద్దీ అందరి దృష్టీ ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్‌పై కేంద్రీకృతమైంది. 2015 మాదిరిగానే ఈసారి కూడా అతను పతకాల పంటను పండిస్తాడా? స్ప్రింట్‌తోపాటు 200 మీటర్ల పరుగు, రిలే విభాగాల్లోనూ సత్తా చాటుతాడా? అన్న ప్రశ్నలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ. కెరీర్‌లో చివరిసారి అంతర్జాతీయ ఈవెంట్‌లో పాల్గొంటున్నట్టు ఇది వరకే బోల్ట్ ప్రకటించడంతో, మళ్లీమళ్లీ ఆ పరుగును చూసే అవకాశం దక్కదుకాబట్టి, కెరీర్‌లో అతని చివరి మజిలీ కోసం ప్రతి ఒక్కరూ ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్ వేదికగా, శుక్రవారం నుంచి మొదలయ్యే ప్రపంచ అథ్లెటిక్స్‌లో బోల్ట్ ప్రతి కదలికనూ, ప్రతి అడుగునూ అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తారని, అతను గెలిచినా.. ఓడినా.. చివరి రేస్ ముగించినప్పుడు ఘనంగా వీడ్కోలు పడతారని అనడం అతిశయోక్తి కాబోదు. రెండేళ్ల క్రితం ప్రపంచ అథ్లెటిక్స్‌లో అద్భుతాలు సృష్టించిన బోల్ట్, గత ఏడాది రియో ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాడు. ఈ ఏడాది, అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పే ముందు చివరిసారి పాల్గొంటున్న ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో బోల్ట్ తప్పకుండా తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తున్నది. గత ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో అతను 100, 200 మీటర్ల పరుగుతోపాటు రిలే ఈవెంట్‌లోనూ స్వర్ణ పతకాన్ని సాధించి ‘ఆల్ టైమ్ గ్రేట్’ జాబితాలో ముందు వరుసలో నిలిచాడు. అతనికి ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం లేకపోలేదు. తమతమ రంగాల్లో తిరుగులేని ప్రతిభాపాటవాలను కనబరచినవారు, అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన వారు ఎంతో మంది ఉంటారు. కానీ, సదరు క్రీడ వల్ల వ్యక్తికి కాకుండా, వ్యక్తివల్లే ఆ క్రీడకు గుర్తింపు రావడం అరుదు. బాక్సింగ్‌లో మహమ్మద్ అలీకి అలాంటి పేరే ఉంది. అందుకే, అప్పటి వరకూ బాక్సింగ్ గురించి పట్టించుకోని ఎన్నో దేశాల్లో అలీ కారణంగానే ఆ క్రీడకు ప్రాచుర్యం లభించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, క్రీడల పట్ల అంతగా ఆసక్తిలేని వారికి కూడా అలీ పేరు తెలుసు. సుమారు అర్ధ శతాబ్దం క్రితం ‘ఐయాం ది గ్రేటెస్ట్’ అని అలీ చేసిన సింహనాదం ఇప్పటికీ ప్రపంచమంతా మారుమోగుతునే ఉంది. అలీ మాదిరిగానే బోల్ట్ కూడా తనను తాను లెజెండ్‌గా అభివర్ణించుకున్నాడు. అలీ మాదిరిగానే అతనిది కూడా ప్రతిభతో కూడిన ఆత్మవిశ్వాసమే తప్ప అతిశయోక్తికాదు. 8 ఒలింపిక్ స్వర్ణాలు.. 11 ప్రపంచ టైటిళ్లు... తాను పోటీపడే 100 మీటర్ల స్ప్రింట్, 200 మీటర్ల పరుగు, రిలే ఈవెంట్స్‌లో ప్రపంచ రికార్డులు.. బోల్ట్ సామర్థ్యం ఏమిటో చెప్పకనే చెప్తున్నాయ. భూమి మీద అత్యంత వేగంగా పరిగెత్తే మనిషి అతను. ప్రపంచ రికార్డులు బోల్ట్ ఖాతాలోనే ఉన్నాయంటే, అంతకు ముందుగానీ, ఆతర్వాతగానీ అతని వేగాన్ని ఎవరూ అందుకోలేదని స్పష్టమవుతుంది. అందుకే ‘నన్ను మించిన అథ్లెట్ లేడు.. నేను లెజెండ్‌ని’ అని ప్రకటించుకున్నా ఎవరూ అభ్యంతరం చెప్పలేకపోయారు. బోల్ట్ చెప్పింది కాదని నిరూపించే సామర్థ్యం సమకాలీన అథ్లెట్లలో ఎవరికీ లేదన్నది వాస్తవం.
నిరంతర శ్రమ
బోల్ట్ ఒక్కసారిగా అందలాలు ఎక్కలేదు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో అతనికి అయాచితంగా అందలం లభించలేదు. అతను సాధించిన, సాధిస్తున్న విజయాల వెనుక అంతులేని శ్రమ దాగుంది. అనుకున్న లక్ష్యాలను చేరేందుకు నిరంతరం చెమటోడ్చాడు. ప్రతి రోజూ, అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడే అతని ప్రాక్టీస్ మొదలవుతుంది. తెల్లవారు జామున జాగింగ్‌తో మొదలయ్యే శిక్షణ రోజులో కనీసం ఎనిమిది గంటలు సాగుతుంది. క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, బాడ్మింటన్ తదితర క్రీడల్లో మాదిరి విరామం లేకుండా పోటీల్లో పాల్గొనే అవకాశాలు అథ్లెట్లకు, ప్రత్యేకించి స్ప్రింటర్లకు ఉండవు. ఏడాదికి ఒకటి లేదా రెండు ఈవెంట్స్ అంటాయ. రెగ్యులర్ షెడ్యూల్ ఉంటే, రొటీన్ వామప్‌ను కొనసాగించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఆఫ్ సీజన్‌లోనూ ఫిట్నెస్‌ను కాపాడుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. కండరాలు బెణకడం నుంచి గాయ పడడం వరకూ అథ్లెట్లకు ప్రతి క్షణం ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. ఒకరంగా చెప్పాలంటే, అడుగడుగునా ప్రమాదాలతో చెలగాటం ఆడుతూనే, ఫిట్నెస్‌తో ఉండడం, పోటీల్లో పాల్గొనడం, పతకాలను సాధించడం అసాధారణ ప్రతిభావంతులకు తప్ప సామాన్యులకు సాధ్యం కాదు.
తీవ్రమైన ఒత్తిడి
మిగతా అథ్లెట్ల విషయాన్ని చెప్పలేంగానీ, బోల్ట్ వంటి వారిపై ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ప్రతిభావంతుడు కాబట్టి బోల్ట్‌పై అభిమానుల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తన స్థాయిని నిలబెట్టుకోవడానికి, అభిమానులను నిరాశ పరచని రీతిలో ఫామ్‌ను కొనసాగించడానికి ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తీవ్రమైన ఒత్తిడిని అధిగమించి, లక్ష్యాలను అందుకోవడం అతనికి కత్తిమీద సామే. 2011లో ప్రపంచ చాంపియన్‌షిప్స్ డిగూలో జరిగినప్పుడు బోల్ట్ 100 మీటర్ల పరుగును పొరపాటుగా మొదలుపెట్టి అనర్హతకు గురయ్యాడు. 2015లో బీజింగ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్ 100 మీటర్ల స్ప్రింట్ సెమీస్‌లో ఫౌల్ చేయకపోయినా, ఆరంభంలో తడబడ్డాడు. సహజంగా స్ప్రింట్‌లో ఒకటిరెండు సెకన్లు వృథా అయినా విజయావకాశాలు చేజారిపోతాయి. కానీ, బోల్ట్ క్షణాల్లోనే సర్దుకున్నాడు. మెరుపు వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్లాడు. సమీప ప్రత్యర్థి జస్టిన్ గాల్టిన్‌ను రెండో స్థానానికి నెట్టాడు. ఫైనల్‌కు అర్హత సంపాదించాడు. బోల్ట్ ఆత్మవిశ్వాసం ఏ స్థాయలో ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఫైనల్ రేస్‌లోనూ గాల్టిన్ నుంచి ఎదురైన తీవ్రమైన పోటీని ఎదుర్కొని విజేతగా నిలిచాడు. అందుకే తాను లెజెండ్‌నని అతను ప్రకటించుకున్నాడు. ఈ వ్యాఖ్య చేసిన బోల్ట్‌ది అహంకారంకాదు ఆత్మస్థైర్యం. తనపై తనకున్న అంతులేని విశ్వాసం. అంతటి మనోధైర్యం ఉంటే, ఏ రంగంలోనైనా ఉన్నత ప్రమాణాలను నెలకొల్పవచ్చు. ఎంతటి లక్ష్యాలనైనా సాధించవచ్చు. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసేందుకు బోల్ట్ సమాయత్తమవుతున్నాడు. చిరుతను మించిన వేగం అతనిది. మొక్కవోని ధైర్యం అతని సొంతం. అంతులేని ఆత్మవిశ్వాసం అతని బలం. అందుకే, మరోసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను ఏలడానికి లండన్ చేరుకున్నాడు. ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నాడు.
ఒలింపిక్స్‌లో ‘ట్రిపుల్’ హ్యాట్రిక్
ఒలింపిక్స్‌ను బోల్ట్ ‘ట్రిపుల్’ హ్యాట్రిక్‌తో ముగించాడు. తన ఖాతాలో మరో రికార్డును చేర్చుకున్నాడు. ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలోనే వరుసగా మూడు ఒలింపిక్స్‌లో మూడేసి స్వర్ణ పతకాలను సాధించిన ఏకైక అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. రియో ఒలింపిక్స్ 4న100 మీటర్ల రిలే పూర్తయిన వెంటనే తనదైన శైలిలో ‘లైట్నింగ్’ ఫోజులిచ్చిన బోల్ట్ ‘ఐ యాం ది గ్రేటెస్ట్’ అని ప్రకటించుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించడంతో విశ్వక్రీడల్లో బోల్ట్ ప్రభంజనం మొదలైంది. 200 మీటర్ల పరుగు, 4న100 మీటర్ల రిలే ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకొని సత్తా చాటాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ, 2012 లండన్ ఒలింపిక్స్‌లో మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అక్కడ కూడా 100, 200 మీటర్ల పరుగు, 4న100 మీటర్ల రిలే ఈవెంట్స్‌లో విజేతగా నిలిచాడు. రియో ఒలింపిక్స్‌లోనూ ఈ మూడు ఈవెంట్స్‌లో మరోసారి స్వర్ణాలను గెల్చుకొని ‘ట్రిపుల్’ హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. మొత్తం మీద మూడు ఒలింపిక్స్‌లో అతను మొత్తం తొమ్మిది రేసుల్లో పాల్గొన్నాడు. అన్నింటిలోనూ స్వర్ణ పతకాలను సాధించాడు. ఈ ఫీట్‌ను ఇప్పటి వరకూ ఎవరూ సాధించలేదు. సమీప భవిష్యత్తులో సాధించే అవకాశాలు కూడా లేవు. ఒలింపిక్స్‌లో పోటీకి దిగిన ప్రతిసారీ స్వర్ణ పతకాలు సాధించడం అనుకున్నంత సులభం కాదు. ఒలింపిక్స్‌ను విజయవంతంగా ముగించిన అతను ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ నుంచి కూడా అదే రీతిలో వీడ్కోలు తీసుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. వారి ఆశ ఫలించాలని కోరుకుందాం.