కృష్ణ

దంపతుల హత్య కేసులో వీడిన మిస్టరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, ఫిబ్రవరి 14: విజయవాడ పటమటలంక చేపల మార్కెట్ సమీపంలో గత ఏడాది డిసెంబర్ 20న ఓ ఇంట్లో అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణ హత్యకు గురైన వృద్ధ దంపతులు మునగపాటి గంగాధరరావు(55), వీరాంజమ్మ(50) కేసులో మిస్టరీ వీడింది. పామర్రుకు చెందిన మామిళ్ల విజయ్ కుమారుడైన పవన్(20), నందిపాటి (లేటు) భాస్కరరెడ్డి కమారుడైన జస్వంత్(20), బడే సుబ్బారావు కుమారుడైన వంశీకృష్ణ(22), మాచవరపు కొండయ్య కుమారుడైన శివన్నారాయణ(19)లను పోలీసులు నిందితులుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి పటిష్ట బందోబస్తు నడుమ ఆదివారం పామర్రు నుంచి విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌కు పోలీసు అధికారులు తీసుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుల్లో మామిళ్ల పవన్ బంధువులు హత్యకు గురైన గంగాధరరావు ఇంట్లో అద్దెకుంటున్నారు. దీంతో పవన్ తన స్నేహితులు ఆ ఇంటికి వెళ్లినప్పుడు నగదు, నగలు దోచుకునేలా పథకానికి రూపకల్పన చేసి ఈ హత్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామని, కేసును పటమట పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తారని వివరించారు.

రైతుల్ని ఆదుకోని ‘అపరాలు’!
* నీటి తడుపు లేక ఎండిపోయిన పైర్లు
* గణనీయంగా తగ్గుతున్న దిగుబడులు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 14: ఖరీఫ్ నష్టాలతో అల్లాడిన రైతాంగాన్ని అపరాలు సైతం ఆదుకోలేకపోయింది. సాగునీటి కొరత కారణంగా దాళ్వాను వదులుకుని అపరాలు సాగు చేసిన రైతన్నలకు మళ్ళీ నష్టాలే మిగిలాయి. అపరాల దిగుబడులపై సాగునీటి కొరత తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం జిల్లాలో మినుము కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. నీటి తడులు పెట్టకపోవటంతో కోతలు ముందుగానే వచ్చాయని, తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ముమ్మరంగా మినుము తీత పనులు జరుగుతున్నాయి. అపరాల దిగుబడులపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలవుతున్నాయి. నీటి తడులు పెట్టకపోవటంతో రోజు రోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు మినుము పైరు ఎండిపోతుంది. నోటికాడికి వచ్చే సరికి పంట ఇలా ఎండిపోవటంతో రైతులు ఆవేదన అంతా ఇంతా కాదు. అయితే రెండు తడుపులు పెట్టిన మినుము పంట దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నాయి. భూగర్భ జలాలతో మినుము సాగు చేయలేని కౌలు రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసిన ఎల్‌బిజి 752తో పాటు 665, 648, నూతన విత్తనాలు అయిన 002 రకం విత్తనాలను రైతులు సాగు చేశారు. అయితే ఏ పంట వేసినా దిగుబడులు మాత్రం తగ్గనున్నాయి. ఎకరాకు రూ.30వేలు నుండి రూ.40వేలకు పైగా పెట్టుబడి పెట్టామని రైతులు వాపోతున్నారు. 10 సార్లకు పైగా పురుగు మందులు పిచికారీ చేశామని, చివరకు దిగుబడులు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలిగే నక్కపై తాడికాయ పడ్డ చందంగా కూలీ ధరలు కూడా పెరిగాయని రైతులు వాపోతున్నారు. ఎకరా మినుము పంట కోసేందుకే రూ.4వేలు ఖర్చు అవుతుంది. అసలే ఖరీఫ్ అప్పుల్లో కూరుకుపోయిన మేము అపరాల దిగుబడులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఖరీఫ్‌తో పాటు అపరాలను సాగునీటి సమస్య తీవ్రంగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు.

పేట నియోజకవర్గంలో
సాగునీటి సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు
* మంత్రి దేవినేని ఉమ
జగ్గయ్యపేట రూరల్, ఫిబ్రవరి 14: జగ్గయ్యపేట నియోజకవర్గంలో సాగునీటి సమస్య లేకుండా సత్వర పరిష్కార మార్గం చూపిస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం జగ్గయ్యపేట, నందిగామ ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురాంతో కలిసి మండలంలోని ముక్త్యాల కృష్ణానదీ పరివాహక ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం ఆంధ్రా, తెలంగాణా సరిహద్దులో ఉండటం వల్ల రాష్ట్రం రెండుగా విడిపోయిన పరిస్థితుల్లో జగ్గయ్యపేట నియోజకవర్గానికి సక్రమంగా సాగునీరు అందడం లేదని, దీనికి తోడు ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన పరిస్థితుల్లో రైతులు, ప్రజలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నారని, కృష్ణానదిపై ఎత్తిపోతల పధకం నిర్మించిన సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం అందించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు మంత్రి ఉమ క్షేత్రస్థాయి సందర్శన చేశారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ 11వ బ్రాంచి, 19 బ్రాంచిలతో పాటు మంగాపురం మేజరు, పోలంపల్లి మునే్నరు, కాచవరం సప్లై ఛానల్ ద్వారా నీటి సరఫరాకు కావాల్సిన సదుపాయాలపై ఆయన అధికారులతో చర్చించారు. పరిష్కార మార్గంగా నియోజకవర్గ సరిహద్దులో 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా నీటి సరఫరాకు అంచనాలపై పరిశీలించారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక, అంచనాలు రూపొందించేందుకు ఆ శాఖ అధికారులకు రూ.16లక్షల నిధులు మంజూరు చేశారు. తుది నివేదిక అందిన తరువాత పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండల పార్టీ అధ్యక్షులు కట్టా నర్శింహరావు, జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి, చింతల సీతారామయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ యలమంచిలి రాఘవ, నీటి సంఘం అధ్యక్షుడు పాల్గొన్నారు.

నేడు గోళ్లమూడికి సిఎం చంద్రబాబు రాక
నందిగామ, ఫిబ్రవరి 14: మండలంలోని గోళ్లమూడి గ్రామంలో సోమవారం జరిగే ఒక ప్రైవేటు విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హజరు కానుండటంతో గ్రామంలోని శివాలయం సమీపంలో హెలిపాడ్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. హైదరాబాదులో స్థిరపడిన గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు దేవభక్తుని నిత్యానంద ప్రసాద్ (డిఎన్) కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో సిఎం చంద్రబాబు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా హెలిపాడ్ నిర్మాణ పనులను ఆదివారం ఎడిషనల్ ఎస్‌పి విద్యాసాగర్, సిఎం సెక్యూరిటీ ఆఫీసర్ ఎ జోషిలు పరిశీలించారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గోళ్లమూడి గ్రామానికి వస్తున్న సందర్భంలో ఆయన చేతుల మీదుగా ఎన్‌టిఆర్ విగ్రహావిష్కరణ చేసేందుకు గ్రామ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కెయును మోడల్ వర్సిటీగా తీర్చిదిద్దుతా
* రోల్డ్‌గోల్డ్, ఆక్వా కల్చర్‌పై డిప్లమో కోర్సులు
* విశ్వవిద్యాలయం సామర్థ్యం పెంపునకు కృషి
* ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య రామకృష్ణారావు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 14: నవ్యాంప్రదేశ్ రాజధాని ప్రాంతానికి అతిచేరువలో ఉన్న కృష్ణా విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలోనే మోడల్ వర్సిటీగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆదివారం ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించారి ఆచార్య సుంకరి రామకృష్ణారావు అన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా విశ్వవిద్యాలయం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు విశ్వవిద్యాలయం అభివృద్ధికి చక్కటి ప్రణాళికలు తయారుచేశారని, వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. సదుపాయాలు కల్పించటంతో పాటు స్థానికంగా ఉన్న రోల్డుగోల్డు పరిశ్రమ, ఆక్వా కల్చర్‌పై డిప్లమో కోర్సులు ప్రవేశ పెడతామన్నారు. రీసెర్చ్‌కు అవసరమయ్యే వర్కింగ్ మోడల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. విశ్వ విద్యాలయం సామర్ధ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తానన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఉపకులపతి సుంకరి రామకృష్ణారావును విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య డి సూర్యచంద్రరావు, హిందూ కళాశాల అనుబంధ సంస్థల పాలకవర్గ కార్యదర్శి దైత లక్ష్మణ శాస్ర్తీ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య), విశ్వ విద్యాలయం క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకె సుందర కృష్ణ తదితరులు అభినందించారు.

ఎమ్మెల్యే ప్రతాప్‌కు సతీవియోగం
నూజివీడు, ఫిబ్రవరి 14: నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి మేకా సుజాతమ్మ (56) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఇంటిలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావటంతో ఆమె మృతి చెందారు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సుజాతమ్మ మృతదేహాన్ని పురప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, కుమారుడు వేణుగోపాల అప్పారావును పరామర్శించి, సానుభూతి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం టెలిఫోన్‌లో ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావును పరామర్శించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సుజాతమ్మ మృతదేహాన్ని సందర్శించి దివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, ఆయన కుమారుడు వేణుగోపాల అప్పారావును పరామర్శించారు. శాసనసభ్యులు జలీల్‌ఖాన్, ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, వల్లభనేని వంశీమోహన్, మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, జోగి రమేష్, వైకాపా నాయకులు గౌతం రెడ్డి, నూజివీడు పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ బసవ రేవతి, మాజీ ఛైర్మన్ బసవ బాస్కరరావు, మాజీ వైస్ ఛైర్మన్ రామిశెట్టి మురళీకృష్ణకుమార్, స్నేహారైడ్సు ఛైర్మన్ బసవరాజు నగేష్‌రావు, నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కాపా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు అక్కినేని చందు, జగ్గవరపు వెంకటరెడ్డి, వీరమాచనేని సత్యనారాయణ, పసుపులేటి జగన్‌మోహనరావు, కౌన్సిలర్లు కందుల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్‌ఆర్ చౌదరితో పాటు పలువురు పురపాలక సంఘం కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సుజాతమ్మ మృతదేహాన్ని సందర్శించి, ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావును పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ఫోన్‌లో ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావును పరామర్శించారు. సుజాతమ్మ అంత్యక్రియలకు వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్‌మెహనరెడ్డి హాజరౌతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు.

శాస్త్రోక్తంగా రథసప్తమి
కూచిపూడి, ఫిబ్రవరి 14: రథసప్తమి పర్వదినాన్ని ఆదివారం మొవ్వ మండలంలో మహిళలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆరోగ్యం, భాస్కరాధిత్యేత్.. అన్న వేదోక్తిని అనుసరించి సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తే మానసిక, శారీరక రుగ్మతులు తగ్గుతాయని ఆయుర్వేద వైద్య గ్రంథాలు పేర్కొన్నాయని ఆచార్య రామకృష్ణమాచార్యులు తెలిపారు. మొవ్వ మండలం బార్లపూడి గ్రామంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ అర్చకులైన ఈయన ఆధ్వర్యంలో ఆవు పిడకల దాలిపై చిక్కుడుకాయలతో తయారుచేసిన రథాలను, ఆవుపాలతో చేసిన పర్వాన్నం పొంగించి సూర్య భగవానునికి నివేదించిన అనంతరం ప్రసాదంగా స్వీకరించారు. కాగా మండలంలోని కాజ శివారు మట్లమాలపల్లి దళితులు రథసప్తమిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మందా సుధారాణి, శ్రీనివాసరెడ్డి దంపతులు, ప్రసాదరెడ్డి, సాగరరెడ్డి దంపతుల పర్యవేక్షణలో గోకపై రామకృష్ణ, కొచ్చర్ల వెంకటేశ్వరరావు, నాగమల్లి, దుర్గ, వెంకటేశ్వరమ్మ తదితర మహిళలు భక్తిశ్రద్ధలతో రథసప్తమి పూజలు నిర్వహించారు.

ముమ్మరంగా మినుము కోతలు
గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 14: మండలంలో దాదాపు 25వేల ఎకరాలలో సాగు చేసిన మినుము పంట ఆశాజనకంగానే ఉంది. గత కొద్దిరోజులుగా మినుము కోత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యవసాయ కూలీలకు ధరలు కూడా అనుకూలంగా ఉండటంతో కోతల పట్ల కూలీలు ఆసక్తి చూపుతున్నారు. కూలీ రూ.100 నుంచి రూ.150వరకు పెరిగింది. వేకువ జాము నుంచే పనులు చేసేందుకు వెళుతున్నారు. దీంతో మండలంలో మహిళలు పెద్దసంఖ్యలో మినుము కోత పనులకు మొగ్గు చూపుతున్నారు.

పరిహారం కోరుతూ రైతుల ధర్నా
ముసునూరు, ఫిబ్రవరి 14: ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు చెప్పిన మాయమాటలు నమ్మి సీడ్ మొక్కజొన్నను సాగుచేశామని, తీరా పంట చేతికి రాకముందే పంటకు తెగుళ్లు వ్యాపించి పంట దిగుబడి రాక నష్టపోయామని తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ ముసునూరు మండపం సెంటరు వద్ద సుమారు 100 మంది రైతులు ఆదివారం సాయంత్రం గంటసేపు ధర్నా నిర్వహించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం ముసునూరు గ్రామానికి చెందిన రైతులు పయనీర్ సీడ్ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలను సాగుచేశారు. పంట దిగుబడి ఎకరానికి 4 నుండి 6 టన్నుల వరకు వస్తుందని ప్రతినిధులు చెప్పడంతో ఆశపడి పంటను సాగుచేశామని రైతులు చెప్పారు. పంటకు తెగుళ్ల బెడద ఉండదని, మందుల పిచికారి కూడా అవసరం లేదని కంపెనీ ప్రతినిధులు చెప్పగా తాము మొక్కజొన్న పంటను వేశామని రైతులు తెలిపారు. తీరా పంట కాలం పూర్తికాకముందే పంట నిలువునా ఎండిపోతూ వేరుకుళ్లు వచ్చి మొక్కజొన్న కర్రలు పడిపోవడంతో పాటు నాసిరకం కండెలు వేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. దీంతో రైతులు కంపెనీ ప్రతినిధులతో చెప్పినా వారు పట్టించుకోలేదని వాపోయారు. నాలుగురోజుల క్రితం విత్తన సంఘం ప్రతినిధులు వచ్చి పంటను పరిశీలించి పంట నష్టపరిహారంగా ఎకరానికి రూ.70 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయని పక్షంలో విత్తన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శనివారం రాత్రి రైతులు కంపెనీ ప్రతినిధుల మధ్య చర్చలు సాగాయి. చర్చలు విఫలం కావడంతో రైతులు ఆదివారం ధర్నాకు దిగారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాతో ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఉద్యమానికీ వెనుకాడం
మోపిదేవి, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమానికి సైతం వెనుకాడేది లేదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి దివి లీలా మాధవరావు హెచ్చరించారు. ఆదివారం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా డీలర్లు రూ.1970 కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం నిర్వహిస్తుండగా సుమారు రూ.3కోట్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారుల హామీల మేరకు డీలర్లు నష్టాలు భరించాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం డీలర్లకు న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్టవ్య్రాప్తంగా 266 ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయన్నారు. జగ్గయ్యపేట, తదితర ఎంఎల్‌ఎస్ పాయింట్లలో తూనికల్లో మోసం రుజువు అయితే రూ.30వేలు మాత్రమే జరిమానా విధించారని, కిలో, అరకిలో తేడా వస్తే రేషన్ డీలర్‌పై రూ.10వేల వరకు జరిమానాలు విధిస్తున్నారన్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం రేషన్ డీలర్లకు న్యాయం చేస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి డీలర్ల సంఘం అధ్యక్షులు కొమ్ము మోహనరావు, డీలర్లు బి తాతారావు, కోసూరు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

నగల కోసమే.. హతమార్చారు
* దంపతుల హత్యకేసు చేధించిన పోలీసులు
* నలుగురు అరెస్టు.. సొత్తు రికవరీ
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 14: గత డిసెంబర్‌లో పటమట లంకలో జరిగిన దంపతుల దారుణహత్య కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. బంధువులు, సన్నిహితులు, తెలిసినవారే ఈఘాతుకానికి పాల్పడి ఉంటారని, మరోవైపు కరుడుగట్టిన దోపిడి దొంగలు నగల కోసమే మట్టుబెట్టి ఉంటారని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. అయితే హతుల ఇంట్లో అద్దెకు ఉన్న ఓ మహిళ కుమారుడు అతని స్నేహితులు కలిసి ఈదారుణానికి ఒడిగట్టారు. నగల కోసమే అయినా రెండు నిండు ప్రాణాలను బలిగొన్న నిందితులు కేవలం మూటకట్టుకెళ్లింది నామమాత్రమే కావడం గమనార్హం. సుమారు రెండు మాసాల దర్యాప్తు అనంతరం ఎట్టకేలకు నిందితులను గుర్తించి నలుగురిని అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు వారి నుంచి నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే సొత్తు రికవరీ చేశారు. సిసిఎస్ స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో క్రైం అదనపు డిసిపి జి రామకోటేశ్వరరావు పూర్తి వివరాలు వెల్లడించారు. పటమటలంక చేపల మార్కెట్ సమీపంలో నివాసముంటున్న సూపర్ మార్కెట్ ఉద్యోగిని మునగపాటి వీరాంజమ్మ (50), భర్త గంగాధరరావు (55)లు తమ ఇంట్లోనే దారుణ హత్యకు గురైన ఘటన గత ఏడాది డిసెంబర్ 20న వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన మామిళ్ళ పవన్‌కళ్యాణ్ అలియాస్ పవన్ (20), నందిపాటి జస్వంత్ (21), బడే వంశీకృష్ణ (23), మాచవరపు శివనారాయణ (24)లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 4లక్షల రూపాయలు విలువైన 130 గ్రాముల బంగారు నగలు, రెండు సెల్‌ఫోన్లు, 40గ్రాముల వెండి సామగ్రి, హత్యకు ఉపయోగించిన ఆటో, ఒక బైక్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు నలుగురు స్నేహితులే. వీరిలో ప్రధాన నిందితుడు పవన్ తల్లి గంగా ఆరేళ్ల క్రితం భర్త నుంచి వేరుపడి పటమటలంక చేపలమార్కెట్ సమీపంలోని మునగపాటి వీరంజమ్మ ఇంటి కింద అద్దెకు ఉంటోంది. పవన్ మాత్రం పామర్రులో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు తల్లి వద్దకు వచ్చి వెళ్తుంటాడు. ఈక్రమంలో పవన్ అతని స్నేహితుడు జస్వంత్‌లు నవంబర్‌లో నగరంలోని మెట్రోలో పనికి కుదిరారు. దీంతో మెట్రోలో పని చేసుకుంటూ తల్లి వద్దే ఉంటున్నాడు. ఈక్రమంలో ఇంటి యజమాని దంపతులపై కనే్నశాడు. బాగా డబ్బు కలిగినవారుగా భావించారు. కొద్దిరోజుల తర్వాత మెట్రోలో పని మానేసి డిసెంబర్‌లో తిరిగి పామర్రు వెళ్లిపోయారు. తల్లి మాత్రం ఇక్కడే ఉంటోంది. జల్సాలకు డబ్బు అవసరం పడిన పవన్ దృష్టి ఇంటి యజమానులు వీరాంజమ్మ దంపతులపై పడింది. వారిని మట్టుపెట్టి దోచుకోవాలని భావించిన పవన్ తన స్నేహితులైన వంశీకృష్ణ, జస్వంత్, శివనారాయణలకు చెప్పి హత్యకు వ్యూహరచన చేశారు. గత ఏడాది డిసెంబర్ 18న బైక్‌పై పామర్రు నుంచి వచ్చి రెక్కీ చేశారు. మరుసటి రోజు 19న రాత్రి ఇంటికి వచ్చి తలుపుకొట్టగా తలుపు తీసిన వీరాంజమ్మను లోనికి నెట్టి భార్య భర్తలను కత్తితో పొడిచి, బ్లేడ్లతో గాయపరిచి హతమార్చారు. ఇంట్లో లభించిన బంగారు నగలు, వెండి వస్తువులు, ఏటిఎం కార్డులు, పాస్‌పోర్టు, సెల్‌ఫోన్లు తీసుకుని ఆటోలో ఉడాయించారు. వెళ్తూ.. దొరక్కూడదని కారం చల్లి వెళ్లారు. ఎట్టకేలకు నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు అదనపు డిసిపి తెలిపారు. విలేఖరుల సమావేశంలో క్రైం ఏసిపిలు వర్మ, పోతురాజు, సుందరరాజు, సిఐ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ఇన్నర్‌రింగ్ రోడ్డుకు అడ్డుగా ఉన్న
ఇళ్ల తొలగింపు.. ఉద్రిక్తత...
విజయవాడ రూరల్, ఫిబ్రవరి 14: ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా రైవస్ కాల్వగట్టుకు అడ్డుగా ఉన్న ఇళ్లు తొలగింపు ప్రయత్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ గ్రామీణ మండలంలోని రామవరప్పాడు గ్రామంలో ఆదివారం ఉదయం రైవస్ కాల్వగట్టుపై ఉన్న ఇళ్ల తొలగింపునకు రెవెన్యూ అధికారులు చేరుకోగానే నిర్వాసితులు, పిల్లలు, పెద్దలు అధికార్లతో వివాదానికి దిగారు. ఇళ్ల తొలగింపును నిరసిస్తూ కుటుంబ సభ్యులతో సహా జాతీయ రాహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ విషయం తెలుసుకొన్న శాసన సభ్యుడు వల్లభనేని వంశీమోహన్ చేరుకొని నిర్వాసితులను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని ధైర్యంగా ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఈ విషయం చర్చిస్తానని అప్పటి వరకు ఇళ్ల తొలగింపు నిలిపివేయాలని చెప్పటంతో రెవెన్యూ అధికారులు అక్కడ నుండి వెనుదిరిగి వెళ్లారు. దీంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు. అనంతరం వల్లభనేని వంశీమోహన్, పార్లమెంట్ సభ్యులు నారాయణలు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ పిలిపించి అధికారులు దూకుడుగా వెళితే సహించేది లేదని, ఎక్కడా లేని విధంగా గన్నవరం నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా 14రకాల భూసేకరణ జరగాల్సి ఉందని, ఎలాంటి భూసేకరణ విషయంలోనైనా ఎమ్మెల్యే, ఎంపితో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించిన తరువాత తగిన పరిష్కారం లేదా ప్రత్యామ్నాయం చూపి భూసేకరణ జరుగుతుందని వంశీ భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే వంశీపై కేసు
విజయవాడ గ్రామీణ మండలం రామవరప్పాడు రైవస్ కాలువ కట్టపై అధికారులు ఇళ్లు కూల్చివేతకు సిద్ధం కాగా కోపోద్రిక్తులై బాధితులు రాస్తారాకోకు దిగారు. అక్కడకు చేరుకొన్న ఎమ్మెల్యే వంశీ ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎవరూ ఆందోళన చెందవద్దు అని భరోసా నేపథ్యంలో ధర్నా విరమించారు. అయితే రాస్తారాకోలో పాల్గొన్నారనే అభియోగంతో పటమట పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. రెవెన్యూ అధికారులు అత్యుత్సాహానికి కోపోద్రిక్తులైన పేద ప్రజలకు అండగా నిలిచి వారిని శాంతపరచి ఆందోళనను విరమింపజేసిన తనపై కేసు నమోదు చేయటాన్ని నిరసిస్తూ శాసన సభ్యులు వల్లభనేని వంశీమోహన్ తనకు ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు అంగరక్షకులను వెనక్కి పంపారు.

ఆంధ్రరత్న భవన్‌కు మహర్దశ
* పిసిసి కార్యాలయంగా రూపుదిద్దుకుంటున్న ఆంధ్రరత్న భవన్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 14: శిథిలావస్థలో ఉన్న ఆంధ్రరత్న భవన్ సుమారు రూ.50 లక్షల రూపాయలతో హంగు, ఆర్భాటంగా రూపుదిద్దుకుంది. సుమారు 50 ఏళ్ల తర్వాత మళ్లీ పిసిసి కార్యాలయంగా అవతరించబోతోంది. దశాబ్దాల తరబడి మూతబడి గబ్బిలాలకు నిలయంగా కొనసాగుతూ వస్తున్న ఆంధ్రరత్న భవన్ నేటి అత్యాధునిక టెక్నాలజీకి అనుగుణంగా మారుతోంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో పూర్తి ఎయిర్ కండిషనర్‌తో పిసిసి అధ్యక్షుని ఛాంబరుతో పాటు మీటింగ్ హాలు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అనుబంధ సంస్థలు అయిన యూత్ కాంగ్రెస్, సేవాదళ్, మహిళా కాంగ్రెస్, ఎస్‌సి, బిసి, ఎస్‌టి సెల్స్‌కు ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటవుతున్నాయి. 30 ఏళ్లుగా ఒక చిన్న గదిలో నివసిస్తున్న ఒక కుటుంబానికి రూ.6 లక్షలు పరిహారంగా చెల్లించడం జరిగింది. వంగవీటి మోహనరంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో నిరుపేదలైన ఆ కుటుంబానికి పార్టీ కార్యాలయంలో ఆశ్రయం కల్పించటం జరిగింది. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు పిసిసి క్యాంప్ కార్యాలయంగా ఆంధ్రరత్న భవన్ పనిచేసింది. 1962 ప్రాంతంలో పిసిసి అధ్యక్ష పదవికి నీలం సంజీవరెడ్డి, ఆచార్య రంగా మధ్య ఇదే భవన్‌లో హోరాహోరీ పోరు జరిగింది. సీనియర్ నేతలు కల్లూరి చంద్రవౌళి, కాకాని వెంకటరత్నం నీలం సంజీవరెడ్డికి మద్దతునివ్వటంతో కేవలం రెండు ఓట్ల ఆధిక్యతతో గెలువగల్గారు. ఓటమిని జీర్ణించుకోలేని రంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కృషికార్ లోక్‌పార్టీని స్థాపించారు. 1962 ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అయ్యదేవర కాళేశ్వరరావు హయాంలో ఆంధ్రరత్న భవన్ నిర్మాణానికి పునాది ఏర్పడింది. ఇందులో పిసిసి కార్యాలయం ఏర్పాటుకు తొలి ఎంపి బోడె మురహరి కృతకృత్యులయ్యారు. హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రం ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి కాగా అయ్యదేవర స్పీకర్‌గా పనిచేశారు. ఆ సమయంలో మున్సిపల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కాకరపర్తి భావనారాయణ మొదటి అంతస్తును నిర్మించారు. 2004 ఎన్నికల సమయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న కడియాల బుచ్చిబాబు గన్నవరం నుంచి పోటీచేస్తున్న సమయంలో ఎంపి పర్వతనేని ఉపేంద్ర ఆంధ్రరత్న భవన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. విష్ణుకు నగర కాంగ్రెస్ పగ్గాలు అప్పగించి ఆంధ్రరత్న భవన్‌లో కార్యకలాపాలు చురుగ్గా జరిగేలా గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గదులను అనుబంధ సంస్థలకు అప్పగించారు. రాజగోపాల్ ఎంపిగా ఉన్న సమయంలో ఆంధ్రరత్న భవన్ పూర్తిగా కూల్చివేసి బహుళంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పైలా సోమినాయుడుతో కలిసి వ్యూహరచన చేశారు. రాజగోపాల్ పదేళ్లు ఎంపిగా ఉన్నప్పటికీ పాడుబడిన ఆ భవనానికి కనీసం రంగు కూడా పడలేదు. పైగా ఏళ్ల తరబడి విద్యుత్ బిల్లులు కూడా చెల్లించని పరిస్థితి ఏర్పడింది. అలాంటి శిథిలావస్థలో ఉన్న ఆంధ్రరత్న భవన్ ప్రస్తుతం ‘అదరహో’ అనిపిస్తోంది.
19న ప్రారంభోత్సవం
రథసప్తమి సందర్భంగా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కొబ్బరికాయలు కొట్టి కార్యాలయంలోకి అడుగుపెట్టారు. అయితే అధికారికంగా ఈనెల 19న ఎపి వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇదే సందర్భంలో పిసిసి విస్తృతస్థాయి సమావేశం జరుగబోతోంది.

కులాల కుంపట్లకు మొదటినుంచి కాంగ్రెస్ దూరం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 14: 125 ఏళ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు కూడా ఏనాడూ తమ రాజకీయాల కోసం కులాలను ఓట్ల యంత్రాలుగా వాడుకోలేదంటూ దళిత వర్గానికి చెందిన దామోదర సంజీవయ్యే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్‌లో ఆదివారం జరిగిన దామోదర సంజీవయ్య 95వ జయంతి వేడుకల్లో రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు అధ్యక్షత వహించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ నేడు అనేక జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా అధికారమే పరమావధిగా భావిస్తూ కొన్ని కులాలను ఓటు బ్యాంక్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తున్న రోజుల్లోనే ఏ ఒక్కరూ నోరుతెరచి అడక్కుండా దళిత వర్గానికి చెందిన అతి సామాన్య వ్యక్తి దామోదర సంజీవయ్యను శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా చివరకు కాంగ్రెస్ పార్టీకి అఖిల భారత అధ్యక్షునిగా కూడా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఆయన మరణించే సమయానికి స్వంత ఇల్లు, వాకిలి కూడా లేదని, 1500 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, శిథిలావస్థలో ఉన్న కారు మాత్రం ఉన్నాయన్నారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ దళిత వర్గాల అభ్యున్నతి కోసం తొలిసారిగా ఇందిరాగాంధీ గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరూ బ్యాంకుల్లోకి అడుగుపెట్టేలా జాతీయకరణ చేశారన్నారు. మాజీ మంత్రి బాలరాజు మాట్లాడుతూ దామోదర సంజీవయ్య లాంటి మహోన్నత వ్యక్తులు నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పిసిసి అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ అతి సామాన్యులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉందన్నారు. పిసిసి ప్రధాన కార్యదర్శి నరహరశెట్టి నరసింహారావు మాట్లాడుతూ కాపులను బిసిలుగా గుర్తించేందుకు చంద్రబాబు జగన్నాటకం ఆడుతున్నారన్నారు. సభలో పిసిసి ఉపాధ్యక్షుడు ఎంజె రత్నకుమార్, సీనియర్ నేత బాబూరావు, కొరగంజి భాను, ఎస్‌సి సెల్ చైర్మన్ రాజకమల్ తదితరులు ప్రసంగించారు.

మన ఆలయాలకు మహర్దశ
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 14: రానున్న కృష్ణ పుష్కరాల సందర్భంగా జిల్లాలోని వివిధ ఆలయాలకు కొత్త హంగులను ఏర్పాటు చేసేందుకు దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ వైవి అనూరాధ రూ.13.47కోట్లు విడుదల చేశారు. త్వరలో రానున్న కృష్ణ పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా కృష్ణమ్మ నదీతీరం వెంబండి ఉన్న సుమారు 150 ఆలయాలను జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ దుర్గాప్రసాద్ గుర్తించి వాటికి కొత్త హంగులను ఏర్పాటు చేయటంతోపాటు, ఈ ఆలయాల్లో భక్తులకు అవసరమైన అన్ని రకాలైన వౌలిక సదుపాయాలను కల్పించటం వంటి అంశాలు వివరిస్తూ నివేదికను పంపించటంతో నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ఈ విలేఖరితో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలోని రూ.50లక్షల ఆదాయం పైబడిన 4 ఆలయాలు, 5లక్షల నుండి 20 లక్షల మేరకు ఉన్న 8 ఆలయాలు, 10లక్షలనుండి 20లక్షల మేరకు ఆదాయం కలిగిన 20 ఆలయాలు, 5లక్షలనుండి 10లక్షల ఆదాయం కలిగిన 28 ఆలయాలు, 2లక్షల ఆదాయం కలిగిన 45 ఆలయాలను తొలుత గుర్తించటం జరిగిందన్నారు. వాటిలో ప్రత్యేకంగా కొన్ని ఆలయాలకు మరమ్మతులు, రంగులు వేయించటం, ఆలయాల్లో మంచినీటి వసతి ఏర్పాటు చేసేందుకు మాత్రమే ఈనిధులు ఖర్చు చేయటం జరుగుతోందని ఆయన వివరించారు. పనులకు ప్రారంభించేందుకు అవసరమైన సాంకేతిక పరమైన అంశాలను ఇంజనీరింగ్ అధికారులు పూర్తి చేసిన వెంటనే ఈ పనులను ప్రారంభించి కృష్ణ పుష్కరాల మహోత్సవాలకు సుమారు 20 రోజుల ముందుగానే ఈఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబు చేయనున్నట్లు ఎసి దుర్గాప్రసాద్ చెప్పారు. ఇప్పటికే జిల్లాలోని వివిధ ఆలయాలకు చెందిన ఇవోలు, సిబ్బందికి పలుసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించటం జరిగిందన్నారు. ఈప్రత్యేకంగా ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బందిని వెంటబెట్టుకొని జిల్లాలోని అన్ని ఆలయాలను పరిశీలించటం జరిగిందని ఎసి వివరించారు.

హుషారుగా మిస్ ఎపి 2016 గ్రాండ్ ఫినాలే
లబ్బీపేట, ఫిబ్రవరి 14: హుషారెత్తిన గీతాలతో సినీ సింగర్స్ దీపు, దినకర్ పాటల పల్లకిలో ప్రేక్షకులను ఉరేగించారు. వీనులకు వినసొంపైన సంగీత కచేరి డాన్ మాస్టర్ సందీప్‌గ్రాప్ దృశ్యకేలి ఎంతగానో అలరించాయి. నికిత, పరిణిక యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకుంది. జబర్దస్త్ టీం సభ్యులు చలాకి చంటి, భాస్కర్ గాలిపటాల సుధాకర్ హాస్యం ప్రేక్షకులను కడుపుఉబ్బ నవ్వించింది. హిరోయిన్ మిత్ర తన నృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అర్ధరాత్రిదాకా జరిగిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకుంది. నేటి యువతలో ఉన్న ఆలోచలను వెలికితీయాలనే లక్ష్యంతో నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో తొలిసారిగా ప్యూచర్ ఆల్ సంస్ధ ఆధ్వర్యంలో శ్రీ సాయి క్రియేటివ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్ధ ప్యూచర్ ఆల్ మిస్ ఎపి 2016 గ్రాండ్ ఫినాలే ఆదివారం సిద్ధార్ద కళాశాల హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఘనంగా జరిగాయి. ఉత్తర భారతదేశంతో పాటు కర్ణాటక రాష్ట్రం కంటే తెలివైన అందమైన, యువతీ,యువకులు మన రాష్టల్రో ఉన్నారని, అంతే కాకుండా దీనికి విశేష ప్రాచుర్యాన్ని కల్పించటానికి అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దామని సంస్ధ ఎండి గొట్టిపాటి సాయి అన్నారు. మిస్ విజయవాడ, మిస్ గుంటూరు, మిన్ నెల్లూరు, మిస్ వెస్ట్ గోదావరి, మిస్ రాజమండ్రి, మిస్ విశాఖపట్నం విజేతలందరితో ఫినాలే ఏర్పాటు చేసామని తెలిపారు. పి గీతికా రతన్, ఎన్ దివ్య, జెబి సురేఖ, టి కుష్మ, ఆర్ శ్రవాణి, ఎం సుజశ్రీ, టి తేజశ్వనీ, ఎండి సుమ్య, ఎంఎ తేజ సుమ్య, ఎ సంజన, ఎం తనుర్య, జెనిష పారుఖ్, జి హరిక, ఎస్ దివ్య, డి దేవి ప్రియ, ఎం శ్రీ సత్య, ఎస్ ప్రసన్న రాంఫ్ ఫో ప్రేక్షకులను ఎంతోగానో అకట్టుకుంది. వీరికి జడ్జీలుగా సినీ హీరోయిన్ పూనమ్ కౌర్, డమరుకం సినిమా డైరక్టర్ శ్రీనివాసరె