క్రీడాభూమి

ఓపెనర్ల మధ్య పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: శ్రీలంకతో చివరిదైన మూడో టెస్టు శనివారం నుంచి మొదలుకానుండగా, టీమిండియా కెప్టెన్‌ను ఎంపిక సమస్య వేధిస్తున్నది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్ విఫలమైనప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో రాణించారు. ధావన్ 94 పరుగులు సాధిస్తే, రాహుల్ 79 పరుగులు చేశాడు. టెస్టు స్పెషలిస్టుగా ముద్రవేసి, పరిమిత ఓవర్ల ఫార్మాట్స్ నుంచి పక్కకుపెట్టిన మురళీ విజయ్‌కి ఆ మ్యాచ్‌లో చోటు కల్పించకపోవడం అదరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, వ్యక్తిగత కారణాలతో రెండో టెస్టుకు ధావన్ దూరంకాగా, అతని స్థానంలో విజయ్‌ని ఆడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను 128 పరుగులు చేసి, ఓపెనర్‌గా తన ప్రతిభను నిరూపించుకున్నిడు. మొత్తం మీద ముగ్గురూ ఫామ్‌లో ఉండడం కోహ్లీకి చిత్రమైన సమస్యను తెచ్చిపెడుతున్నది. సాధారణంగా ఓపెనర్లు విఫలం కావడం లేదా ఫామ్ కోల్పోవడం లేదా గాయపడడం వంటి సమస్యలు జట్టు మేనేజ్‌మెంట్‌ను వేధిస్తుంటాయి. దీనితో ఇన్నింగ్స్‌ను ఎవరు ప్రారంభిస్తారన్న ప్రశ్న తెరపైకి వస్తుంది. ఓపెనర్లను ఎంపిక చేయడానికి కెప్టెన్, కోచ్ నానా తంటాలు పడతారు. కానీ, ఇప్పుడు టీమిండియా కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవి శాస్ర్తీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ధావన్, రాహుల్, విజయ్ తీవ్రంగా పోటీపడుతున్న తరుణంలో ఎవరిని పక్కకు పెట్టాలో తేల్చుకోవడం వారికి సులభ సాధ్యం కాదు. చివరిదైన మూడో టెస్టు నుంచి విశ్రాంతి తీసుకోవాలని కోహ్లీ తొలుత అనుకున్నాడు. అదే జరిగి ఉంటే, అతను బ్యాటింగ్‌కు దిగే నాలుగో స్థానాన్ని రాహుల్‌కు కేటాయించవచ్చు. అయితే, కోహ్లీని చివరి టెస్టులో ఆడించాలని నిర్ణయించిన సెలక్టర్లు అతనికి వనే్డ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. దీనితో ఓపెనర్ల ఎంపిక సమస్య కోహ్లీని వేధిస్తున్నది. అతను తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ముగ్గురిలో ఒకరు బెంచ్‌కి పరిమితం కానుండగా, అతను ఎవరన్న ప్రశ్నకు సమాధానం ప్రస్తుతానికి లేదు.
నాయర్‌ను వెంటాడుతున్న దురదృష్టం
యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్‌ను దురదృష్టం వెంటాడుతున్నది. సమర్థుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, అజింక్య రహానేకే జట్టు మేనేజ్‌మెంట్ అధిక ప్రాధాన్యం ఇస్తున్న కారణంగా అతనికి ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కడం లేదు. రహానే పునరాగమనంతో నాయర్ అవకాశాలకు గండిపడింది. ప్రస్తుతం అంతగా ఫామ్‌లో లేని రహానేకు విశ్రాంతినచ్చి, తుది జట్టులోకి నాయర్‌ను తీసుకునే సాహసం కోహ్లీ చేస్తాడన్నది అనుమానమే. త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున, రహానేను ఆడించడం ద్వారా జట్టు మేనేజ్‌మెంట్ అతనిని మళ్లీ ఫామ్‌లోకి తెచ్చే ప్రయత్నం చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. వర్షం కారణంగా మొదటి రెండు రోజుల ఆటకు తీవ్ర అంతరాయం ఏర్పడి, చివరి క్షణాల్లో ఉత్కంఠ సృష్టించిన మొదటి టెస్టు డ్రాకా ముగియగా, రెండో టెస్టును ఇన్నింగ్స్ 239 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. చివరిదైన మూడో టెస్టును డ్రా చేసుకున్నా, సిరీస్ భారత్ ఖాతాలోకే చేరుతుంది. ఒకవేళ ఓడితే సిరీస్ డ్రా అవుతుంది. అంతకంటే టీమిండియాకు వచ్చే నష్టమేమీ లేదు. ఈ నేపథ్యంలో కోహ్లీ ఏవైనా ప్రయోగాలు చేస్తాడా లేక రెండో టెస్టులో ఆడిన జట్టునే యథాతథంగా బరిలోకి దించుతాడా అన్నది చూడాలి. బౌలింగ్ విభాగంలో అశ్విన్ అద్భుత ప్రతిభ కనబరచగా, రవీంద్ర జడేజా కూడా భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. దీనితో వారిలో ఎవరినైనా తొలగించి, యుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం లేదనే చెప్పాలి. దక్షిణాఫ్రికా టూర్‌ను దృష్టిలో ఉంచుకొని, మరి కొంత మంది ఆటగాళ్ల ఫామ్‌ను పరీక్షించాలనుకుంటే మాత్రం, ఒకటి రెండు మార్పులు తప్పకపోవచ్చు.
లంకేయులకు అగ్నిపరీక్ష
చివరి టెస్టు శ్రీలంక క్రికెటర్లకు అగ్నిపరీక్షగా మారనుంది. మొదటి టెస్టులో ఓటమి అంచున నిలిచి, అతి కష్టం మీద డ్రా చేసుకున్న దినేష్ చండీమల్ నాయకత్వంలోని లంక రెండో టెస్టులో ఇన్నింగ్స్ పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లోనూ విఫలమై, టీమిండియా ముందు చేతులెత్తేసింది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్లకు 610 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసిందంటే, లంక బౌలర్ల వైఫల్యం ఏ విధంగా కొనసాగిందో ఊహించుకోవచ్చు. అటు బ్యాట్స్‌మెన్, ఇటు బౌలర్లు పోటీపడి మరీ పేలవమైన ఆటతో జట్టును నిలువునా ముంచేశారు. చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని, ఆటపై దృష్టిని కేంద్రీకరించకపోతే, లంకకు మరోసారి పరాభవం తప్పదు.

చిత్రం.. ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా సహచరులతో కలిసి
ఫుట్‌బాల్ ఆడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ