డైలీ సీరియల్

యాజ్ఞసేని-98

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా సేవలు చేస్తూ, మహారాణి సుధేష్ణనూ, అంతఃపుర కాంతలను కూడా తృప్తిపరుస్తున్నది. ఇంకా కొద్ది దినాలు ఓపిక పడితే సంవత్సర కాలం పూర్తి అవుతుంది. సంవత్సరం చివరకు వచ్చింది.
ఇట్లుండ, ఒకనాడు విరాటరాజు బావమరిది, సింహబలుడు అనే పేరుగలవాడు తన అక్క సుదేష్ణాదేవిని చూచి నమస్కరించటానికై వచ్చాడు. అప్పుడు అతడు ఆమె సమీపంలో నున్న ద్రౌపదిని చూచాడు. అతడు నూటైదుగురు కీచకులకు అన్న. ఈ సింహబలుణ్ణే ‘కీచకుడు’ అని కూడా పిలుస్తారు. అందమైన రూపాన్ని అభిమానించేవాడు. అలంకార ప్రియుడు. అయితే వివేకహీనుడు. బలగర్వితుడు.
తన అక్క ప్రక్కనే వుండి ఆశ్చర్యాన్ని కలిగించే ద్రౌపది యొక్క సౌందర్యాన్ని చూడగానే అది కీచకుడి హృదయానికి భరించలేనిదయింది. దేవాతామూర్తిగా తిరుగుతూ దేవకన్యలా మెరసిపోతున్న ద్రౌపదిని చూసి మన్మథబాణ పీడితుడై ఆమెను పొందాలని నిశ్చయించుకొన్నాడు. కామాగ్నిలో దహంచుకపోతూ తన మనస్సులో ఆమెను గురించి
‘‘ఎక్కడైనా యిటువంటి సౌందర్యరాశిని మానవులెవరైనా చూచారా? నేనే కాదు, ఆ దేవేంద్రుడి కొడుకైన ‘జయంతుడు’ కూడా ఈమె అందాన్ని ఆసక్తితో చూడక మానడు. ఈ సుందరాంగి అనుభవించిన వాడి జీవితం నిజంగా పూర్వజన్మల పుణ్యఫలం. ఆమె అందాన్ని చూస్తే బ్రహ్మదేవుడు మన్మథబాణాలయిదింటిని ఒకేసారి కరిగించి ఒక మూసలోపోసి, రూపుకట్టించి, ప్రాణంపోసి, చైతన్యస్ఫూర్తిని సంఘటించాడేమో? లేకపోతే సృష్టిలో యిటువంటి అందగత్తెలుంటారా? ఈమె భర్తగా ఈ లోకంలో అందచందాలతో ఒప్పారే సౌభాగ్యవంతుడు యెవరోగదా? అని తలపోశాడు.
ద్రౌపది అందాన నేకవిధాలుగా మనసులో ప్రశంసిస్తూ మన్మథవికారాలకు లోనయినాడు. ద్రౌపది మాసిన దుస్తులలో కళావిహీనంగా వున్నా, తనను చూచి అసహ్యించుకొంటున్నా ఆమె మనస్సును గ్రహించలేకపోయాడు.
కీచకుడు జంకుగొంకు లేకుండా చూస్తున్నాడనే అని ద్రౌపది మనసు కలత చెందింది. ఆమె శరీరం చెమట పట్టింది. ‘బలమైన ఆ విధి నా పట్ల ఎప్పుడూ వుచితంగాని పనులు ఎందుకు చేస్తాడో? వాటిని తప్పించుకొనటం ఎలా?’’ అనే భావం తోచగానే నిశే్చష్టురాలైంది. ఈ సమయంలో నాకెవ్వరూ దిక్కులేరనే భావం గూడా కలిగి వణుకు పుట్టింది. ఏ వుపాయమూ కనిపించుట లేదని బాధపడుతున్న ఆమె ముఖం వెలవెలబోయింది. అలా హావభావాలను ప్రదర్శిస్తున్న ద్రౌపదిని ఆ నీచుడు, వివేకరహితుడైన కీచకుడు పరిశీలించాడు. ఆమె ప్రదర్శిస్తున్న భయసాత్విక భావాలన్నీ తన పట్ల వలపుచేత ప్రదర్శిస్తున్న శృంగార చేష్టలను భావించాడు.
మన్మథ ప్రభావానికి గురైన నా కీచకుడు అక్క సుదేష్ణనడిగి సైరంధ్రిని గురించిన వాస్తవాలను తెలిసికొనగోరి ఆమెకు నమస్కరించి ద్రౌపది వైపు చేయి చూపిస్తూ.
‘‘అక్కా! ఈ పద్మసువాసనలీనే కాంత కులమేమిటి? ఈమె నడవడి ఎలాంటిది? ఈమె పేరేమిటి? ఊరేది? దీని భర్త ఎవరు? ఎక్కడ వుంటున్నది? ఇక్కడికి ఏ పనిమీద వచ్చింది? ఇంతకు ముందెప్పుడూ ఈ దాసిని అంతఃపురంలో నేను చూడలేదు. నా హృదయాన్ని కలచివేస్తున్నది ఈ రోగానికి ఈమెకు పొందడం కంటే వేరొక మందు లేదనిపిస్తుంది. ఈ సుందరి నీ దాసియా? ఈమె రూపం నిత్య సుందరం. నీవద్ద దాసీ పనిచేయడం ఈమెకు ఎంతమాత్రం తగినది కాదు. ఈమె నా యింటికి యజమానురాలిగా కావాలి.’’అని అక్క అనుమతితో ద్రౌపదివద్దకు వచ్చి
‘‘ఓ చంద్రవదనా! నీ వెవరవు? ఎవ్వరిదానవు? ఎచట నుండి ఈ విరాట నగరానికి వచ్చావు? నిజము చెప్పుము. నీ మోము మచ్చలేని చంద్రునికాంతివలె విరాజిల్లుచున్నది. నీ కనులు విశాలంగా వున్నవి. ఓ భామినీ! నీవంటి రూపముగల వనితను నేను ఈ భూమిపై చూచి యుండవలెను.
ఓ కోమలీ! నీ కన్నులు విచ్చి చూస్తే ఏవౌతుంది? ఓ కాంతా! అందమైన నీ నిండు మొగంతో సౌందర్యం రెట్టింపయ్యేటట్లుగా నవ్వితే ఏంపోతుంది? ఓ సుందరీ! దృష్టిలోపం తగులుతుందేమోనని నీమేని సౌందర్యాన్ని చూడటానికి జంకుతున్నాను. ఎన్ని రకాలుగా ఆలోచించినా నీ మనస్సు యేమిటో నాకు అంతుపట్టటం లేదు.
చారుహాసినీ! నీవు కోరితే యింతకుముందున్న నా భార్యలందరినీ వదిలివేస్తాను. లేదా వారు నీకు దాసీలౌతారు. సుందరీ! నేను గూడా నీకు దాసుడనౌతాను. నీకు వశమై వుంటాను.
సుందరాంగీ! తామరమొగ్గల వంటి నీ వక్షోజాలు రెండూ మన్మథుని యంకుశాలవలె నన్ను అమితంగా బాధిస్తున్నాయి. చేతివ్రేళ్ళ కానలచేత కొలవడానికి వీలైనంత సన్నంగా వుంది నీ నడుము. నిన్ను పొందాలనే బలమైన కోరిక నేయి వలె అగ్నిని మరింత పెంచుతోంది.’’ అని కీచకుడు నోటికి వచ్చినట్లుగా ప్రేలాపన చేయసాగాడు

..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము