డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-79

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునులందరు ఈ విషయమై చర్చిస్తున్న సమయంలో తపస్వి హోత్రవాహనుడు అక్కడికి వచ్చాడు. అతను కూర్చున్న తర్వాత వారంతా అంబ సమస్యను అతనికి తెలిపారు. విషయం విని అతను విచారించాడు. అతను అంబకు తల్లి తండ్రి అంటే తాతగారు అవుతాడు. అతడు అంబను దగ్గర కూర్చోబెట్టుకొని జరిగినదంతా వివరించ మన్నాడు. అంబ అతనికి అన్ని సంగతులు చెప్పింది.
అంతా విని అతడు ఇలా అన్నాడు. ‘‘అమ్మారుూ! నీకిష్టం లేకపోతే నీ తండ్రి ఇంటికి వెళ్ళొద్దు. నేను నీ మాతామహుడిని. నా దగ్గర ఉండు. నా మాట విను. నీవు తపస్సు చేసుకుంటున్న జమదగ్ని కుమారుడైన పరశురాముని దగ్గరకు వెళ్ళు. అతను నీ దుఃఖాన్ని పోగొట్టగలడు. తాను చెప్పినట్లు భీష్ముడు చేయకపోతే అతను భీష్ముని యుద్ధంలో సంహరిస్తాడు. అతను నీకు చక్కని మార్గం చూపగలడు’’.
అంబ అతని మాటలు విని పరశురాముని ఎక్కడ దర్శించవచ్చు అని అడిగింది. అప్పుడు హోత్ర వాహనుడు ఇలా చెప్పాడు - ‘‘అతను మహారణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు. జమదగ్ని కుమారుడైన అతను మహావీరుడు, సత్యసంధుడు, మహాబలవంతుడు. అతని దగ్గరికి వెళ్ళి నమస్కరించి అతనికి నాగురించి చెప్పు. అతను నీకు తప్పక సహాయం చేస్తాడు. అతను నాకు మిత్రుడు’’.
హోత్రవాహనుడు ఇలా చెప్తూ ఉండగానే పరశురామునికి ఇష్టుడు, అనుచరుడు అయిన అకృతవ్రణుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. అక్కడ మునులందరూ గౌరవపూర్వకంగా లేచి నిలబడ్డారు. తర్వాత వారంతా అనేక విషయాల గురించి చర్చించుకున్నారు. వారి సంభాషణలు ముగిసిన తర్వాత హోత్ర వాహనుడు ఆకృతవ్రణుని పరశురాముని గురించి అడిగాడు. ‘‘మహాత్మా ఆకృతవ్రణా! వేదవేత్తలలో శ్రేష్ఠుడు, పరాక్రమశాలి అయిన జమదగ్నిసుతుని ఇప్పుడు ఎక్కడ చూడగలం?’’
దానికి ఆకృతవ్రణుడు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘రాజా! రాముడు ఎప్పుడూ తలుస్తూ ఉంటాడు. రేపు తెల్లవారేసరికి అతను ఇక్కడ ఉంటాడని అనుకుంటున్నాను. నిన్ను చూడాలనే వస్తున్నాడు. ఈ కన్య ఎవరు? అడవికి ఎందుకు వచ్చింది? నీకేమవుతుంది?’’
అప్పుడు హోత్రవాహనుడు అంబ గురించి ఇలా వివరించాడు. ‘‘ఈమె నా దౌహిత్రి. కాశీరాజు కూతురు అంబ. ఈమె తన చెల్లెళ్ళతో స్వయవరంలో పాల్గొంది. ఆ కన్యల కోసం క్షత్రియరాజులంతా కాశీనగరానికి విచ్చేశారు. అప్పుడు మహావీరుడు, శంతనుపుత్రుడు అయిన భీష్ముడు ఆ రాజులందరినీ ఎదిరించి వీరిని కొనిపోయాడు. అతను వీరిని తన తల్లికి అప్పగించి తమ్మునితో వీరి వివాహం నిశ్చయించాడట. అప్పుడు అంబ భీష్మునితో తాను సాళ్వరాజుని వరించానని చెప్పగా అతను సత్యవతితో ఆలోచించి ఈమెను సాళ్వరాజు దగ్గరకు పంపాడు. కాని సాళ్వుడు ఈమెను తిరస్కరించాడు. అందుకని ఈమె తపస్సు చేయాలన్న నిశ్చయంతో ఈ తపోవనానికి వచ్చింది. ఈమె దుఃఖానికంతటికీ కారణం భీష్ముడే’’.
అప్పుడు అంబ ఇలా అంది. ‘‘మహాత్మా! నా తాత
అయిన హోత్రవాహనుడు చెప్పినట్లుగానే జరిగింది. ఇప్పుడు నాకు నగరానికి వెళ్ళాలన్న కోరిక లేదు. మహర్షి అయిన పరశురాముడు నన్ను ఏది చేయుమని ఆజ్ఞాపిస్తాడో అదే చేస్తాను’’.
ఆకృతవ్రణుడు అంబతో ఇలా అన్నాడు. ‘‘అమ్మారుూ! నీకు ఇప్పుడు రెండు దుఃఖకారణాలు ఉన్నాయి. ఒకటి సాళ్వుడు, రెండు భీష్ముడు. వీరిద్దరిలో ఎవరి మీద ప్రతీకారం చేస్తావు? అది చెప్పు. నీకిష్టమైతే మహాత్ముడైన పరశురాముడు నీ కోసం సాళ్వుని ఆజ్ఞాపించి నీ వివాహం అతనితో చేయిస్తాడు. అలా కాక భీష్ముని రాముడు ఓడించాలనుకుంటే అది కూడా భార్గవరాముడు చేయగలడు. ఇప్పుడు నువ్వు ఏది చేయాలో నిశ్చయించుకొనుము.’’ అప్పుడు అంబ అతనితో ఇలా అంది. ‘‘్భగవన్! నా మనసులో సాళ్వుడు ఉన్నాడని తెలియక భీష్ముడు నన్ను తెచ్చాడు. ఇది మనసులో ఉంచుకొని మీరే నిర్ణయించి చేయండి. అన్ని విషయాలు మీకు తెలిపాను. మీరే న్యాయమైన ప్రతీకారం చేయండి’’.
అప్పుడు ఆకృతవ్రణుడిలా అన్నాడు ‘‘అమ్మారుూ! నీవు చెప్పినదంతా ధర్మబద్ధంగా ఉంది. భీష్ముడు నిన్ను ఎత్తుకొనిరాకపోతే సాళ్వుడు నిన్ను తప్పక వివాహం చేసుకొనేవాడు. భీష్ముడు నిన్ను జయించి హస్తినకు తీసుకొని వెళ్ళడం వల్లనే సాళ్వునకు నీపై అనుమానం కలిగి నిన్ను స్వీకరించలేదు. భీష్ముడు ధర్మం పట్ల నిష్ఠ కలవాడు. అతనిక జయకాంక్ష ఉంది. కనుక భీష్ముని పట్ల ప్రతీకారం తీర్చుకోవడమే ఉత్తమం’’.
అప్పుడు అంబ తన మనసులో కూడా అదే కోరిక కలదని చెప్పింది.
ఈ విధంగా మాట్లాడుకుంటూ ఆ రాత్రి కూడా గడిపారు. అప్పుడు శిష్యులతో కలిసి తేజస్వి అయిన పరశురాముడు చేతిలో విల్లు, ఖడ్గము, పరశువు ధరించి ప్రత్యక్షమైనాడు. అతను రజోరహితుడై తాపసి అయిన హోత్రవాహనుని సమీపించాడు. రాజు, అంబ కలిసి మహర్షికి అతిథిసత్కారాలు చేసి పూజించారు. రాజు పరశురాముడు కొంతసేపు ముచ్చటించుకొన్నారు. తరువాత హోత్రవాహనుడు మహర్షి పరశురామునితో తన దౌహిత్రి గురించి ఇలా చెప్పాడు. ‘‘ప్రభూ! రామా! ఈమె నా దౌహిత్రి అంబ. కాశీరాజు కుమార్తె. ఈమె కార్యమేమిటో ఈమె ద్వారానే విను’’.
అంబ తేజస్వి అయిన మహర్షి పాదాలమీద తలపెట్టి నమస్కరించి, నీళ్ళు నిండిన కళ్ళతో అతన్ని శరణు కోరింది. రాముడిలా అన్నాడు. ‘‘అమ్మారుూ! నీవు సృంజయునికి ఎలాగో నాకూ అలాగే దౌహిత్రివి. నీ కష్టమేమిటో చెప్పు తీరుస్తాను’’.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి