కృష్ణ

బలవంతపు భూసేకరణ మా విధానం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రభుత్వ మార్పిడి అనంతరం బందరు ఓడరేవు నిర్మాణంపై ఆదివారం తొలి భేటీ జరిగింది. మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడా) అధికారులతో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) భేటీ అయ్యారు. ముడా కార్యకలాపాలతో పాటు ఇప్పటి వరకు పోర్టు కోసం సేకరించిన భూముల వివరాలు, ముడా మాస్టర్ ప్లాన్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ముడా ద్వారా పోర్టు నిర్మాణానికి తీసుకున్న చర్యలు, భూసేకరణ తదితర అంశాలను ముడా వైస్ చైర్మన్ పి విల్సన్ బాబు మంత్రి పేర్ని నానికి వివరించారు. బలవంతపు భూసేకరణకు తమ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని పేర్ని నాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రైతుల అంగీకారం లేకుండా భూములు సేకరించేది లేదన్నారు. ముడా వీసీ విల్సన్ బాబు మాట్లాడుతూ 2016 సెప్టెంబర్‌లో ముడా ఏర్పాటయిందన్నారు. మచిలీపట్నం పురపాలక సంఘంలోని 42 వార్డులు, బందరు మండలంలోని అన్ని గ్రామాలతో పాటు పెడన మండలంలో కాకర్లమూడి గ్రామం ముడా పరిధిలో ఉన్నట్టు తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రానున్న 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ముడా మాస్టర్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వానికి అందచేసిందన్నారు. ఇందులో 10 ఏళ్లకు మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశారని, పోర్టు అనుబంధ పరిశ్రమలు, అవసరమైన వౌలిక సదుపాయాల కల్పన, రైలు, రోడ్డు అనుసంధానం తదితర అంశాలు ముడా మాష్టర్ ప్లాన్‌తో పొందుపర్చినట్లు చెప్పారు. ఓడరేవు నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా 620 ఎకరాలు, కొనుగోలు ద్వారా 544 ఎకరాలు సేకరించినట్లు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పోర్టు అభివృద్ధిపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ, అసైన్డ్ భూమి మనది కాదన్న భావన వీడాలన్నారు. ప్రస్తుతం ఉన్న ముడ విస్తీర్ణంతో పాటు ముదినేపల్లి, కలిదిండి, కైకలూరు, మండవల్లి మండలాలను కూడా ముడా పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. పోర్టు కోసం విద్యుత్, వాటర్ సోర్సెస్‌ను గుర్తించి ముడా మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చాలన్నారు. ముడాకు సత్వర అవసరం నిమిత్తం రూ.250కోట్లు ప్రభుత్వం నుండి మంజూరయ్యేలా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు, ముడా కార్యదర్శి సమజ, ముడా ప్లానింగ్ అధికారి శిల్ప, మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, ముడా డెప్యూటీ కలెక్టర్లు, ముడా కన్సల్టెంట్స్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.