Others

శివస్మరణం.. పాపహరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. దివ్యలింగాలు దేశానఁ దేజరిల్లి
జూడ ఁగన్నులు చాలవు సోమశేఖ
రా! మహత్వంబు నెన్నంగ నోమువాడ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఈ దేశమంతటా ప్రకాశించే నీ దివ్యలింగాలు చూడడానికిరెండు కళ్లు చాలవు సోమశేఖరా! నీయొక్క గొప్పతనాన్ని గణిస్తే కాపాడేవాడవు. నీవేనయ్య, పార్వతీపతీ!

తే.గీ. నిన్ను నొకతరిఁ దలచిన నిలచు సిరులు
నిన్ను పలుమార్లు దలచిన నిలుచు వంశ
మెన్నియో తరాలు వెలుగునెన్న హరుడ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: ఒక్కసారి నిన్ను తలచినంత మాత్రానే సంపదలునిలుస్తాయి. పలుమార్లు తలచిన పక్షంలో ప్రకాశవంతమైన వంశాభివృద్ధి కలుగుతుంది పార్వతీపతీ!

తే.గీ. స్వామీ! ముక్కంటి! నీ కృపాసాగరాన
మిగుల ఁ దరియింపనెంచితి మెఱపురీతి
తళుకు మనరాదె నా జన్మ ధన్యవౌను
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ త్రినేత్రా! నీకృపాసాగరంల మునిగి తరించాలనుంది స్వామీ. ఒక్కసారి నా ముందు మెఱుపులా మెరిస్తే చాలు నా జన్మ ధన్యవౌతుంది పార్వతీపతీ!

తే.గీ. ముజ్జగంబుల ఁ గాచేఇ మోక్షదాయి
ఉండలేనయ్య యుపవాసమొక్కపూట
జాగరణఁ జేయలేనయ్య సాంబశివుడ
పాహిమాం పరపేశ్వరా! పార్వతీశ

భావం: ముల్లోకాలను కాపాడే ఓ ముక్త ప్రదాతా! శంకరా! ఒక్కపూట కూడా ఉపవాసం ఉండలేనయ్య. అలాగే జాగరణ చేయాలన్నా నావల్ల కాదయ్య నన్ను కాపాడ రావాశివా!

తే.గీ. వివిధ చీకాకులం బొంది విసిగి విసిగి
మిగుల వేసారిపోతినే మిన్నకుంటి
వేమి? దయ ఁజూపవేమయ్య విశ్వనాథ?
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ విశ్వనాథ! ఎనె్నన్నో చీకాకులతో విసిగి వేసారి పోయానయ్య. దయజూపవేమయ్య శివా పార్వతీపతీ పాహిమాం.
తే.గీ. భువనముల ఁగాచనెంచియుఁ బొంగిపొరలు
గరళవౌపోసనము వట్టి కంఠమందు
నిలుపుకుంటివి నిరతమ్ము దలతు మదిన
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: ఓ పార్వతీశా! సకల మోకాలను కాపాడాలనే దృక్పథంతో సముద్ర మథన సమయంలో పొంగిపొరలే హాలాహలాన్ని కంఠంలో నిలుపుకున్న ఉదార స్వభావం గల నిన్ను నిత్యం ధ్యానిస్తూ ఉంటానయ్యా!

తే.గీ. క్రూర రాక్షస మూకలు కేలుమోడ్చ
నట్టివారికి వరములనమితమొసగి
చిక్కులంబడితివి శివా! చిత్రరీతి
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: క్రూర రాక్షసుల తపస్సునకు సంతోషించి ముందువెనుకలు ఆలోచించకుండా అనేక వరాలనిచ్చి చిక్కుల్లో పడ్డావు కదయ్యా శంకరా!

తే.గీ. మంజునాథా! ప్రభో! శివా!స్మరణ ఁ జేతు
సంస్తుతింతును మించియు శరణు వేడు
కుందు ముక్కంటి! మమ్మేలు కొనగ రావె
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: ఓ మంజునాథస్వామీ! ప్రభో! శివా! నిన్ను స్మరిస్తూ సంస్తుతిస్తూ శరణు వేడుకుంటున్నానయ్యా నన్నుకాపాడ రావయ్య పరమేశ్వరా!

- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం