Others

చైనా ‘వీగర్ల’ స్థితిపై వామపక్షాల వౌనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ ముస్లింలు వివక్షకు, అణచివేతకు గురవుతున్నారని చాలాకాలంగా కమ్యూనిస్టులు, నక్సలైట్లు, మావోయిస్టులు, కొందరు లిబరల్స్ ఆరోపిస్తున్నారు. ఆందోళనలు లేవనెత్తారు. పౌరసత్వ సవరణ చట్టం సందర్భంలోనైతే వీధుల్లోకి వచ్చి వీరంగం వేశారు. విధ్వంసాలకు పాల్పడ్డారు. హింసాత్మక సంఘటనలకు తెగబడ్డారు.
ముస్లింల పట్ల ఇంత ప్రేమ ప్రకటించినవారు పొరుగున వున్న చైనాలో అక్కడి కమ్యూనిస్టులు పది లక్షల మంది ముస్లిం ‘వీగర్స్’ను నిర్బంధించి, వారి హక్కులను కాలరాచి, వారి స్వేచ్ఛ స్వాతంత్య్రాలను హననం చేసి, హింసకు-చిత్రసింసలకు గురిచేస్తున్నారని లోకమంతా కోడై కూస్తున్నా ఇక్కడి కమ్యూనిస్టులు, నక్సలైట్లు, మావోలు లిబరల్స్‌కు చీమకుట్టినట్టైనా అనిపించకపోవడాన్ని ఎవరైనా ఎలా అర్ధం చేసుకుంటారు?... ఇది పూర్తిగా ద్వంద్వ ప్రమాణంగాక ఏమవుతుంది?... నిజాన్ని... సత్యాన్ని సదా తలపై పెట్టుకుని ప్రపంచానికి చాటాల్సినవారు ఇలా పక్షపాత వైఖరితో ఊరేగితే అదెలా ఆమోదయోగ్యమవుతుంది? టర్కీ మూలాలున్న వీగర్ ముస్లిం సముదాయం ఎక్కువగా నివసిస్తున్న షింగ్జాంగ్ ప్రావిన్స్ ప్రాంతంలో పెద్దఎత్తున ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసి సంవత్సరాలుగా వారినక్కడ నిర్బంధించారని, ‘‘రీఎడ్యుకేషన్’’పేర వారి మత స్వేచ్ఛను, ఇతర హక్కులను హరిస్తున్నారని ఐక్యరాజ్యసమితితో సహా ఎన్నో సంస్థలు, దేశాలు గగ్గోలుపెడుతున్నా ఇక్కడి వామపక్షాలు, మావోలు పల్లెత్తి మాట కూడ మాట్లాడలేదు. ఖండించలేదు...కరపత్రాలు ముద్రించలేదు.
అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాదం నేపధ్యంలో షింగ్జాంగ్‌లోని వీగర్ ముస్లింలపై పాలకులు పెద్దఎత్తున నిఘాపెట్టారు. ముందు జాగ్రత్తగా వారిని సంస్కరించే నెపంతో, వారికి వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చే పేర వారి కదలికలపై-కార్యక్రమాలపై గట్టి నిఘాపెట్టి వారి యువతీయువకులను నిర్బంధించి ‘‘బ్రెయిన్‌వాష్’’చేస్తున్నారని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా ఈ విషయమై చైనాను మందలించింది... ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అంతర్జాతీయంగా తగుచర్యలు తీసుకుంటామన్నది. ఇంత జరుగుతున్నా, సంవత్సరాల తరబడి ఈ విషయం ఉద్రిక్తతలకు దారితీస్తున్నా వామపక్షాలు-మావోలు మాట మాత్రంగానైనా ఖండించక పోవడాన్ని పరిశీలిస్తే వారికి ముస్లింలపై ప్రేమ, వారి హక్కుల పట్ల చింత, సానుభూతిగాక ఆ ముసుగులో తమ ప్రాబల్యం పెంచుకోవాలనే యావ, దురాలోచన స్పష్టంగా కనిపిస్తోంది.
భారతీయ ముస్లింలు ఎక్కడా లేనంత స్వేచ్ఛ-స్వాతంత్య్రాలతో జీవిస్తున్నారని అనేక ముస్లిం దేశాలలో ముస్లిం మహిళలకు ఓటు హక్కులేకపోయినా భారతదేశంలో వారికి సమాన హక్కులు, ఓటుహక్కు ఉందని, ముస్లింలకు భారతదేశం స్వర్గ్ధామంగా ఉందని కెనడాలో ఉంటున్న పాకిస్తాన్ ముస్లిం రచయిత, వక్త, మేధావి, ముస్లిం మతంపై సాధికారికంగా మాట్లాడే కమ్యూనిస్టు తారేఖ్‌ఫతే అంటున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన రచయిత్రి తస్లిమా నస్రిన్ సైతం భారతీయతను శ్లాఘిస్తున్నారు. ఇలా ఎందరో ముస్లిం మేధావులు, రచయితలు భారత్‌లో ముస్లింల పరిస్థితి ఎంతో గొప్పగా ఉందని, ఎలాంటి వివక్షకు, అణచివేతకు గురికావడంలేదని జాతీయ-అంతర్జాతీయ వేదికలపై ప్రకటిస్తున్నారు. అనేక రచనలు చేస్తున్నారు. చర్చల్లో పాల్గొని తమతమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. అలాగే వివిధ దేశాల్లో ముఖ్యంగా చైనాలో ముస్లింల పరిస్థితిని, అక్కడి మైనార్టీల స్థితిని లోకం దృష్టికి తీసుకొస్తున్నారు. భారతదేశ వామపక్ష-మావోయిస్టు మేధావులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. భారతదేశంలో అల్పసంఖ్యాక వర్గాల అణచివేత జరుగుతోందని, బ్రాహ్మణీయ-హిందూ ఫాసిజం విజృంభిస్తోందని అదేపనిగా ఆడిపోసుకుంటూ హింసను, విద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారు. అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. నిజాయితీ... నిష్పాక్షికత... వాస్తవికత ఆధారంగా ‘సత్యం’ సర్వత్రా వర్ధిల్లాలని కోరుకోవలసినవారు ఇలా అసత్యాలతో, అర్థసత్యాలతో, అతిశయోక్తులతో పౌరులను రెచ్చగొట్టి తమ ‘రాజకీయ పబ్బం’ గడుపుకోవాలని చూడ్డం విడ్డూరం గాక ఏమవుతుంది?
భారతదేశంలో అంతర్భాగమైన కశ్మీర్‌నుంచి అక్కడి లక్షలాది పండిట్లను ముస్లిం ఉగ్రవాదులు, మత ఛాందసవాదులు రెచ్చిపోయి తరిమేస్తే, విస్థాపనకు గురిచేస్తే, ఆస్తిపాస్థులను కొల్లగొడితే కిమ్మనని వామపక్షాలు... మావోయిస్టు మేధావులు పౌరసత్వ చట్టసవరణ వల్ల వీసమెత్తు నష్టం వారికి జరగదని తెలిసినా, అసలు భారత ముస్లింల సంగతి ఆ చట్టంలో ఓ అక్షరంముక్క లేకపోయినా వామపక్షాలు, లిబరల్స్ వారి మద్దతుదారులు దేశంమొత్తం అల్లకల్లోలం చేయడం వారి మానసిక స్థితిని తేటతెల్లం చేస్తుంది. ఏమి జరగకముందే కల్లోలం సృష్టించిన వారు కశ్మీర్‌లో పండిట్లకు ఎదురైన పరిస్థితి ముస్లింలకు ఎదురైతే దేశం మొత్తం తగులబెట్టే వారేమో?... 21వ శతాబ్దంలో విచక్షణాజ్ఞానం, విజ్ఞత ఇలాగేనే ఉండాల్సింది?... ఇది మానవీయత, నాగరికత అనిపించుకుంటుందా?... నూతన మానవుని ఆదర్శభావన ఇదేనా?..
మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, గౌరవం-హుందాతనంగా సమాజాలు విలసిల్లాలని సాధికారత పరిఢవిల్లాలని కోరుకోవలసినవారు ఇంత పక్షపాత వైఖరితో, రాజకీయ లబ్ధిపొందేందుకు వాతావరణాన్ని ‘కలుషితం’చేయడం ఏ రకంగా చూసినా అన్యాయమే... అధర్మమే!
ముస్లిం మతస్తులను చైనాలో పూర్తి అనుమానాస్పదంగా, అవాంఛనీయ వ్యక్తులుగా చూస్తున్నారు. ఆ మతాన్ని ‘‘ఓ మానసిక రుగ్మత’’గా బహిరంగంగా పేర్కొంటున్నారు. విశ్వమానవ కల్యాణం గూర్చిన ఆలోచనలతో పనిచేసే కమ్యూనిస్టు పాలకులే ఇంత బరితెగించి బందిఖానాలు తెరిచి, కాన్‌సెన్‌ట్రేషన్ క్యాంపులకు, ఒకప్పటి రష్యాలోని ‘గులగ్’లను తలపిస్తూ ‘బ్రెయిన్‌వాష్’ను భారీస్థాయిలో చేస్తుండగా కిమ్మననివారు భారతదేశంలో ఇలా వీరంగంవేసి- విధ్వంసాలకు పాల్పడటం దుర్మార్గంగాక ఏమవుతుంది?
చైనాలో 1966-76 దశకంలో సాంస్కృతిక విప్లవం సమయంలో జరిగిన అకృత్యాలను, తియన్మన్ స్క్వేర్ దమనకాండను ఇప్పుడు ముస్లింపై జరుపుతున్నారన్న వీగర్ ఆరోపణలు గుప్పుమంటుంటే వాటిగూర్చి ఆలోచన చేయాలికదా?... కనీసం ఖండించాలి గదా?...
కమ్యూనిస్టు నియంతృత్వం గొప్పదిగా, ఆ సిద్ధాంతాన్ని అంగీకరించేలా, ఆమోదించేలా, ఆచరించేలా వీగర్స్‌పై పెద్దఎత్తున ఒత్తిడిచేస్తున్న చైనా పాలకులు (కమ్యూనిస్టులు) ఇక్కడి కమ్యూనిస్టులకు-మావోయిస్టుకు ముద్దొస్తున్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లగా పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తున్న భారతదేశ ప్రజాస్వామ్యం మాత్రం వారికి అయిష్టంగా కనిపిస్తోంది... అణచివేతకు నిలయంగా దర్శనమిస్తోంది... ఇదెంతటి విడ్డూరమో ప్రతిఒక్కరు ఆలోచించాల్సిన సందర్భమిది.
విలువలను, విజ్ఞానాన్ని, విజ్ఞతను విస్తృతంగా ప్రచారంలోపెట్టి మానవీయతను మహోన్నతంగా నిలపాల్సినవారు ఇలా సంకుచితత్వంతో, పక్షపాతంతో, రాజకీయ లబ్ధికోసం... తమ పలుకుబడికోసం ప్రజల్లో ‘విషం’నింపడం దారుణంగాక ఏమవుతుంది?
ఆధునిక టెక్నాలజీని, ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ సాయంతో వీగర్ ముస్లింల ట్రాకింగ్ చేస్తూ ఈడ్చుకెళ్ళి క్యాంపుల్లోపెట్టి, సంవత్సరాల తరబడి ఓ పద్ధతి ప్రకారం వారిని వదిలించుకోవడానికి చేస్తున్న ‘‘చర్యలు’’ ఇక్కడి కమ్యూనిస్టులకు-మావోయిస్టు మేధావులకు ఆమోదయోగ్యంగా కనిపించడం ఎంతటి విషాదం!
ఒకప్పుడు టిబెట్‌లో అనుసరించిన పాలసీని ఇప్పుడు షింగ్జాంగ్‌లో ప్రవేశపెడుతున్నారు. ఆ ప్రాంతంలో (రాష్ట్రంలో) మెయిన్‌ల్యాండ్స్ చైనీయులను పెద్దఎత్తున దింపుతున్నారు. అలాంటివారికి ఎన్నో రాయితీలుఇస్తూ మెజార్టీ వీగర్లను మైనార్టీలుగామార్చే ప్రయత్నం పెద్దఎత్తున జరుగుతోంది.
అక్కడ భద్రత-నిఘాకోసం బడ్జెట్‌ను రెండింతలు పెంచారు. ఒక పద్ధతి ప్రకారం వారిని లొంగదీసుకునే చర్యలు నిష్కర్షగా కొనసాగుతున్నాయి. రీ-ఎడ్యుకేషన్ పేర సరికొత్తగా ‘బ్రెయిన్‌వాష్’కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాన్‌సెన్‌ట్రేషన్ క్యాంపుల వెలుపల ఉన్న వీగర్ ముస్లింలు మానసికంగా కుంగికృశించిపోతున్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు. ఎప్పుడేమి జరుగుతుందో తెలియని అభద్రతాభావంతో కాలం గడుపుతున్నారు. ఎక్కడ చూసినా నిఘా... సివిల్ దుస్తుల్లో పోలీసులు... ఇంతటి దుస్థితిని భారత ముస్లింలు ఏ మూలనైనా ఎదుర్కొంటున్నారా?... రీ-ఎడ్యుకేషన్ పేర నిర్బంధ క్యాంపులు కనిపిస్తున్నాయా?... అనుమానమొస్తే వీధుల్లో బరబరా ఈడ్చుకెళ్ళే దృశ్యాలు అగుపిస్తున్నాయా?... నిర్మానుష్య ప్రాంతంలో బందీఖానాలు కనిపిస్తున్నాయా?... మతంపై, ప్రార్థనలపై, మత క్రతువులపై ఆంక్షలున్నాయా?... ముస్లింలు భారత్‌లో సంపూర్ణ స్వేచ్ఛా-స్వాతంత్య్రాలతో నివసిస్తున్నట్టుగా ప్రపంచంలో మరెక్కడా జీవించడం లేదని తారేఖ్‌ఫతే లాంటివాళ్ళు అనేక సంవత్సరాలుగా బహిరంగంగా పదే పదే చెబుతున్నా, ఆ స్వరాన్ని పట్టించుకోకుండా తమ రాజకీయ పబ్బంగడుపుకోవడానికి ఇలా ‘దేశం’లో చిచ్చుపెట్టడం, అభూత కల్పనలకు పూనుకోవడం ఏ రకంగా న్యాయసమ్మతం?...

- వుప్పల నరసింహం, 9985781799