క్రీడాభూమి

కిర్మానీకి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ కీపర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ కింద బిసిసిఐ పురస్కారం
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: భారత మాజీ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ సయ్యద్ కిర్మానీకి కల్నల్ సికె నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించనుంది. గురువారం ఇక్కడ సమావేశమైన అవార్డుల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్, అనురాగ్ ఠాకూర్ కూడా హాజరైన ఈ కమిటీ భారత క్రికెట్ జట్టుకు మొట్టమొదటి కెప్టెన్ సికె నాయుడు పేరిట నెలకొల్పిన లైఫ్‌టైమ్ అవార్డు కోసం పలువురి పేర్లను పరిశీలించింది. చివరికి కిర్మానీ పేరును ఖాయం చేసింది. అవార్డు కింద అతనికి ప్రశంసా పత్రం, ట్రోఫీ, 25 లక్షల రూపాయల చెక్కు లభిస్తాయి. ఫరూక్ ఇంజనీర్ వికెట్‌కీపర్‌గా నెలకొల్పిన అత్యుత్తమ ప్రమాణాలను ఏ విధంగా కొనసాగిస్తాడోనన్న అనుమానాలను కిర్మానీ తన అసాధారణ ప్రతిభతో నివృత్తి చేశాడు. 1976 జనవరి 24 నుంచి 28వ తేదీ వరకు అక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కిర్మానీ చివరి టెస్టును 1986 జనవరిలో, సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియాతో ఆడాడు. అదే విధంగా 1976 ఫిబ్రవరి 21న క్రైస్ట్‌చర్చి మైదానంలో న్యూజిలాండ్‌పై అతను తొలి వనే్డ ఇంటర్నేషనల్ ఆడాడు. 1986 జనవరి 12న బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో చివరి వనే్డలో పాల్గొన్నాడు.
కెరీర్‌లో 88 టెస్టులు ఆడిన కిర్మానీ 2,759 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 102 పరుగులు. అతని టెస్టు ఖాతాలో రెండు సెంచరీలు, 12 అర్ధ శతకాలు ఉన్నాయి. 160 క్యాచ్‌లు పట్టాడు. 38 స్టంపింగ్స్ చేశాడు. అదే విధంగా 49 వనే్డల్లో 373 పరుగులు సాధించాడు. 48 (నాటౌట్) వనే్డల్లో అతని అత్యధిక స్కోరు. 27 క్యాచ్‌లు పట్టిన అతను 9 స్టంపింగ్స్ చేశాడు.
చెన్నైలో పుట్టిన హైదరాబాదీ
సయ్యద్ కిర్మానీ పూర్వీకులు హైదరాబాదీలు. కిర్మానీ నేటి చెన్నైలో 1949 డిసెంబర్ 29న జన్మించాడు. తర్వాతి కాలంలో కుటుంబంతో కలిసి బెంగళూరులో స్థిరపడ్డాడు. అక్కడే క్రికెట్‌లో ఓనమాలు దిద్దుకున్నాడు. ఉత్తమ వికెట్‌కీపర్‌గా ఎదిగాడు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత చాలకాలం అతను బెంగళూరులోనే ఉన్నాడు. ఇప్పుడు తిరిగి చెన్నై చేరాడు.
స్టాండ్‌బై కీపర్‌గా..
భారత జట్టుకు కిర్మానీ తొలుత స్టాండ్‌బై వికెట్‌కీపర్‌గా ఎంపికయ్యాడు. 1971లో ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత జట్టులో ఫరూఖ్ ఇంజనీర్, పి.కృష్ణమూర్తి రెగ్యులర్ వికెట్‌కీపర్లుకాగా, స్టాండ్‌బైగా కిర్మానీని ఎంపిక చేశాడు. ఇంజనీర్ ఎక్కువగా లాంకషైర్ కౌంటీ క్లబ్‌లో ఆడడంలోనే గడపడంతో, భారత జట్టు పాల్గొనే వివిధ టూర్లకు అతను హాజరయ్యేవాడుకాడు. అయితే, టెస్టు సిరీస్‌లకు మాత్రం వచ్చేవాడు. ఇంజనీర్ తరచు అందుబాటులో లేకపోవడం కిర్మానీకి కలిసొచ్చింది. అతను స్టాండ్‌బై కీపర్ స్థాయి నుంచి రెగ్యులర్ కీపర్ స్థాయికి ఎదిగాడు.
స్కూల్స్‌కు ప్రాతినిథ్యం
కిర్మానీ కెరీర్ స్కూల్ క్రికెట్‌తో మొదలైంది. మైసూరులో స్కూల్స్‌కు, ఆతర్వాత ఇండియా స్కూల్స్‌కు అతను ప్రాతినిథ్యం వహించేవాడు. అయితే, 1967లో ఇండియా స్కూల్స్ తరఫున ఇంగ్లాండ్ పర్యటనకు అతను స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా వెళ్లాడు. అక్కడి అతని ప్రదర్శన మైసూరు క్రికెట్ (ప్రస్తుతం కర్నాటక క్రికెట్ సంఘం) అధికారులను ఆకట్టుకుంది. ఇంగ్లాండ్ టూర్ ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన అతనికి మైసూర్ (ఇప్పుడు కర్నాటక) జట్టులో స్థానం లభించింది.
కొంప ముంచిన సిరీస్
కెర్రీ ప్యాకర్ ప్రారంభించాలనుకున్న ప్రపంచ సిరీస్ క్రికెట్ (డబ్ల్యుఎస్‌సి) కొంతకాలం కిర్మానీ కెరీర్‌ను సందేహంలో పడేసింది. ఆ సిరీస్‌లో ఆడేందుకు అంగీకరించడమే కిర్మానీ చేసిన పొరపాటు. ప్యాకర్ సిరీస్ జరగలేదుగానీ, అందులో ఆడేందుకు అంగీకరిస్తూ సంతకం చేసిన వారిపై భారత క్రికెట్ బోర్డు కఠినంగా వ్యవహరించింది. తత్ఫలితంగా అతనికి 1979లో జరిగిన వరల్డ్ కప్‌లో, ఆతర్వాత ఇంగ్లాండ్ టూర్‌లో అవకాశం దక్కలేదు.
టాక్సీలో చక్కర్లు
కెర్రీ ప్యాకర్ సిరీస్ జరగకపోయినా, అందులో పాల్గొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్న పాపానికి జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన కిర్మానీ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. దాదాపు అదే సమయంలో అతని వివాహం నిశ్చయమైంది. భారత ఆటగాళ్లంతా బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తుండగా, వారంతా తన పెళ్లికి రావాలని కిర్మానీ కోరాడు. కానీ, తనపై వేటు పడడంతో ఎవరికీ ముఖం చూపించుకోలేకపోయాడు. ఉదయం అందరూ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతను టాక్సీ ఎక్కి, ఎలాంటి గమ్యం లేకుండా చక్కర్లు కొట్టేవాడు. తిరిగితిరిగి విసుగుపుట్టినప్పుడు ఇంటికి వెళ్లేవాడు.
బౌలర్ కూడా!
కిర్మానీ క్లాస్ వన్ వికెట్‌కీపర్. ఎన్నోసార్లు కీలక సమయాల్లో చక్కటి బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. అయితే, వికెట్‌కీపర్‌గా సేవలు అందిస్తూనే, సరదాకోసం బౌలింగ్ చేసిన కిర్మానీకి ఒక టెస్టు వికెట్ లభించడం విచిత్రం. 1983 అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో భారత జట్టు నాగపూర్‌లో టెస్టు ఆడింది. చివరి రోజు చివరి సెషన్ ముగింపు దశలో అసాధ్యమైన 186 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి పాకిస్తాన్ బ్యాటింగ్‌కు దిగింది. ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 42 పరుగులు చేసింది. ఆ ఒక్క వికెట్‌ను కిర్మానీ పడగొట్టడం విశేషం. అజమ్ హఫీజ్‌ను అతను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఒక టెస్టు వికెట్‌ను సాధించడం ద్వారా తనను తాను బౌలర్‌గానూ కిర్మానీ నిరూపించుకున్నాడు.
ఆలస్యంగా అవకాశం
న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌కు 1971లో వెళ్లిన టీమిండియాలో ఉన్నప్పటికీ, అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించేందుకు కిర్మానీ చాలాకాలం వేచి చూడాల్సి వచ్చింది. ఇంజనీర్ జట్టులో ఉండడంతో కిర్మానీకి అవకాశం దక్కనే లేదు. 1974లో మరోసారి భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లింది. అప్పుడూ అదే పరిస్థితి. అతనికి ఒకవైపు ఇంజనీర్ వంటి ప్రపంచ మేటి కీపర్, మరోవైపు కృష్ణమూర్తి లాంటి సీనియర్ పోటీదారులయ్యారు. అందుకే అతనికి చాలా ఆలస్యంగా అవకాశం దక్కింది. 1976లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టుతో అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆలస్యంగా వచ్చినా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
నిద్రలో కుంభకర్ణుడే..
న్యూఢిల్లీ: నిద్రలో కిర్మానీ కుంభకర్ణుడే. ‘ఐడల్స్’ పుస్తకంలో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పలువురి గురించిన ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించాడు. అందులోనే కిర్మానీ నిద్ర గురించి ప్రత్యేకంగా పేర్కొన్నాడు. 1971లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కిర్మానీ కూడా ఉన్నాడు. భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పెవిలియన్‌లో కూర్చున్న కిర్మానీ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అప్పటి మేనేజర్ రాం ప్రకాశ్ మెహ్రా హడావుడిగా కిర్మానీ వద్దకు వచ్చి, ఇంగ్లాండ్ కీపర్ అలాన్ నాట్ ఏ విధంగా కీపింగ్ చేస్తున్నాడో జాగ్రత్తగా గమనించమని ఆదేశించాడు. మెహ్రా అక్కడ ఉన్నంత సేపు అతి కష్టం మీద గడిపిన కిర్మానీ అతను వెళ్లిన వెంటనే మళ్లీ నిద్రపోయాడు. మెహ్రా మళ్లీ ఎక్కడ వస్తాడోనని భయపడిన జట్టులోని మిగత సభ్యులంతా కిర్మానీ ఎవరికీ కనిపించకుండా అడ్డంగా కూర్చున్నారు. మెహ్రా కనిపించినప్పుడు కిర్మానీ సైడ్ స్క్రీన్ వద్ద కూర్చొని నాట్ కీపింగ్‌లో ప్రదర్శిస్తున్న టెక్నిక్స్‌ను గమనిస్తున్నాడని చెప్పి సమస్య నుంచి తప్పించారు.