తెలంగాణ

ఖాళీ భవనాలు మాకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ తాత్కాలిక సచివాలయ నిర్వహణ కోసం ఆంధ్రకు కేటాయించిన భవనాలు తెలంగాణకు అప్పగించాలని ఉమ్మడి గవర్నర్‌ను కోరుతూ తెలంగాణ మంత్రిమండలి తీర్మానం చేసింది. ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలో ఆంధ్రకు కేటాయించిన భవనాలతోపాటు, వెలుపల ఉన్న శాసనసభ, శాసనమండలి, ఇతర భవనాలనూ తమకు అప్పగించాలని చేసిన తీర్మానంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. సిఎం కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం మంత్రిమండలి నాలుగు గంటలపాటు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియాకు వెల్లడించారు. ఏపీ ఖాళీ చేసిన కార్యాలయాలు తమ ప్రభుత్వానికి అప్పగించాలని గవర్నర్‌ను కోరినట్టు కడియం శ్రీహరి వివరించారు. ఇందుకు ఏపీ సిఎం చంద్రబాబుకూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసిందన్నారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై అధ్యయనం చేసిన తర్వాతే ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు కడియం తెలిపారు. ట్రిబ్యునల్ తీర్పు తెలంగాణకు లాభమో నష్టమో అధ్యయనం చేయడానికి నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించిందన్నారు. మూడో విడత రైతు రుణ మాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలను నెలలో పూర్తిగా చెల్లించాలని మంత్రిమండలిలో సిఎం కెసిఆర్ ఆదేశించారన్నారు.
జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో ఆరు జిల్లాల పేర్లు మార్చాలని కూడా మంత్రిమండలి నిర్ణయించిందన్నారు. ఇకనుంచి జోగుళాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల, కుమ్రంబీమ్ ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలుగా పేర్లు మారుస్తున్నట్టు కడియం వివరించారు.
మహిళా ఉపాధ్యాయులు, మహిళా ఉద్యోగులకు ఇకనుంచి చైల్డ్ కేర్ సెలవుల కింద 90 రోజులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఈ సెలవులను ఒకేసారి కాకుండా తమ సంతనానికి 18ఏళ్ల వయసు వచ్చేదాకా ఆరు విడతలలో 15 రోజుల చొప్పున వీటిని వినియోగించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో 2487 మంది భాషా పండితులు, 1047 పిఇటీలను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయాలని మంత్రిమండలి నిర్ణయించిందన్నారు. వర్శిటీలకు రాష్ట్రంలో పూర్వ వైభవం తెచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేయడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేత్వత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని, అలాగే రాష్ట్రంలో మత్స్య, గొర్రెల పెంపకాన్ని అభివృద్ధికి పశుసంవవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో మరో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు కడియం శ్రీహరి చెప్పారు.

చిత్రం... కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సహ మంత్రులతో కలిసి వెల్లడిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి