క్రీడాభూమి

కివీస్ ఖాతాలో నాలుగో వనే్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, అక్టోబర్ 26: సొంత గడ్డపై భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన నాలుగో వనే్డలో భారత్ 19 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 261 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా బ్యాట్స్‌మెన్ నిలకడలేమి కారణంగానే విఫలమయ్యారు. ఆజింక్య రహానే (57), విరాట్ కోహ్లీ (45), చివరిలో అక్షర్ పటేల్ (38) కొంత వరకు ఫరవాలేదని అనిపించినా, మిగతా వారు నిర్లక్ష్యంతో వికెట్లను సమర్పించుకున్నారు. అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు. కాగా, ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరి రెండు విజయాలతో సమవుజ్జీగా ఉన్నాయి. దీనితో ఈనెల 29న విశాఖపట్నంలో జరగాల్సిన చివరి, ఐదో వనే్డ ప్రాధాన్యతను సంతరించుకుంది.
టాస్ గెలిచిన కివీస్
న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని నిరూపించే విధంగా ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, టామ్ లాథమ్ జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు దూకించారు. వీరు 15.3 ఓవర్లలో 96 పరుగులు జోడించగా, తొలి వికెట్ లాథమ్ రూపంలో కూలింది. 40 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 39 పరుగులు చేసిన అతనిని రహానే క్యాచ్ అందుకోగా అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. 84 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసిన గుప్టిల్‌ను వికెట్‌కీపర్ ధోనీ క్యాచ్ అందుకోగా హార్దిక్ పాండ్య పెవిలియన్‌కు పంపడంతో న్యూజిలాండ్ కష్టాలు మొదలయ్యాయి. ప్రమాదకరంగా కనిపిస్తున్న కెప్టెన్ విలియమ్‌సన్ (59 బంతుల్లో 41) వికెట్ 184 పరుగుల వద్ద కూలింది. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో ధోనీ క్యాచ్ అందుకోవడంతో అతను వెనుదిరిగాడు. అనంతరం రాస్ టేలర్ (34)ను మినహాయిస్తే, మిగతా బ్యాట్స్‌మెన్ పరుగుల వేటలో సఫలం కాలేదు. జిమీ నీషమ్ (6), బ్రెడ్లే వాల్టింగ్ (14), ఆంటన్ డెవిసిచ్ (11) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. చివరిలో మిచెల్ సాంట్నర్ (17), టిమ్ సౌథీ (9) నాటౌట్‌గా నిలవగా, కివీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 260 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్, ధవళ్ కులకర్ణి, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు. బౌలింగ్ చేసిన వారిలో కేదార్ జాదవ్ ఒక్కడికే వికెట్ లభించలేదు.
రహానే పోరాటం
న్యూజిలాండ్‌ను ఓడించి, సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు 261 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 19 పరుగుల స్కోరువద్ద రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. అతను 19 బంతుల్లో 11 పరుగులు చేసి బ్రాడ్లే వాల్టింగ్ క్యాచ్ అందుకోగా టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనర్ ఆజింక్య రహానే చక్కటి పోరాటాన్ని ప్రదర్శించాడు. కివీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని అతను స్కోరుబోర్డును వంద పరుగుల సమీపానికి తీసుకెళ్లాడు. అయితే, జట్టు స్కోరు 98 పరుగులు ఉన్నప్పుడు ఇష్ సోధీ వేసిన బంతిని అర్ధం చేసుకోలేకపోయిన కోహ్లీ వికెట్‌కీపర్ బ్రాడ్లే వాల్టింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో ఏకాగ్రత కోల్పోయిన రహానే 57 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జిమీ నీషమ్ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. 70 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కేవలం 11 పరుగులు చేసి జిమీ నీషమ్ బౌలింగ్‌లో బౌల్డ్‌కాగా, మనీష్ పాండే (12), కేదార్ జాదవ్ (0)లను టిమ్ సౌథీ రెండు వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపాడు. దీనితో భారత్ కష్టాల్లో పడింది. ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న హార్దిక్ పాండ్య కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, 9 పరుగులు చేసి, మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో టామ్ లాథమ్ క్యాచ్ అందుకోవడంతో అవుటయ్యాడు. 167 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ కలిసి స్కోరును 200 పరుగుల మైలురాయిని దాటించారు. స్కోరు 205 పరుగులు ఉన్నప్పుడు అమిత్ మిశ్రా (14) రనౌటయ్యాడు. మరో రెండు పరుగుల తర్వాత అక్షర్ పటేల్ కూడా వెనుదిరిగాడు. అతను 40 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38 పరుగులు చేసి, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ధవళ్ కులకర్ణి, ఉమేష్ యాదవ్ పోరాటం ఎక్కువ సేపు సాగలేదు. ఏడు పరుగులు చేసిన ఉమేష్ యాదవ్‌ను రాస్ టేలర్ క్యాచ్ అందుకోగా, ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఇన్నింగ్స్ 241 పరుగుల వద్ద ఆలౌటైంది. 19 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టిమ్ సౌథీ మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించగా, ట్రెంట్ బౌల్ట్, జిమీ నీషమ్ చెరి రెండు వికెట్లు కూల్చారు. మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీలకు చెరొక వికెట్ లభించింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఆంటన్ డెవిసిచ్ మాత్రమే ఒక్క వికెట్‌ను కూడా సాధించలేకపోయాడు.

భారత్ ఒకానొక దశలో ఒక వికెట్ నష్టానికి 98 పరుగులతో పటిష్టమైన స్థితిలో ఉంది. అదే స్కోరువద్ద కోహ్లీ అవుట్ కావడంతో వికెట్ల పతనం కొనసాగింది. 69 పరుగుల వ్యవధిలో ఏకంగా ఆరు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో కూరుకుపోయింది. ఆతర్వాత కోలుకోలేక ఓటమిపాలైంది. రాంచీలో టీమిండియా పరాజయాన్ని చవి చూడడం ఇదే మొదటిసారి.
రహానే మొదటి మూడు వనే్డల్లో వరుసగా 33, 28, 5 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 57 పరుగులతో రాణించాడు. కాగా, న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించిన ఓపెన్ మార్టిన్ గుప్టిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

స్కోరు బోర్డు

న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ సి ధోనీ బి హార్దిక్ పాండ్య 72, టామ్ లాథమ్ సి రహానే బి అక్షర్ పటేల్ 39, కేన్ విలియమ్‌సన్ సి ధోనీ బి అమిత్ మిశ్రా 41, రాస్ టేలర్ రనౌట్ 34, జిమీ నీషమ్ సి విరాట్ కోహ్లీ బి అమిత్ మిశ్రా 6, బ్రాడ్లే వాల్టింగ్ సి రోహిత్ శర్మ బి ధవళ్ కులకర్ణి 14, ఆంటన్ డెవిసిచ్ సి హార్దిక్ పాండ్య బి ఉమేష్ యాదవ్ 11, మిచెల్ సాంట్నర్ 17 నాటౌట్, టిమ్ సౌథీ 9 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 17, మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 260.
వికెట్ల పతనం: 1-96, 2-138, 3-184, 4-192, 5-217, 6-223, 7-242.
బౌలింగ్: ఉమేష్ యాదవ్ 10-1-60-1, ధవళ్ కులకర్ణి 7-0-59-1, హార్దిక్ పాండ్య 5-0-31-1, అమిత్ మిశ్రా 10-0-41-2, అక్షర్ పటేల్ 10-038-1, కేదార్ జాదవ్ 8-0-27-0.
భారత్ ఇన్నింగ్స్: ఆజింక్య రహానే ఎల్‌బి జిమీ నీషమ్ 57, రోహిత్ శర్మ సి బ్రాడ్లే వాల్టింగ్ బి టిమ్ సౌథీ 11, విరాట్ కోహ్లీ సి బ్రాడ్లే వాల్టింగ్ బి ఇష్ సోధీ 45, మహేంద్ర సింగ్ ధోనీ బి జిమీ నీషమ్ 11, అక్షర్ పటేల్ బి ట్రెంట్ బౌల్ట్ 38, మనీష్ పాండే సి టామ్ లాథమ్ బి టిమ్ సౌథీ 12, కేదార్ జాదవ్ ఎల్‌బి టిమ్ సౌథీ 0, హార్దిక్ పాండ్య సి టామ్ లాథమ్ బి మిచెల్ సాంట్నర్ 9, అమిత్ మిశ్రా రనౌట్ 14, ధవళ్ కులకర్ణి 25 నాటౌట్, ఉమేష్ యాదవ్ సి టేలర్ బి ట్రెంట్ బౌల్ట్ 7, ఎక్‌స్ట్రాలు 12, మొత్తం (48.4 ఓవర్లలో ఆలౌట్) 241.
వికెట్ల పతనం: 1-19, 2-98, 3-128, 4-135, 5-154, 6-154, 7-167, 8-205, 9-207,
బౌలింగ్: టిమ్ సౌథీ 9-0-40-3, ట్రెంట్ బౌల్ట్ 9.4-1-48-2, జిమీ నీషమ్ 6-0-38-2, మిచెల్ సాంట్నర్ 10-0-38-1, ఇష్ సోధీ 10-1-52-1, ఆంటన్ డెవిసిచ్ 4-0-22-0.