కృష్ణ

అవయవదాత నాగబాబు అమరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవయవదాత నాగబాబు అమరుడు
24/06/2015
TAGS:
గన్నవరం, జూన్ 23: తన అవయవాల దానంతో మరో ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించిన పలగాని నాగబాబు (22) అమరుడయ్యాడు. భౌతికంగా నాగబాబు దేహం కనుమరుగైనప్పటికీ అతని అవయవాలు మరో ఐదుగురికి ఉపయోగపడ్డాయి. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామానికి చెందిన పలగాని వెంకటేశ్వరరావు (లేటు), రేణుక దంపతుల ఏకైక కుమారుడు నాగబాబు బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో ఓ కాంట్రాక్టర్ వద్ద రోజువారీ కూలీగా పనిచేస్తున్న నాగబాబు ఈనెల 18న నిర్మాణంలో ఉన్న భవనం పోర్టికోలో నిల్వ ఉన్న నీటిని కిందికి మళ్లించేందుకు నిచ్చెన ఎక్కాడు. నిచ్చెన జారి పడటంతో ప్రమాదవశాత్తూ నేలమీద పడ్డాడు. ఈ నేపధ్యంలో తలకు బలమైన గాయమైంది. చికిత్స నిమిత్తం చినఅవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం బ్రెయిన్‌డెడ్ స్టేజ్‌కు వెళ్లాడు. నాగబాబు తండ్రి 17 సంవత్సరాల క్రితం మృతి చెందగా, తల్లి రేణుక, చెల్లి కోమలి ఉన్నారు. నాగబాబుకు, అతని చెల్లికి ఇంకా వివాహం కాలేదు. నాగబాబు బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు ఆసుపత్రి వైద్యులు అతని తల్లికి, చెల్లికి వివరించారు. అవయవాల దానం చేయడం వల్ల మరో ఐదుగురుకు మేలు చేకూరుతుందని వివరించడంతో వారు అంగీకరించారు. తన బిడ్డ ఎలానూ బతికే అవకాశం లేనప్పుడు, తన బిడ్డను వారిలో చూసుకుంటానని తల్లి సంతోషంగా అంగీకరించింది. వీరి అంగీకారంతో మంగళవారం ఉదయం 11 గంటలకు ఆపరేషన్ ధియేటర్‌కు నాగబాబు దేహాన్ని తరలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్య బృందం నాగబాబు అవయవాలను సేకరించారు. లివర్ హైదరాబాద్, కిడ్నీలు విజయవాడ, గుంటూరు, కళ్లు విజయవాడ ఆసుపత్రులకు తరలించారు.
భారత మహిళల క్రికెట్ జట్టులో నగర క్రికెటర్ కల్పన
విజయవాడ , జూన్ 23: నగరానికి చెందిన ఆర్‌వి కల్పన (19) భారత మహిళల క్రికెట్ జట్టులో స్థానం సాధించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ వికెట్ కీపర్‌గా, బ్యాట్స్ ఉమెన్‌గా రాణించి భారత్ జట్టులో ఎసిఎ నుండి మొట్టమొదటి క్రికెటర్‌గా స్థానం సంపాదించింది. వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన ఆర్.వెంకటేశ్వరమ్మ, బాలకోటేశ్వరి దంపతుల కుమార్తె ఆర్‌వి కల్పన నలంద డిగ్రీ కళాశాలలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నది. బెంగుళూరులో 2014 సంవత్సరం జూలై 3 నుండి 14వ తేదీ వరకు జరిగిన భారత జట్టు ఎంపిక ప్రక్రియలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుండి మేఘన, కల్పనలు భారత ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికయ్యారు. ఫైనల్ ఎంపిక ప్రక్రియలో ఆర్‌వి కల్పన తుది జట్టులో స్థానం సంపాదించింది. ఆగస్టులో యుకెలో జరుగనున్న టోర్నీలో భారత జట్టులో కల్పన చోటు పొందింది. ఈ సందర్భంగా కల్పనను బిసిసిఐ ఉపాధ్యక్షులు జి.గంగరాజు, ఎసిఎ అధ్యక్షులు డివి సోమయాజులు, కోశాధికారి ఎంఎ రహీం, మహిళల క్రికెట్ అకాడమి ఛైర్మన్ జె.మురళీ మోహన్, ఎసిఎ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎంఎస్‌కె ప్రసాద్, సంయుక్త కార్యదర్శి సిహెచ్ అరుణ్‌కుమార్, జిల్లా సంఘ కార్యదర్శి ఎం.యల్లారావు, సంఘ సభ్యులు తదితరులు అభినందించారు.
ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన రాజేంద్రప్రసాద్
ఉయ్యూరు, జూన్ 23: రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాదు మంగళవారం హైదరాబాదులో ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి సభాపతి ఎదుట కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ముకానివ్వనని, రాజ్యాంగంలోని 73,74 అధికరణల కింద స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు, విధులు, హక్కులపై పోరాటం సాగిస్తానని చెప్పారు. కాగా పదవీ ప్రమాణం చేసిన రాజేంద్రకు బిజెపి నియోజకవర్గ నాయకులు డాక్టరు దివి చిన్మయ, తెలుగుదేశం పార్టీ నాయకులు చక్కా వెంకటసుబ్బారావు, వెంట్రప్రగడ వీరాంజనేయులు, రియాజ్ తదితరులు అభినందనలు తెలిపారు.
నూతన చట్టాలు - రెవెన్యూ పరిపాలనపై
రెవెన్యూ సిబ్బందికి శిక్షణ తరగతులు
విజయవాడ, జూన్ 23: రెవెన్యూ సిబ్బందికి నూతన చట్టాలు, రెవెన్యూ పరిపాలన అంశాలపై పూర్తి స్థాయి అవగాహనకు మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను అందించాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సిసిఎల్‌ఎ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మంగళవారం రెవెన్యూ డివిజనల్ అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నుండి సిసిఎల్‌ఎ నిర్వహించే సమావేశాలకు పూర్తి స్థాయి నివేదికలతో హాజరుకావాలసి ఉంటుందన్నారు. వారం, వారం నిర్వహించే అజెండా అంశాలపైనే నివేదికలు సమర్పిస్తున్నారని, సిసిఎల్‌ఎ పరిధిలో వచ్చే 21 అంశాలను చేర్చవలసి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం భూ సంబంధ అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందన్నారు. జిల్లాలో పరిశ్రమలు, ఇతర ప్రముఖమైన సంస్థల నిర్మాణాలను చేపడుతుందని, అందుకు క్షేత్ర స్థాయిలో నిబద్ధతతో కూడిన పని చేయాలని సూచించారు. ఇ-సేవ ద్వారా ఆదాయ, కుల, నివాస సంబంధమైన ధృవపత్రాల జారీలో దరఖాస్తుల పరిశీలన సమయంలోనే నిర్లక్ష్యం కనపడుతోందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో చిన్న, చిన్న కారణాల వల్లే దరఖాస్తులను తిరస్కరించడంపై సిసిఎల్‌ఎ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ సమీక్షించడం జరిగిందని తెలిపారు. ప్రజలు చేసే దరఖాస్తులపై సానుకూల స్పందన తప్పనిసరిగా చూపాలని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు. ప్రజలు సమర్పించే దరఖాస్తులపై స్పందించేందుకు రెవెన్యూ చట్టాలపై గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్‌ఓ) నుంచి ఆర్‌డిఓ స్థాయి వరకు అవగాహన ఎంతో ముఖ్యమన్నారు. జిల్లాలోని అన్ని స్థాయిల రెవెన్యూ సిబ్బంది బుధ, గురువారాల్లో ప్రత్యేక శిక్షణను అందించి వాటి వివరాలను శుక్రవారం సమర్పించాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానంలో 21 రోజుల్లో తగిన అనుమతుల నేపథ్యంలో చట్టాలపై అవగాహన ప్రాధాన్యత విషయాలపై తెలియచెప్పాలని గంధం చంద్రుడు పేర్కొన్నారు. ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన 517 ఉత్తర్వులపైన 22 ఏ సెక్షన్ పైన గ్రామ కంఠం భూములపైన శిక్షణను ఇచ్చి నివేదికలను పంపాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. వివిధ సమావేశాల సందర్భంలో సమీక్షలకు ఇచ్చే నివేదికల్లో పూర్తి స్థాయి సమాచారం అందించడం జరగలేదని అన్నారు. నివేదికలు మండల, డివిజన్, జిల్లా స్థాయి సంగ్రహ పట్టికలతో రూపొందించాలని, అసంపూర్తి విధానంలో వుంటే సంబంధిత పర్యవేక్షకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎల్‌ఇసి, కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల జారీపై డివిజనల్ స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కౌలు ధృవ పత్రాలు వున్న రైతులు అందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నీటి తీరువా బకాయిలు వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి నిలపాలని సూచించారు. అంతకు ముందు సిసిఎల్‌ఎ కమిషనర్ ఆదిత్యనాద్ దాస్ వెబ్ ల్యాండ్, గ్రామ కంఠం, భూ సంస్కరణలు, ప్రభుత్వ భూముల సంరక్షణ, రుణ అర్హత కార్డులు, భూ సేకరణ, మండల స్థాయిలో వివిధ ధృవపత్రాల జారీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, డిఆర్‌ఓ ఏ ప్రభావతి, ఆర్‌డిఓలు చెరుకూరి రంగయ్య, సిహెచ్ వెంకట సుబ్బయ్య, సిపిఓ వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ సెక్షన్ పర్యవేక్షలు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీగా బుద్దా ప్రమాణ స్వీకారం
ఇంద్రకీలాద్రి, జూన్ 23: పశ్చిమ నియోజవర్గానికి చెందిన బుద్దా వేంకటేశ్వరరావు (వెంకన్న) మంగళవారం ఉదయం శాసన మండలిసభలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈకార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, పలువురు యంపిలు విచ్చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బుద్దా వెంకన్న హైదరాబాద్ నుండి విజయవాడ నగరానికి బయలు దేరారు. నియోజకవర్గానికి చెందిన బిసి వర్గాలకు చెందిన బుద్దావెంకన్నకు ఎమ్మెల్సీ పదవి కేటాయించి ఈనియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీని మరింత బలపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరిగిలేని పునాది వేసినట్లు ఈపార్టీకి చెందిన సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 24గంటల వ్యవధిలోనే కాషాయరంగు జెండా మెడలో వేసుకొని ఎన్నికల బరిలో దిగిన వెలంపల్లి శ్రీనివాస్ జలీల్‌ఖాన్ చేతిలో పరాజయం పాలైయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ అధిష్టాన వర్గం దృష్టిలో పడేందుకు వెలంపల్లి పశ్చిమలో పార్టీ సభ్యత్వం అంటూ ప్రజలకు వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. బిజెపి వ్యవహారాన్ని గమనించిన అర్బన్ కన్వీనర్ హోదాలో బుద్దా వెంకన్న తెలుగుయువత నాయకులు అల్లాడ దుర్గారావు,బిసి నాయకులు సారిపల్లి రాధాకృష్ణ యాదవ్, సాదర ఏడుకొండలు, సుకాశి కిరణ్‌కుమార్ తదితరులతో ముందుగానే పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆయనకు చెక్ పెట్టారు.
దిక్కుతోచని స్థితిలో నాగబాబు కుటుంబం
గన్నవరం, జూన్ 23: కుటుంబానికి పెద్దదిక్కుగా, గ్రామస్థులకు తలలో నాలుకగా ఉన్న నాగబాబు ఇక లేడన్న సంగతి తెల్సుకున్న కేసరపల్లి గ్రామస్థులు తండోప తండాలుగా ఆసుపత్రికి తరలివచ్చారు. తండ్రి మృతి చెందడంతో కుటుంబ భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. కుటుంబ యజమాని లేడు. నాగబాబు కూడా ఆ కుటుంబానికి దూరం కావడంతో గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళవారం ఉదయం నాగబాబు దేహాన్ని ఆపరేషన్ ధియేటర్‌కు తరలిస్తున్న సమయంలో బంధువర్గం చేసిన ఆర్తనాదాలతో ఆసుపత్రి మార్మోగింది. తల్లి రేణుక మాట్లాడుతూ డబ్బులు కోసం తన బిడ్డ అవయవాలను దానం చేయడం లేదని, మరో ఐదుగురిలో తన కుమారుడ్ని చూసుకుంటానన్నారు. నాగబాబు చెల్లి కోమలి మాట్లాడుతూ మా అన్నయ్య మృతిచెంది నలుగురిలో బతికి ఉన్నాడని, ఆ నలుగురులో మా అన్నయ్యను చూసుకుంటానన్నారు. కేసరపల్లి గ్రామ సర్పంచ్ నాగరాజకుమారి మాట్లాడుతూ నాగబాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా తన అవయవాలను దానం చేసి అమరుడయ్యాడన్నారు. నాగబాబు కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలన్నారు. అవయవాలను దానం చేసేందుకు అంగీకరించిన రేణుక, కోమలిని అభినందించారు.
నాగబాబుకు ఘన నివాళులు
పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలోని నాగబాబు మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన తర్వాత మంగళవారం సాయంత్రం ఆసుపత్రి వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది ఘన నివాళులర్పించారు. నాగబాబు భౌతికకాయాన్ని ఆసుపత్రి వద్ద నుంచి ఊరేగింపుగా స్వగ్రామానికి తరలించారు. చిన్నఅవుటుపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో మంగళవారం నాగబాబు అవయవాలను జీవన్‌ధాన్ పథకం ద్వారా సేకరించిన వైద్యులు వివిధ ఆసుపత్రులకు పంపారు. ఆ వివరాలను వైద్య కళాశాల డైరక్టర్ జనరల్ డాక్టర్ సి. నాగేశ్వరరావు విలేఖరులకు తెలిపారు. జీవన్‌దాన్ పథకం ద్వారా ఈ కార్యక్రమానికి సహకరించిన హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవిరాజు, పథకం కో ఆర్డినేటర్ నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెరగాలన్నారు. అవయవదానం చేయాలనుకున్నవారు ఆసుపత్రిలో సంప్రదించి కార్డులు పూర్తిచేయాలని ఆయన సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాద్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్, న్యూరోసర్జన్ సోనీలాల్, యూరాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్, ఏఓ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
బురదకయ్యలుగా రహదారులు
తోట్లవల్లూరు, జూన్ 23: తోట్లవల్లూరులో పలు రహదారులు బురదకయ్యలుగా తయారై ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. అంబేద్కర్ సెంటర్ నుంచి సినిమా హాలు వైపు వెళ్లే రహదారి నడవలేనంత దుస్థితికి చేరిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే డ్రైనేజీ ఉన్నప్పటికీ మురుగు సక్రమంగా పారే అవకాశం లేక రహదారి మురికికూపంగా మరిపోతోందని అంటున్నారు. విద్యార్థులు, మహిళలు ఎవరు నడవాలన్నా ఇబ్బందికరంగా మారింది. బురదలో నడవలేక చెరకు ఆకు చెత్తను రహదారిపై వేసుకున్నారు. వర్షాలు వచ్చినా, మామూలు రోజుల్లో అయినా ఈ రహదారి పరిస్థితి ఇలానే ఉంటోంది. రహదారిని మెరక చేస్తేనే సమస్య తొలగుతుందని ప్రజలు కోరుతున్నారు. అలాగే వాటర్ ట్యాంక్ రోడ్డు కూడా అధ్వానంగా తయారయింది. ఇంకా అంతర్గత రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఎబివిపి ఆధ్వర్యంలో పాఠశాలల బంద్
మచిలీపట్నం , జూన్ 23: గుర్తింపు లేని పాఠశాలలు మూసివేయాలని, అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పాఠశాలల బంద్ విజయవంతమైంది. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను ఎబివిపి కార్యకర్తలు మూసివేయించారు. ఈసందర్భంగా ఎబివిపి పట్టణ కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలతో కలిసి ప్రభుత్వ విద్యను మాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా క్లస్టర్ స్కూల్స్ పేరుతో గ్రామాల్లో ఉండే స్కూల్స్‌ను మూసివేస్తున్నారని విమర్శించారు.
కార్పొరేట్ విద్యాసంస్థలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ళ తరబడి ఎంఇఓ, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్య కుంటుపడుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు విస్తారక్, కోటా వెంకటేశ్వర్లు, గిరీష్, నాగా, రామ్ ప్రసాద్, సుబ్బు, సాయి, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో ‘నీరు-చెట్టు’
మచిలీపట్నం, జూన్ 23: జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ పిలుపిచ్చారు. జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపిడివోలు, జెడ్పీటిసిలు, ఉపాధి హామీ ఎపిఓలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామగ్రామాన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. నీరు-చెట్టు కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. చెట్లు ప్రగతికి ప్రతీకలని, మానవ మనుగడకు జీవనాధారమని, మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతను కాపాడవచ్చన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో విశాలమైన ఆవరణలు, క్రీడా మైదానాలు ఉన్నాయని, వీటిలో మొక్కలు నాటాలని సూచించారు.