AADIVAVRAM - Others

తపన కాదు.. తాదాత్మ్యం చెందాలి ( కళాంజలి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానం రసం ఫణిః’ - అంటే సంగీతాన్ని శిశువులు, పశువులు, పాములు కూడా సంతోషంగా ఆస్వాదిస్తాయి. కృష్ణుడు కూడా తీయని వేణుగానం ఆలపించేవాడు. సంగీతం, కూచిపూడి నృత్యంలో ప్రవీణులు డి.ఎస్.వి.శాస్ర్తీ ప్రఖ్యాతి చెందిన కళాకారుడు. వీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సరోజినీనాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో నృత్యశాఖలో సంగీతకారుడుగా పని చేస్తున్నారు. వారితో ముఖాముఖి...
ప్ర: మీరు కళలు ఎవరి వద్ద నేర్చుకున్నారు?
జ: యక్షగాన సంగీతం, కర్ణాటక సంగీతం నేను శ్రీ పసుమర్తి వేణుగోపాలకృష్ణ శర్మగారి వద్ద నేర్చుకున్నాను. కూచిపూడి నృత్యం శ్రీ వేదాంతం రాధేశ్యాం, ఇంకా శ్రీ వేదాంతం రత్తయ్యశర్మగారి వద్ద నేర్చుకున్నాను.
ప్ర: మీకు కళలతో ప్రస్థానం ఎలా జరిగింది?
జ: నేను కూచిపూడిలోనే పెరిగాను. కూచిపూడి సంప్రదాయ కుటుంబానికి నేను చెందను. అయినా కళాకారుల కుటుంబంలో జన్మించాను. మా తాతగారు శ్రీ వేంకటశాస్ర్తీగారు పార్వతీ కళ్యాణం రాశారు. మా నాన్నగారు శ్రీ వేంకట రమణమూర్తిగారు సిద్దేంద్ర ఓరియంటల్ హైస్కూల్‌లో పని చేసేవారు. మా అక్కయ్య శ్రీమతి దుర్గ్భావాని మంచి గాయకురాలు. మా తమ్ముడు నారాయణమూర్తి రచయిత, కవి. నేను నృత్యం, సంగీతం చిన్నప్పటి నుండే నేర్చుకున్నాను. ఇలా రెండు కళలూ నాకు రెండు కళ్ల వంటివి. దశాబ్దాలుగా కళలకే అంకితమై పోయాను. చిన్నప్పుడు నృత్యంలో ప్రోగ్రామ్‌లిచ్చాను. ఇప్పుడు నృత్యం శిష్యులకి నేర్పిస్తున్నాను. సంగీతం ప్రదర్శనలు, నృత్యానికి సహకారం ఇస్తూనే సెంట్రల్ యూనివర్సిటీ (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)లో పని చేస్తున్నాను.
ప్ర: మీరు చిన్నప్పుడు నృత్యం, సంగీతం ఎలా అభ్యాసం చేసేవారు?
జ: చిన్నప్పుడు పొద్దునే్న 7 నుండి 8.30 గంటల దాకా పి.వి.జి.కృష్ణశర్మ గారి వద్ద సంగీతం అభ్యాసం, శిక్షణ అయ్యేది. తరువాత 8.30 నుండి 10 దాకా శ్రీ వేదాంతం రాధేశ్యాం గారి వద్ద కూచిపూడి నేర్చుకునేవాణ్ణి. తరువాత సా యంత్రం దాకా స్కూలు. మళ్లీ 4-6 దాకా సంగీతం. 6 నుండి రాత్రి మళ్లేవరకు నృత్యం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 1991-94 బి.ఏ. సంగీతం చేశాను. నాకు స్వర్ణ పతకం కూడా వచ్చింది. ఆ తరువాత సంగీత అలంకార్, అఖిలభారత గంధర్వ మహావిద్యాలయ మండలం, ముంబయలో 1997-1999 మధ్య పని చేశాను. ఇవాళ నాదే లాస్యకల్ప అనే సంస్థ ఉంది. అక్కడ కళాకారులకు శిక్షణ ఇస్తున్నాను.
ప్ర: మీరు ఎన్నో విదేశాలు వెళ్లారు?
జ: జోర్డాన్, సిరియా, టర్కీ, సిప్రస్, గ్రీకు, దుబాయి, అబుదబి, బహెరన్, కువైట్, ఖతార్, దోహా, జర్మనీ, యుకె, యుఎస్, ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్, ఫ్రాన్స్, మలేసియా వంటి ఎన్నో విదేశాలు వెళ్లాను. 2004లో ఒక ఫారెన్ టూర్‌లో వెంపటి చినసత్యం గారు అందరి ముందు నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అది నా మనసుకు గుర్తుండిపోయిన మధుర స్మృతి. నేను వెంపటి చినసత్యం గారికి ప్రశిష్యుడిని.
ప్ర. మీరు చాలా ఫెస్టివల్స్, ముఖ్య ప్రదర్శనలలో పాడారు..
జ: అవును.. ఖజురహో ఫెస్టివల్, కోణార్క్ ఫెస్టివల్ మ్యూజిక్ అకాడెమీ, సంగీత నాటక అకాడెమీ ఫెస్టివల్స్, భారత్ కళాకార్, కల్ కే కళాకార్, బృహదీశ్వర ఆలయం, తంజావూరు, చిదంబరాలయం, ఆంధ్ర మ్యూజిక్ అకాడెమీ, శారద సంగీత గానసభ, హరిదాస్ సమ్మేళన్, ఐసిసిఆర్ ప్రదర్శనలు, విశాఖ మ్యూ జిక్ అండ్ డాన్స్ అకాడెమీ, స్పిక్‌మెకే, మిలినీయం ఫెస్టివల్స్, మైసూర్ నాద మండపం, సికా ఫెస్టివల్స్, త్యాగరాజ సంగీత తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉదయ శంకర్ డాన్స్ ఫెస్టివల్, కూచిపూడి మహోత్సవ్, ముద్రా ఫెస్టివల్ (కేరళ), నాద నీరాజనం-తిరుమల, కెనె్నడీ సెంటర్ - వాషింగ్టన్ డీసీ, కార్నగీ హాల్ - న్యూయార్క్ మొదలగు చోట్ల ముఖ్య ప్రదర్శనలు.
ప్ర: మీరు చాలా లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్స్ ఇచ్చారు కదా...
జ: మ్యూజిక్ ఇన్ కూచిపూడి - కూచిపూడి 2016లో, త్యాగరాజ గానసభ, హైదరాబాద్- 2015లో, త్రిస్సూర్ కేరళ 2015లో మ్యూజిక్ ఆఫ్ భామాకలాపం - రవీంద్రభారతి, హైదరాబాద్ - 2013లో, మ్యూజిక్ ఇన్ వెంపటి డాన్స్ బ్యాలేస్, సిద్దేంద్ర నాట్య కళోత్సవం, కూచిపూడి- 2013లో, జలవిహార్ - 2003లో, ఇన్నోవేషన్స్ ఇన్ మై మ్యూజిక్ కంపోజిషన్స్, సిద్దేంద్ర యోగి నాట్యకళోత్సవం - కూచిపూడి 2012లో, కూచిపూడి మ్యూజిక్ - వరల్డ్ డాన్స్ డే, గుంటూరు -2011లో, వెండితెర కూచిపూడి వెలుగులు, కూచిపూడి నాట్యోత్సవం - కూచిపూడి 2006లో ఇచ్చాను. ఎన్నో వ్యాసాలు ముఖ్యమైన సావనీర్లలో ప్రచురితమయ్యాయి.
ప్ర: మీకు గౌరవాలు ఎన్నో జరిగాయి...
జ: చింతా కృష్ణమూర్తి యక్షగాన యువ సూత్రధార పురస్కారం, సిద్దేంద్రయోగి నాట్య కళోత్సవం, కూచిపూడి -2012లో.
బహువిద్యా ప్రవీణ, విజయవాడ 2011లో. మధురగాన సుధాకర, సింహపురి సంగీత సభ, నెల్లూరు 1999లో.
సరస సంగీత విద్వాన్, శ్రీరామలింగేశ్వర పీఠం, ఒంగోలు, మచిలీపట్నం -1994లో.
స్వర్ణ పతకం, బి.ఏ. సంగీతం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1994లో.
ఆలిండియా రేడియో ‘బి’గ్రేడ్ కళాకారుడిగా కృషిచేశాను.
ఎన్నో కీర్తనలు, తిల్లానాలు రాశాను. రూపకల్పన చేశాను. కొత్తరాగం శ్రీప్రియ 1999లో కనిపెట్టాను. అసంఖ్యాకంగా, గొప్ప కళాకారులతో పాడాను. ఎంతోమంది నృత్య ప్రదర్శనలకి సంగీత సహకారం అందించాను.
ప్ర: మీరు బాగా గుర్తు పెట్టుకున్న ప్రదర్శనలు...
జ: అన్నీ ముఖ్యమైనవే. అన్నీ మధురస్మృతులే. 2003లో గోదావరి పుష్కరాల సందర్భంగా, వెంపటి చినసత్యం గారి పక్కన కూర్చుని శ్రీకృష్ణ పారిజాతం ప్రదర్శనకు గాత్ర సహకారం అందించాను. అలాగే 2006లో అనంతపురంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరు మీద ఆడిటోరియం కట్టారు. వారి సమక్షంలో పాడటం నా అదృష్టం.
ప్ర: మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు?
జ: మా గురువుల వల్లే నేను ఈనాడు ఈ స్థాయికి వచ్చాను. వారు పెట్టిన విద్యాభిక్ష వల్లే నాకు ఇవాళ మంచి పేరు వచ్చింది. నేను హైదరాబాద్‌కు వచ్చిన కొత్తల్లో (1991) బావగారు వేదాంతం రామలింగశాస్ర్తీ గారు, అక్కయ్య వద్ద ఉండేవాణ్ణి. వారు చాలా ప్రోత్సహించారు. అలాగే నన్ను నమ్మి సెంట్రల్ యూనివర్సిటీలో ఉపాధి కలిగించారు పసుమర్తి రామలింగశాస్ర్తీ గారు. నృత్య విభాగంలో అన్నిచోట్ల నన్ను పరిచయం చేశారు రాజగోపాలాచారిగారు. వేణువు కళాకారుడు ఎస్.ఎ.రవికిరణ్ గారు చాలా ప్రోత్సహించారు.
ప్ర: అవార్డులు తెచ్చుకోవడంలో కొంతమందికి అనుభవజ్ఞత ఉందంటారు. ఆర్థిక స్థోమత, రాజకీయ పలుకుబడి సహాయపడుతుంది.. అని కొందరు అంటారు. మీరేమంటారు?
జ: అనేదేముంది? కనిపిస్తోంది కదా! ప్రతిభ, సృజనతోపాటు అదృష్టం కూడా ఉండాలి. అప్పుడు ఎవరి ప్రగతినీ మనం ఆపలేం. అవినీతి, డబ్బుతో ముడిపడి ఉన్నప్పుడు ఇలాంటివి సహజమే! కళాకారులకు ఆత్మాభిమానం ఉంటుంది. కళకు అంకితమైన వారికి ఇవి అక్కరలేదు.
ప్ర: మీరు కళాకారులకు ఇచ్చే సందేశం ఏమిటి?
జ: కళను మనసావాచా కర్మణా.. త్రికరణశుద్ధిగా ప్రేమించాలి. కళ వల్ల ఇహం పరం రెండూ లభిస్తాయి. ఏం వస్తుంది? ఫలితం ఏమిటి? అనేది త్యజించాలి. నిస్వార్థంగా కళకు అంకితమైపోయి, భగవంతుడి పాదాలకు కళను అంకితం చేయాలి. పాడుతున్నప్పుడు ఆ భాష నుడికారం తెలుసుకోవాలి. ఉచ్ఛారణ తెలుసుకోవాలి. కళకు నా వంతు సేవ చేయాలి అన్నది నా చిన్న ఆశ.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి