అదిలాబాద్

రైతు సమస్యలపై ఐజి నాగిరెడ్డి ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 3: మార్కెట్ యార్డులో రైతులకు మోసాలు జరగకుండా అధికారులు, వ్యాపారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, తూకంలో అక్రమాలు జరిగితే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని వరంగల్ ఐజి వై.నాగిరెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డును ఎస్పీ శ్రీనివాస్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించి పత్తి కొనుగోళ్లు, రైతుల సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తూకంలో, ధరలో ఎవైనా అక్రమాలు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. నిరక్షరాస్యులైన రైతులను నమ్మించి తూకంలో మోసాలకు పాల్పడితే వ్యాపారులపై ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. ఎలక్ట్రానిక్ కాంటాలు కూడా పారదర్శకంగా పనిచేసేలా చూడాలని అధికారులకు సూచించారు. పత్తి కొనుగోళ్లలో పెద్దనోట్ల వ్యవహారం, నగదు మార్పిడి అంశాలపై రైతులతో చర్చించారు. ఇదిలా ఉంటే ఉన్నత పోలీసు అధికారి మార్కెట్‌యార్డును సందర్శించడం రైతుల్లో, వ్యాపార వర్గాల్లో చర్చనియాంశంగా మారింది.

అవినీతి నిర్మూలనతోనే దేశాభివృద్ధి
* నిర్మల్ జిల్లా ఎస్పీ వారియర్
నిర్మల్, డిసెంబర్ 3: సమాజంలో పేరుకుపోయిన అవినీతిని నిర్మూలిస్తేనే దేశం త్వరితగతిన అభివృద్ది చెందుతుందని నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్‌టి ఆర్ మినీస్టేడియంలో నిర్వహించిన అవినీతి వ్యతిరేక వారోత్సవాలను ఆయన జెండా ఊపి ప్రారంభించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఈ వారోత్సవాలు 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుపుకోవడం జరుగుతుందన్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమన్నారు. అవినీతి రహిత సమాజనిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. అవినీతికి పాల్పడే వారు పట్టుబడితే శిక్షార్హులన్నారు. లంచంకోసం డిమాండ్‌చేసే అధికారుల సమాచారాన్ని ఏసిబికి అందించాలన్నారు. అనంతరం వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థులు పట్టణంలోని పలు వీదులగుండా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎసిబి డిఎస్పీ పాపాలాల్, స్పెషల్ బ్రాంచ్ ఎం ఎ కరీం, ఎసిబి సిబ్బంది పాల్గొన్నారు.

అవినీతి నిర్మూలనలో భాగస్వాములు కండి
* జిల్లా ఎస్పీ శ్రీనివాస్
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 3: నవ సమాజ నిర్మాణానికై అవినీతి నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయినప్పుడే భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎస్పీ ఎం.శ్రీనివాస్ అన్నారు. శనివారం అవినీతి నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా స్థానిక పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసులతో పాటు కార్యాలయం అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో అవినీతిని తరిమినప్పుడే దేశాభ్యుదయానికి మార్గం సుగుమం అవుతుందన్నారు. డిసెంబర్ 3 నుండి అవినీతి వారోత్సవాల సందర్భంగా అవినీతి నిర్మూలన సమాజం పాత్రపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లు, సిఐ, డిఎస్పీ కార్యాలయాలతో పాటు పోలీసు హెడ్ క్వార్టర్స్‌సలో అవినీతి నిర్మూలనకై ప్రతిజ్ఞ చేవారన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డిఎస్పీలు ఎ లక్ష్మీనారాయణ, కె,నర్సింహారెడ్డి, కె.సీతారాములు, ఎస్.మల్లారెడ్డి, ఎండి బుర్హాన్ అలి, సిఐలు ఎన్.సత్యనారాయణ, ఎన్.వెంకటస్వామి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ బి.ప్రవీణ్, యండి షేర్ అలీ, పోతారం శ్రీనివాస్, కె.రాంచందర్‌రావు, జె.పుష్పరాజ్, ఆర్.్భరతి, సిసిఎం పోతరాజు, మురళీ, ఎస్సైలు జి.రాజన్న, ఎన్.శ్రీనివాస్, అన్వర్ ఉల్ హఖ్ తదితరులు పాల్గొన్నారు.

వైకల్యం శరీరానికే.. మనసుకు కాదు
* జిల్లా కలెక్టర్ చంపాలాల్
ఆసిఫాబాద్, డిసెంబర్ 3: వైకల్యం అనేది శరీరానికే కాని మనసుకు కాదని కొమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. శనివారం ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికలాంగుల శాఖ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు. వికలాంగులకు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క వికలాంగుడు వారి ప్రతిభను కబర్చి ముందుకు సాగాలని, అప్పుడే లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. సదరన్ క్యాంపు ఆసిఫాబాద్‌లో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అలాగే ప్రతి కార్యాలయానికి ర్యాంపును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు వికలాంగులకు పెన్షన్ రూ.500లు ఇస్తే తెరాస ప్రభుత్వం రూ.1500 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. వివాహమైన వికలాంగుల జంటలకు కలెక్టర్, ఎమ్మెల్యేలు రూ.50వేల నగదును అందజేశారు. అలాగే నలుగురికి ట్రై సైకిళ్ళు పంపిణి చేశారు. కార్యక్రమంలో డిఆర్‌డివో శంకర్, డిఎంహెచ్‌వో శంకర్, ఐసిడిఎస్ పిడి సావిత్రి, కాగజ్‌నగర్ మున్సిపల్ కమీషనర్ రమేష్‌బాబు, వాంకిడి జెడ్సిటీసి అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపిపిలు తారబాయి, సంజీవ్‌లు, సింగిల్‌విండో చైర్మెన్ అలీ, బిసి, ఎస్సి,సిపివో కార్పోరేషన్ అధికారులు, వికలాంగులు తదితరులు పాల్గోన్నారు.

ఆత్మవిశ్వాసంతో వైకల్యాన్ని జయించాలి
* వికలాంగుల దినోత్సవంలో మంత్రి జోగు రామన్న
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, డిసెంబర్ 3: ఆత్మవిశ్వా సంతో వికలాంగులు తమ ముందు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత లక్ష్యాలను అధిగమించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని శనివారం జిల్లా పరిషత్‌సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమశాఖ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి జోగు రామన్న హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ దివ్యాంగులకోసం కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దివ్యాంగుల అభివృది ధకోసంకృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల 34వేల మందికి రూ.420కోట్లతో పింఛన్లు అందించడం జరుగుతుందన్నారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం కోసం అంచెలంచలుగా కృషి చేస్తానన్నారు. వికలాంగుల సభ్యుడు ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతూ జిల్లాలోని వికలాంగులు ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఉమాదేవి మాట్లాడుతూ ప్రపంచ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం మాదిరిగానే డిసెంబర్ 3న జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరిగిందన్నా రు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి సొంత వాహనం ఉన్న నిరుద్యోగ శారీరక వికలాంగులకు పెట్రోల్ కొనుగోళ్ళపై రాయితీ ఇవ్వడం జరుగుతుందని, వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుందని, అందులకు చేతి కర్రలు, బ్రెయిలీ పలక, ఎంపి-3 ప్లేయర్, ల్యాప్‌టాప్లు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. అనంతరం వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన దివ్యాంగులకు మంత్రి రామన్న చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ సంధర్భంగా దివ్యాంగులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో డిసిసిబి చైర్మెన్ దామోదర్ రెడ్డి, జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి రాజేశ్వర్ రాథోడ్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి ఉమాదేవి, దివ్యాంగుల సంక్షేమ ప్రతినిధులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి పాలన కాదు... నలుగురి పాలనే..!
* అప్పల రాష్ట్రంగా మారింది
* సిఎం దత్తత గ్రామంలో డబుల్ బెడ్ రూంలు ఏవి...?
* టిడిపి జిల్లా అధ్యక్షుడు జనార్దన్
మంచిర్యాల, డిసెంబర్ 3: రాష్ట్రంలో పాలన ఉమ్మడిగా లేదని, నాలుగురు మంత్రుల పాలనే పాగుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బోడ జనార్థన్ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశం లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ సుమారు రూ.70 కోట్లు ఇచ్చారేతప్ప మిగతా ఏఒక్క శాఖకు బడ్జెట్ కేటాయించాలేదన్నారు. 16వేల కోట్లు మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం వస్తే.. రెండున్నరేళ్ల పాలనలో అప్పల రాష్ట్రంగా మారిందని అరోపించారు. లక్షా 7వేలు అప్పలుతీసుకువచ్చారన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణంలేదని, ఉట్నూర్‌లో గిరిజన యునివర్సిటి, మంచిర్యాలలో మెడికల్, అగ్రికల్చర్ యూనివర్సటిల ఉసేలేదు. జిల్లాలో ప్రాజెక్టులన్నిటికి కాలువల నిర్మాణం చేపట్టాక లక్ష ఎకరాల ఆయక్టుకు నీరు అందక పోవడంతో బీడు భూములుగా మారిపోగా, ప్రాజెక్టులన్ని చేపల ప్రాజెక్టులుగా మారయన్నారు. ప్రాణహిత -చెవెళ్ళ ప్రాజెక్టుకు నిధులు కేట్టాయించక పోవడంతో నిర్మాణం నిలిచిపోయిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద చెన్నూర్ నిమోజిక వర్గంలో 1000 ఎకురాలు మునిగిపోతున్నాయని, ముంపు అవసరం లేకుండా ప్రాణహిత ప్రాజెక్టును నిర్మిస్తే సాగు తగు నీరుకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. ముంపు ప్రాంత ప్రజలకు 2013 భూ సేకరణ చట్టం జివో నెం 123 ప్రకారం పరిహారం చెల్లించి ముంపు భాదితులను అదుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్టల్రో ముంపునకు గురైతున్న రైతులకు 2013 భూసేకరణచట్టం ప్రకారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పకున్నారని మన రాష్ట్ర ముంపు బాధితులకు చెల్లించేందుకు ఇప్పటికి అంగికరించలేదన్నారు. వెంటనే ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు పరుచాలని, జివో ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలని కోరారు.

కోదండరాంను విమర్శించేస్థాయి కెటిఆర్‌కు లేదు
* డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, డిసెంబర్ 3: జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాంను విమర్శించే స్థాయి మంత్రి కె.తారకరామారావుకు లేదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్‌లోని ఆయన స్వగృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటులో కోదండరాం క్రియాశీలకపాత్ర పోశించారన్నా రు. సకలజనులను ఏకంచేసిన ఘనత కోదండరాందేనన్నారు. శాంతియుతంగా ఆయనచేసిన పోరాటఫలితంగానే రాష్ట్రం సాకారమైందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. స్థానిక మంత్రి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, అధికారులు కూడా సహకరించడం విడ్డూరమన్నారు. నాయకులు కోట్లాది రూపాయలు సంపాదిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో టిఆర్‌ఎస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారని వాపోయారు. ఆయన వెంట మాజీ డిసిసిబి ఛైర్మెన్ అయిర నారాయణరెడ్డి, మాజీ మండలాధ్యక్షులు సాద సుదర్శన్, నాయకులు సత్యం చంద్రకాంత్, ముత్యంరెడ్డి, దినేష్, పోతన్న, ముత్యం, వీరేష్ తదితరులు ఉన్నారు.

విద్యార్థుల్లో ఉన్నత ప్రమాణాలు పెంచాలి
* బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, డిసెంబర్ 3: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించి, వారి భవిష్యత్తు ను తీర్చిదిద్దాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంత్రి రామన్న అధ్యక్షతన రిమ్స్ అడిటోరియంలో ప్రభుత్వ విద్యాసంస్థల బోధనతీరుపై సమీక్షించి, కళాశాలల ప్రిన్సిపాళ్ళకు, ప్రధానోపాధ్యాయులకు, ఎంఈవోలకు, వసతి గృహ సంక్షేమ అధికారులకు పలు మార్గదర్శకాలు జారీచేశారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నామనే నమ్మకాన్ని తల్లిదండ్రులకు కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, ఎంఈవోలపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలోని విద్యార్థినీలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడంతోపాటు ప్రహారిగోడలు నిర్మించి, ఆడపిల్లలు అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బిసి స్టడీ సర్కిల్ అధ్వర్యంలో మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వసతి గృహ విద్యార్థినీలకు వౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మెను ప్రకారం భోజనం అందించాలని మంత్రి రామన్న అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం జిల్లాలోని అన్ని పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయగా నిర్మాణ పనులు పూర్తిచేయకుండా పనులను నత్తనడకన కొనసాగడంపై ఆర్‌విఎం ఈఈని వివరణ కోరారు. అవసరమైనంత నిధులు ఉన్నందున పెండింగ్‌లో ఉన్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలకు ఇంకా 90 రోజులు మాత్రమే సమయం ఉంన్నందున జిల్లా వ్యాప్తంగా అన్ని ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించి, వారికి అర్థమయ్యే విధంగా బోధించి 10వ తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలను మంత్రి రామన్న ఆదేశించారు. మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు సక్రమంగా భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఈవోలను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులు పటిష్టమైన విద్యను అందించడంతో పాటు నూతనంగా ప్రవేశపెట్టిన డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్థుల మేదస్సును పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెసి కృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య, ఉప విద్యాశాఖాధికారి శ్యామ్‌రావు, డిటిడబ్ల్యూవో రాంమూర్తి, జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ ఇజ్జగిరి ఆశోక్, జైనథ్ జడ్పీటీసీ దేవన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టి.చందు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, వసతిగృహాల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు సంక్షేమ పథకాలు చేరాలి
* మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
దివ్యనగర్, డిసెంబర్ 3: ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఎన్నో చర్య లు చేపడుతుందని సంక్షేమ పథకాల ను సక్రమంగా ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్ ఆర్ ఫంక్షన్‌హాల్‌లో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దివ్యాంగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. రూ. 500 పింఛన్‌ను రూ.1500లకు పెంచ డం జరిగిందన్నారు. దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం శిక్షణ కార్యక్రమాలు సైతం ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఎన్నో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పొందే వీలుందన్నారు. చదువుకున్న దివ్యాంగులను అన్నివిధాలుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. దివ్యాంగులకు డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయంకృషితో ఎదగడానికి దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తామన్నారు. అనంతరం వివాహం చేసుకున్న 15 మంది దివ్యాంగులకు రూ.50 వేల చొప్పున పంపిణి చేశారు. అలాగే స్ర్తిలక్ష్మి స్వయం సహాయక సంఘం గ్రూపుకు రూ.5 లక్షల రుణాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటి ఛైర్మెన్ దేవెంధర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సగ్గం రాజు, సిడిపివొలు సుగుణ, విజయలక్ష్మి, వికలాంగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు సట్టిసాయన్న, సూపర్‌వైజర్లు విజయగౌరి, లక్ష్మి, రాధకుమారి, కౌన్సిలర్ పోడెల్లి గణేష్, వికలాంగులు పాల్గొన్నారు.

పెన్‌గంగా బ్యారేజీ పనుల్లో నిర్లక్ష్యం వద్దు
* సమన్వయంతో పనిచేస్తేనే గడువులోగా సాగునీరు
* సమీక్షా సమావేశంలో మంత్రి రామన్న
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, డిసెంబర్ 3: అంతరాష్ట్ర పెన్‌గంగా ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చెనాకకోర్ట బ్యారేజి పనుల్లో నిర్లక్ష్యం విడనాడి గడవులోగా బ్యారేజీ పనులు పూర్తిచేసి రైతులకు సాగునీరందించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. శనివా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టు పనుల ప్రగతిపై జిల్లా కలెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతితో కలిసి మంత్రి జోగు రామన్న రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్షిం చి, పలు సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ ప్రతినెలలో పనుల ప్రగతిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ విధంగా పనులు నిర్వహించి, ప్రగతిని చూపించాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కాంట్రాక్టర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఇంజనీరింగ్ అదికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ బుద్దప్రకాష్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ జిల్లా రైతాంగానికి మేలు జరిగేలా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెనాకకోర్ట బ్యారేజి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని బ్యారేజి ఇంజనీరింగ్ అధికారు లు, కాంట్రాక్టర్లపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి నుండి తగినంత మంది ఇంజనీర్లను ఉపయోగించి మెటీరియల్ ఏర్పాటు చేసి ప్రతి నెల ప్రగతిపై వివరణ ఇవ్వాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈనెల 17నాటికి పారదర్శకంగా పనులు నిర్వహించి, ప్రగతి నివేదికలు చూపించాల న్నారు. నీటిపారుదల శాఖ ప్రధాన ఇంజనీర్ భగవంత్‌రావు వివరణ ఇస్తూ 14లక్షల క్యూబిక్ మీటర్ల పనులకు గాను ఇప్పటివరకు 7లక్షల 70వేల క్యూబిక్ మీటర్ల పని పూర్తిచేయడం జరిగిందన్నారు. బ్యారేజీ ద్వారా 13,500 ఎకరాలకు, ప్రధాన కాలువల ద్వారా 37,500 ఎకరాలకు నీరు అందించుటకుగాను 3 పంపు హౌస్‌ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 30శాతం జరగాల్సి ఉండగా, భారీ వర్షాల కారణంగా 10శాతం పనులు జరిగాయన్నా రు. డిసెంబర్ నెలాఖరులోగా 2లక్షల 33వేల క్యూబిక్ మీటర్ల పనులు చేసి ప్రగతి నివేదికలు సమర్పిస్తామన్నారు. సమావేశంలో జెసి కృష్ణారెడ్డి, ఎస్‌ఈ అంజద్ హుస్సేన్, ఈఈ సత్యరాజ్‌చంద్ర, మిషన్ కాకతీయ ఈఈ సుశీల్‌కుమార్, ఆదిలాబాద్, జైనథ్, బేల, భీంపూర్ తహశీల్దార్లు శ్రీదేవి, ప్రభాకర్, నందకిషోర్, రాజేశ్వర్, కాంట్రాక్టర్లు మురళీధర్‌రెడ్డితో పాటు ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.