అదిలాబాద్

వంద శాతం నగదు రహిత గ్రామంగా ముక్రాకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ, డిసెంబర్ 11: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసి వాటి స్థానంలో నగదు రహిత లావాదేవీలపై దృష్టిసారించాలని ప్రకటించడంతో ఇచ్చోడ మండలంలోని ముక్రాకె గ్రామంలోని ప్రజలు పేటిఎంపై తమ అవగాహనను పెంచుకొని వాటిద్వారానే లావాదేవీలను నిర్వహిస్తున్నారు. ఆదివారం స్థానిక తహసీల్దార్ మోహన్‌సింగ్ గ్రామానికి వెళ్ళి నగదు రహిత లావాదేవీలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. స్వయాన తహసీల్దార్ పేటి ఎం ద్వారా కిరాణ షాపులో సరకులను కొనుగోలు చేసి గ్రామస్తులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నగదు రహిత లావాదేవీలపై ఎక్కువ దృష్టి సారించడంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎటిఎం, పేటిఎంల ద్వారా జరిగే చెల్లింపులపై అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు కూడా దీనిపై దృష్టిసారించారు. నకిలీ నోట్ల నివారణతో పాటు బ్యాంకుల చుట్టూ తిరగకుండా ప్రజలు నేరుగా తమ సెల్‌ఫోన్ల ద్వారా యాప్‌లను డౌన్‌లోడు చేసుకొని లావాదేవీలను జరుపుకోవడంతో పాటు నిత్యావసర సరకులను కూడా కొనుగోలు చేసుకునే అవకాశాన్ని గ్రామస్తులు అనుసరిస్తున్నారు. ఈ సంధర్భంగా గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షులు గాడ్గె సుభాష్ మాట్లాడుతూ గతంలో కూడా తమ గ్రామంలో సి ఎస్‌సి ద్వారా వందశాతం అక్షరాస్యతను సాధించి రాష్ట్రంలో మూడవ గ్రామంగా ఎంపికైందని, అదే మాదిరిగా నగదు రహిత లావాదేవీలపై కూడా తమ గ్రామం ముందు వరసలో నిలువడంపై ఎంతో ఆనందంగా ఉందన్నారు.

అంబేద్కర్ ఆశయ సాధనకు బిజేపి కృషి చేస్తుంది
* బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణ రెడ్డి
మంచిర్యాల, డిసెంబర్ 11: భారత రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం బిజేపి ప్రభుత్వం కృషి చేస్తుందని బిజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణ రెడ్డి అన్నారు. బిజేపి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ నెల 6 నుంచి చేపడుతున్న వర్థంతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాలాభిషేకం చేపట్టారు. పట్టణంలోని నైనాశ్రీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన వర్థంతి సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ 70 సంవత్సరాల పాలనలో రాజ్యాంగ నిర్మాతకు గుర్తింపు ఇవ్వలేదని అన్నారు. భారతరత్న అవార్డు కూడా అతి కష్టం మీద అందించారని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరే విధంగా పాలన అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలోని నల్లధనాన్ని బయటికి తీసేందుకే పెద్ద నోట్లను రద్దు చేశారని విపక్షాలు పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో రాదాంతం చేయడం సమంజసం కాదన్నారు. పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా మోదీ పాలన ఉందని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగానే పాలన అందించి బడుగుబలహీన వర్గాల ప్రజలకు అభివృద్ది ఫలాలు అందే విధంగా మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా అధ్యక్షులు ముల్కల మల్లారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఎనగందుల కృష్ణమూర్తి, జిల్లా ప్రధానకార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు గోలి రాము, పట్టణ అధ్యక్షులు పూసాల వెంకన్న, దళిత మోర్చ నాయకులు శశికుమార్, బిజేవై ఎం నాయకులు స్వామి రెడ్డి, బిజేపి జిల్లా నాయకులు మధుకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరం
* ఎమ్మెల్సీ పురాణం సతీష్
కాసిపేట, డిసెంబర్ 11: ప్రస్తుత పరిస్థితులలో ఆత్మరక్షణకు కరాటే, కుంఫూలు ఎంతో అవసరమని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు పేర్కొన్నారు. ఆదివారం సోమగూడెంలో అంక రాంచందర్ మెమోరియల్ ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి కుంగ్‌ఫూ, కరాటే చాంపియన్ షీప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడారు. క్రీడా పోటీలు శరీరానికి దోహిద పడుతాయన్నారు. నేటి రోజులలో ముఖ్యంగా మహిళలకు తమను తాము కాపాడుకోవడానికి ఆత్మరక్షణకు కరాటే, కుంగ్‌ఫ్యూ లు ఉపయోగపడుతాయన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోను స్టేడియంల నిర్మాణానికి తెలంగాణ ప్రభఉత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ పోటలకు రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 350 పై చిలుకు మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొని తమ సత్నా చాటారు. ఈ పోటీలలో గెలుపొందిన చాంపియన్ షీప్ గెలుపొందిన క్రీడాకారులకు నగదుతో పాటు షీల్డులను ప్రధానం చేయనున్నారు. క్రీడా పోటీల ముగింపు కర్యక్రమానికి కేంద్ర అధికార ప్రతినిధి వేణుగోపాల చారి రానున్నట్లు క్రీడా కమిటి తెలిపారు. ఈ కార్యక్రమంలో గెల్లిరాజలింగు, ముడిమడుగుల రమేష్, కంటేష్, కుందేళ్ళ శ్రావన్, వంశీధర్‌రావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

దేశాన్ని ఆర్థిక ఇబ్బందులోకి నెట్టి వేసిన మోదీ సర్కారు
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్
బెల్లంపల్లి, డిసెంబర్ 11: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 500, 1000 లను రద్దు చేసి దేశాన్ని ఆర్థిక ఇబ్బందులోకి నెట్టి వేసారని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్ విమర్శించారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికి తీస్తానని చెప్పిన నరేంద్ర మోదీ పెట్టుబడి దారుల కొమ్ముకాస్తూ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్నా వ్యతిరేక విధానాల వల్ల సామన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మోదీ రూ.2000 నోట్లను తీసుకువచ్చి కోటీశ్వరులు, సంపన్నులకు లాభం చేకూరుస్తున్నారని తెలిపారు. టిటిడి బోర్డు సభ్యుడు ఇంట్లో గుట్టలుగుట్టలుగా నల్ల ధనాన్ని సిబిఐ అధికారులు వెలికి తీస్తున్నారని ఈ నల్ల ధనం ఎక్కడి నుంచి వస్తుందో మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ అబద్దాల కోరు, దివాళా కోరు, మతోన్మాది అని ఎద్దెవా చేశారు. దేశాన్ని అతలాకుతలం చేసేందుకే కార్పోరేట్, బడా పారిశ్రామిక వేత్తలకు తొత్తుగా మారారని విమర్శించారు. ప్రత్యామ్నాయ పరిస్థితులు కల్పించకుండా పెద్ద నోట్ల ను ఎలా రద్దు చేస్తారన్నారు. పెద్ద నోట్ల రద్దుతో 150 మందికి పైగా ప్రాణాలుకోల్పోయరు అన్నారు. బాధ్యతతో పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సిన మోదీ సమావేశాలకు హాజరు కాకుండా తనను పార్లమెంట్‌లో మాట్లాడకుండా ప్రతి పక్షాలు అడ్డుకుంటున్నాయని అనడ హాస్యాస్పదం అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ స్వరం విప్పి సామన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేశారు.

పర్యాటక ప్రదేశంగా గుండాల జలపాతం
* మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్
దండేపల్లి, డిసెంబర్ 11: గుండాల జలపాతాన్ని మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ది పర్చుతామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. గుండాల జలపాతం, ఊట్ల ఘాట్ రోడ్డును కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గుండాల జలపాతం పరిసర ప్రాంతాలను క్షుణంగా పరిశిలించిన కలెక్టర్ అటవీశాఖ అధికారుల నుండి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గుండాల గిరిజనులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ ప్రభుత్వం గుండాల జలపాతాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ది చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తానని, గిరిజనులు కూడ సహకరించాలని కలేక్టర్ సూచించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ది జరిగితే స్థానికంగా ఉండే గిరిజనులకు ఉపాధి దోరుకుందని,అలాగే అటవి ఉత్పత్తులు తయారి చేసి అమ్ముకోవచ్చన్నారు. జలపాతం చెక్ డ్యాం నిర్మాణం కోసం ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపిస్తామని వారు నివేధిక ఇవ్వగానే ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపుతామని కలేక్టర్ వివరించారు. ఊట్ల ఘాట్ రోడ్డులోని మూడవ మలుపులు అతి ప్రమాదకంగా ఉన్నాయని వాటికి రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన నిధుల గురించి తనకు వివరాలు అందజేయాలని ఐటిడిఏ అధికారులకు సూచించారు. గోడలకు రిటర్నింగ్ వాల్, సిసి రోడ్డు నిర్మాణం చేపడితే ప్రయాణికులకు బాగుంటుందని పలువురు కలేక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. కార్యక్రమంలో జన్నారం ఎఫ్‌డివో రవిందర్, ఆర్‌ఐ మోతిరాం, రెంజర్ దేవిదాస్, దండేపల్లి సర్పంచ్ అజ్మీర కిషన్ నాయక్,మార్కెట్ కమిటి మాజి ఉపాధ్యక్షుడు శేషగిరి రావు, గిరిజనులు పాల్గొన్నారు.

రక్తదానం చేసేందుకు యువత ముందుకురావాలి
* ఎంపి గెడం నగేష్
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 11: రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని, అన్నిదానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గెడం నగేష్ అన్నారు. అక్షయ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సంధర్భంగా ఎంపి గెడం నగేష్ మాట్లాడుతూ నేటి సమాజంలో ఎందరో మంది అత్యవసర సమయంలో రక్తం లభించకపోవడంతో మృత్యువాత పడుతున్నారని అన్నారు. అదే విధంగా రక్తహీనతతో ఎందరో మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రక్తదానం చేయడంలో యువత ముందుండాలని, యువజన సంఘాలు, స్వచ్చంద సంస్థల అధ్వర్యంలో రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహించి, రక్తం నిల్వలను పెంచాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో ఉపయోగపడుతుందని, నేటి యువత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. అక్షయ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 70 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అక్షయ ఫౌండేషన్ సభ్యులు భూపతిగౌడ్, పరుశురాంగౌడ్, చల్ల శ్రీనివాస్ రెడ్డి, లంక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బాబోయ్ చలి....
* జిల్లాను వణికిస్తున్నా చలి
* ఆకస్మికంగా ఉష్ణోగ్రత తగ్గుముఖం
మంచిర్యాల, డిసెంబర్ 11: మంచిర్యాల జిల్లాను చలి వణికిస్తుంది. జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రత పడిపోవడంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. రాత్రి ఏడు దాటిదంటే రోడ్లపై వెళ్లాలంటే జక్కుతున్నారు. ఉన్ని దుస్తులు ధరించిన చలికి వణుకుంటూ ఇండ్లలోకి చేరాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి ఏడు నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు బయటకు వెళ్లాలంటే ప్రజలంతా భయపడుతున్నారు. ఉదయం పూట విధులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. చలికాలంలో చిన్నారులు పాఠశాలకు వెళ్లాలంటే వణుకుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో మంట కాగుతూ రక్షణ పొందుతున్నారు. ఉదయం పూట దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు వాయిదా వేసుకుంటున్నారు. చలి యే కారణంగా దగ్గర ప్రాంతమైన బస్సులోనే వెళ్లాల్సి వస్తుందని ప్రజలు చెబుతున్నారు. కూలీలకు వెళ్లే వారి పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో దట్టమైన అడవులు, గుట్టల ప్రాంతం కావడంతో అత్యల్పంగా ఉష్ణోగ్రత నమోదవుతుందని నిపుణులు చెబుతున్నారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలో సాయంత్రం వేళ రోడ్లన్ని బోసిపోతున్నాయి. చాయ్ కోట్ల వద్ద రద్దీ కనిపిస్తుంది. ఉదయం పూట పని చేసే మున్సిపల్ కార్మికులు గజగజ వణుకుతూ రోడ్లను శుభ్రం చేస్తున్నారు. ఉదయం పూట ఇండ్లలోకి వచ్చి నిత్యావసర వస్తువులు అందించే వారు సైతం సమయ పాలనకు మించి రావాల్సివస్తున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఉష్ణోగ్రత 29 డిగ్రీలకు పడిపోవడం జరిగింది. జిల్లాలో 2011 లో 3. 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆకాశంలో మంచు పోరలు కమ్ముకున్నా రీతిలో చలి ఆవరించడంతో అప్పట్లో ప్రజలు గజగజ వణికారు. 2010- 2012 6. 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 2013 లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 2014లో 4 డిగ్రీలు నమోదు కాగా గతడేది అత్యల్పంగా 3.4 డిగ్రీలు నమోదు కాగా ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలోనే 9 డిగ్రీలకు పడిపోయింది. చలిని చూసి ప్రజలు బొంబేలెత్తుతున్నారు.

ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వం
* డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
దివ్యనగర్, డిసెంబర్ 11: రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ ఇప్పటికి విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని మండిపడ్డారు. మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కళ్లబొల్లి మాటలతో పబ్బం గడుపుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క ఉద్యోగాన్ని కూడా రెండున్నరేళ్లలో భర్తీచేయలేదన్నారు. ఇళ్లులేని వారికి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీనిచ్చినప్పటికి రాష్ట్రంలో ఏ ఒక్కరికి కట్టించకపోవడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ పబ్బం గడుపుతుందన్నారు. రుణమాఫీ సంపూర్ణంగా చేపట్టకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సరికెల గంగన్న, తక్కల రమణరెడ్డి, గంగారెడ్డి, పోశెట్టి, హైదర్, తదితరులు ఉన్నారు.

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం
* మహాజన పాదయాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నిర్మల్, డిసెంబర్ 11: ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని, సమస్యలు విస్మరిస్తే ప్రభుత్వంపై దండయాత్రకు వెనకాడేది లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సిపిఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఆదివారం రాత్రి నిర్మల్‌కు చేరుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. దొరల తెలంగాణ కాదు, ఎర్రజెండా తెలంగాణ కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మహాజన పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. ఈ పాదయాత్రను చూసి ప్రభుత్వం భయపడుతుందన్నారు. పాదయాత్రతో గ్రామాల్లో నెలకొన్న ఎన్నో సమస్యలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఐక్యంగా పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, ఇందుకోసం ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఇళ్లులేని వారికి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కటి కూడా నిర్మించలేదని, కెసిఆర్ మాత్రం 150 పడకలతో 50 కోట్ల ప్రజాధనంతో ఇళ్లు నిర్మించుకున్నాడని విమర్శించారు. ఆశా కార్యకర్తలు 106 రోజులు ఆందోళన కార్యక్రమాలు చేపడితే ఏఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు. కార్మికులు తమసమస్యలపై ఉద్యమిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని మండిపడ్డారు. ఆధ్యాత్మికతత పేరుతో ఆలయాలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెడుతూ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లిస్తున్నారని వాపోయారు. రైతుల రుణమాఫీ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో రైతులు రుణం కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమావేశంలో సి ఐటియు జాతీయ అధ్యక్షురాలు హేమలత, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
* ఎంపి బాల్క సుమన్
మంచిర్యాల, డిసెంబర్ 11: రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి పునరావాస కేంద్రాలైన చందనాపూర్, పడ్తనపల్లి, కర్ణమామిడి గ్రామాల సీసీ రోడ్లతో పాటు లింక్ రోడ్లను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామాలను కలిపేందుకు లింక్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు అనుసంధానం చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులందరికి పరిహారం అందిస్తామన్నారు. పునరవాస కేంద్రాలను అభివృద్ది చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే దివాకర్ రావు మట్లాడుతూ పునరవాస కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. చందనాపూర్ లింక్ రోడ్డు నిర్మాణానికి రూ. 50 లక్షలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. హాజీపూర్ నుంచి కర్ణమామిడికి వెళ్లే రహదారికి రూ. 2.30 లక్షలు, పడ్తనపల్లి రోడ్డు నిర్మాణానికి రూ. 2.05 లక్షలు నిధులు కేటాయించి పనులు చేపట్టడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బేర సత్యనారాయణ, వైస్ ఎంపిపి మందపల్లి శ్రీనివాస్, జడ్పిటిసి ఆశాలత, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రావు, వైస్ చైర్మన్ వంగ తిరుపతి, మండల పార్టీ అధ్యక్షులు దొమ్మటి సత్తయ్య, నాయకులు వెంకటేశ్వర్ రావు, పోషయ్య, శరత్ తదితరులు పాల్గొన్నారు.

మొన్న పులి.. నేడు చిరుత హతం
* అడవుల జిల్లాలో వన్యప్రాణులకు కరవైన రక్షణ
* వరస ఘటనలపై కేంద్ర పర్యావరణ శాఖ సీరియస్

ఆదిలాబాద్, డిసెంబర్ 11: అడవుల జిల్లాలో వరసగా వన్యప్రాణులు మృతి చెందుతున్న సంఘటన అటవీ శాఖలో అలజడి రేపుతోంది. అడవుల్లో వన్యప్రాణులే లక్ష్యంగా స్మగ్లర్లు వేటాడి హతమారుస్తున్న సంఘటనలపై ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సీరియస్‌గా స్పందించి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేయగా, వారం రోజుల్లోనే ఆదిలాబాద్ జిల్లాలో ఒక పెద్దపులి, చిరుతపులి మృతిచెందడంపై అధికారులు హడలెత్తిపోతున్నారు. రైతుల ముసుగులో పంట పొలాల రక్షణసాకుతో వేటగాళ్ళు యదేచ్చగా వన్యప్రాణులను వదిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ, వన్యప్రాణి విభాగం అధికారులు నిర్ధారించగా, రాత్రి వేళల్లో సంచరించే పులులు, వన్యప్రాణులను హతమార్చేందుకు వ్యూహాత్మకంగా కొందరూ స్మగ్లర్లు విష ఆహారం ప్రయోగించి పులుల కళేబరాలను, గోళ్లను, చర్మాన్ని ఇతర రాష్ట్రాల్లో భారీగా విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గోళ్లు, చర్మానికి నిషేధిత మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు ఆదిలాబాద్, మంచిర్యాల, కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌ల పరిధిలో వన్యప్రాణుల వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 3న కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోని కోటపల్లి మండలం పిన్నారం గ్రామ శివారులో మూడేళ్ల పులిని హతమార్చిన సంఘటనపై విచారణ జరిపించగా స్మగ్లర్లు వేటాడి హతమార్చినట్లు విచారణలో తేలింది. చెన్నూర్ డివిజన్‌లో నాలుగు సంవత్సరాల్లో మూడు పులులు చనిపోవడంపై నేషనల్ టైగర్ కన్జర్వేటీవ్ ఆథారిటీ అధికారులు సీరియస్‌గా స్పందించారు. గత నెల 22న కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని బెజ్జూర్ రేంజ్‌లో గల ఎట్టిగూడలో పులి చర్మాన్ని అధికారులు స్వాదీనం చేసుకోగా పులిని ఉద్దేశపూర్వకంగానే హతమార్చినట్లు కేసు విచారణలో బట్టబయలైంది. ఈ సంఘటనలో నిందితులను అటవీ అధికారులు అరెస్ట్ చేసి లోతుగా దర్యాప్తు సాగించారు. పంట రక్షణ కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి బెజ్జూర్ రేంజ్‌లో ఈ పులి చనిపోయినట్లు మంచిర్యాల జిల్లా అటవీ సంరక్షణ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో అటవీ ప్రాంతంలో కఠినమైన వన్యప్రాణి చట్టాలను ఉల్లంఘించి యదేచ్చగా మూగజీవాలను హతమారుస్తున్నట్లు తెలిసింది. దీంతో వైల్డ్ లైఫ్ కంట్రోల్ బ్యూరో అటవీ అధికారులను సంజాయిషీ కోరినట్లు సమాచారం. కోటపల్లి మండలంలో ఈనెల 3న పులి హతమైన ఘటనపై విచారణలో భాగంగా బీట్ ఆఫీసర్ అంజారి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నగేష్‌లను ప్రభుత్వం రెండు రోజుల కిందటే సస్పెండ్ చేయగా ఈ ఘటన మర్చిపోకముందే ఆదిలాబాద్ అటవీ డివిజన్ పరిధిలోని పెన్‌గంగా నదీతీరంలో తాంసికె గ్రామం బొర్లగుట్ట శివారులో చిరుతపులి మృతి చెంది ఉన్న సంఘటన అటవీ అధికారుల మెడకు ఉచ్చుబిగించింది. నెల రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతపులి తమ పంట పొలాలను ధ్వంసం చేయడమే గాక నాలుగు పశువులను చంపివేసి ఆహారంగా తిన్నట్లు రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. అయితే చిరుత సంచారంతో భయాందోళనలో ఉన్న కొంతమంది రైతులు ఉద్దేశపూర్వకంగానే చిరుతను హతమార్చేందుకు విష ప్రయోగం జరిపినట్లు తెలుస్తోంది. వీటి చర్మాన్ని, గోళ్లను తీసుకోకపోవడం, మూడు రోజులుగా చిరుత కళేభారం అక్కడే పడి ఉండడాన్ని భట్టి విష ప్రయోగం జరిగిందా..? లేదా పాముకాటుకు బలైపోయిందా అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. శవపంచనామాలో మాత్రం చిరుత కాలేయం దెబ్బతిని ఊపిరితిత్తులు పాడైపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తుండగా మూడేళ్ల ప్రాయంలో చలాకిగా ఉండాల్సిన చిరుత అకస్మాత్తుగా మృతి చెందడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు కవ్వాల్ అటవీ ప్రాంతంలో, ఉట్నూరు ఏజెన్సీ ఏరియాల్లో జింకలు, కుందేళ్లు, దుప్పిలు, తదితర వన్యప్రాణులను వేటాడి హతమారుస్తున్నట్లు తెలుస్తోంది. అటవీ అధికారులు ఈ వన్యప్రాణుల సంరక్షణకై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడం, స్మగ్లర్లపై కఠినమైన చట్టాలు ప్రయోగించకపోవడం వరసగా వన్యప్రాణులు బలైపోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ వన్యప్రాణి విభాగం అధికారులు కోటపల్లి, కవ్వాల్, తాడోబ, ఆదిలాబాద్ అటవీ డివిజన్‌లలో పర్యటించి వరస ఘటనలపై విచారణ జరపనున్నట్లు తెలిసింది.