అదిలాబాద్

తెల్లకాగితంపై తొలగనున్న నల్లమబ్బులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 21: గాడి తప్పిన నిర్వహణ.. భారమైన యంత్రాలు.. పేరుకుపోయిన అప్పులతో నాలుగేళ్ల కిందట మూతపడ్డ సిర్పూర్ పేపర్ మిల్లు పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోంది. పేపర్ మిల్లు పునరుద్ధరణపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) సానుకూలంగా తీర్పునివ్వడం, సుమారు 5వేలమంది కుటుంబాలకు ఉపాధిచూపిన పేపర్‌మిల్లును పునరుద్ధరించేందుకు జెకె యాజమాన్యం ముందుకు రావడం, ప్రభుత్వం పలు రాయితీలు కల్పించడంతో కార్మికుల కొత్త జీవితాల్లో వెలుగులురానున్నాయ. ఇప్పటికే జెకె యాజమాన్యం ఐడిబిఐ అప్పుల ఆర్థికపరమైన చర్చలు సైతం సఫలం కావడంతో మిల్లు పునరుద్ధరణ చర్యల నిమిత్తం నిపుణుల బృందం ఇటీవల పర్యటించి వెళ్ళగా ఎన్‌సిఎల్‌టి తీర్పు అనంతరం ఈనెల 23న ఢిల్లీ, ముంబైకి చెందిన ప్రతినిధుల బృందం మిల్లును సందర్శించనుంది. గత యాజమాన్యం ఐడిబిఐ, ఇతర బ్యాంకుల నుండి తీసుకున్న మొత్తం అప్పులు రూ.422 కోట్ల బకాయిలతోపాటు కార్మికులకు చెల్లించాల్సిన వేతన బకాయిలు, క్రెడిటర్స్ చెల్లింపులపై జెకె యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చల్లో అంగీకారం కుదరగా సర్కారు అందించే రాయితీలపైనే యాజమాన్యం పూర్తి ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వం ప్రకటించిన రాయితీల మేరకు పదేళ్ళపాటు పూర్తిగా జిఎస్టీ మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించగా, మరో పదేళ్ళపాటు ఒప్పందంలో భాగంగా సుబాబుల్, యూక ముడిసరకు కొనుగోళ్ళలో రాయితీలు కల్పించేలా జెకెతో అంగీకారం కుదిరింది. మూలధనం పెట్టుబడిలో 20 శాతం అంటే 50కోట్ల పరిమితి మేరకు ప్రభుత్వమే చెల్లింపు జరపనుంది. కొత్త పెట్టుబడులపై ఏటా 2శాతం చొప్పున ఐదేళ్ళపాటు వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పేపర్ మిల్లు కాగితపు ఉత్పత్తులను మార్కెట్ ధరపై ప్రభుత్వమే సరఫరా చేసేలా అనుమతి లభించింది. సంస్థ వ్యాపార కార్యకలాపాలన్నింటిపై స్టాంప్‌డ్యూటీతోపాటు అన్నిరకాల పన్నులను మినహాయించేలా రాయితీ ప్రకటించింది. పరిశ్రమకు గుదిబండగా మారిన విద్యుత్ బిల్లులో భారీఎత్తున రాయితీలు కల్పించగా మూడేళ్ళపాటు యూనిట్‌కు రూ.3చొప్పున విద్యుత్ రాయితీ అందించనున్నారు. పదేళ్ళపాటు విద్యుత్ పన్ను రద్దుచేసేందుకు ఒప్పందం కుదిరింది. ఆర్థికపరమైన అంశాల్లో బ్యాంకుల నుండి అప్పులపై సానుకూలమైన పరిణామాలు రావడంతో కొత్తగా పరిశ్రమను తెరిచేందుకు యాజమాన్యం సన్నద్దమవుతోంది. అయితే దేశంలోనే పేపర్‌మిల్లుకు పేరున్న సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఇంతకుముందు 1675 మంది శాశ్వత కార్మికులు, 1920 ఒప్పంద కార్మికులు, 565 మంది స్ట్ఫా ఉద్యోగులు పనిచేయగా, పరోక్షంగా 5వేల మందికి ఉపాధి లభించింది. మిల్లు కార్మికుల కోసం 50 ఏళ్ళ కిందట బిర్లా కంపెనీ నిర్మించిన నివాస గృహాలు, కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 1500 క్వార్టర్లకు నాలుగేళ్ళ నుండి విద్యుత్ సరఫరా నిమిత్తం రూ.53కోట్ల బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. మిల్లు పునరుద్ధరణ కోసం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నాలుగేళ్ళుగా పడుతున్న శ్రమకు ఫలితం దక్కడంతో రెండు నెలల్లోనే ప్రయోగాత్మకంగా మిల్లు తెరుచుకొని ఉత్పత్తి ప్రారంభించనుంది. అయితే భారీ యంత్రాలు తుప్పుపట్టిపోవడం, మరికొన్ని పనిచేసే స్థితిలో లేకపోవడంతో వాటి స్థానంలో ఆధునిక యంత్రాలను తెప్పించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మిల్లులో రూ.7కోట్ల విలువైన సిఎల్‌వో2 యూనిట్, ఎస్‌ఆర్ ప్లాంట్‌ను కొత్తగా బిగించి భారీ స్థాయిలో కాగితపు ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలను ప్రతినిధులు పరిశీలించనున్నారు. నాలుగేళ్ళ కిందట దీర్ఘకాలిక షట్‌డౌన్ పేరిట కాగితపు ఉత్పత్తి నిలిచిపోగా నల్లమబ్బులు తొలిగిపోయి పూర్వవైభవం దిశగా అడుగులు పడుతుండడంతో కార్మిక కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.