అదిలాబాద్

సమస్యల పరిష్కారం కోసమే ప్రజాఫిర్యాదుల విభాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్ రూరల్, మే 2: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. సోమవారం డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాఫిర్యాదుల విభాగంలో పాల్గొని ఆయా మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు ఓపికతో విని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజాఫిర్యాదుల విభాగంలో తమకు వచ్చిన ఆర్జీలను ఆయా శాఖలకు అందచేస్తామన్నారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇదిలా ఉండగా ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డివిజన్ నలుమూలల నుండి ఆర్జీ దారులు పెద్ద సంఖ్యలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. గుడ్లబోరి చెరువుకింద ముంపుకు గురైన రెండెకరాల భూమికి సంబందించిన నష్టపరిహారం ఇప్పించాలని కౌటాల మండలం విజయనగరంకు చెందిన బండ శౌర్య కోరారు. సాగుచేసుకుంటున్న భూమికి హక్కు పత్రాలు ఇవ్వాలని రెబ్బెన మండలం పిర్సింగుల బాణయ్య, సిర్పూర్ మండలానికి చెందిన కొలాంగుడ గ్రామస్థులు వెంపెల్లి వరకు రోడ్డు వేయించాలని, సొంత భూమిలో అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లను తొలగించాలని కోరుతూ రెబ్బన మండలం వంకులం గ్రామానికి చెందిన జాడి రాజారాం తదితరులు ప్రజాఫిర్యాదుల విభాగంలో ఆర్జీలు సమర్పించారు.

ఆదిలాబాద్‌ను కరవు జిల్లాగా ప్రకటించాలి
ఉట్నూరు, మే2: ఆదిలాబాద్ జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో సోమవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సంధర్భంగా బిజెపి జాతీయ కార్యదర్శి గుగ్లావత్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టమ్రంతా కరవుతో అల్లాడుతుండగా ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రివర్గ సభ్యులు చోద్యం చూస్తున్నారని అన్నారు. కరవు కోరల్లో ప్రజలు, రైతులు అల్లాడుతుంటే ప్లీనరి పేరుతో జల్సాచేస్తున్నారని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో గుక్కెడు తాగునీరు అందకా గ్రామీణ ప్రాంత ప్రజలు కిలోమీటర్ల దూరం మేరకు నీళ్ల కోసం నడుస్తూ వెళ్తున్నా ప్రభుత్వం కాని.. అధికారులు కాని చర్యలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి మండలానికి రూ. 5కోట్లను కరవు నిధిగా మంజూరు చేయాలన్నారు. ఆడంబరానికి, ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్న కెసి ఆర్ ప్రజా సంక్షేమంవైపు దృష్టిసారించాలని అనంతరం ఆర్డీవో ఐలయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నేతలు ప్రభాకర్, రాంచందర్, కొండేరి రమేష్, దేవిదాస్, భీమన్న, శ్రీకాంత్, రవీందర్, బండారి పోశన్న తదితరులు పాల్గొన్నారు.

ఎసిబి వలలో దహెగాం తహశీల్దార్
కాగజ్‌నగర్, మే 2: అవినీతి నిరోధక శాఖ వలలో దహెగాం తహశీల్దార్ విశ్వంబర్ చిక్కారు. ఒక రైతు నుండి 15వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా ఎసిబి అధికారులు సోమవారం కాగజ్‌నగర్‌లో పట్టుకున్నారు. దహెగాం మండలం చేడ్వాయి గ్రామానికి చెందిన రైతు బోయిరే సోమయ్య నుండి 15వేల రూపాయలను కాగజ్‌నగర్ పట్టణంలోని హనుమాన్ మందిర్ సమీపంలో రోడ్డుమీదే తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కాడు. చేడ్వాయి గ్రామ సమీపంలో తనకు గల రెండేకరాల భూమిని తనపేరుపై పట్టా, పాస్‌బుక్ ఇప్పించాలని బోయిరే సోమయ్య, దహెగాం తహశీల్దార్ విశ్వంబర్‌ను కోరారు. గత నాలుగు నెలల నుండి తహశీల్దార్ తిప్పించుకుంటుండడంతో సోమయ్య ప్రాదేయపడగా తనకు 15వేల రూపాయలను లంచంగా ఇస్తేనే పట్టాదారు, పాస్‌బుక్కును ఇస్తానని తహశీల్దార్ తెలిపారు. దీంతో విసుగుచెందిన సోమయ్య ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. అధికారులు కోరిన విదంగా సోమయ్య, కాగజ్‌నగర్‌లో తహశీల్దార్‌కు 15వేలు ఇస్తుండగా, అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఉదయం పూట తహశీల్దార్ పట్టణంలోని ఎస్పీం మైదానానికి వాకింగ్‌కని బయలుదేరాడు. వాకింగ్‌నుండి తిరిగివస్తుండగా తనకు మార్గమద్యంలో డబ్బు అందచేయాలని తహశీల్దార్ కోరడంతో ముందుగా వేసుకున్న పథకం ప్రకారంగా సోమయ్య, తహశీల్దార్ విశ్వంబర్‌కు మందిర సమీపంలో రోడ్డుపైనే 15 వేల రూపాయలను అందచేస్తుండగా ఎసిబి డీ ఎస్పీ పాపాలాల్, సి ఐలు వేణుగోపాల్, కాశయ్యలు దాడిచేసి పట్టుకున్నారు. అనంతరం తహశీల్దార్‌ను కాగజ్‌నగర్ పట్టణంలోని బాలాజీనగర్‌లోని తన ఇంటికి తీసుకెల్లి విచారించారు. రికార్డుల పరిశీలన, మరింత విచారణ కోసం తహశీల్దార్‌ను దహెగాంలోని తహశీల్దార్ కార్యాలయానికి తీసుకెల్లి విచారించిన అనంతరం తహశీల్దార్‌ను హైద్రాబాద్‌కు తరలించారు.

ఆసరా పింఛన్ బిల్లుల చెల్లింపులో జాప్యం వద్దు
కలెక్టర్ జగన్మోహన్
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మే 2: ఆసరా పింఛన్ల ద్వారా లబ్దిపొందుతున్న పింఛన్‌దారులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా సకాలంలో చెల్లింపులు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ 60, 70 సంవత్సరాల వృద్దుల చేతివేళ్లు నునుపుగా ఉండడం వలన గుర్తించుటకు వీలుకాక పింఛన్ అందడం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని, వారి కోసం జిల్లాలో 45 ఐరీష్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా వృద్దుల కనుపాపలు స్కాన్ చేసి ఇకపై ఎటువంటి ఆటంకం కల్గకుండా పింఛన్ అందించే అవకాశం కల్గుతుందన్నారు. పింఛన్ చెల్లింపులు పోస్ట్ఫాసుల ద్వారా సాయంత్రం కాకుండా ఉదయమే చేయాలని, అందుకు వీలుగా వారికి నగదును ముందుగా అందించేందుకు బ్యాంకులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అంతేగాక క్యాష్ లిమిట్‌తో పనిలేకుండా పోస్ట్ఫాసులకు పింఛన్ చెల్లింపులు చేయాలని, అవసరమైన నగదు ఇచ్చే ఏర్పాట్ల చేయాల్సిందిగా లీడ్‌బ్యాంక్ అధికారిని ఆదేశించారు. పోస్ట్ఫాసులో ఖాళీల వివరాలు ఇవ్వాలని, వాటి భర్తీ కొరకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని, ఖాళీలు ఉన్నచోట పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహించి నగదు చెల్లింపులు చేస్తారన్నారు. మూడు నెలల్లో ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ పూర్తి అవుతుందని, అప్పటి వరకు మాన్యువల్ ద్వారా చెల్లింపు చేస్తామన్నారు. జిల్లాలో ఈ ఎన్‌టి లోపంతో ఉన్న 735 మందికి సదరన్ క్యాంపులు ఏర్పాటు చేసి ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉందని, ఆడియాలజిస్టుల కొరత, పరీక్ష చేసే మిషన్ ఆదిలాబాద్‌లో ఒక్కటే ఉన్నందునా రోజుకు ఏడుగురికి మాత్రమే పరీక్ష చేసే వీలుందని డాక్టర్లు కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ డివిజన్లలో క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షలు చేసి అర్హత కలిగిన వారిని గుర్తించి జిల్లా కేంద్రానికి పంపాలని, అందుకు సిబ్బంది అవసరమైతే రోజువారి చెల్లింపు పద్దతిలో రిటైర్డ్ డాక్టర్లను కాని, ఇతరులను కాని నియమించాలన్నారు. సమావేశంలో సిఈవో జితేందర్ రెడ్డి, డిఆర్‌డిఏ పిడి అరుణకుమారి, రిమ్స్ డైరెక్టర్ అశోక్, డిఎంఆండ్‌హెచ్‌వో జలపతి నాయక్, డిసిహెచ్‌ఎస్ చంద్రవౌళి, పోస్టు ఆఫీసు అధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

తోడేళ్ల దాడిలో 16 గొర్రెల మృతి
జన్నారం, మే 2: మండలంలోని బాదన్‌పెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చిందలపెల్లి గ్రామంలో సోమవారం తెల్లవారు జామున రైతు కనకయ్యకు చెందిన గొర్రెల పాకపై తోడేళ్లు దాడి చేయడంతో 16 గొర్రెలు మృతి చెందగా, 4 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. బాధితుని కథనం ప్రకారం తన గొర్రెలను ఆదివారం రాత్రి పాకలోకి పంపగా సోమవారం తెల్లవారు జామున తోడేళ్లు దాడి చేశాయని, అరుపులు విని బయటకు వచ్చే సరికి గొర్రెలు మృతి చెంది ఉన్నాయన్నారు. ఈ దాడిలో సుమారు లక్ష వరకు నష్టం వాటిల్లిందని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు. కాగా గ్రామ సర్పంచ్ కాసెట్టి నాగలక్ష్మి మాట్లాడుతూ వన్యప్రాణుల నుండి గ్రామస్తులకు ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారని, ప్రభుత్వం కవ్వాల్ అభయారణ్య ప్రాంతంగా ఏర్పాటు చేయడంతో వన్యప్రాణుల సంఖ్య పెరిగిందన్నారు. వన్యప్రాణుల నుండి ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి గ్రామ శివారులోని అటవీ ప్రాంతం చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని, అదే విధంగా తోడేళ్ల దాడిలో నష్టపోయిన రైతు కనకయ్యను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అంగన్‌వాడీ భవన నిర్మాణాల్లో అలసత్వం సహించేది లేదు
అధికారులకు కలెక్టర్ హెచ్చరిక
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మే 2: జిల్లాలో అంగన్‌వాడీ, పంచాయతీ భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసి ఏళ్లు గడుస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయని, జూన్ 30 గడవులోగా నిర్మాణాలను పూర్తిచేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లాకలెక్టర్ ఎం.జగన్మోహన్ హెచ్చరించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో అంగన్వాడీ, పంచాయతీ భవన నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ జగన్మోహన్ సమీక్షించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే గ్రామాల్లో అసంపూర్తిగా పనులు సాగుతున్నాయని, ఈ విషయంలో ఇక ఏమాత్రం ఊపేక్షించబోమని హెచ్చరించారు. నాబార్డు ద్వారా 90 అంగన్వాడీ భవనాలు, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద డ్వామా ద్వారా 208 గ్రామపంచాయతీ భవనాలకు నిధులు మంజూరి అయ్యాయని, అయితే అధికారులు తమ బాధ్యతలను విస్మరించడం వల్ల పనులు పూర్తికాక అద్దె భవనాల్లోనే నడపాల్సి వస్తోందని అన్నారు. ఇందుకు డ్వామా, పంచాయతీరాజ్ ఎస్‌ఈలు బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జెసి సుందర్ అబ్నార్, డి ఆర్‌వో సంజీవరెడ్డి, పిఆర్‌ఏ శంకర్, డ్వామా పిడి శ్రీనివాస్, డిపివో పోచయ్య, ఐసిడిఎస్ పిడి వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.

ప్రజా దర్బార్‌కు హాజరుకాకుంటే కఠిన చర్యలు
ఉట్నూరు, మే 2: గిరి దర్బార్‌కు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అధికారులను హెచ్చరించారు. గిరి దర్బార్‌లోభాగంగా సోమవారం ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సంధర్భంగా అధికారులతో గతంలో వచ్చిన ఆర్జీలపై సమీక్షించారు. అనంతరం పివో మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రజా ఫిర్యాదులు ఎన్ని వచ్చాయని, వాటిలో పరిష్కరించిన వాటి వివరాలు ఇవ్వాలని అన్నారు. కొంత మంది అధికారులు దర్బార్‌కు హాజరుకావడం లేదని,అటువంటి వారిపై శాఖపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే గిరిజనుల్లో ప్రజా ఫిర్యాదు విభాగంపై నమ్మకం సన్నగిల్లుతుందని, నమ్మకాన్ని పెంచే విధంగా సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిడి రాంమూర్తి, అడిషనల్ డిఎంఅండ్ హెచ్‌వో ప్రభాకర్ రెడ్డి, ఆర్డీవో ఐలయ్యతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
అంబలి ఆరోగ్యానికి ఎంతో మంచిది
అంబలి సేవించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అన్నారు. సోమవారం ఐటిడిఏ ప్రాంగణంలో అంబలి పంపిణీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భంగా ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చిన గిరిజనులందరికి స్వయంగా అంబలిని అందజేశారు. అనంతరం పివో మాట్లాడుతూ గతంలో చాలా మంది అంబలి సేవించే ఉదయానికి స్వాగతం పలికేవారని, తద్వారా వారు ఆరోగ్యంగా ఉండే వారని అన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో ప్రతి ఒక్కరు అంబలి సేవించడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్కారం సర్పంచ్ మర్సుకోల తిరుపతి, అధికారులు శ్రీరాంమూర్తి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరవు సమస్యలపై కదం తొక్కిన బిజెపి
రైతులను ఆదుకోవాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మే 2: వర్షాభావం, పంటల దుర్భిక్షంతో అల్లాడుతున్న కరవు రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకొని జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బిజెపి అధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అందోళనలు నిర్వహించారు. పలు మండల ఆఫీసుల ఎదుట ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బిజెపి నేతలు నినాదాలు చేస్తూ తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మాట్లాడుతూ రైతుల రుణమాఫీ అమలుకాక, మరోవైపు పంటలు పండక రైతులు అప్పుల ఊబీలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహారిస్తున్నారని విమర్శించారు. జిల్లా అంతటా కరవు చాయలు అలుముకొని రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో మధ్యదళారులను ఆశ్రయిస్తున్నారని, కరవు జిల్లాగా ప్రకటించకపోగా రైతులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. వేసవిలో తాగునీటి సమస్యను తీర్చడం లేదని, నిధుల కొరతతో పంచాయతీ పాలన అస్తవ్యస్థంగా మారిందని, గిరిజన గ్రామాల్లో తాగునీరు దొరక్క ప్రాణాలు కోల్పోవల్సిన పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కరవు జిల్లాగా ప్రకటించడంలో కృషి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ ఏడాది సాధారణ వర్షాపాంతం కంటే 20 శాతం లోటు ఏర్పడిందని, దీంతో రైతులు తీవ్రంగా పంటలను నష్టపోవాల్సి వచ్చిందన్నారు. అదే విధంగా భూగర్భజలాలు అడుగంటి పోవడంతో జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందన్నారు. వేసవికి ముందే నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం, అధికారులు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడంతోనే నేడు ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. మారుమూల గ్రామాల ప్రజలు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నుండి నీటిని తెచ్చుకుంటుంటే అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని 384 గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, వారికి కనీసం తాగడానికి సైతం నీరు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో అరకొరగా సరఫరా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. అదే విధంగా పశువులకు పశుగ్రాసం, తాగునీరు దొరకకపోవడంతో అల్లాడిపోతున్నాయని, పాడిపరిశ్రమపై ఆధారపడే రైతులు పశువులను కాపాడుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో కళేబారాలకు అమ్ముకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం పశువుల కోసం పశుగ్రాసం, తాగునీటి తొట్టెల్లో నీటిని నింపేందుకు చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి దుస్థితి నెలకొందన్నారు. రాబోయే రోజుల్లో పశుసంపద పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించడంతో పాటు ఒకేసారి రుణమాఫీ చేసి అప్పుల ఊబీలో కూరుకుపోయిన రైతన్నను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం యుద్దప్రాతిపదికన తాగునీటి ఎద్దడి గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, చెడిపోయిన బోర్లను మరమ్మత్తులు చేయించాలని అన్నారు. అదే విధంగా ఉచితంగా రైతులకు పశుగ్రాసం విత్తనాలు అందించడంతో పాటు నీటి తొట్టెల్లో నీటిని నింపడానికి ట్యాంకర్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ చిట్యాల సుహాసిని, మాజీ జడ్పీటీసీ మడావి రాజు, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురేష్ జోషి, జోగురవి, విజయ్‌సింగ్ షేకావత్, గందె రవికుమార్, ఆకుల ప్రవీణ్, గందె కృష్ణాకుమార్, ఆదిలాబాద్, జైనథ్, బేల, తలమడుగు, తాంసి, ఇచ్చోడ మండలాలకు చెందిన బిజెపి అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజా ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలి
కలెక్టర్ జగన్మోహన్
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్,మే2: డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులపై అధికారులు జవాబుదారితనంతో సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగం నిర్వహించగా కలెక్టర్ పాల్గొని ఆర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అంతకు ముందు నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదు దారులు నేరుగా తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. సమస్యలపై కలెక్టర్ స్పందిస్తూ డయల్ యువర్ కలెక్టర్ ద్వారా అందిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గత వారం నాటికి అందిన ఫిర్యాదులు, పరిష్కరించిన ఆర్జీలపై శాఖల వారీగా జిల్లా రెవెన్యూ అధికారి సమీక్షించారు. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ ఆర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సంధర్భంగా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి వారి సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ఫిర్యాదు దారులు ప్రజావిభాగానికి వస్తుంటారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా అధికారులు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు ప్రతి రోజు మండల అధికారులతో తాగునీటి సమస్యలపై సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సంధర్భంగా తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్వర్యంలో ముద్రించిన ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యపై గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, స్టడీమెటీరియల్, మధ్యాహ్న భోజన పథకం, అర్హులైనవారందరికి ఉపకార వేతనాలు, బస్సు పాసులు వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెసి సుందర్ అబ్నార్, జిల్లా రెవెన్యూ అధికారి సంజీవరెడ్డి, జడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, డిఈవో సత్యనారాయణ రెడ్డి, డిపివో పోచయ్య, కలెక్టరేట్ ఏవో ఆరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.