అదిలాబాద్

ఓటరు తీర్పు.. స్ట్రాంగ్‌రూంలో భద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 8: శాసనసభ ఎన్నికల పోలింగ్ అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు శుక్రవారం అర్ధరాత్రికి జిల్లా కేంద్రాలకు సురక్షితంగా చేరుకున్నాయి. వివిధ పోలింగ్ స్టేషన్‌లలో ఎన్నికల విధులు నిర్వర్తించిన పోలింగ్ సిబ్బంది భారీ బందోబస్తు నడుమ ఎన్నికల యంత్రాంగం ఏర్పాటుచేసిన వాహనాల్లో రాత్రి ఆదిలాబాద్ జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 460 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే ముగియడంతో ఓటరు తీర్పు నిక్షిప్తమైన ఈవీఎంలతో పాటు వివి ప్యాట్‌లతో సిబ్బంది జిల్లా కేంద్రంలోని డిటిటిసి శిక్షణ కేంద్రానికి తరలిరాగా పోలీసులు భారీ బందోబస్తు నడుమ వాటిని స్ట్రాంగ్‌రూంల్లోకి చేర్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌రూంలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు సంబంధించి ఓటింగ్ జరిగిన యంత్రాలను భద్రపర్చగా అనంతరం స్ట్రాంగ్‌రూంలకు జిల్లా పరిశీలకులు సురేందర్ కుమార్ బగ్డె, కలెక్టర్ దివ్యదేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌లు దగ్గరుండి సీల్ వేశారు. అనంతరం జిల్లా ఎస్పీ విష్ణు మాట్లాడుతూ స్ట్రాంగ్‌రూంల్లో ఈనెల 11వ తేదీ వరకు ఎవరిని అనుమతించేది లేదని, అక్కడ ప్రత్యేక పోలీసు బలగాలను బందోబస్తు కోసం నియమించడం జరిగిందన్నారు. ఈనెల 11వ తేదీ వరకు అక్కడే ఈవీ ఎంలను ఉంచి అనంతరం ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు.
పోలింగ్ సిబ్బందికి బాసటగా నిలిచిన కలెక్టర్
వివిధ మారుమూల ప్రాంతాల నుండి పోలింగ్ విధులు నిర్వర్తించుకొని జిల్లా కేంద్రానికి చేరుకున్న పోలింగ్ సిబ్బందికి ముఖ్యంగా మహిళా సిబ్బందికి జిల్లా కలెక్టర్ దివ్య దగ్గరుండి శుక్రవారం అర్ధరాత్రి అన్ని ఏర్పాట్లు చేశారు. డిటిటిసి కేంద్రం నుండి బస్టాండ్ వరకు రెండు కిలోమీటర్ల దూరం నడిచివెళ్ళకుండా సిబ్బందికి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలను అందుబాటులో ఉంచారు. వారు వెళ్ళేగ్రామాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ ద్వారా బస్సులు వేయించి గమ్యస్థానాలకు పంపించారు. రాత్రి వేళ సిబ్బందికి భోజనం ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు.

స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్
* భారీ పోలీస్ బందోబస్తు
మంచిర్యాల, డిసెంబర్ 8: మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజక వర్గాలలోని 698 పోలీంగ్ కేంద్రాలలో ఓటర్లు వినియోగించుకున్న ఈవీఎం, వీవీ ప్యాట్‌ల మిషిన్‌లను జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటి యార్డ్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో భద్ర పరిచారు. శనివారం స్ట్రాంగ్‌రూమ్‌లను జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరితో పాటు సిపి సత్యనారాయణతో కలిసి సందర్శించారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు ప్రత్యేక సిబ్బందితో స్ట్రాంగ్ రూమ్‌లలో ఏర్పాటు చేశారు. ఈవీఎంల భద్రతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలను భారీగా మోహారించారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రత్యేక ఫైర్ వాహానాన్ని కూడా అందుబాటులో ఉంచారు. స్ట్రాంగ్ రూమ్‌లలో భద్ర పరిచిన ఈవీఎం, వీవీ ప్యాట్ యంత్రాల రూమ్‌ను మూసివేసి ప్రత్యేకంగా సీజ్ చేశారు.

ఉరకలేసిన ఓటు హక్కు
* కుమురంభీం జిల్లాలో అత్యధికంగా 86 శాతం ఓటింగ్
* మంచిర్యాలలో 72.74% నమోదు
* మారుమూల ప్రాంతాల్లోనూ వెల్లివిరిసిన చైతన్యం

ఆదిలాబాద్, డిసెంబర్ 8: అసెంబ్లీ ఎన్నికల పోరు రాజకీయ వేడిని రాజేయగా మరోవైపు ఓటు హక్కు వినియోగంలోనూ యువతరం ఉరకలేసి ఉద్యమంలా ఓటెత్తారు. కొత్తగా నమోదైన ఓటర్లు ఉత్సాహంగా ఉదయం పూటనే తమ తొలి ఓటును వినియోగించుకోగా, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఓటర్లు ఈసారి విలక్షణంగా పట్టణ ఓటర్లకంటే అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ తీర్పు నిక్షిప్తం చేశారు. పలు గ్రామాల్లో రాత్రి 8 గంటల వరకు ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్ ప్రక్రియలోనూ ఆలస్యం జరిగింది. బెజ్జూర్ మారుమూల మండలంలో ఊహించని రీతిలో ఈసారి 93.5శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యమే పైచేయిగా చాటిచెప్పారు. నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే కుమురంభీం జిల్లాలో అత్యధికంగా 85శాతం పోలింగ్ జరగగా అతి తక్కువగా మంచిర్యాల జిల్లాలో 72శాతం ఓటు హక్కు నమోదైంది. జిల్లాలో తొలిసారిగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల సిబ్బంది, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అర్ధరాత్రి వరకు జిల్లా కేంద్రాలకు ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ సామాగ్రి భారీ బందోబస్తు మధ్య తరలిరాగా శనివారం స్ట్రాంగ్ రూంల్లో ఎన్నికల పరిశీలకులు కలెక్టర్, ఎస్పీల సమక్షంలో ఈవీ ఎంలను భద్రపర్చారు. మారుమూల గ్రామాల్లో కొన్ని చోట్ల పోలింగ్ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. శనివారం తెల్లవారుజాము వరకు గ్రామాలు, పోలింగ్ బూత్‌ల వారీగా ఓటింగ్ శాతాన్ని క్రోడికరించి ఎన్నికల కమిషన్‌కు అధికారులు పంపించారు.
కుమురంభీం జిల్లాలో అత్యధికంగా 86 శాతం నమోదు
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పోలింగ్ ఘట్టం ప్రశాంతంగా ముగియగా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐదు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల్లోనే ఓటింగ్ శాతం భారీగా నమోదు కావడం విశేషం. ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 1,86,311 మంది ఓటర్లకుగాను 1,60,214 మంది అంటే 86 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే జిల్లాలోని సిర్పూర్‌టి నియోజకవర్గంలో 85.93శాతం ఓటింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలో 1,90,934 మంది ఓటర్లకు గాను 1,64,073 మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. బోథ్ నియోజకవర్గంలో 1,82,977 మంది ఓటర్లకు గాను 1,56,243 మంది అంటే 85.29 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్‌లో 2,01,39 మంది ఓటర్లకుగాను 1,63,320 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ 81.64శాతం ఓటింగ్ నమోదైంది. నిర్మల్‌లో 2,16,779 మంది మొత్తం ఓటర్లు ఉంటే 1,71,540మంది అంటే 79.13శాతం ఓటింగ్ నమోదైంది. ముథోల్ నియోజకవర్గంలో 2,16,784 మంది ఓటర్లకుగాను 1,82,132 మంది 84.02 శాతం ఓటింగ్ నమోదైంది. ఖానాపూర్ నియోజకవర్గంలో 1,87,893 మంది ఓటర్లకు గాను 1,47,353 మంది ఓటర్లు అంటే 78.42శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో 80.40శాతం, బెల్లంపల్లి నియోజకవర్గంలో 82.23శాతం, మంచిర్యాలలో అత్యల్పంగా 72.74 శాతం ఓటింగ్ నమోదైంది. గత 2014 ఎన్నకలకంటే ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం చూస్తే ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసినట్లు స్పష్టమవుతోంది.

మంచిర్యాల జిల్లాలో 78.72శాతం పోలింగ్
మంచిర్యాల, డిసెంబర్ 8: జిల్లాలో 78.74 శాతం పోలింగ్ నమో దైంది. జిల్లావ్యాప్తంగా 5 లక్షల 44 వేల 108 మంది ఓటర్లు ఉండగా, 4లక్షల 28 వేల 337మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో 2లక్షల 27వేల మంది ఓటర్లకుగాను, లక్షా 66వేల 093 మంది ఓటర్లు ఓటు వేశారు. నియోజకవర్గంలో 73.17 శాతం ఓట్లు పోలయ్యాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో లక్షా 52వేల 905 మంది ఓటర్లకుగాను లక్షా 27వేల 067మంది ఓటర్లు ఓట్లు వేశారు. నియోజకవర్గంలో 83.10శాతం ఓట్లు పోలయ్యాయి. చెన్నూర్ నియోజకవర్గంలో లక్షా 64వేల 203మంది ఓటర్లు ఉండగా, లక్షా 35 వేల 177మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో 82.32 శాతం ఓట్లు పోలయ్యాయి.

పోలింగ్ సరళిపై పోస్టుమార్టం
*భారీ పోలింగ్ లాభించేది ఎవరికో? *అంతుచిక్కని ఓటర్ల నాడి
ఆసిఫాబాద్, డిసెంబర్ 8: నిన్నటి వరకు ఎన్నికల పోరులో బిజీబిజీగా ఉన్న అభ్యర్ధులు శనివారం పోలింగ్ సరళిపై పోస్టుమార్టం నిర్వహించారు. శుక్రవారం సాయత్రం పోలింగ్ ప్రక్రియ ముగియడంతోనే ఇండ్లకు చేరుకొని సేద తీరిన ఆయా పార్టీల అభ్యర్థులు, మరుసటి రోజైన శనివారం ఉదయం నుండే ముఖ్య నేతలతో సమావేశమై గెలుపోటములపై విశే్లషణలు జరిపారు. పెరిగిన పోలింగ్ శాతం వల్ల లాభపడేదెవరు ? నష్టపోయెదెవరనే కోణంలో చర్చలు సాగించారు. జనరల్ నియోజక వర్గమైన సిర్పూర్‌లో 85.4 శాతం పోలింగ్ నమోదైంది. ఈనియోజక వర్గంలో 190934 మంది ఓటర్లుండగా, వీరిలో 164073 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆసిఫాబాద్ నియోజక వర్గంలో 1,86311 మంది ఓటర్లుండగా 86 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలకంటే అధికంగా 160214 ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈనేపథ్యంలో పెరిగిన ఓట్ల శాతం ఎవరికి లాభిస్తుందనే చర్చ రెండు నియోజక వర్గాల్లో జోరందుకుంది. మారు మూల ప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రెట్టించి ఉత్సాహంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెరిగిన ఓట్ల శాతంపై రెండు నియోజక వర్గాల్లోని అభ్యర్థులు బూత్‌ల వారీగా లెక్కలు వేసుకోవడం కనిపిస్తోంది. మండలాల వారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభ్యర్థుల ఇండ్లకు చేరుకున్నారు. వీరితో సమావేశమైన ఎమ్మెల్యే అభ్యర్థులు మండలాల వారీగా పోలింగ్ సరళిపై ఆరా తీశారు. నమోదైన పోలింగ్ పర్సెంటేజీపై అధికార పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన పథకాలకు ఆకర్శితులయ్యే ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు చేరుకున్నారని అధికార పార్టీ భావిస్తోంది. దీన్ని కొట్టిపారేస్తున్న విపక్షాలు భారీగా నమోదైన పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొంటున్నారు. పైకి ధీమా వ్యక్తం చేస్తున్న వీరికి లోన మాత్రం గెలుపుపై ఎక్కడో ఓ చోట ఆందోళనే కనిపిస్తోంది. గిరిజన నియోజక వర్గమైన ఆసిఫాబాబాద్ విషయానికొస్తే ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తున్న టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిఎస్పీ పార్టీ అభ్యర్థులు సామాజిక వర్గాల వారీగా తమకు వచ్చే ఓటింగ్‌పై లెక్కలు వేసుకోవడం కనిపించింది. ప్రత్యర్థుల ఓటు బ్యాంకులో చీలిక వస్తే గెలుపు ఈజీ అవుతుందనే భావన అటు కాంగ్రెస్, ఇటు టిఆర్‌ఎస్ అభ్యర్థుల్లో కనిపించింది. అదే విధంగా హోరాహోరీగా సాగిన సిర్పూర్ నియోజక వర్గంలోనూ గెలిచేది ఎవరనేదానిపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ప్రధాన పోటీ అధికార టిఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే నెలకొనగా, ఇక్కడ నమోదైన భారీ పోలింగ్ శాతం ఎవరి కొంపలు ముంచుయాతో తెలియకుండా మారింది. మొదటి నుండి అందరూ అనుకుంటున్నట్లుగా బిజెపి అభ్యర్థి ఒట్లు రాబట్టుకోలేక పోవడం అధికార పార్టీకి కలిసొచ్చే అంశమనే చెపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మునుపెన్నడూ లేని రీతిలో ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఓటర్లు ఎటువైపుమొగ్గు చూపుతారో తెలియకుండా మారింది. గతానికి భిన్నంగా ఓటర్లు గుంభనంగా వ్యవహరించడం రెండు నియోజక వర్గాల్లో బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొందనే చెప్పవచ్చు. పార్టీల వారీగా అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి మండలాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నా ఓటు నాడి అంతుబట్ట జుట్టుపీక్కుంటున్నారు.

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం
* కౌంటింగ్ కేంద్రాలను సందర్శించిన రామగుండం సిపి
మంచిర్యాల, డిసెంబర్ 8: మంచిర్యాల జిల్లాపరిధిలోని మూడు నియోజక వర్గాల పరిధిలోని ప్రతి పోలీంగ్ స్టేషన్ నుండి ఈ వీ ఎం, వీవీ ప్యాట్‌లను జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గా రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణ తెలిపారు. భద్రత ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. శనివారం స్ట్రాంగ్ రూమ్‌లను డిసిపి వేణుగోపాల్ రావులతో సందర్శించారు. ఈనెల 11 వ తేదీన ఎన్నికల లెక్కింపుకు ఒక డిసిపి, ముగ్గురు ఏసిపిలు, సి ఐ, ఎస్సై , మూడంచెల భద్రత కేంద్ర బలగాలు, కమీషనరేట్ పరిదిలోని ఆర్ముడ్ సిబ్బంది, సివిల్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని నియోజక వర్గాల వారీగా కౌంటింగ్ హాల్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కమీషనరేట్ పరిదిలోని 6 నియోజక వర్గాలలో ప్రశాంతంగాపోలీంగ్ ప్రక్రియ ముగిసిందని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రజలు స్వేచ్చ, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలకు సహాకరించిన ప్రజలకు పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి గౌస్ బాబా, సి ఐ మహేష్, ఎస్సైలు ఓం కార్ యాదవ్, భాస్కర్, మారుతి, ట్రాఫిక్ ఏ ఎస్సై భవానీలు పాల్గొన్నారు.

గెలిచినా, ఓడినా ప్రజాక్షేత్రంలోనే ఉంటా
* సీపీఐ నేత గుండా మల్లేష్
బెల్లంపల్లి, డిసెంబర్ 8: డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మహాకూటమి సీపీఐ అభ్యర్థిగా తాను బరిలో ఉన్నానని ఈ ఎన్నికలలో గెలిచిన ఓడినా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే సీపీఐ నేత గుండా మల్లేష్ తెలిపారు. శనివారం బెల్లంపల్లి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోజరిగిన ఎన్నికలలో ప్రజాకూటమి స్వల్ప మేజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందని తెలిపారు. నైతిక విలువలు లేని విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని విమర్శించారు. ఈ ఎన్నికలలో ధనం విళయ తాండవం చేసిందన్నారు. ఎలక్షన్ కమీషన్ నిబంధనలు ఎన్ని ఉన్నప్పటికీ నగదు, మందు, విందు భోజనాలు, ఓటర్లను రాజకీయ పార్టీలు ప్రలోభం చేశాయని మండి పడ్డారు. ఓటుకు నోటు విచ్చల విడిగా జరిగిందన్నారు. నియోజక వర్గంలో బీ ఎస్పీ అభ్యర్థి ధన బలంతో ఎన్నికలలో ప్రలోభాలకు ఓటర్లను గురి చేశారని తెలిపారు. కుంపటి శ్రీనివాస్ అనే వ్యక్తిని నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో బీ ఎస్పీ నుండి పోటీ చేయవద్దని భయాభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. వినోద్ పై కుంపటి శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని అన్నారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలలో పలు పార్టీల ఓటర్లను టీఆర్‌ఎస్, బీఎస్పీ అభ్యర్థులు బెదిరించారని అన్నారు. అంతేకాకుండా టి ఆర్ ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య, కొంత మంది బీ ఎస్పీ నాయకులను బెదిరించారని నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, నేను గెలిచాక మీ అంతు చూస్తానని బెదిరించారని, ఈ విషయమై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఇలాంటి పద్దతులు అభ్యర్థులు మార్చుకోవాలని హెచ్చరించారు. తాను ప్రజా తీర్పును గౌరవిస్తానని, ప్రజా స్వామ్య దేశంలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం సామన్యుడికి ఉందని తెలిపారు. గెలిచిన, ఓడినా ప్రజా క్షేత్రంలో ఉంటానని స్పష్టం చేశారు. చివరి వరకు ఎర్ర జెండా నీడలోనే ఉంటూ ప్రజల కోసమే పని చేస్తానని గుండామల్లేష్ స్పష్టం చేశారు.

పైన ధీమా.. లోన గుబులు
* అభ్యర్థులకు అంతుచిక్కని ఓటరు తీర్పు
* గెలుపు ఓటములపై ఎడతెగని ఉత్కంఠ

ఆదిలాబాద్, డిసెంబర్ 8: ఎన్నికల కీలకఘట్టం ప్రశాంతంగా ముగిసినా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై ఇంకా ఉత్కంఠ వీడడం లేదు. పోలింగ్ అనంతరం గ్రామాలు, పట్టణాల్లో ఓటింగ్ సరళిపై బేరీజు వేసుకొని అభ్యర్థుల విజయాలు, అపజయాలపై లెక్కలు వేసుకుంటున్నా స్పష్టమైన మెజార్టీతో ఫలానా అభ్యర్థి గెలుస్తారన్న అంచనాలు ఎక్కడా కనిపించడం లేదు. అన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిపై ఇదే పరిస్థితి కనిపించడంతో అభ్యర్థుల్లో ఎక్కడాలేని టెన్షన్ నెలకొంది. శనివారం పార్టీ కార్యకర్తలు, అనుచరులతో అభ్యర్థులు సమావేశమై బూత్‌ల వారీగా పోలింగ్ సరళిపై ఆరా తీశారు. అన్ని చోట్ల గెలుపు తమదంటే తమదేనంటూ అన్ని పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా ఓటరు అంతరంగం ఏ కోశాన అంతుచిక్కకపోవడం గమనార్హం. గెలుపుపై ఎవరి అంచనాలు వారికే ఉన్నాయి. గెలుపుపైపైకి ధీమా వ్యక్తం చేస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోన మాత్రం గుంబనంగా ఉన్న ఓటరు తీర్పు కునుకు లేకుండా చేస్తోంది. ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖానాపూర్ నియోజకవర్గాల్లో పోలింగ్ అనంతరం నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొనసాగగా ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల అధిక్యతతో మాత్రమే బయటపడడం ఖాయమని తెలుస్తోంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కొనసాగినప్పటికీ ముగ్గురు అభ్యర్థులు లెక్కకు మించి కోట్లాది నిధులు దారపోసినా ఓటర్లు మాత్రం అందరికి జై కొట్టి తన తీర్పు మాత్రం ఈవీఎం యంత్రాల్లో నిక్షిప్తం చేయడంతో ఓటర్ల సరళి బయటపడడం లేదు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో బిజెపి తొలి స్థానంలో ఉంటుందని గ్రామస్తులు లెక్కలు తీసిచెబుతూ రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి జోగురామన్న ఉంటారని విశే్లషించారు. ఆ పక్కనే గల గ్రామంలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఇక్కడా టీఆర్‌ఎస్ అభ్యర్థి రామన్న ఓట్ల అధిక్యతతో మొదటి స్థానంలో ఉంటారని, కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుందని, బిజెపి మూడో స్థానంలో ఉంటుందని తేల్చిచెప్పడాన్ని బట్టి ఫలితాలు కూడా రౌండ్లవారీగా ఉత్కంఠత రేపే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ 7 స్థానాల్లో విజయం సాధించగా ఈసారి 4 స్థానాలకు పరిమితం కావచ్చని సర్వేలు పేర్కొంటున్నాయి. బి ఎస్పీ 2 స్థానాల్లో గతంలో విజయం సాధించగా ఈసారి తూర్పు జిల్లాలో ఒక నియోజకవర్గంలో మాత్రం పాగా వేయడం ఖాయమని విశే్లషకులు భావిస్తున్నారు. మరోవైపు మెజార్టీ స్థానాలు తమకే దక్కుతాయని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, ఏజెన్సీలో ఓటింగ్ శాతం భారీగా పెరగడాన్ని బట్టి ఈసారి ఓటర్లు అధికార టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారా లేక మార్పు కోరుతున్నారా అన్నది అంతుపట్టడం లేదు. ఓటర్ల అంతరంగం బయటకపోవడంతో అన్ని పార్టీలు, అభ్యర్థుల్లోనూ ఎడతెగని ఉత్కంఠత రేకెత్తిస్తోంది. ఓటరు అంతిమ తీర్పు కోసం 11వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.

కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం
* డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, డిసెంబర్ 8: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మెజార్టీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం నిర్మల్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ నిర్మల్‌లో భారీ మెజార్టీతో గెలువబోతున్నామన్నారు. గత రెండు నెలలుగా తన గెలుపుకోసం కృషిచేసిన కార్యకర్తలు, పార్టీ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భారీ క్యూలైన్‌లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న వారందరికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణరెడ్డి, అర్జుమన్, సత్యం చంద్రకాంత్, రమణరెడ్డి, దినేష్, తదితరులు పాల్గొన్నారు.

తెరాస విజయానికి కృషి అభినందనీయం
* మాజీ ఎమ్మెల్యే కోనప్ప
కౌటాల, డిసెంబర్ 8: గత మూడు నెలలుగా శాసన సభ ఎన్నికలలో విజయం కోసం తెరాస శ్రేణులు చేసిన ఆవిశ్రాంత కృషి అభినందనీయం అని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శనివారం కౌటాల మండల కేంద్రంలోని ఆయన నివాసంలో చింతలమానేపల్లి, కౌటాల మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బం గా తెరాస విజయం కోసం ఆహార్నీశలు కార్యకర్తలు కృషి చేశారని, వారికి పార్టీ తరుపున రుణ పడి ఉంటామని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామగ్రామాన తెరాస హాయంలో జరిగిన అభివృద్ది సంక్షేమాన్ని వివరించడంలో కార్యకర్తలు చేసిన కృషి ఎంతో గొప్పగా ఉందన్నారు. 11న వెలువడనున్న ఫలితాలలో భారీ మేజార్టీతో గెలువనున్నామని ధీమా వ్యక్తం చేశారు. నియోజక వర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం మరోసారి వస్తుందని జోష్యం చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కన్వీనర్ విశ్వనాథ్, ఎంపిపి శ్రీనివాస్ గౌడ్, జడ్పిటిసి నానయ్య, ఐటిడిఏ డైరెక్టర్ మాంతయ్య, నాయకులు రవీందర్ గౌడ్, తిరుపతి, నరుూం, శ్రీ్ధర్, ప్రభాకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.