అదిలాబాద్

హెల్మెట్ ఉంటేనే పెట్రోల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 2: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ వాడకంపై ప్రజల్లో చైతన్యం తీసుకవచ్చేందుకు పెట్రోల్ బంక్ యజమానులు పూర్తిగా సహకరించాలని, ఇందుకోసం జిల్లాలో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోసేందుకు యజమానులు కఠిన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో పెట్రోల్ బంక్ యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారని, అందుకు కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని అన్నారు. జిల్లా ప్రజలకు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ పోసేలా బంక్ యజమానులు అవగాహన కల్పించాలని, ప్రతి బంక్‌వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు యూనిఫాం ధరించిన ఎన్‌సిసి, ఫారెస్ట్, హోంగార్డులను ఉంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ముందు వరసలో ఉందని, హెల్మెట్ వాడకంలో సైతం జిల్లా ముందుండాలని అన్నారు. ప్రజల్లో మార్పు రాకపోతే జరిమానాల వల్ల కూడా ఫలితం ఉండదని, ఆంక్షలతో ఏపని విజయం కాదని అందుకే ప్రజలకు ప్రమాదాల వల్ల కలిగే నష్టాలు వివరించి నచ్చజెప్పాలన్నారు. కుటుంబ నియంత్రణ పాటించడంతో పాటు పోలియోను నిర్మూలించడంలో మనం విజయం సాధించామని, హెల్మెట్ విషయంలోను విజయం సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు. ఈ సంధర్భంగా బంక్ యజమానులు మాట్లాడుతూ తాము హెల్మెట్ లేకుండా వచ్చే వాహనదారులకు పెట్రోల్ పోయకపోవడంతో వారు ఇతర బంక్‌లకు వెళ్ళి పెట్రోల్ పోయించుకుంటున్నారని కలెక్టర్‌కు వివరించారు. అలా చేసినట్లయితే ట్రాన్స్‌ఫోర్ట్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సంధర్భంగా కలెక్టర్ జగన్మోహన్ నోహెల్మెట్‌నో ఎంట్రీ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో సహాయ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ శ్రీనివాస్, వివేకానంద, పెట్రోల్ బంక్ యజమానులు పాల్గొన్నారు.

మైనార్టీ సంక్షేమానికి పెద్దపీఠ
* ఎమ్మెల్యే రేఖానాయక్ చొరవతోనే మైనార్టీ గురుకులం
ఖానాపూర్, జూలై 2: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీఠ వేసిందని ఖానాపూర్ శాసనసభ్యురాలు ఆజ్మీరా రేఖానాయక్ అన్నారు. స్థానికంగా ఏర్పాటుచేసిన నూతన మైనార్టీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో మైనార్టీలకు ఏ ప్రభుత్వం కల్పించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మైనార్టీలు కూడా ఎంతగానో కృషిచేశారని, ఇప్పుడు వారు కోరుకున్న విధంగా అభివృద్ది కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఖానాపూర్‌లో ఈ సంవత్సరమే ప్రారంభించిన మైనార్టీ గురుకుల పాఠశాలలో తరగతుల సంఖ్యను పెంచే ప్రయత్నంచేస్తామన్నారు. కొమురంభీం చౌరస్తాలోని 110 ఎకరాల స్థలం నుండి ఐదెకరాల స్థలాన్ని మైనార్టీ గురుకులానికి కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో సుమారు 20 కోట్లు వెచ్చించి అన్ని ఆధునిక హంగులతోభవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా భవనాన్ని నిర్మింపచేస్తామని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం వారిని ఆహ్వానిస్తు ఇఫ్తార్‌విందులో భోజనాలను ఏర్పాటుచేయడం జరిగిందని, పేదలకు దుస్తువులు పంపిణి చేయడం జరిగిందన్నారు. షాదీ ముబారక్ ప్రతీ ముస్లిం కుటుంబంలోని ఆడ పిల్లలకు రూ.51 వేలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఖానాపూర్‌లోని ప్రభుత్వ జూనియన్ కళాశాలలో ఉర్దూమీడియం విద్యార్థుల కోరిక మేరకు బైపిసి కూడా ఈ విద్యాసంవత్సరం ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అనంతరం పాఠశాలను ప్రారంభించి విద్యార్థులకు అందించే బోజనాన్ని పరిశీలించారు. హరితహారం కింద పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎన్నో ఆశలతో ఈ గురుకులాన్ని స్థాపించిందని రాష్టవ్య్రాప్తంగా 71 గురుకులాలు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే అన్నారు. భవన యజమాని జోవహార్ నాయక్ దంపతులు ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, ఎంపిపి ఆకుల శోభారాణి, జడ్పిటిసి సునిత, ఎ ఎంసి ఛైర్మెన్ శ్రీనివాస్, ఆత్మ ఛైర్మెన్ రాజారెడ్డి, టి ఆర్ ఎస్ మండలాధ్యక్షులు గజేంధర్, పట్టణాధ్యక్షులు కతలాపురం శ్రీనివాస్, మైనార్టీ మండల ప్రసిడెంట్ నజీర్ అహ్మద్, మండల పార్టీ నాయకులు అంకం రాజేందర్, రాజ్‌గంగన్న, గొర్రె గంగాధర్, మార్కెట్ డైరెక్టర్లు అశోక్‌రావు, జన్నారపు శంకర్, సతీష్, కౌట మహేష్, ఇర్ఫాన్, చరణ్, శోభన్, మైనార్టీ గురుకుల ప్రిన్సిపల్ బియాబాని, తదితరులు పాల్గొన్నారు.

ట్రిపుల్ ఐటిలో రెండవ విడత కౌనె్సలింగ్
* రెండవ విడతలో 436 మంది విద్యార్థులకు 370 మంది హాజరు
బాసర, జూలై 2: బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటిలో శనివారం రెండవ విడత కౌన్సిలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులు తల్లితండ్రులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కౌన్సిలింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. 436 మంది విద్యార్థులకు గాను 370 మంది విద్యార్థులు కౌన్సిలింగ్‌కు హాజరైనట్లు కళాశాల యూనివర్సిటి వైస్ ఛాన్స్‌లర్ సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులకు అడ్మిషన్ దృవీకరణ పత్రాలు సైతం అధికారులు అందజేశారు. రెండు రోజులకుగాను 118 సీట్లు మిగిలాయని తెలిపారు. గైర్హాజరైన వారి స్థానంలో వేయిటింగ్‌లిస్టు విద్యార్థులకు ఈ నెల 8వ తేదిన యూనివర్సిటిలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, విద్యార్థులు తమ వివరాలకై ఆర్జెయుకెటి. ఇన్ వెబ్‌సైట్‌లో వివరాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదిన విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి 15వ తేది నుండి కళాశాల ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. 4వ తేదిన వికలాంగులు, ఎన్‌సిసి విద్యార్థులకు, 5వ తేదిన హ్యాండిక్యాప్, స్పోర్ట్స్‌కోటా కింద ఎంపికైన విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లుచేసినట్లు అధికారులు తెలిపారు.

నిండు కుండలా గోదావరి
బాసర, జూలై 2: బాసర వద్ద గోదావరి నది శనివారం నిండుకుండలా దర్శనమిచ్చింది. శుక్రవారం మహారాష్టల్రోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరిలోకి నీరు భారీగా వచ్చిచేరింది. దీంతో బాసర పుష్కరఘాట్ల వరకు గోదావరి నీరు వచ్చిచేరడంతో భక్తుల పుణ్యస్నానాలకు ఇబ్బందులు తొలగిపోయాయి. గోదావరిని ఆనుకొని ఉన్న రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. గత సంవత్సరం వర్షాకాలంలో సరైన వర్షాలు కురియక గోదావరి ఎడారిగా మారింది. గోదావరి పుష్కరాల సందర్భంగా పుణ్యస్నానాలకు సైతం ప్రభుత్వం బాబ్లీపైనే ఆధారపడింది. గేట్లు ఎత్తడంతో పుష్కరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

కదం తొక్కిన అధికార పార్టీ నేతలు
* కొమురంభీం జిల్లాలోనే తిర్యాణి మండలాన్ని ఉంచాలి
* తాండూర్ ఐబి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో
తాండూర్, జూలై 2: కొత్తగా ఏర్పాటు చేయనున్న కొమురంభీం (మంచిర్యాల) జిల్లాలోనే తిర్యాణి మండలాన్ని ఉంచాలని డిమాండ్ చేస్తూ అధికార పార్టీ (టిఆర్‌ఎస్) నేతలు కదం తొక్కారు. తిర్యాణి మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, మండలవాసులు శనివారం తాండూర్ మండలం ఐబికి చేరుకుని రాష్ట్రీయ రహదారిపై ఆందోళన చేశారు. ఈసందర్భంగా తిర్యాణి ఎంపిపి హన్మండ్ల లక్ష్మి, జడ్పీటీసీ వెడమ కమల, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గాయంగి మల్లేష్, జిల్లా కార్యదర్శి హన్మండ్ల జగదీష్, ఎంపిటిసిలు యశ్వంత్, శ్రీదేవి, రేవతి, నాయకులు తాళ్ల శ్రీనివాస్, ముత్తె రాజయ్యతో పాటు దాదాపు 60 మంది మండలవాసులు రాష్ట్రీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తిర్యాణి మండలాని ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగించాలని జిల్లా అధికారులు ప్రతిపాదనాలు పంపించినట్లు తెలిసిందన్నారు. దాదాపు 200 కిలోమీటర్ల దూరం గల ఆదిలాబాద్ జిల్లాలో తిర్యాణి మండలాన్ని ఉంచడం వలన మండలవాసులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. మంచిర్యాల పట్టణం తిర్యాణి మండలానికి దాదాపు 50 కిలో మీటర్ల దూరం ఉంటుందని మండలవాసులకు ఎంతో సౌకర్యం ఉంటుందన్నారు. మండల కేంద్రాలు జిల్లా కేంద్రానికి 60 కిలో మీటర్లు మించవద్దని సి ఎం కెసి ఆర్ ప్రకటించినప్పటికి అధికారులు 200 కిలోమీటర్లు దూరంలో గల ఆదిలాబాద్ జిల్లాలో తిర్యాణి మండలాని ఉంచాలని ప్రతిపాదనాలు పంపించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తిర్యాణి మండలాన్ని కొమురం భీమ్ జిల్లాలో ఉంచేవిధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనాలు పంపించాలని డిమాండ్ చేశారు. తిర్యాణి మండలాన్ని ఆదిలాబాద్ జిల్లాలో ఉంచితే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి బెల్లంపల్లి వైపు వెళ్తుండగా ఆమెను టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు అడ్డుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తిర్యాణి మండలాన్ని కొమురం భీమ్ జిల్లాలో ఉంచాలని కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందని ఆమె చెప్పారు. అధికార పార్టీ నేతల అందోళన వద్దకు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ప్రజల అమోదం ప్రకారమే తిర్యాణిని కొమురంభీమ్ జిల్లాలో ఉంచాలని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ డిమాండ్ చేశారు. గంట అనంతరం పోలీసుల జోక్యంతో అధికార పార్టీ నేతలు అందోళన విరమించారు.