అదిలాబాద్

ఇక పంపకాలే తరువాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 11: పాలనపరమైన సౌలభ్యంకోసం ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆయా శాఖల్లో కార్యాలయాల ఏర్పా టు, ఉద్యోగుల సర్దుబాటు, ఫైళ్ళ విభజనపై కసరత్తు ముమ్మరం చేశారు. కొత్త జిల్లాల్లో పాలన పరమైన ఇబ్బందులు తలెత్తకుండా దసరా రోజున కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాలని సిఎం ఆదేశించిన నేపథ్యంలో సరిగ్గా నెల రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. గడవు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారుల్లో హడావుడి నెలకొంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల మూడు జిల్లాల విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పడే నిర్మల్, మంచిర్యాల కేంద్రాల్లోనే అన్ని శాఖలు పనిచేసేలా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈమేరకు ఏ ఏ విభాగాల్లో పనిభారం ఎలా ఉంటుంది, సిబ్బంది అవసరాలు ఎలా ఉంటాయి అన్న కోణంలో కసరత్తు పూర్తిచేశారు. అయితే ముందుగా దసరా రోజు కీలకమైన రెవెన్యూ, పోలీసు, విద్య, వ్యవసాయ, పంచాయతీ రాజ్ శాఖలు పనిచేసేలా ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన తహసీల్దార్, ప్రత్యేక అభివృద్ది అధికారి, విద్యాధికారులు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుందని, పైస్థాయి అధికారుల నుండి వౌఖిక ఆదేశాలు వచ్చాయి. ఈనేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ ముందస్తుగా సిబ్బంది సర్దుబాటు, ఫైళ్ళవిభజన, వాహనాల కేటాయింపు తదితర అంశాలతో కసరత్తు పూర్తిచేసి నివేదిక సమర్పించారు. నిర్మల్ పట్టణంలో పాలిటెక్నిక్ కేంద్రాన్ని ఎస్పీ కార్యాలయంగా, మంచిర్యాలలో బాలికల గురుకుల కళాశాల కేంద్రాన్ని కొత్త ఎస్పీ కార్యాలయంగా ఎంపిక చేశారు. మరోవైపు రెవెన్యూ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ యంత్రాంగం సిబ్బంది, అధికారుల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టిసారించింది. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారమే జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, కార్యాలయాల ఏర్పాటు, శాఖల విభజనపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆర్డీవో ఆఫీసులో ఏర్పాటు చేయనున్నారు. అక్కడ వసతులు, సౌకర్యాలు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అదే విధంగా పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంలో జిల్లా ఎస్పీ కార్యాలయం కొలువుదీరనుంది. పోలీసు శాఖలో సుమారు 170 నాలుగు చక్రాల వాహనాలు, 200పైన ద్విచక్ర వాహనాలను గుర్తించి, వాటిని మూడు జిల్లాలకు విభజించేందుకు కసరత్తుపూర్తిచేశారు. ఇప్పటికే ప్రతి ఉద్యోగికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చగా, ఏఉద్యోగి ఏ జిల్లాలో పనిచేసేందుకు ఆసక్తి ఉందో వారి నుండి అప్షన్స్ రాబట్టారు. పోలీసు శాఖలో ఏఆర్ విభాగం కింద నిర్మల్‌లో 300 మంది సిబ్బందిని సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఉద్యోగుల్లో మాత్రం తాము ఎక్కడికి బదిలీపై వెళ్తామో అన్నది ఉత్కంఠత నెలకొంది. ఈ విద్య సంవత్సరం ముగిసే వరకు ఇక్కడే ఉంటూ ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి కొత్త జిల్లాలకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఒప్పంద ఉద్యోగుల బదిలీ వ్యవహారం కూడా ఆయా శాఖల్లో చర్చనీయాంశంగా మారింది. తక్కువ వేతనంతో పనిచేస్తున్న తమను దూర ప్రాంతాలకు బదిలీ చేస్తే తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు త్వరలోనే బదిలీపై వస్తారని ప్రచారం సాగుతుండగా, ఎవరెవరిని ఎక్కడ నియమిస్తారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.