AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకో ప్రశ్న

రాముడు అంటే
అర్థం ఏమిటి?

ఆ మాటలు విన్న కైకేయి కోపంతో మండిపడుతూ వేడిగా నిట్టూర్చి మంధరతో చెప్పింది.
‘నేను తక్షణం రాముడ్ని ఇక్కడి నించి అడవికి పంపించి, భరతుడికి వెంటనే రాజ్యాభిషేకం చేయిస్తాను. మంధరా! ఏ విధంగా రాముడికి కాక భరతుడికి రాజ్యం లభిస్తుందో చెప్పు’
రాముడికి రాజ్య లాభం కలగకుండా చేసే పాపపు ఆలోచనలు గల మంధర ఈ ఉపాయాన్ని చెప్పింది.
‘సంతోషం కైకేయి. నీ కొడుకు భరతుడు మాత్రమే ఎలా రాజ్యాన్ని పొందగలడో చెప్తాను విను. ఆ ఉపాయాన్ని నేను చెప్పాలని నువ్వు కోరుతున్నావా? అది నీకు గుర్తు లేదా? లేదా గుర్తుండీ లేనట్లుగా నటిస్తున్నావా? నేను చెప్తేనే నీకు వినాలని ఉంటే అలాగే చెప్తాను. విను. విన్నాక నన్ను విమర్శించకూడదు’
మంధర మాటలు విన్న కైకేయి వెంటనే పక్క మీంచి కొంచెం లేచి చెప్పింది.
‘మంధరా! భరతుడు రాజ్యాన్ని పొందే, రాముడు పొందని ఆ ఉపాయం నాకు చెప్పు’
‘ఓ రాణీ! దేవతలకి, అసురులకి జరిగిన యుద్ధంలో దేవేంద్రుడికి సహాయం చేయడానికి వెళ్తూ, నీ భర్త నిన్ను దక్షిణ దిక్కులోని నైమిశారణ్య ప్రాంతంలోని తిమిధ్వజుడి నగరం వైజయంతీ పురానికి తీసుకెళ్లాడు కదా? అనేక మాయలు తెలిసిన మారీచుడు అనే ప్రసిద్ధి చెందిన ఆ రాక్షసుడ్ని దేవతలు జయించలేక పోయారు. వాడు ఇంద్రుడితో యుద్ధానికి వచ్చాడు. ఆ మహాయుద్ధంలో రాత్ర నిద్రపోయే పురుషులని రాక్షసులు బాణాలతో గాయపరిచి చంపారు. దశరథ మహారాజు ఆ యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఆయన్ని రాక్షసులు తమ ఆయుధాలతో ముక్కలు ముక్కలు చేసారు. స్పృహ లేని ఆయన్ని నువ్వు యుద్ధ రంగం నించి దూరంగా తీసుకెళ్లి రక్షించావు. అక్కడికి కూడా రాక్షసులు వచ్చి దాడి చేసినా నువ్వు నీ భర్తని మళ్లీ కాపాడావు. అందుకు సంతోషించిన ఆయన నీకు రెండు వరాలు ఇచ్చాడు. వాటిని అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పావు. అందుకు ఆయన ఒప్పుకున్నాడు. అక్కడ జరిగింది నాకు తెలీదు. గతంలో నువ్వే నాకు చెప్పావు. నీ మీద గల ప్రేమ వల్ల నాకు అది గుర్తుంది. ఆ రెండు వరాలుగా నువ్వు బలవంతంగా రాముడికి రాజ్యాభిషేకాన్ని నిలిపి వేసి భరతుడికి రాజ్యాభిషేకం చేయమని, రాముడ్ని పధ్నాలుగు సంవత్సరాలు దూరంగా పంపాలని నీ భర్తని కోరుకో. రాముడు పధ్నాలుగేళ్లు అడవికి వెళ్లాక నీ కొడుకు ప్రజల అభిమానం చూరగొని రాజ్యంలో స్థిరపడతాడు. కైకేయి! ఇప్పుడు నువ్వు పాత బట్టలని ధరించి, కోపాన్ని నటిస్తూ కోపగృహానికి వెళ్లి కటిక నేల మీద పడుకో. దశరథ మహారాజుని చూసి కూడా ఏడుస్తూ ఎదురెళ్లి మాట్లాడకు. నువ్వు సదా నీ భర్తకి ప్రియురాలివి అన్న విషయంలో నాకు అనుమానం లేదు. నీ కోసం ఆయన అగ్నిలోకి కూడా దూకగలడు. రాజు నీకు కోపాన్ని తెప్పించలేడు. కోపంతో ఉన్న నిన్ను చూడలేడు. నీకు ప్రీతి కలిగించడానికి ప్రాణాలని కూడా విడుస్తాడు కనుక రాజు నీ మాటని అతిక్రమించలేడు. తెలివితక్కువదానా! నీ సౌభాగ్య బలాన్ని తెలుసుకో. దశరథ మహారాజు నీకు మణులని, ముత్యాలని, బంగారాన్ని, అనేక రకాల రత్నాలని ఇస్తానని అనచ్చు. వాటిని తీసుకుని తృప్తిపడకు. ఓ భాగ్యవంతురాలా! దశరథుడు దేవాసుర యుద్ధంలో నీకు ఏం వరాలు ఇచ్చాడో వాటిని ఆయనకి గుర్తు చేసి నువ్వు అనుకున్న ప్రయోజనం దాటిపోకుండా చూసుకో. దశరథుడు స్వయంగా నిన్ను నేల మీంచి లేవతీసి నీకు ఏం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. అప్పుడు ఆ మహారాజుని కుదుటపరిచి, ‘మహారాజా! పధ్నాలుగు సంవత్సరాలు రాముడ్ని అడవికి పంపించు. భరతుడ్ని భూమికి రాజుగా చేయి’ అని కోరు. రాముడ్ని పధ్నాలుగు సంవత్సరాలు అడవికి పంపడం వల్ల నీ కొడుకు రాజుగా నిలదొక్కుకుంటాడు. రాముడు అరణ్యవాసానికి వెళ్తే అతనిలోని ప్రజలని ఆనందింపజేసే గుణం నశించి అరాముడు అవుతాడు. నీ భరతుడు రాజై శత్రువులు నశించి సుఖంగా ఉంటాడు. రాముడు అడవి నించి తిరిగి వచ్చేసరికి బుద్ధిమంతుడైన నీ కొడుకు మిత్రులని సంపాదించుకుని, ప్రజలను అదుపులో ఉంచుకుని, వేళ్లుదన్ని స్థిరంగా ఉంటాడు. దశరథ మహారాజుకి అవసాన కాలం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. ఏ మాత్రం భయపడకుండా పట్టుపట్టి రామాభిషేకం చేయాలనే ఆయన సంకల్పాన్ని తొలగించు’
అనర్థం కలిగించే విషయాన్ని మంధర లాభకరం అయినట్లుగా బోధించగా కైకేయి సంతోషించింది.
‘మంధరా! నువ్వు ఎంత మంచి మాటలు చెప్పావు? నువ్వింత ఉత్తమమైన దానివని నేను గుర్తించలేదు. బుద్ధిబలంలో నువ్వు భూమి మీది గూని వాళ్లందరిలోకి శ్రేష్టురాలివి. నా శ్రేయోభిలాషివి. లోకంలో ఎందరో గూనివాళ్లు ఉన్నారు. వారందరి అవయవ నిర్మాణం వంకరగా, చాలా చెడ్డగా ఉంటుంది. కాని నువ్వు గాలికి వంగిన పద్మంలా వంగినా కూడా అందంగా కనిపిస్తావు. బిగువైన నీ వక్షస్థలం మూపు దాకా ఎత్తుగా ఉంది. దాని కింది మంచి బొడ్డుగల కడుపు వక్షస్థలానికి ఉన్న బిగువుని చూసి అది తనకి లేనందుకు సిగ్గుపడుతోందా అన్నట్లు సన్నగా ఉంది. నిండుగా ఉన్న జఘనంతో, చక్కగా బలిసిన స్థనాలతో నిర్మలమైన చంద్రుడి లాంటి మొహంతో, వడ్డాణ్ణంతో అలంకరించిన నీ మొల ధ్వని చేస్తూ, పొడవైన పాదాలు, నున్నటి పిక్కలు గల నువ్వు ఎంత గొప్పగా వెలిగిపోతున్నావు? పొడవైన తొడలు గల నువ్వు పట్టువస్త్రాలని ధరించి నా ముందు నడుస్తూంటే రాజహంసలా ప్రకాశిస్తున్నావు. రాక్షసుల ప్రభువైన శుక్రాచార్యుడిలో వెయ్యి మాయలే ఉన్నాయి. కాని నీలో అవే కాక ఇంకా వేల మాయలు ఉన్నాయి. ఎతె్తైన నీ గూనిలో ఆలోచనలు, క్షత్రియ విద్యలు, మాయలు దాగి ఉన్నాయి. మంధరా! రాముడు అడవికి వెళ్లి భరతుడు రాజ్యాన్ని పొందాక నీ గూనిని బంగారు గొలుసుతో అలంకరిస్తాను. నేను అనుకున్నది జరిగి తృప్తి చెందాక బాగా పుటం వేసిన బంగారంతో నీ గూనికి పూత పెట్టిస్తాను. నీ నొసటి మీదకి శుభమైన, విచిత్రమైన బంగారు తిలకాన్ని, అందమైన ఆభరణాలని చేయిస్తాను. మంగళకరమైన వస్త్రాలని ధరించి నువ్వు దేవతలా తిరగచ్చు. చంద్రుడితో పోటీ పడే మొహంగల నువ్వు గర్వంతో నీ శత్రువుల మధ్య అత్యున్నత స్థానాన్ని పొందగలవు. నువ్వు నాకు చేస్తున్నట్లే గూని స్ర్తిలు నీకు కూడా పాదసేవ చేస్తారు’
యజ్ఞగుండంలోని అగ్నిశిఖలా మంచం మీద పడుకున్న కైకేయితో పొగడబడిన మంధర ఇలా చెప్పింది.
‘కైకేయి! నీళ్లు పోయాక గట్టు కట్టి ప్రయోజనం లేదు. వెంటనే లేచి లాభకరమైన పనిని చేయడానికి సిద్ధపడి రాజుకి నీ ప్రభావాన్ని చూపించు’
మంధర మాటలకి లొంగిన విశాలమైన కళ్లు, సౌందర్యమదం గల కైకేయి మంధరతో కలిసి కోపగృహంలోకి ప్రవేశించి, బంగారు తీగలా నేల మీద పడుకుని మంధరతో ఇలా చెప్పింది.
‘రాముడు అరణ్యానికి వెళ్లాక భరతుడు రాజ్యాన్ని పొందడమైనా జరగాలి. లేదా ఇక్కడి నా మరణవార్తని నువ్వు రాజుకి చెప్పాలి. నాకు బంగారం, రత్నాలతో కూడిన అలంకారాలతో పనిలేదు. రాముడికి ఎప్పుడు రాజ్యాభిషేకం జరుగుతుందో ఆ రోజే నా అంతం’
అతి తీవ్రంగా మాట్లాడే భరతుడి తల్లి కైకేయితో మంధర ఆమెకి లాభం, రాముడికి నష్టం కలిగించే మాటలని ఇలా చెప్పింది.
‘రాముడు రాజైతే నువ్వూ, నీ కొడుకు చాలా కష్టాల పాలవుతారు. కాబట్టి నీ కొడుకు భరతుడికి రాజ్యాభిషేకం జరిగేలా ప్రయత్నించు’
ఆ గూనిది మాటిమాటికీ వాగ్బాణాలు ప్రయోగించడంతో చాలా దుఃఖించిన కైకేయి దశరథుడి మీద కోపంతో గుండె మీద చేతులు వేసుకుని ఆ గూనిదాని తెలివికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆమెని పొగిడింది.
‘మంధరా! రాముడు అరణ్యానికి వెళ్లాలి. భరతుడు రాజవ్వాలి. లేదా నేను యమలోకానికి వెళ్తానని నువ్వు రాజుకి చెప్తావా? రాముడు అడవికి వెళ్లకపోతే నాకు పూలమాలలు, గంధం, బొట్టు, కాటుకలు, అలంకరణలు, ఆహార పానీయాలతో, చివరికి జీవితంతో కూడా పనిలేదు’
కినె్నర స్ర్తిని తలపించే కైకేయి ఇలా అతి దారుణంగా మాట్లాడి, ఒంటి మీది ఆభరణాలని తీసేసి నేల మీద పడుకుంది. అత్యధిక కోపం అనే చీకటి ఆమె మొహాన్ని కప్పివేయగా, అలంకారాలని తీసేసి అన్యమనస్కురాలైన కైకేయి చీకటి ఆవరించి నక్షత్రాలు కనపడని ఆకాశంలా ఉంది. (అయోధ్యకాండ సర్గ 9)
వెంటనే ఓ పాతికేళ్ల యువకుడు లేచి హరిదాసుతో చెప్పాడు.
‘నా పేరు రామదాసు. నేను రామాయణం మీద రీసెర్చ్ స్కాలర్‌ని. మీరు చెప్పిన కథంతా బావుంది కాని కొన్ని తప్పులు ఉన్నాయి. వాటిని చెప్తాను వినండి.
ఆ తప్పులని మీరు కనుక్కోగలరా?

కిందటి వారం ప్రశ్నలకు జవాబులు

1.తెల్లని పట్టువస్త్రాలు ధరించిన ఓ దాదిని మంథర అడిగింది. భటుడ్ని కాదు.
2.్భరతుడ్ని నీ బంధువుల దగ్గరికి పంపేసి రేపు ప్రాతఃకాలంలో ఏ అడ్డూ లేని రాముడికి రాజ్యాన్ని కట్టపెడుతున్నాడు అని మంథర చెప్పిన సంగతి హరిదాసు చెప్పలేదు.
3.కైకేయి మంథరకి ఓ అందమైన ఆభరణాన్ని బహుమతిగా ఇచ్చిందని హరిదాసు చెప్పలేదు.
4.రాముడి తర్వాత జన్మించింది భరతుడే కాబట్టి రాముడి తర్వాత రాజ్యం పొందాల్సింది భరతుడే అని మంథర చెప్పిన సంగతి కూడా హరిదాసు చెప్పలేదు.
5.నాకు భరతుడి మీద ఎంత ప్రేమ ఉందో రాముడి మీద కూడా అంతే ప్రేమ ఉంది. నిజానికి ఎక్కువే ఉంది అన్న కైకేయి మాటలని హరిదాసు చెప్పలేదు. (దీన్నిబట్టి కైకేయి స్వతహాగా ఉత్తమురాలు. మంథర మాటలతో చెడు దారి పట్టింది)

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

శ్రీ రామ నామం ఎందుకు తారకమంత్రం అయింది?
శ్లో.రా శబ్దోచ్ఛార మాత్రేణ ముఖాన్నిర్యాతి పాతకమ్
పునః ప్రవేశ భీత్యా తు మకారస్తు కవాటవత్
భావం: ‘రా-మ’ అనే రెండక్షరాల్లోని ‘రా’ అనే అక్షరం ఉచ్ఛరించగానే పాపం నోటి నించి పోతుంది. ‘మ’ అక్షరం ఉచ్ఛరించగానే నోరు మూసుకుని తిరిగి ఆ పాపం లోపలకి ప్రవేశించలేదు. రామ ఉచ్చారణతో పాపం తిరిగి రాకుండా పోతుందని భావంతో అది తారకమంత్రమైంది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి