డైలీ సీరియల్

అమ్మానాన్నకు - 52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏ అమ్మా నాన్న అయినా ఉండే ఒకే ఒక్క కొడుకును రెండేళ్లపాటు ఇంటికి తీసుకుపోకుండా ఉంటారా? వీళ్లిద్దరూ ( అమ్మా నాన్నను చూపించి) రెండేళ్లలో ఒక్కసారి కూడా వాళ్ళబ్బాయిని ఇంటికి తీసుకుపోలేదు. వాళ్లకు చదువు గొప్పతనం తెలుసు. వాళ్ల కొడుకు గొప్పవాడు కావాలనేదే వాళ్ల కోరిక. అందుకోసం వాళ్లు కొడుకుమీది ప్రేమను త్యాగం చేశారు.. మహేష్‌ను వాళ్లింటి దగ్గరనుంచి తీసుకొచ్చిన రోజున మాటిచ్చా, మీ అబ్బాయిని ర్యాంక్‌తో పంపిస్తానని. నా మాట నిలబెట్టుకున్నా’ అన్నారు కరస్పాండెంట్.
మీడియా అంతా అమ్మా నాన్నను చుట్టుముట్టారు. వాళ్లిద్దరూ కరస్పాండెంట్ చెప్పిందే చెప్పారు.
‘‘మాకు పెళ్లయిన పదిహేనేళ్లకు పుట్టాడు. ఒక్కడే కొడుకు. అయినా వాడి భవిష్యత్తు బాగుండాలని, వాడు గొప్పవాడు కావాలని ప్రేమను చంపుకుని చిన్నప్పటినుంచీ హాస్టల్లో వేశాం. మా ఇళ్లలో ఎవ్వరూ ఇంత బాగా చదువుకోలేదు. మావాడు టెన్త్‌లో కూడా టాపర్. చాలా గర్వమనిపించింది. ఇపుడు కూడా టాపర్.. ఇంకా సంతోషంగా ఉంది.. మా వాడు ఇంజనీరింగ్‌లో కూడా టాపర్‌గా నిలుస్తాడు. మేం కోరుకున్న కలలు నెరవేరుస్తాడు’’ అని ఉద్వేగంగా చెప్పారు అమ్మా నాన్న. అమ్మ కళ్లలో అయితే నీళ్లు కారిపోతున్నాయి.
అవి దుఃఖంతోనో, ఆనందంతోనో నాకు అర్థం కాలేదు.
‘‘మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇంటర్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చిన మహేష్ అమ్మా నాన్న ఉన్నారు. కొడుకు భవిష్యత్తు కోసం వాళ్లు తమ ప్రేమను త్యాగం చేశారు. చిన్నప్పటినుంచీ హాస్టల్లో పెట్టి, మంచి స్కూల్, కాలేజీలో చదివించారు. అందువలనే ఇంత గొప్పవాడయ్యాడని, తమ త్యాగం వృధా కాలేదని, భవిష్యత్తులో వారి కొడుకు మరింత గొప్పవాడు అవుతాడని అంటున్నారు. వాళ్లు కోరుకుంది జరుగుతుందని ఆశిద్దాం. వారి త్యాగం మరెందరికో ఆదర్శం కావాలని కోరుకుందాం’’ అని టీవీల్లో చెప్పారు.
నన్ను అమ్మా నాన్న మధ్యలో నుంచోబెట్టి ఫొటోలు తీసుకున్నారు. వీడియోలు తీసుకున్నారు.
నాకు ఈ హంగమా అంతా చూస్తుంటే చికాగ్గా వుంది. కోపంగా వుంది.. ‘అమ్మా నాన్నది త్యాగం కాదు.. మూర్ఖత్వం.. స్వార్థం...’ అని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. ‘వాళ్ల త్యాగంతో నేను ప్రేమకు దూరమయ్యాను. ఒంటరివాడిగా మిగిలిపోయాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అమ్మా నాన్న ఉండీ అనాథనయ్యాను. దయచేసి ఎవ్వరూ వారిలా ఉండకండి.. పిల్లలను మీ దగ్గరే పెట్టుకుని చదివించండి.. వాళ్లకు ర్యాంకులు రాకపోయినా ఫర్వాలేదు. మనుషులుగా పెంచండి.. యంత్రాలుగా మార్చకండి’’ అని చెప్పాలనుకున్నా.
కరస్పాండెంట్, అమ్మా నాన్న, మీడియా నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. వాళ్లకు తోచింది, వాళ్లకు నచ్చింది వాళ్లు మాట్లాడేశారు. ప్రసారం చేసేశారు. అవే నా మాటలుగా, నా అభిప్రాయాలుగా చెలామణి అయిపోయాయి.
ఇంటికి వెళ్లి రెండు రోజులున్నాను. అమ్మా నాన్న ఆ ఇంట్లోకి వచ్చిన ఏడాది తర్వాత నేను వచ్చాను. అది సింగిల్ బెడ్‌రూం ఇల్లు.. ఇంటికి పోయినప్పటినుంచీ నాన్న, అమ్మ స్నేహితులు, కాలేజీలో వాళ్లు, క్లాస్‌మేట్స్... ఇలా ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తూనే ఉన్నారు. అభినందిస్తూనే ఉన్నారు. అభినందనలు ఆనందంగా ఉన్నా, చిరాకుగా కూడా ఉంది.
నేను సొంతూరికి వెళ్లాలనుకున్నాను. నాతోపాటు అమ్మా నాన్న వచ్చారు. ఇంటర్మీడియెట్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చిన కొడుకు తల్లిదండ్రులుగా వాళ్లు చాలా గర్వపడుతున్నారు. నేను వాళ్ల పక్కన ఉండటం, లేదా వాళ్లు నా పక్కన ఉండటం గొప్పగా ఫీలవుతున్నారు. నాకు మాత్రం ఇది చికాకనిపించింది.
ఆ రోజు మేము మా ఊరికి పోయేప్పటికి సాయంత్రం అయింది. నేను ఇంట్లోకి కూడా పోకుండా నేరుగా శ్రీకాంత్ అంకుల్ వాళ్ల ఇంటికి పోయాను. వాళ్లందరూ ఊరెళ్లారని ఈ రోజో, రేపో వస్తారని పక్కింటి అతను చెప్పాడు.
‘‘నువ్వు మోహన్ కొడుకువి కదూ..’’ అన్నాడు.
అవునన్నాను.
నా రెండు చేతులు పట్టుకుని ‘‘చాలా గొప్పవాడివైపోయావు బాబూ.. ర్యాంక్ తెచ్చుకుని మన ఊరికి పేరు తెచ్చినావు.. ఎవరికైనా నీయట్లా బిడ్డలుండాల.. మాకూ ఒక కూతురు ఉంది.. ఎందుకు వేస్ట్...’’ ఇంటర్‌లో ఫెయిలైపోయింది. లోపలికి రా బాబూ... కాఫీ తాగేసి పోదువు’’ అని బలవంతం చేశాడు.
‘‘లేదండీ.. ఇంటికి పోవాలి.. ఇంటి దగ్గర అమ్మా నాన్న, ఫ్రెండ్స్ ఉన్నారు’’ అని చెప్పి అక్కడినుండి వచ్చేశాను.
నాకు ఇంటికి పోవాలనిపించలేదు. ఏటి ఒడ్డుకు వెళ్లాను. వేసవి కదా, ఏటిలో నీళ్లు తక్కువగా పోతున్నాయి. నీళ్ల మధ్యలో పెద్ద పెద్ద బండలు పైకి తేలి కనిపిస్తున్నాయి. పిల్లలు కొందరు ఆ బండలపైకి ఎక్కి కేరింతలు కొడుతున్నారు.
నేను కూడా ఏటి ఒడ్డున ఉండే ఒక బండపైన కూర్చున్నాను. సూర్యుడు అస్తమించి చాలాసేపే అయింది. పౌర్ణమి మరో రెండు రోజుల్లో ఉన్నట్టుంది. చీకటి కమ్ముకోవడం లేదు. వెనె్నల వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది. రెండు రోజుల నుంచి నాకు వస్తున్న పొగడ్తలన్నీ గుర్తుకొచ్చాయి.
వాటిని ఎలా స్వీకరించాలో అర్థం కావడంలేదు. పొగడ్తలకు నేను పొంగిపోతే, ఇనే్నళ్లు నేను మానసికంగా పడ్డ హింస తప్పు అవుతుంది. ఇన్నాళ్లు నేను వ్యతిరేకించిన అమ్మా నాన్న ఆలోచనలను అంగీకరించాలి. వాటిని అంగీకరించడం నాకు ఇష్టం లేదు. అలా అని పొగడ్తలకు దూరంగానూ ఉండలేకుండా ఉన్నాను.
- ఇంకా ఉంది

-సుంకోజి దేవేంద్రాచారి