రాష్ట్రీయం

ఉపాధి కూలీల పంట పండింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 24: వేసవిలో ఉపాధి కూలీలకు ప్రభుత్వం చల్లని కబురిచ్చింది. వేసవి ఎండలను తట్టుకొని కుటుంబ పోషణ కోసం ఉపాధి పనికి వచ్చే వారికి తక్కువ పనికే పూర్తి వేతనాన్ని ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల పాటు దీనిని పూర్తి స్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా పూర్తిస్థాయిలో నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే ఓ కూలీకి రోజుకు 205రూపాయల వేతనాన్ని అందిస్తారు. కానీ ఈ రెండునెలల పాటు 70శాతం పనిచేస్తేనే 205రూపాయల వేతనాన్ని ఇచ్చేలా ఆదేశాలు జారీచేశారు. కూలీలు వలస పోకుండా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మరోవైపు వ్యవసాయ రంగానికి కూడా ఉపాధి పనులను అనుసంధానం చేస్తున్న నేపథ్యంలో ఈ పథకం గ్రామాల్లో మరింత ఆదరణ కలిగిస్తుంది. జాబ్‌కార్డులు కలిగిన అందరినీ పనికి రప్పించడం ద్వారా అందరికీ ఈ అవకాశాన్ని కల్పించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాగా వేసవి కాలంలో సోప్ పిట్‌లు, ఇంకుడు గుంటలు, చెరువుల్లో పూడికలు లాంటి వాటికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న ఉపాధి కూలీలు తమ వ్యవసాయ పొలాల్లో అవసరమైతే పనులు చేసుకునేందుకు కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే వారు ముందస్తుగా పని వివరాలను దరఖాస్తు చేసుకుంటే అధికారులు మంజూరు చేయడం ద్వారా ఆ ప్రాంతంలో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ రెండు నెలల్లోనే అధిక మొత్తంలో పనులు పూర్తిచేయడం ద్వారా వర్షాకాలంలో వ్యవసాయ పనులకు ఆటంకం కలుగకుండా ఉండటం, కూలీలకు ఎక్కువ మొత్తంలో కూలీ దక్కే అవకాశాన్ని కల్పించేందుకు పూర్తిస్థాయిలో అధికారులు చర్యలు చేపడుతున్నారు.
తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా 30జిల్లాల పరిధిలో ఈ పథకం అమల్లో ఉండగా 53,91,433మంది ఉపాధి కూలీలకు జాబ్‌కార్డులు అందించారు. వీరందరికీ అదనపు వేతనాన్ని అందించడమే కాకుండా వారందరికీ పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 46,558.68లక్షల విలువైన 31,849పనులను అధికారులు మంజూరు చేశారు. పనుల వద్దనే ప్రతి కూలీకి మంచినీటి కోసం రోజుకు ఐదు రూపాయలు, ప్రాథమిక చికిత్స కోసం మెడికల్ కిట్, ఎండనుంచి కాపాడుకునేందుకు టెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో 1,21,06,330మంది ఉపాధి కూలీలు పనిచేస్తుండగా అందులో పురుషులు 61,35,044మంది, మహిళలు 59,71,294మంది ఉండగా దివ్యాంగులు 11,45,921మంది పనిచేస్తున్నారు. దాదాపు 3,15,375గ్రూపులు ఈ పనులు చేస్తుండటం విశేషం. ప్రస్తుతం సగానికి పైగా గ్రూపులు కూలి పనులకు వస్తుండగా మిగిలిన వారిని ఈ నెలాఖరులోగా పనికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉపాధి పనులకు వచ్చేవారిలో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. జాబ్‌కార్డులు పొందిన వారిలో ఎస్సీలు 12,13,113మంది ఉండగా, ఎస్టీలు 8,85,621మంది, బిసిలు 28,11,740మంది, ఇతరులు 5,10,959మంది ఉన్నారు. వీరందరిని ఉపాధి పనికి రప్పించేందుకు ఆయా జిల్లాల స్థాయిలో జిల్లా గ్రామీణాభివృద్థి అధికారుల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ల వరకు విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తక్కువ పనికి పూర్తి వేతనాన్ని ప్రభుత్వం ఇస్తున్నదని, వేసవి ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు పనివద్దనే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని గ్రామాల్లో సమావేశాలు పెట్టి అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఎప్పుడూ వచ్చే వారికంటే సగంమందే పనికి వస్తున్నారని, కమాండ్ ఏరియాలో వ్యవసాయ పనులు ఉన్న దృష్ట్యా మరో 10రోజుల్లో ఆ పనులు పూర్తయితే కూలీల సంఖ్య పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ఎక్కువ మంది కూలీలు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.