ఆంధ్రప్రదేశ్‌

మంత్రి పదవి ఎవరిని వరించేనో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 9: మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్టు తెలియడంతో తూర్పు గోదావరి జిల్లా నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. బీజేపీకి చెందిన పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ రాజీనామాలతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు, విస్తరణకు అవకాశం ఉంటుందని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించడంతో తూర్పు గోదావరి జిల్లాకు తప్పనిసరిగా ఓ మంత్రి పదవిని కేటాయించడం తథ్యమని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా సెంటిమెంట్ జిల్లాగా గుర్తింపు పొందిన తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్న అంశం ఇపుడు చర్చనీయాంశమయ్యింది. అయితే సామాజికవర్గాల ఆధారంగా జిల్లాలో మంత్రిని ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే జిల్లాకు చెందిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను అధినేత చంద్రబాబు అప్పగించారు. వెనువెంటనే హోంమంత్రిగా నియమించారు. కాపు సామాజికవర్గానికి చెందిన చినరాజప్ప సుదీర్ఘకాలంగా పార్టీకి సేవ చేస్తూ చంద్రబాబుకు విధేయుడిగా పేరొందారు. జిల్లాకు చెందిన కీలక నేత, బీసీ సామాజికవర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు ఆర్ధిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఏ విధమైన మార్పులు లేకుండా వీరివురూ మంత్రులుగా కొనసాగుతున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడాన్ని నిరసిస్తూ అప్పట్లో జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదవరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై నేరుగా అప్పట్లో గోరంట్ల ధ్వజమెత్తారు. గతంలో ఈయన కమ్మ సామాజికవర్గం నుండి మంత్రిగా వ్యవహరించారు. ఇదిలావుంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తూర్పు గోదావరి జిల్లా నుండి విధిగా ఓ దళిత ఎమ్మెల్యేకు మంత్రి పదవి లభిస్తోంది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అవకాశం పశ్చిమ గోదావరి జిల్లాకు లభించడంతో జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. సామాజికపరంగా చూసినా, సీనియర్ ఎమ్మెల్యేగా చూసినా మంత్రి పదవికి తాను అర్హుడినని సన్నిహితుల వద్ద పేర్కొంటున్నట్టు సమాచారం! మరోవైపు కాపు సామాజికవర్గానికి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇదే సామాజికవర్గానికి చెందిన చినరాజప్ప ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నప్పటికీ మంత్రివర్గ విస్తరణంటూ జరిగితే తన పేరును తప్పక పరిశీలిస్తారన్న నమ్మకంతో నెహ్రూ ఉన్నట్టు తెలుస్తోంది. రిజర్వేషన్ల విషయంలో కాపుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చే విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగా జిల్లా నుండి కాపు సామాజికవర్గానికి చెందిన మరొకరికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం! ఈ విధంగా కాపులకు మరింత ప్రాధాన్యత కల్పించినట్టు అవుంతుందన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. వైకాపా నుండి తెలుగుదేశంలో చేరిన నెహ్రూకు గతంలో మంత్రి పదవిని ఆఫర్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే నెహ్రూ కుమారుడు జ్యోతుల నవీన్‌ను జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్‌గా నియమించారని, మరో మంత్రి పదవి అంటూ కాపులకు ఇవ్వాల్సి వస్తే తన పేరే పరిశీలించాలని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు డిమాండ్ చేస్తున్నట్టు భోగట్టా!
ఒకవేళ మంత్రి వర్గంలో తనకు చోటు లభించని పక్షంలో 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేయాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకునేందుకు సైతం తోట నిర్ణయించుకున్నట్టు తెలిసింది. మరోవైపు బీసీ సామాజికవర్గ ఎమ్మెల్యేల్లోనూ మంత్రి పదవిపై ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యంను శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా నియమించి జిల్లా నుండి బీసీలకు ప్రాధాన్యత కల్పించినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే మంత్రి వర్గంలో స్థానం కల్పించాలన్న డిమాండ్ బీసీ ప్రజాప్రతినిధుల్లో ఉంది.
కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి అనంతలక్ష్మి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (మత్స్యకార) మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరిద్దరూ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మరోవైపు కమ్మ సామాజికవర్గానికి చెందిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి మంత్రి పదవిని గట్టిగా ఆశిస్తున్నట్టు సమాచారం! ఏది ఏమైనా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పక్షంలో పదవీ కాలం పట్టుమని అర్ధ సంవత్సరం కూడా లేకపోయినా మంత్రి పదవి కోసం సదరు నేతలు చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు.