ఆంధ్రప్రదేశ్‌

జనసేనతోనే జవాబుదారీ రాజకీయ శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), అక్టోబర్ 13: రాజకీయ జవాబుదారీతనం లేని కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రత్యేక హోదాపై అక్కడ ప్రధాని మోదీ, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు మార్చారని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్‌కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోతే దానిపై ఎవరైనా సరే వివరణ ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడ్డారు. హామీలు నెరవేర్చని వారిని రీకాల్ చేసే వ్యవస్థ రూపొందాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను మొదటి నుంచీ ఒకే మాటమీద ఉన్నానన్నారు. చంద్రబాబు అనుభవం హోదా అంశంలో పది సార్లు మాట మార్చేలా చేసిందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు తనకు బంధువులేమీ కాదన్నారు. ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం పెడితే వచ్చి తమ అభిప్రాయాలను చెప్పి, ఢిల్లీలో మోదీని నిలదీస్తానన్నారు. విజయవాడలో పార్టీ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని శనివారం ప్రారంభించిన ఆయన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సమకాలీన రాజకీయాల్లో జవాబుదారీతనం లేకపోవడం తోనే రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితులు వచ్చాయన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఎదైనా చేయాలనే తలంపుతో నాడు సంపాదనను వదిలి, ఏదీ ఆశించకుండా అనుభవం ఉన్న బాబుకు మద్దతిచ్చానన్నారు. అయితే రాష్ట్రానికి హోదాతో సహా ప్రయోజనాలు, హామీలు నెరవేర్చడంలో బాబు విఫలమయ్యారన్నారు. బీజేపీ నేతలతో తనకు ఎక్కడా బంధుత్వం లేదన్నారు. ప్రధాని మోదీని, బీజేపీనీ ఎప్పుడూ, ఎక్కడా వెనకేసుకు రాలేదన్నారు. తాను తన కుటుంబ సభ్యులనే వెనకేసుకురానని స్పష్టం చేస్తూ, మోదీని ఎందుకు వెనకేసుకొస్తానన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్ష సమావేశం పెట్టాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి చర్చించి ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసి, హోదాకోసం ఒత్తిడి తీసుకు వద్దామన్నారు. హోదా కోసం అందరం సమష్టిగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని, ఇం దుకోసం అందరూ కలిసి రావాలన్నారు. గతంలో పెట్టిన ఆఖిలపక్ష సమావేశం చిత్తశుద్ధితో పెట్టింది కాదన్నారు. అందుకే నాడు జనసేన హాజరు కాలేదన్నారు. హోదా కోసం జనసేన మాదిరిగా బలం గా గళం ఎత్తిన వారు రాష్ట్రంలో ఎవ్వరూ లేరన్నా రు. అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు మాటలు పదే పదే మార్చిన కారణంగా రాష్ట్ర ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. నేడు ప్రజలకు మాటలు చేప్పే ప్రజాప్రతినిధులు ఉన్నారే తప్ప, ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకులే లేరన్నారు. మేధావులు, రాజకీయ నాయకులతో కలసి జనసేన ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ విభజిత ఏపీకి రావాల్సిన, కావాల్సిన వాటి గురించి నివేదిక తయారు చేసిందన్నారు. ఆ నివేదికలోని అంశాలను చట్టసభల్లో ఉన్న టీడీపీ, వైకాపా నేతలు ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. తాను చట్టసభల్లో లేని కారణంగా ఆ బాధ్యతను పదవుల్లో ఉన్నవారు తీసుకోవాలన్నారు. ఐటీ దాడులు ఢిల్లీ తరహాలో ఇక్కడి సచివాలయంపైనో, సీఎం కార్యాలయం పైనో జరిగి ఉంటే ఖండించే వాడినన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్థులపై ఐటీ దాడులు చేస్తే ఎందుకు స్పందించాలన్నారు. ఈ దాడులపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామన్నారు.
ముందస్తు అవసరం లేదు
తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అనుకోని పరిస్థితుల్లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామన్నారు. ధవళేశ్వరం కవా తు అనంతరం ఎన్నికలపై పార్టీతో చర్చించి, నిర్ణ యం తీసకుంటామన్నారు. తప్పకుండా తెలంగాణ లో జనసేన పోటీ చేస్తుందని, 23 నుండి 14 స్థానాల్లో పోటీకి దిగే అలోచన ఉందన్నారు.
తిత్లీ తుఫాన్ బాధితులను కలుస్తా
తిత్లీ తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులను త్వరలోనే కలుస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. శ్రీకాకుళం ప్రాంతానికి తుఫాన్ తాకిడి తగలడం ఎంతో బాధ కలిగించిందన్నారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకుంటూనే ఉన్నానన్నారు. ఆ ప్రాంత వాసులకి మనస్ఫూర్తిగా అండగా ఉంటనన్నారు. ఇప్పటికే జనసేన పార్టీ శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలసి సహాయచర్యలో భాగం పంచుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వెళ్తే సహాయచర్యలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే వెళ్లడం లేదన్నారు. ఈనెల 15న జన కవాతు పూర్తయ్యాక 16న విశాఖకు వెళ్లి మరుసటి రోజు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను కలసుకుంటానన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్