ఆంధ్రప్రదేశ్‌

అన్యమత ప్రచారం దురదృష్టకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 20: పురాణ ప్రాశస్థ్యం కలిగిన గోదావరి తీరంలో అన్యమత ప్రచారం దురదృష్టకరమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆందోళన వ్యక్తంచేశారు. అఖండ గోదావరి నదిలో స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యం వస్తుందని దేశ వ్యాప్తంగా ఎంతోమంది భక్తులు తరలి వస్తుంటారని, అటువంటి గోదావరి తీరమంతా అన్యమత ప్రచారంతో అల్లకల్లోలమైపోవడం దురదృష్టకరమన్నారు. రాజమహేంద్రవరం అఖండ గోదావరి నదీ గౌతమి ఘాట్‌లోని శ్రీ అక్షర కోటి గాయత్రీ పీఠంలో మంగళవారం ఏపీబీఎస్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురపు శ్రీకాంత్‌శర్మతో కలిసి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ మీడియా సమావేశంలో మాట్లాడారు. పరమ పవిత్రమైన గోదావరి రేవుల్లో అన్యమత ప్రచారం చేయడం, మత మార్పిళ్లకు దిగడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలకు అధికారులు వత్తాసు పలకడాన్ని సహించబోమని సరస్వతి స్వామీజీ హెచ్చరించారు. రాజమహేంద్రవరంలోని కుమారీ టాకీస్ సమీపంలోని ఘాట్, స్థానిక మార్కండేయ ఘాట్ వద్ద అన్యమత ప్రచారం, మత మార్పిళ్లకు ప్రయత్నాలు జరగడం, హిందూ సంఘాలు అడ్డుకోవడం గురించి తెలుసుకున్న స్వరూపానందేంద్ర సరస్వతి రాజమహేంద్రవరంలో స్నాన ఘట్టాలను పరిశీలించారు. పురాణ ప్రాశస్థ్యం కలిగిన మార్కండేయేశ్వరస్వామి ఆలయం ప్రాంతంలో అన్యమత ప్రచారం జరుగుతోందన్నారు. ఇక్కడ స్నానం చేస్తే మహాపుణ్యమని దేశ వ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారన్నారు. గతంలో జరిగిన పుష్కరాల్లో అశేష భక్తజనం ఎంత ఎండలైనా లెక్క చేయకుండా, ప్రభుత్వ ఏర్పాట్లను కూడా పట్టించుకోకుండా తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించి వెళ్లారన్నారు. గోదావరి తీరంలోని స్నానఘట్టాలు కేవలం హిందూ సమాజానికి సంబంధించిన పుణ్యస్నానాలు, పితృ తర్పణాలు, యజ్ఞాలు, హోమాలు, క్రతువులు తదితర కార్యక్రమాలు చేసేందుకు ఉద్దేశించినవన్నారు. అధికార యంత్రాంగం అన్యమతాలకు కొమ్ము కాసి హిందువులకు సంబంధించిన పరమ పవిత్రమైన ఘాట్లను అన్యమత ప్రచారానికి, మత మార్పిళ్లకు అంగీకరించడం ఘోరమైన వైపరీత్యమని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల చుట్టుపక్కల అన్యమత ప్రచారం జరగకూడదని ప్రభుత్వం జీవోజారీచేసిందని, దాన్ని తుంగలో తొక్కి ఒక సామాన్య అధికారి దగ్గర నుంచి ఒక పెద్ద అధికారి వరకు ప్రభుత్వం అండతో అన్యమత ప్రచారానికి కొమ్ముకాయడమనేది దురదృష్టకరమన్నారు.
భక్తుల చెంత విశాఖ శారదా పీఠం నిలబడి దీన్నొక ఉద్యమంగా మార్చి హిందూ దేవాలయాలకు సంబంధించిన తీరం, ఘాట్‌ల ప్రాంతాన్ని కాపాడేందుకు పూర్తిస్థాయిలో నడుం బిగిస్తుందని స్వామీజీ ప్రకటించారు. స్వామీజీ ముందుగా అక్షరకోటి గాయత్రీ పీఠాన్ని సందర్శించారు. ఆలయ వ్యవస్థాపకులు సవితాల చక్రభాస్కరరావు దంపతులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. పెరుమాళ్ళ రఘునాథ్, సవితాల సుబ్రహ్మణ్యం, కేబుల్ రమణ తదితరులు స్వాగతం పలికారు. హిందూ చైతన్య వేదిక పక్షాన కన్వీనర్ పట్నాల సూరిబాబు, కో-కన్వీనర్లు దినేష్ వైష్ణవ్, మాదిరాజు శ్రీనివాస్, భమిడిపల్లి బాబు తదితరులు అన్యమత ప్రచారం, మత మార్పిళ్ల గురించి వినతిపత్రం అందజేశారు. కలగా ప్రభాకరం, భమిడిపాటి సుబ్బారావు, తేజోమూర్తుల పండు, అయ్యప్ప, బీవీ సత్యనారాయణ, ప్రసాద్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ