ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ ‘హోదా’ హోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: ఏపికి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఈనెల 22న జరగనున్న ఓటింగ్ ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలో అన్ని పార్టీలూ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తులు వేస్తుండటమే దానికి కారణం. కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఓటింగు వరకూ రావడం అనుమానంగానే ఉంది. అయినా అన్ని ప్రధాన పార్టీలూ హోదా అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకునే ఎత్తుగడలో భాగంగా ఇప్పటికే విప్ జారీ చేశాయి.
విభజన తర్వాత ఏపిలో అడ్రసు గల్లంతయిన కాంగ్రెస్ పార్టీ, హోదా అంశంతో మళ్లీ తెరపైకి రావాలన్న రాజకీయ ఎత్తుగడతో అడుగులు వేస్తోంది. ఈ అంశంలో ఆ పార్టీ తన ప్రత్యర్థులయిన తెదేపా, భాజపాను కూడా వ్యూహాత్మకంగా ఇరికించే ప్రయత్నాలకు పదునుపెడుతోంది. అసలే రాజకీయంగా సమస్యలు ఎదుర్కొంటున్న తెదేపా ఈ విషయంలో తన చిత్తశుద్ధిని చాటుకునేందుకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కూడా కెవిపి బిల్లుకు మద్దతునిస్తామని తెదేపా ఎంపిలు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు.
అయితే, స్వయంగా చంద్రబాబునాయుడు ఢిల్లీకి వచ్చి హోదాపై జరిగే ఓటింగుకు మద్దతు కూడగట్టాలని కోరుతూ, ఏపిపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ఆయనకు లేఖ రాసి, బాబును ఇరుకునపెట్టే యత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో బాబును ముద్దాయిగా చూపించాలని, కాంగ్రెస్ తన ముందున్న అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తోంది. బిల్లు ఓటింగు వరకూ రాదని తెలిసినప్పటికీ, బాబు సరైన ప్రయత్నం చేసి ఉంటే నెగ్గేదన్న వాదనను ముందస్తుగా సిద్ధం చేసుకునేందుకే, కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
అటు తెదేపా కూడా తనను ముద్దాయిగా నిలబెట్టే అవకాశం ఇవ్వకుండా, ప్రతివ్యూహానికి పదునుపెడుతోంది. విభజనకు, రాష్టద్రుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమయినప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రైవేటు బిల్లుపై ఓటింగుకు మద్దతునిస్తామని ఎంపిలు జెసి దివాకర్‌రెడ్డి, టిజి వెంకటేష్‌తో ప్రకటన చేయించింది. ఆ రకంగా తమకు బిజెపి మిత్రపక్షమయినప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న సంకేతాలిస్తోంది. తద్వారా అటు కాంగ్రెస్ విభజన పాపాన్ని మరోసారి చర్చ చేయడంతోపాటు, రాష్ట్ర ప్రయోజనాలపై తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంది. ఈ వ్యవహారంలో తెరాస రంగప్రవేశం చేయటం కొత్త పరిణామం. దీనిని ఎవరూ ఊహించలేదు. ఇది కూడా కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడగానే స్పష్టమవుతోంది. నిజానికి తమిళనాడు, కర్నాటక, ఒడిషా వంటి రాష్ట్రాలు ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని కేంద్రానికి లేఖ రాశాయి. అలాంటిది రోజూ వివిధ సమస్యలపై ఏపి సర్కారుతో ఘర్షణ పడుతున్న తెరాస, ప్రత్యేక హోదాపై జరిగే ఓటింగుకు మద్దతునిస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యం కలిగించింది. అయితే, నిశితంగా పరిశీలిస్తే ఇది కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడగానే స్పష్టమవుతుంది. ఒకవేళ ఓటింగు జరిగి ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే, ఆ తర్వాత తమకూ ఆ ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేసేందుకు ముందస్తు రంగం సిద్ధం చేసుకున్నట్లు, తెరాస మద్దతు ప్రకటన స్పష్టం చేస్తోందని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. దాంతోపాటు, తమకు రాజకీయంగా తెదేపాతోనే తప్ప, ఆంధ్ర ప్రజలతో శత్రుత్వం లేదన్న సంకేతాలిచ్చేందుకు నిర్ణయం ఉపయోగపడుతుందని విశే్లషిస్తున్నారు.
కాగా, మిత్రపక్షమైన తెదేపా సహా అన్ని పార్టీలూ హోదా అంశాన్ని అడ్డుపెట్టుకుని, ఏపిలో రాజకీయ ప్రయోజనం పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను బిజెపి నిశితంగా గమనిస్తోంది. నిజానికి బిల్లు ఓటింగు వరకూ రాదన్న విషయం అన్ని పార్టీలకూ తెలిసినా, మైలేజీ కోసమే పాట్లు పడుతున్నాయని తమకు తెలుసునని, ఆ మేరకు తాము కూడా వ్యూహరచన చేస్తున్నామని బిజెపి నేతలు చెబుతున్నారు. తెదేపా నిర్ణయాలు, చర్యలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జీవం పోసేందుకు ఉపకరిస్తాయే తప్ప, తమకు ఏపిలో పెద్దగా బలం లేని తమకు ఎలాంటి నష్టం లేదని బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఫిరాయింపులపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టే ప్రైవేటు మెంబర్ బిల్లుకు తాము కూడా మద్దతునివ్వడం ద్వారా, మిత్రపక్షమైన తెదేపాకు షాక్ ఇవ్వాలని బిజెపి ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. అసలు ఈ వ్యవహారం ఓటింగు వరకూ రాదని, ఎన్ని పార్టీలు విప్ జారీ చేసినా, ఆ రోజు గందరగోళం వల్ల సభ మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసే..పొలిటికల్ మైలేజీ కోసం ఎత్తులు వేస్తున్నాయని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు.