ఆంధ్రప్రదేశ్‌

తీర ప్రాంత భద్రతకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 20: తీర ప్రాంత భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎపి డిజిపి జెవి రాముడు పేర్కొన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోటలో రూ.47 లక్షలతో నిర్మించిన మెరైన్ పోలీసు స్టేషన్ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సువిశాల తీర ప్రాంతం ఉన్న నవ్యాంధ్రలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఉగ్రవాదుల చొరబాట్ల నేపథ్యంలో తీర ప్రాంత గస్తీ, భద్రతపై రాజీ పడకుండా ప్రభుత్వం పటిష్ట భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో వెనుకాడబోమన్నారు. ఇప్పటి వరకూ ఆరు మెరైన్ పోలీసు స్టేషన్‌లను ప్రారంభించుకున్నామని వెల్లడించారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న చింతపల్లి, జికె వీధీ పోలీస్ స్టేషన్‌లను రూ.4 కోట్లతో ఆధునీకరిచగా, డిజిడి రాముడు వాటిని రిమోట్ ద్వారా ప్రారంభించారు. విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, మెరైన్ పోలీస్ ఐజి ప్రకాశరావు పాల్గొన్నారు.

అదుపులో నక్సల్స్ కార్యకలాపాలు

కాకినాడ, జూలై 20: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ సిబ్బందికి తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు శిక్షణ కేంద్రాన్ని తక్షణం ఏర్పాటుచేయాల్సిన అవసరముందని డిజిపి జెవి రాముడు సూచించారు. బుధవారం కాకినాడలోని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం ఆవరణలో కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పోలీస్ కనె్వన్షన్ హాలును డిజిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలీస్ శాఖలో అనేక సమస్యల ఏర్పడ్డాయన్నారు. పోలీస్ సిబ్బంది నియామకాలు చేపట్టడానికి ముందు వారికి శిక్షణ ఇచ్చేందుకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
సైనికుల్లా పనిచేయాలి
కొత్తపట్నం: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలకేంద్రమైన కొత్తపట్నంలో నూతనంగా నిర్మించిన కోస్టల్ సెక్యూరిటి పోలీసుస్టేషన్‌ను బుధవారం డిజిపి జెవి రాముడు ప్రారంభించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సముద్రమార్గంనుండి దేశంలోకి చొరబడే తీవ్రవాదులను నియంత్రించే చర్యల్లో భాగంగా మెరైన్ పోలీసుస్టేషన్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే వ్యక్తులపట్ల కాని, సంస్ధలపట్లకాని పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు వెనకాడరాదని ఆదేశించారు.

విశాఖపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్‌ను రిమోట్ ద్వారా ప్రారంభిస్తున్న డిజిపి

రైళ్లలో పుష్కర సర్‌చార్జ్!

విజయవాడ, జూలై 20: రైల్వే బోర్డు ఆదేశాల ప్రకారం కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆగస్టు 12 నుండి 23వ తేదీ వరకు విజయవాడ, కృష్ణా కెనాల్ జంక్షన్, మధురానగర్, గుణదల, రాయనపాడు, గుంటూరు, రేపల్లె, పెదకూరపాడు, మంగళగిరి, విష్ణుపురం, పొందుగుల, కృష్ణ, గద్వాల్ రైల్వే స్టేషన్లలో మేళా (ఉత్సవాల) సర్‌ఛార్జి విధించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సెకండ్ క్లాస్ (సాధారణ మరియు మెయిల్/ఎక్స్‌ప్రెస్)కు, స్లీపర్ క్లాస్ (సాధారణ మరియు మెయిల్ ఎక్స్‌ప్రెస్)కు రూ.5 చొప్పున, ఎసి ఛెయిర్ కార్/ఎసి ట్రి టయిర్‌కు రూ.10, ఫస్ట్ క్లాస్ (సాధారణ మరియు మెయిల్/ఎక్స్‌ప్రెస్)కు ఎసి టు టయిర్‌కు రూ.15, ఫస్ట్ ఎసికి రూ.20 మేలా సర్‌ఛార్జి విధిస్తారు. ఇది రిజర్వ్‌డ్, అన్ రిజర్వ్‌డ్ టిక్కెట్లకు కూడా వర్తిస్తుంది.అయితే టికెట్ల బేసిక్ ఛార్జి రూ.15 అంతకంటే తక్కువ ఉంటే ఈ సర్‌ఛార్జి విధించరు. పుష్కరాల రోజుల్లో పైన తెలిపిన స్టేషన్ల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి, పుష్కర ప్రాంతాల్లోని స్టేషన్లనుండి తిరుగు ప్రయాణం టికెట్‌ను ఇతర స్టేషన్లనుండి బుక్ చేసుకునే వారికి కూడా ఈ సర్‌ఛార్జి విధిస్తారు. అయితే దేశంలోని ఇతర రైల్వేస్టేషన్ల నుండి పుష్కర స్టేషన్లకు సింగిల్ జర్నీ టికెట్‌పై వచ్చే వారికి మాత్రం ఈ సర్‌ఛార్జి విధించరు. మేళా సర్‌ఛార్జి కలపకుండా ఇప్పటికే రిజర్వ్ అయిన టిక్కెట్ల విషయంలో ప్రయాణికులు ఈ ఛార్జీలను రైళ్లలోని టిటిఇలకు చెల్లించాలి. లేదా ప్రయాణికులు బుకింగ్ కౌంటర్లలో కూడా చెల్లించవచ్చు.
నిర్వాసితులకు పారదర్శకంగా పరిహారం: కలెక్టర్ జానకి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జూలై 20: నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయం ఏర్పాటుకు సేకరించిన భూములకు నష్టపరిహారాన్ని పారదర్శకంగా ఎటువంటి అవకతవకలకు అవకాశమివ్వకుండా రైతులకు వారి బ్యాంక్ ఖాతాలో ఆన్‌లైన్ పద్ధతిలో జమచేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం.జానకి పేర్కొన్నారు. బుధవారం దగదర్తిలో ఏర్పాటు చేసిన విమానాశ్రయ భూముల రైతులకు నష్టపరిహార పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రికార్డుల పరిశీలన, బ్యాంకు ఖాతాలు తెరవడం, ఎవరెవరికి ఎంతెంత చెల్లించడమనేది ఫోటో ద్వారా, వీడియో ద్వారా చిత్రీకరించడం జరుగుతుందన్నారు. దీని వలన భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. ఈ భూసేకరణ మొత్తం నాలుగు రకాలుగా ఉందని, పట్టా భూములు, డికెటి, సిజెఎఫ్‌ఎస్, ప్రభుత్వ భూములని వివరించారు. 606.69 ఎకరాలను రైతుల నుంచి సేకరించామన్నారు. వీటిలో 336.32 ఎకరాలు పట్టా భూములు, 104.92 ఎకరాలు డికెటి, 129.46 ఎకరాలు సి జె ఎఫ్ ఎస్, 25.41 ఎకరాలు ప్రభుత్వ భూములని తెలిపారు. కె.కె.గుంట గ్రామంలో రైతులు ముందుకొచ్చి తమకు చెందిన 74 ఎకరాల సి జె ఎఫ్ ఎస్ భూముల్ని విమానాశ్రయం కోసం ఇస్తామని తెలుపగా ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయిస్తామని ఆమె హామీనిచ్చారు. గ్రామానికి చెందిన దావా మాలకొండయ్య అనే రైతుకు 2.87 ఎకరాలకు సంబంధించి రూ.37.31లక్షలు మంజూరు ఉత్తర్వులను కలెక్టర్ తొలుత అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కె.లలితమ్మ, సంయుక్త కలెక్టర్ ఇంతియాజ్, డి ఆర్ ఓ మార్కండేయులు, కావలి ఆర్డీవో లక్ష్మీ నరసింహం, ఎల్ డి ఎం వెంకట్రావు, ఎస్ బి ఐ ఆర్ ఎం ప్రకాశరావు, తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్ సుబ్రమణ్యేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బండ విరిగిపడి నర్సరీ విద్యార్థిని మృతి
గోరంట్ల, జూలై 20: తరగతి గదిలోని ఓ బండ విరిగి మీద పడడంతో నర్సరీ విద్యార్థిని తన్మయి సాయి(3) మృతి చెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గోరంట్లలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గోరంట్లకు చెందిన నాగరాజు, గిరిజమ్మ దంపతులు కూడూరు తన్మయి సాయి స్థానికంగా ఉన్న శాంతినికేతన్ పాఠవాలలో నర్సరీ చదువుతోంది. బుధవారం పాఠశాలకు వెళ్లిన సాయి భోజనం చేసిన తరువాత తరగతి గదిలో ఉండగా బండ విరిగి వీపుపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. లిక మృతదేహంతో బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.
గొర్రెల మందపెకి దూసుకెళ్ళిన లారీ
ముండ్లమూరు, జూలై 20: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని పోలవరం క్రాస్‌రోడ్డు వద్ద గొర్రెల మందపై లారీ దూసుకువెళ్ళటంతో 23 గొర్రెలు మృతిచెందగా, 15గొర్రెలకు తీవ్రగాయాలైన సంఘటన బుధవారం తెల్లవారు జామున జరిగింది. ప్రకాశంజిల్లాలో వర్షం పడినట్టు తెలియడంతో గుంటూరు, ప్రకాశంజిల్లాలకు చెందిన ఐదుగురు తమ 800గొర్రెలను కారంచేడు, స్వర్ణ, రంగప్పనాయుడువారిపాలెం గ్రామాలకు మేతకు తోలుకెళ్లారు. పోలవరం క్రాస్‌రోడ్డు వద్దకు వేకువజామున మూడుగంటలకు రాగానే అనంతపురంనుండి విజయవాడకు కీర దోసకాయల లోడుతో వెళ్తున్న లారీ మందపైకి దూసుకువచ్చింది.
ప్రకాశం, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటిల జీఓ విడుదల
వేంపల్లె, జూలై 20: రాష్ట్రంలో ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ట్రిపుల్ ఐటిలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ నెం.48 జారీ చేసింది. ప్రకాశం జిల్లా ట్రిపుల్ ఐటి వెంకటేశ్వర యూనివర్శిటీ పరిధిలో, శ్రీకాకుళం జిల్లా ట్రిపుల్ ఐటి ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో ఉంటాయని కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటి డైరెక్టర్ భగవన్నారాయణ, ఏఓ విశ్వనాధరెడ్డి బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో సొంత భవనాలు లేకపోవడంతో ఒంగోలుకు సంబంధించి ఆర్కె వ్యాలీలో, శ్రీకాకుళంకు సంబంధించి నూజివీడులో తరగతులు నిర్వహిస్తారన్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటికి 770 సీట్లు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటికి 1230 సీట్లు కేటాయించారన్నారు.
రాయపాటికి సిఎం పరామర్శ
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జూలై 20: నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సతీమణి లీలాకుమారి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బుధవారం సిఎం గుంటూరులో రాయపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తొలుత లీలాకుమారి చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం ఆనందంగా 50 ఏళ్ల వైవాహిక జీవిత వేడుకలు రాయపాటి దంపతులు జరుపుకున్నారు.. విధి.. చాలా విచిత్రమైంది.. అంతలోనే లీలాకుమారి మృతి చెందడం బాధాకరమన్నారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, తెనాలి శ్రావణ్ కుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, కలెక్టర్ కాంతిలాల్ దండే, నగర కమిషనర్ నాగలక్ష్మి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ కమిషన్ ప్రతినిధి ఎండి హిదాయత్ సానుభూతి తెలిపారు.

ఆలయాల ఇవోలుగా
ఐఎఎస్ అధికారులు
విజయవాడ, జూలై 20: ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ ఆలయాలకు ఇక నుండి ఐఎఎస్ అధికారులను ఇవోలుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇవోగా ఐఎఎస్ అధికారిణి ఎ.సూర్యకుమారిని నియమించారు. కొద్ది రోజుల వ్యవధిలోనే శ్రీశైలం దేవస్థానానికి సైతం ఐఎఎస్ అధికారిని నియమించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈ రెండు దేవస్థానాలకు ఐఎఎస్ అధికారులను ఇవోలుగా నియమించి వీరి కింద జెఇవోలుగా దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన సీనియర్ ఇవోలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం, శ్రీశైలం, తిరుపతమ్మ దేవాలయం (పెనుగంచిప్రోలు) తదితర ఆలయాలకు త్వరలో ఐఎఎస్ అధికారులను ఇవోలుగా నియమించే అవకాశం ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి జెఇవోగా గతంలో దుర్గగుడి ఇన్‌ఛార్జిగా పనిచేసిన ఎస్‌ఎస్ చంద్రశేఖర్ ఆజాద్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దుర్గగుడి ఇన్‌ఛార్జిగా ఆజాద్ ఉన్న సమయంలోనే సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో దుర్గగుడిని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

స్విస్ ఛాలెంజ్‌పై
బహిరంగ చర్చకు రెడీ!
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జూలై 20: స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ప్రపంచమంతటా ఆమోదిస్తుంటే, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ కొత్తగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టి దోపిడీ చేస్తున్నారంటూ కాంగ్రెస్, వైసిపి నాయకులు ఆరోపణలు చేస్తున్నారని, స్విస్ ఛాలెంజ్‌పై బహిరంగ చర్చకు రావాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు సవాల్ విసిరారు. బుధవారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎపి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సింగపూర్‌కు చెందిన సెంచ్ కార్ఫ్, అసెండాస్-సింగ్ బ్రిడ్జ్ కంపెనీలు సింగపూర్ ప్రభుత్వానికి చెందిన కంపెనీలని, ఇవి ప్రైవేటు కంపెనీలు కావన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. చిలీ, ఫిలిప్పైన్స్, సౌత్ కొరియా, అర్జింటినా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, తైవాన్ తదితర దేశాల్లో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అమలు చేసి విజయం సాధించారన్నారు. కేల్కర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే విధానాన్ని అనుసరిస్తుందన్నారు.

‘గోదావరి’ తొక్కిసలాటపై
కలెక్టర్‌కు హెచ్‌ఆర్‌సి నోటీసు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, జూలై 20: తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్‌కు మానవ హక్కుల సంఘం (హెచ్ ఆర్ సి) పుష్కరాల తొక్కిసలాట ఘటనపై నోటీసు జారీ చేసింది. గోదావరి మహా పుష్కరాలు ప్రారంభం రోజు గత ఏడాది జూలై 14న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై హెచ్‌ఆర్‌సి వచ్చే సెప్టెంబర్ 13వ తేదీన విచారణకు ఆదేశించింది. ఈ తేదీలోగా జిల్లా కలెక్టర్ తొక్కిసలాట ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. పుష్కర తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులకు సక్రమరీతిలో నష్టపరిహారం ఇవ్వలేదని ఫిర్యాదు చేస్తూ పుష్కర తొక్కిసలాట ఘటనలో బాధితుల తరపున పోరాటం సాగిస్తోన్న ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు హెచ్‌ఆర్ సికి ఫిర్యాదు చేయడంతో హెచ్‌ఆర్‌సి కలెక్టర్‌కు నోటీసు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనలో మొత్తం 51 మంది క్షతగాత్రులయ్యారని పోలీసు అధికారులు రెవెన్యూకు నివేదిక ఇచ్చారు. ఇందులో 20 మంది వరకు తీవ్రంగా గాయపడినవారున్నారని నివేదికలో పేర్కొన్నారు. అయితే తీవ్రంగా గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం యాభై వేల చొప్పున, రాష్ట్రం గాయపడిన వారికి 25వేల చొప్పున ప్రకటించారు. కలెక్టర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కేవలం ఆరుగురు మాత్రమే తీవ్రంగా గాయపడినవారున్నారని పేర్కొన్నారు. గాయపడినవారు కొంతమంది ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వైద్యం చేయించుకుని వెళ్లిపోయారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినవారు మాత్రమే గాయపడినవారి జాబితాలో నమోదయ్యారు. ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎక్స్‌గ్రేషియో అందించడానికి జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంగా ఇచ్చిన నివేదికే కారణమని ఆరోపిస్తూ న్యాయవాది ముప్పాళ్ల ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఎపి మానవ హక్కుల సంఘానికి ముప్పాళ్ల ఫిర్యాదు చేశారు.