ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో ఉన్నది ప్రజాస్వామ్యమా?.. ఆటవిక రాజ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 23: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా భారత రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకోకుండానే, ఓటు హక్కు ఎలా ఉంటుందో తెలియకుండానే దళితులు, అణగారిన వర్గాలు మరణించే దీన, దారుణ స్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు అన్నారు. బుధవారం స్థానిక పద్మావతి అతిధిగృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఓటుహక్కు అంటే ఏమిటో తెలియని, ఓటుహక్కును ఇప్పటివరకు వినియోగించుకోని పరిస్థితి ఉందన్నారు.
అగ్రవర్ణాల దాడులు, దౌర్జన్యాలపై తనకు అందిన ఫిర్యాదుతో చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం, పాకాల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించానని అన్నారు. తిరుపతి సమీపంలోని రామచంద్రాపురం మండలంలోని ఎన్‌ఆర్ కమ్మపల్లి, రావిళ్లవారిపల్లి, పారకాల్వ, కొత్తకండ్రిగ గ్రామాలలో ఇప్పటికీ దళితులు, వెనుకబడిన వర్గాలు ప్రాథమిక హక్కును వినియోగించుకోని దుస్థితి ఉందన్నారు. వారు చెప్పిన విషయాలు తనను నిర్ఘంతపోయేలా చేశాయన్నారు. అగ్రవర్ణాల వారు దళితులు, వెనుకబడిన వర్గాల వారి వేలికి ఇంకు పూసి పంపించి వేసి తమకు ఇష్టమైన వారికి ఓటు వేసుకుంటున్నారని అన్నారు.
అగ్రవర్ణాల వారిని కాదని ఓటు వేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై దాడులు జరుగుతాయని మహిళలు తన ముందు వాపోయారన్నారు. దీనినిబట్టి చూస్తే రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా? లేకుంటే ఆటవిక రాజ్యమా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఓటుహక్కు అడిగితే పొలాల్లోకి రానివ్వరని, దారులు ఇవ్వకుండా చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. పాకాల మండలం మెగరాల పంచాయతీ కృష్ణాపురంలో ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. అగ్రవర్ణాల దాడులతో దళితులు ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితిలో లేరన్నారు. చంద్రగిరి మండలం ముంగిళపట్టు గ్రామంలో అగ్రకులాలను కాదని రాజకీయ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్న దళితులపై విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నాయన్నారు. దళితవాడలకు చెందిన ఆడపిల్లలను పాఠశాలలకు రానివ్వకుండా హుకుం జారీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరైనా వస్తే వారు ఉపయోగించే మరుగుదొడ్లకు నీటి సరఫరా ఆపివేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులను తాను దేశ రాష్టప్రతి, జాతీయ ఎన్నికల ప్రధానాధికారి, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అధికారుల సమక్షంలో దళితులు కొన్ని దాడులకు సంబంధించిన వివరాలను చెప్పడంతో సుమోటోగా కేసులు నమోదు చేయాలని పోలీసులను తాను ఆదేశించడం జరిగిందని కమిషన్ సభ్యులు రాములు చెప్పారు. దళితుల ఓటుహక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని, లేకుంటే పక్కనున్న పోలింగ్ బూత్‌ల్లో ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. దళితులు స్వేచ్ఛగా ఓటు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు.