ఆంధ్రప్రదేశ్‌

తప్పించుకున్న చిరుత...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయపురం, ఫిబ్రవరి 5: తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం సాయంత్రం హంగామా సృష్టించి, కొబ్బరిచెట్టుపై నక్కిన చిరుత అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో తప్పించుకుని పారిపోయింది. అటవీ శాఖ అధికార్లు ఏర్పాటు చేసిన వలలు, బోనును వెక్కిరిస్తూ చిరుత చీకటిలో కలిసిపోయింది. దీనితో చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చిరుత జాడ కోసం అటవీ శాఖాధికార్లు గాలింపు చేపట్టినా, మంగళవారం రాత్రి వరకూ ఫలితం లేకపోయింది. వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలోని పంట పొలాల్లో సోమవారం సాయంత్రం ప్రత్యక్షమైన చిరుత నలుగురిని గాయపరచి, కొబ్బరి చెట్టుపై నక్కిన సంగతి విదితమే. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసు, అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు. అప్పటికే చీకటి పడటంతో ఆ ప్రాంతంలో జనరేటర్ సాయంతో ఫ్లడ్ లైట్లు ఏర్పాటుచేశారు. చిరుత ఉన్న కొబ్బరి చెట్టు చుట్టూ వలలు పన్ని, ఒక బోను సైతం ఏర్పాటుచేశారు. డీఎఫ్‌వో నందనీ సలారియా తదితర అధికార్లు అక్కడే మకాంచేశారు. చిరుతను మత్తు ఇంజక్షన్లతో పడగొట్టడానికి విశాఖ నుండి ప్రత్యేక బృందాన్ని సైతం రప్పించారు. అయితే ఎంతకీ చిరుత చెట్టు దిగకపోవడంతో వ్యూహాత్మకంగా ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఫ్లడ్ లైట్లు నిలిపివేశారు. చీకటిలో కిందకు దిగే చిరుత తాము ఏర్పాటుచేసిన వలలో గాని, బోనులో గాని చిక్కుకుంటుందని అధికార్లు భావించారు. అయితే అధికార్లు చేసిన ఏర్పాట్లన్నిటినీ వెక్కిరిస్తూ నెమ్మదిగా చెట్టు దిగిన చిరుత చీకట్లో మాయమయ్యింది. ఒక్కసారిగా తేరుకున్న అటవీ శాఖ అధికార్లు చిరుత వెళ్లిన దిశలో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఇక మంగళవారం ఉదయం నుంచి ఆ ప్రాంతంలో హైడ్రామా నెలకొంది. చిరుతను అక్కడ చూశాం, ఇక్కడ చూశాం అంటూ వస్తున్న సమాచారంతో అధికారులు పరుగులు తీశారు. అయితే ఫలితం లేకపోయింది. మళ్లీ చిరుత ఎవరికీ కనిపించిన దాఖలాల్లేవు. దీనితో పరిసర గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు అమలాపురం రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంట పొలాలపై నిఘా వేశారు. స్థానిక చెంచు జాతీయులు కూడా వారి కుక్కలతో గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి అనంత శంకర్ మాట్లాడుతూ ఒక కిలోమీటరు లేదా రెండు కిలోమీటర్లలో కొత్త ప్రదేశం కాబట్టి దాగి ఉండవచ్చునని చెప్పారు. ఆ చిరుత కనిపించగానే దానిని బంధించేందుకు సిద్ధంగా అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. చిరుత పులి సంచారంతో నేపథ్యంలో మంగళవారం ర్యాలి, అంకంపాలెం గ్రామాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు ఎంఈవో వరప్రసాద్ తెలిపారు.
అటవీ శాఖ అధికార్లపై ఆగ్రహం
చెట్టుపై నక్కి కళ్లకు కనిపిస్తున్న చిరుతను చేజేతులా వదిలేశారంటూ అంకంపాలెం గ్రామస్థులు అటవీశాఖ అధికార్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం వేకువజామున చిరుత తప్పించుకున్నట్టు తెలిసిన వెంటనే ఆ ప్రాంతంలోనే గుమిగూడివున్న గ్రామస్థులు అధికార్లను నిలదీశారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామీణ ప్రాంతం కావడంతో తమ పశువులకు రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
చిత్రం.. చిరుత వచ్చిందనే ప్రచారంతో లొల్ల గ్రామంలో గస్తీ తిరుగుతున్న యువకులు