ఆంధ్రప్రదేశ్‌

సతాయంచిన ఈవీఎంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/తిరుపతి, ఏప్రిల్ 11: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు చోట్ల ఇవిఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. నెల్లూరు నగరం, రూరల్, కోవూరు, కావలి తదితర నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో ఇవిఎంలు మొరాయించాయి. సాంకేతిక సిబ్బంది సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేక పోయారు. దీంతో ఇటువంటి చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల సమయానికి జిల్లాలో 67 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా కొన్ని చోట్ల క్యూలైన్లలో ఓటర్లు వేచి ఉండడంతో పూర్తి వివరాలు అందాల్సి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సమయంలో పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ పార్టీల నడుమ నువ్వానేనా అనేలా పోరు జరుగుతుండడంతో గెలుపు కోసం ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కొన్ని చోట్ల ఘర్షణకు దిగారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని పుల్లనీళ్లపల్లి గ్రామంలో వైసీపీ ఏజెంట్‌ను టీడీపీ నాయకులు అభ్యంతరం పెట్టడంతో అక్కడకు చేరుకున్న వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి వర్గీయులకు టీడీపీ వర్గీయులకు ఘర్షణ తలెత్తింది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇడిమేపల్లి గ్రామంలో టీడీపీ వర్గీయులకు, వైసీపీ వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. అదే నియోజకవర్గ పరిధిలో స్వతంత్ర అభ్యర్థి విజయరాజ్‌పై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్వగ్రామమైన తోడేరులో వైసీపీ వర్గీయులు దాడి చేశారు. జిల్లాలోని చిట్టమూరు మండలం బురదపల్లి, కుమ్మరిపాలెం గ్రామాల్లో ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. తమ ప్రాంతానికి ఏ పార్టీ నాయకులు ఎటువంటి అభివృద్ధి చేయలేదని నిరసిస్తూ పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
అలాగే చిత్తూరు జిల్లాలో కూడా పలుచోట్ల ఈవిఎంలు మొరాయించాయి. దీంతో ప్రాంతాల్లో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. నాయకుల వినతితో కొంత మంది పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లినా అనేక మంది తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. సుమారు 2 గంటల పాటు జరిగిన పోలింగ్‌లో 13 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అటు తరువాత మధ్యాహ్నం నుంచి ఒక మోస్తరుగా ఓట్లు పోలయ్యాయి. సూర్యతాపం తగ్గిన తరువాత ఓటర్లు తిరిగి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈవీఎంలు మొరాయించిన చోట పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైన చోట ముగింపు సమయం 6 గంటల వరకు ఎవరైతే క్యూలైన్లో ఉంటారో వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఓటర్లు ఆనందం వ్యక్తం చేశారు.
తొలి ఓటు వేసి యువతలో ఆనందం
తొలిసారిగా ఓటు హక్కును పొంది, తమ తల్లిదండ్రులతో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న యువతలో ఎనలేని ఆనందం తొణికిసలాడింది. ఓటు హక్కును వినియోగించుకునే విధానం తల్లిదండ్రులు చెప్పినా పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన యువతకు సిబ్బంది సవివరంగా వివరించడంపై యువత హర్షం వ్యక్తం చేసింది.
పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ బాబుపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని ఆయన అనుయాయులు ఆసుపత్రికి తరలించారు. గుర్రం కొండ మండలం నదిమి కండ్రిక గ్రామంలో 51 ఓట్లు తేడారావడంతో పోలింగ్ నిలిపివేశారు.
గుర్రంకొండ మండల గెరికుంటపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుమారునిపై వైకాపా కార్యకర్తలు దాడికి యత్నించారు. పలమనేరులో పోలింగ్ ముగిసే సమయానికి 73శాతం పోలింగ్ నమోదైంది. రొంపిచర్ల మండలంలో 79శాతం పోలింగ్ నమోదైంది. గంగాధర నెల్లూరులో చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నియోజకవర్గంలో గురువారం జరిగిన ఎన్నికల్లో 85శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి వరప్రసాద్‌రావు తెలిపారు.
గంగాధరనెల్లూరు, పాలసముద్రం, వెదురుకుప్పం, కార్వేటినగరం, పెనుమూరు, ఎస్‌ఆర్ పురం మండలాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ పూర్తయినట్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హరికృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణస్వామి వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తంబళ్ళపల్లెలో 83.2శాతం పోలింగ్ నమోదైంది. ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగి సాయంత్రం ఆరుగంటలకు పోలింగ్ భారీగా నమోదయింది. జిల్లాకేంద్రం ఒంగోలులో టీడీపీ, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడగా పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. అడ్డుపడిన ఒక వైకాపా మహిళా కార్యకర్తను పోలీసులు లాఠీలతో చితకబాదారు. ఒంగోలు సెయింట్ థెరిస్సా హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఈ సంఘటన జరిగింది.
సాయంత్రం నాలుగు గంటలకు యర్రగొండపాలెం నియోజకవర్గంలో 51.59 శాతం, దర్శి నియోజకవర్గంలో 73.2 శాతం , పర్చూరులో 64శాతం, అద్దంకిలో 68 శాతం, చీరాలలో 65శాతం, సంతనూతలపాడులో 65 శాతం, ఒంగోలులో 65 శాతం, కందుకూరులో 62.2శాతం పోలింగ్ నమోదయింది. కొండేపి నియోజకవర్గంలో 60.2 శాతం, మార్కాపురంలో 65.01 శాతం, గిద్దలూరులో 63శాతం, కనిగిరిలో 57.75 శాతం ఓట్లు పోలయ్యాయి. జిల్లావ్యాప్తంగా సరాసరిన 63.36శాతం ఓట్లు పోలయ్యాయి. కలెక్టర్ వినయ్‌చంద్ గురువారం సాయంత్రం 5.20కి స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు, వైకాపా పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి దంపతులు, ఒంగోలు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి దంపతులు, ఒంగోలు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ దంపతులు, జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, మంత్రి తనయుడు శిద్దా సుధీర్‌బాబు దంపతులు దర్శిలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

చిత్రాలు.. కోడుమూరులో ఓటు వేసిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి..
*నగరిలో ఓటు హక్కు వినియోగించుకున్న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ కె రోజా