ఆంధ్రప్రదేశ్‌

సీఈసీ వైఖరి నిరంకుశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: కేంద్ర ఎన్నికల కమిషన్ నిరంకుశ, అసమర్థ, పక్షపాత, మొండి వైఖరి భారత ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారడం దురదృష్టకరమని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. శనివారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమిషన్ కంచే చేను మేసినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఈసీ అసమర్థత, వైఫల్యాల వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఎన్నికలకు ఓటర్ల జాబితా గుండెకాయ లాంటిదన్నారు. అలాంటి ఓటర్ల జాబితాలో అనర్హులకు చోటు, అర్హులైన వారి పేర్లు తొలగించడం అదీ లక్షల సంఖ్యలో జరగటం ఈసీ అసమర్థతకు తార్కాణమన్నారు. విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ జరుగుతున్నా చేష్టలుడిగి ఈసీ చూస్తోందన్నారు. కొన్ని చోట్ల వెయ్యి నుంచి రూ. 10వేల వరకు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారని, ముక్కుపుడకలు, టోకెన్లు కూడా పంపిణీ చేశారన్నారు. సీఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీ అయితే, పోలింగ్ 12వ తేదీ కూడా జరపడం షెడ్యూల్‌కే విరుద్ధమన్నారు. రూ. 9వేల కోట్ల డబ్బు ఖర్చు చేసి వీవీ ప్యాట్లను కొని వాటిని లెక్కించకపోవడం వల్ల ప్రయోజనం ఏమిటని ఈసీనీ ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా 23 జాతీయ, ప్రాంతీయ పార్టీలు వీవీ ప్యాట్లను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. ప్రపంచంలో 173 దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలు ఇప్పటికీ బ్యాలెట్‌నే ఉపయోగిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పెనుగాలులు, వడగండ్ల వానలతో పంట నష్టం జరిగి రైతు నష్టపోతున్న పరిస్థితుల్లో కోడ్ అంటూ మీన వేషాలు లెక్కించడం సబబా అని ప్రశ్నించారు. పంటలు కళ్లాల్లోనే ఉన్నాయన్నారు. కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. ఈ సమయంలో రైతుల కష్టాలను, ప్రజల బాధలను సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మొండి వైఖరిని విడనాడి మిగిలిన ఐదు విడతల పోలింగ్‌లో అయినా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని తులసీరెడ్డి పేర్కొన్నారు.