ఆంధ్రప్రదేశ్‌

పింఛన్ల పంపిణీలో రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, ఆగస్టు 3: ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఆది నుండి టిడిపిలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. బుధవారం బల్లికురవ మండల కేంద్రంలో పింఛన్ల పంపిణీలో చోటుచేసుకున్న ఉద్రిక్తత ఘటనలే నిదర్శనం. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైకాపా నుండి టిడిపిలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా తమ వర్గం వారికి పింఛన్లు మంజూరు చేయించుకున్నారు. ఈనేపధ్యంలో పింఛన్ల పంపిణీ చేసేందుకు బల్లికురవ ఎంపిడిఓ కార్యాలయంలో సమాయత్తమయ్యారు. కాని బల్లికురవ ఎంపిపి కరణం వర్గీయుడు కావడంతో ఎంపిపి అనుమతి లేకుండా ఎమ్మెల్యే ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టడం కరణం వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. సాగర్ నీటి విషయం, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో మాట్లాడేందుకు బుధవారం ఉదయం అధికారులతో ఎంపిడిఓ కార్యాలయంలో కరణం బలరాం, నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్ సమావేశమయ్యారు. ఇదే కార్యాలయంలో ఎమ్మెల్యే ద్వారా పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. లోపల బలరాం ఉండడంతో, ఎమ్మెల్యే లోపలకు వెళితే ఘర్షణలు చోటుచేసుకుంటాయని భావించిన డిఎస్‌పి రాంబాబు ఎమ్మెల్యేను రోడ్డుపై నిలిపివేశారు. ఎంతసేపటికి బలరాం వర్గీయులు బయటకు రాకపోవడంతో కనీసం ఎంపిడిఓనైనా బయటకు పిలిపిస్తే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. బయటకు రావాలని ఎంపిడిఓకు డిఎస్‌పి కబురు పంపించినా ఆయన బయటకు రాకపోవడంతోఎమ్మెల్యే తన సొంత నగదును పింఛన్లుగా అందచేశారు. షామియానాలు పడగొట్టడం, కార్యాలయాన్ని తన అనుచరులతో స్వాధీనం చేసుకోవడం ఇవన్నీ చిల్లర చేష్టలుగా ఎమ్మెల్యే గొట్టిపాటి అభివర్ణించారు. ఈసందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

మైనర్‌పై సామూహిక అత్యాచారం
కావలి, ఆగస్టు 3: నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వెంగళరావునగర్ ప్రాంతానికి చెందిన సుమారు 16 ఏళ్ల ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఆ బాలికకు వరసకు సోదరుడిగా చెబుతున్న ఒకడు తన ఇంటికి వస్తే డబ్బులు ఇస్తామని ఆశచూపి ఆటోలో తీసుకెళ్లి మరో ఇద్దరు యువకులను వెంటబెట్టుకొని పట్టణ పడమటి శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ సంఘటన మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జరగగా అర్ధరాత్రి ఒంటి గంటకు బాధిత బాలిక 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటనను పోలీసులకు తెలిపింది. అప్రమత్తమైన సిఐ రమణ, ఎస్‌ఐ అన్వర్ బాషా వెంటనే స్పందించి బాధితురాలిని వైద్యపరీక్షల కోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. అఘాయిత్యానికి పాల్పడ్డ యువకులను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. వారిలో ఒక అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
భద్రాద్రిలో పెరుగుతున్న పుష్కర రద్దీ
భద్రాచలం, ఆగస్టు 3: ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరికి పుష్కర తాకిడి కొద్దికొద్దిగా పెరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు భద్రాచలం తరలివస్తున్నారు. నాల్గవరోజు బుధవారం పుష్కరస్నానం చేయడానికి వచ్చిన భక్తుల సంఖ్య భారీగానే కనిపించింది. తరలివచ్చిన భక్తులు గోదావరి ఒడ్డున పిండప్రదానాలు చేశారు. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసి పునర్వసు మండపంలోని శ్రీసీతారామచంద్రస్వామి ప్రచారమూర్తులను దర్శించుకుంటున్నారు. కాగా అంత్యపుష్కరాల్లో చిన్నపాటి అపశృతి చోటు చేసుకుంది. కల్యాణకట్ట సమీపంలో గుర్తు తెలియని భక్తుడు ఒకరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అధికారులు భావిస్తున్నారు. దీంతో కొద్ది సేపు ఉదయం భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మృతదేహాన్ని తరలించారు. శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా రామాలయంలో నిత్యకల్యాణ మూర్తులకు, ధ్యానమందిరం వద్ద ఉన్న రంగనాథస్వామికి స్నపన తిరుమంజనం చేశారు.
ఒకేరోజు 10 కీళ్ల మార్పిడి ఆపరేషన్లు
గుంటూరు, ఆగస్టు 3: ఒక వైద్యుడు - ఒక ఉచిత శస్తచ్రికిత్స నినాదంతో దేశవ్యాప్తంగా 3,4 తేదీల్లో 5 వేల ఆపరేషన్లకు పైబడి నిరుపేదలకు ఉచితంగా చేయనున్నట్లు ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుధీర్ కపూర్ పేర్కొన్నారు. బుధవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రముఖ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి పర్యవేక్షణలో ఒకేరోజు 10 మందికి మోకీళ్ల మార్పిడి శస్తచ్రికిత్సలు నిర్వహించారు. ఆపరేషన్లను దగ్గరుండి పరిశీలించిన డాక్టర్ సుధీర్‌కపూర్ విలేఖర్లతో మాట్లాడుతూ ఈ నెల 4న బోన్ అండ్ జాయింట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 3,4 తేదీల్లో ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు కనీసం ఒక్క నిరుపేదకైనా ఉచితంగా శస్తచ్రికిత్స చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 5 వేల ఆపరేషన్లు నిర్వహించి జాతీయ రికార్డును నెలకొల్పుతామని చెప్పారు. దీనికి చొరవచూపి సొంతంగా ఇంప్లాంట్స్ అందించడంతో పాటు స్వయంగా ఆపరేషన్లు చేసిన బూసిరెడ్డి నరేంద్రరెడ్డిని అభినందించారు.
హోదాపై కాంగ్రెస్, బిజెపి డ్రామా: ప్రత్తిపాటి
తాడేపల్లి, ఆగస్టు 3: నవ్యాంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్ బిజెపి డ్రామాలాడుతున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని బైపాస్‌రోడ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మండల టిడిపి కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌లో జరిగిన చర్చకు చట్టబద్ధత, విలువ లేకపోతే, రాజ్యాంగానికి ఏమాత్రం విలువిస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ నెల 12న ప్రారంభంకానున్న కృష్ణాపుష్కరాలకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్ తప్పనిసరి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఆగస్టు 3: ప్రజాప్రతినిధుల విషయంలో ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రొటోకాల్ నిబంధనలు విధిగా పాటించాలని రాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజేస్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని తెలిపారు. విజయనగరం పర్యటన సందర్భంగా బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ సూర్యారావు మాట్లాడుతూ ప్రొటోకాల్ విషయంలో జిల్లా నుంచి ఐదు ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని, చిన్న సమస్యల కారణంగా జిల్లా స్థాయిలోనే వాటిని పరిష్కరించాలని చెప్పారు. పని ఒత్తిడి, అత్యవసర పనులు ఉన్న సందర్భంలో అధికారులు తమ ఇబ్బందులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువస్తే ఇబ్బందులు ఉండవని ఆయన సూచించారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా ప్రజా ప్రతినిధులకు తగిన గౌరవ మర్యాదలను అధికారులు పాటించాలని చెప్పారు. ప్రజాప్రతినిధుల విషయంలో పాటించవలసిన ప్రొటోకాల్ అంశాలను తెలిపే ప్రభుత్వ ఉత్తర్వులను అన్ని శాఖల అధికారులకు పంపించాలని సూచించారు.
కొనసాగుతున్న అల్పపీడనం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 3: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. ఉత్తర ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ దిశగా గాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
నాగలాపురం చెక్‌పోస్టుపై ఏసిబి దాడులు
నాగలాపురం, ఆగస్టు 3: చిత్తూరు జిల్లా నాగలాపురంలోని చెన్నై-పుత్తూరు జాతీయ రహదారిలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టుపై బుధవారం తిరుపతి ఎసిబి అధికారులు దాడి చేశారు. ఈ చెక్‌పోస్టులో ప్రభుత్వ ఆదాయం కంటే 34,080 రూపాయలు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. ఎసిబి డిఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు నాగలాపురం వాణిజ్య పన్నుల చెక్‌పోస్టులో వచ్చి వెళ్లే వాహనదారుల నుండి అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం రావడంతో బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో చెక్‌పోస్టుపై దాడి చేశామన్నారు. చెక్‌పోస్టులో ప్రైవేటు వ్యక్తులు కృష్ణయ్య వద్ద 15 వేలు, ఉమాపతి వద్ద 4 వేల 80 రూపాయలు, గ్యాస్ సిలిండర్ దగ్గర రూ.10 వేలు, వంట గదిలో రూ.3వేలు, ఇన్వర్టర్ బ్యాటరీ దగ్గర రూ.2వేలు, మొత్తం రూ. 34,080 ఉన్నట్లుగా గుర్తించినట్లు వివరించారు
కమ్యూనిస్టు నేత చండ్ర ఆజాద్ మృతి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఆగస్టు 3: సిపిఐ అగ్రనేత దివంగత చండ్ర రాజేశ్వరరావు ఏకైక కుమారుడు చండ్ర చంద్రశేఖర్ ఆజాద్ (75) బుధవారం విజయవాడలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆజాద్ గత కొంతకాలంగా ఉబ్బసంతో బాధపడుతున్నప్పటికీ దైనందిన కార్యక్రమాలు యధావిథిగానే చేసుకుపోతున్నారు. మంగళవారం రాత్రి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతుండటటాన్ని కుటుంబ సభ్యులు గమనించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే బుధవారం ఆయన కన్నుమూశారు. వీరికి భార్య, ఇద్దరు కుమారులు కలరు. మరణానంతరం ఆజాద్ నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు స్వేచ్ఛా గోరా ఐ బ్యాంకుకు దానం చేశారు. ఆజాద్ మరణవార్త తెలిసిన వెంటనే వివిధ రాజకీయ పక్షాల నాయకులు ఆయన నివాస గృహానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

మావోల అకృత్యాలు
ఎండగడుతూ బ్యానర్లు!
చింతూరు, ఆగస్టు 3: మావోయిస్టుల అకృత్యాలను ఎండగడుతూ తూర్పు గోదావరి జిల్లా చింతూరులో బుధవారం బ్యానర్లు వెలిశాయి. వారపు సంత, శబరి నది బ్రిడ్జి వద్ద ఈ బ్యానర్లు వెలిశాయి. లచ్చిగూడెం చర్చి పాస్టర్ ఊయికా మారయ్యను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో వారి చర్యలను వ్యతిరేకిస్తూ ఈ బ్యానర్లు వెలిశాయి. ఈ బ్యానర్లలో మారయ్య ఫొటోతోపాటు మావోయిస్టుల నైచ్యాన్ని పేర్కొన్నారు. మావోయిజం అంటే హత్యలతో, మందుపాతరలతో భయభ్రాంతులకు గురిచేయడమేనా అని ప్రశ్నించారు. ప్రజలకు నీతి వాక్యాలు చెప్పి వారికి అండగా ఉంటే మావోయిస్టులు ఎందుకు బాధ అని పేర్కొన్నారు. మారయ్యను హతమార్చి మానవత్వాన్ని మంట కలిపారన్నారు. పాస్టరుగా దైవ కార్యాన్ని నిర్వహించుకుంటున్న మారయ్యను చంపిన మావోయిస్టులు తప్పక ఫలితం అనుభవిస్తారని పేర్కొనడం విశేషం.

ధవళేశ్వరం వద్ద
పెరుగుతున్న గోదావరి

రాజమహేంద్రవరం, ఆగస్టు 3: గోదావరి నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదిలో నీటి ఉద్ధృతి పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి వద్ద బుధవారం 10.9 అడుగుల నీటి మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద 26.4 అడుగులకు చేరుకుంది. మంగళవారం భద్రాచలం వద్ద 21.6 అడుగుల నీటిమట్టం నుంచి క్రమేణా ఉద్ధృతి పెరుగుతూ వస్తోంది. దీంతో ధవళేశ్వరం వద్ద కూడా నీటిమట్టం పెరుగుతోంది. కాటన్ బ్యారేజి 175 గేట్లను 0.4 మీటర్లు మేరకు ఎత్తివేశారు. 2లక్షల 12వేల 909 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజి నుంచి ఈస్ట్రన్ డెల్టాకు 3,300 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 2,000 క్యూసెక్కులు, వెస్ట్రర్ డెల్టాకు 5,500 క్యూసెక్కుల జలాలను విడుదల చేస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు, ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కూడా వర్షాలతో గోదావరి నదిలో భారీగా వరద నీరు చేరుతోంది. మరో రెండు రోజుల్లో మరింతగా గోదావరి నదిలో వరద నీటి ఉద్ధృతి పెరిగేందుకు అవకాశం వుంది. కాళేశ్వరం వద్ద 6.64 మీటర్లు, పేరూరు వద్ద 9.25, దుమ్ముగూడెం వద్ద 8.45, కూనవరం వద్ద 8.59, కుంట వద్ద 7.47, కొయిదా వద్ద 10.73, పోలవరం 7.66 మీటర్లు నీటి మట్టం నమోదైంది.

త్వరలో ఎస్వీబీసీ
తమిళ చానెల్

తిరుపతి, ఆగస్టు 3: భారతీయుల సంపద భగవంతుడని, దాన్ని భావితరాలకు అందించాలని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతి అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ నమూనా ఆలయం వద్ద శ్రీ వేంకటేశ్వర భక్తిచానెల్ నూతన స్టూడియో, పరిపాలన భవనాలకు బుధవారం టిటిడి చైర్మన్ చదలవాడ, ఇఓ సాంబశివరావు భూమిపూజ నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో మొట్టమొదటిసారిగా అన్ని వసతులతో టిటిడి స్టూడియో నిర్మిస్తోందని తెలిపారు. త్వరలో ఎస్వీబీసీ తమిళ చానెల్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఎస్వీబీసీ ప్రసారాలకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోందని, కార్యక్రమాలను మరింత నాణ్యంగా రూపొందించాలని కోరారు. ఎస్వీబీసీ అన్ని భాషలలో ప్రసారాలు చేయాలన్నారు. అనంతరం టిటిడి ఇఓ మాట్లాడుతూ శ్రీవారి కార్యక్రమాలను, ధర్మప్రచారానికి ఎస్వీబీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.