ఆంధ్రప్రదేశ్‌

భారమవుతున్న ‘హంద్రీనీవా’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 31: రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు నానాటికీ భారమవుతున్నాయి. ఈ ప్రాజెక్టును ప్రారంభించి దశాబ్దకాలం పూర్తయినా ఇప్పటికీ పనులు పూర్తవలేదు. మరోవైపు ప్రాజెక్టు వ్యయం ప్రారంభం రోజుకీ ఇప్పటికీ చూస్తే రెట్టింపు అయ్యింది. తాజాగా మరోమారు నిర్మాణ వ్యయం పెంచాలని కాంట్రాక్టర్లు ఒత్తిడి తీసుకువస్తుండగా ప్రభుత్వం సైతం ఒప్పుకోవడంతో వ్యయాన్ని పెంచడానికి రంగం సిద్ధమైంది. అయితే ప్రాజెక్టు ప్రారంభం నాటికీ ఇప్పటికీ వ్యయం రెట్టింపు అయినా అనుకున్న సమయంలో ప్రాజెక్టు పనులు పూర్తవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు 2005వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉరవకొండ వద్ద భూమిపూజ చేశారు. అప్పుడు ప్రాజెక్టు రెండు దశల అంచనా వ్యయం రూ. 3,185 కోట్లుగా నిర్ణయించి మొదటి దశ పనులకు రూ. 1305 కోట్లు, రెండవ దశకు రూ. 1,880 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు మొదటి దశను 2007 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఆచరణలో పై రెండూ అనుకున్న సమయానికి పూర్తి చేయకపోవడంతో 2007 నాటికే నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. దీంతో అంచనాలను సైతం అమాంతంగా పెంచేయగా మొదటి దశ రూ. 2,774 కోట్లకు, రెండవ దశ రూ. 4,076 కోట్లకు చేరుకుంది. దీంతో నిర్మాణ వ్యయం రూ. 3,185 కోట్ల నుంచీ అమాంతంగా రూ. 6,850 కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ ప్రాజెక్టు పనులు మాత్రం ఏ ఏడాదికి ఆ ఏడాది వాయిదా పడుతూనే వచ్చాయి. ఇలా 2012వ సంవత్సరంలో అతి కష్టం మీద అరకొర పనులు పెండింగులో ఉన్నప్పటికీ మొదటి దశలో చివరగా ఉన్న జీడిపల్లి రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను విడుదల చేశారు. అలా అప్పటి నుంచీ ఇప్పటివరకూ మొదటి దశ వరకూ ఏదో ఒక రకంగా శ్రీశైలం నుంచీ నీరు చేరుతోంది. కానీ రెండవ దశ పనులు ఏ మాత్రం ముందుకు సాగకపోగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. రాష్ట్రంలో 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే 2015 నాటికి మొదటి దశలో అక్కడక్కడ పెండింగులో ఉన్న పనులతో పాటు రెండవ దశ పనులను సైతం పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా నాలుగైదుమార్లు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా కాలువల వెంట పర్యటించి హడావుడి చేశారు. కానీ 2016 నాటికి కూడా పనులు పూర్తి కాకపోగా ప్రస్తుతం నిర్మాణ వ్యయాన్ని రూ. 7,200 కోట్లకు పెంచాలన్న యోచనకు ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. ఇలా ప్రారంభం నాటి నుంచీ ఇప్పటివరకూ అంచనా వ్యయం పెరిగినా ప్రస్తుతం మరోమారు పెంచాలని భావిస్తున్నా ప్రభుత్వం చెప్పినట్లు 2016 ఖరీఫ్ నాటికి రెండు దశల పనులు పూర్తవుతాయా అనే సందేహాలు లేకపోలేదు. ప్రాజెక్టు ప్రారంభం నాటి నుంచీ ఇప్పటివరకూ చూస్తే నిర్మాణ వ్యయం రెండింతలు అవుతోంది తప్పించి పనులు మాత్రం చాలానే మిగిలి ఉన్నాయి. ప్రధాన కాలువల పరిస్థితే ఇలా ఉంటే పంట కాలువల వెంట నిర్మాణాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇప్పటికీ మొదటి దశలోనే 5 శాతం పనులు పెండింగులో ఉన్నాయ.
రెండవ దశలో ప్రధాన కాలువ పనులే సుమారు 48 శాతం దాకా పెండింగులో ఉన్నాయి. కానీ రెండు మూడు మార్లు ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షల్లో మాత్రం మార్చి నాటికి రెండు దశల పనులు పూర్తి చేస్తామని హామీలు ఇస్తున్నారు. అయితే చేసిన పనులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం మూలాన పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించడం లేదు. ఇలా హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలకు వచ్చినపుడు హడావుడి చేయడం మినహా తక్కిన సమయాల్లో పనులు ఏ మాత్రం ముందుకు కదలడం లేదు.

చిత్రం.. అనంతపురం జిల్లాలో వివిధ దశల్లో ఆగిపోయిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు

తాగునీటి సమస్యను
అధిగమిస్తాం
మంత్రి నారాయణ ఆశాభావం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జనవరి 31: రాష్ట్రంలోని ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఈసంవత్సరం తాగునీటి సమస్య అధికంగా ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆదివారం మంత్రి నారాయణ ఒంగోలు పురపాలక సంఘ కార్యాలయానికి విచ్చేశారు. ఈసందర్భంగా తనను కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందన్నారు. గోదావరి నదిలో మూడు టిఎంసిల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టి ఐదు నెలల్లో పూర్తిచేసి ఎనిమిది టిఎంసిల నీటిని కృష్ణానదికి తరలించారన్నారు. వచ్చే సంవత్సరం నాటికి 80 నుండి 120 టిఎంసిల నీటిని తీసుకురావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ నీటి ద్వారా మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 71 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోను, 29 శాతం జనాభా పట్టణాల్లో నివశిస్తున్నారని పట్టణీకరణ పెంచడంవల్ల ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయన్నారు. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో సిఎం పట్టణీకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి తెలిపారు. పురపాలక పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి తిరిగి సాలిడ్‌వేస్ట్, లిక్విడ్ వేస్ట్‌ను సక్రమంగా సేకరించాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో సాలిడ్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ముఖ్యమంత్రి నీరు-చెట్టు కార్యక్రమం చేపట్టడటం వల్ల పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయని, ఫలితంగా ప్రస్తుతం పలు జిల్లాల్లో భూగర్భజలాలు పెరగటంతో తాగునీటి సమస్యలు, కరవు పరిస్థితులు తలెత్తడం లేదని మంత్రి నారాయణ తెలిపారు.

అభివృద్ధి అంతా అమరావతిలోనే

సిపిఎం నేత రాఘవులు విమర్శ

మదనపల్లె, జనవరి 31: ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తొలిసారిగా పరిపాలన చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో పరిశ్రమలు, విద్యాసంస్థలు, వైద్యసంస్థలు, అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలన్నీ అమరావతిమయం అవుతున్నాయని సిపిఐ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. ధావోస్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి వ్యాపారులను రాష్ట్రానికి ఆహ్వానించడం, వారు ఏర్పాటు చేయనున్న పరిశ్రమలు, ప్రాజెక్టులు, అభివృద్ధి అంతా అమరావతి, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాలకే పరిమితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధిపై ఆదివారం చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణం బిటి కళాశాల ఆవరణలో సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడారు. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని ప్రజలు కోరుకోవడంలో తప్పు లేదన్నారు. 1956లో ఏర్పడిన 60 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని 44 ఏళ్లు రాయలసీమకు చెందిన రాజకీయ పార్టీల నేతలే ముఖ్యమంత్రులుగా పరిపాలన చేసినా ఎక్కడా రాయలసీమ అభివృద్ధి జరగలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రం సిఎంగా చంద్రబాబు చేస్తున్న పరిపాలన, కొత్తరాష్ట్రంలో కూడా అదే పంథాను అనుసరిస్తున్నారని, ఒకే ప్రాంతానికి అభివృద్ధిని పరిమితం చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వెనుకబడిందని, నేడు విభజనతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని, ఈ తరహాలో రాయలసీమ ప్రత్యేకరాష్ట్రం కావాలని ప్రజలు కోరుకోవడం తప్పేమిలేదన్నారు. కృష్ణానది ఒడ్డున ఇల్లు కట్టుకున్న సిఎం చంద్రబాబు సీమ గురించి మాట్లాడటం లేదన్నారు. వ్యాపారాలు, పరిశ్రమలు, ఓడరేవులు, ఎయిమ్స్, ఐటి తదితర పెద్దపెద్ద పరిశ్రమలన్నీ అమరావతి పరిసర ప్రాంతాల్లోనే నిర్మించేందుకు విదేశీయులను ఆహ్వానిస్తున్నారని అన్నారు.

కోటి రూపాయల విలువైన
ఎర్రచందనం స్వాధీనం
శ్రీకాళహస్తి, జనవరి 31: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అబ్బాబట్టపల్లె నుండి అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆదివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన డ్రైవర్ పోలీసు విచారణలో శ్రీకాళహస్తికి చెందిన టిడిపి నేతకు చెందిన అనుచరుడి సహకారంతో ఈ స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇటీవల అరెస్టయిన శ్రీకాళహస్తి మండలం, అబ్బాపట్లపల్లి గ్రామానికి చెందిన మునిశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బంది, శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో అబ్బాపట్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఓటిగుంట చెరువులో దాచిన 64 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన బత్తెయ్య అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం ఏ గ్రేడ్ రకానికి చెందిందని, దీని విలువ కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి పోలీసులు 20 మంది జాబితాను కూడా సేకరించారు. ఈనేపథ్యంలో మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
ఉదయగిరి, జనవరి 31: నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఉదయగిరి మండల పరిధిలోని గండిపాళెంకు చెందిన మిట్టా శ్రీ్ధర్ కుటుంబ సభ్యులతో మోటార్‌సైకిల్‌పై పుల్లాయిపల్లిలోని బంధువుల ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో సీతారామపురం నుండి ఉదయగిరికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మిట్టా కార్తీక్ (7) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులోని ప్రయాణికులు వెంటనే 108కి సమాచారం అందించడంతో గాయపడ్డ వారిని ఆ వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర గాయాలైన మిట్టా సాత్విక్ (4) చిన్నారి పరిస్థితి విషమించడంతో ఆత్మకూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న శ్రీ్ధర్, విజయ, దీపక్‌లను బంధువులు ఆత్మకూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మిట్టా శ్రీ్ధర్ (34), మృతి చెందగా వైద్యశాలలో చికిత్స పొందుతు మిట్టా విజయ (28) మృతి చెందారు. మిట్ట దీపక్ (9) చిన్నారి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఆర్‌టిసి బస్సు డ్రైవర్ వెంకటేశ్వర్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కైలాసగిరిలో తెగిపడిన కేబుల్ కార్
ఆరుగురికి గాయాలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 31: విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో గల కైలాసగిరి రోప్ వే కేబుల్ కార్ తెగిపడటంతో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం 5.15 గంటల సమయంలో కైలాసగిరి నుంచి రోప్‌వే కేబుల్‌కార్ దిగుతున్న సమయంలో బోల్టు విడిపోవడంతో కిందకు పడిపోయింది. ఈ సంఘటనలో కేబుల్‌కార్‌లో ఉన్న ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, మరొకరికి గాయాలయ్యాయి. వీరిలో చిన్నారితోపాటు మరొకరిని చికిత్స నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వారు. కేబుల్ కార్ 15 అడుగుల ఎత్తులో నుంచి తెగిపడటంతో వీరంతా స్వల్ప గాయాలతో బయటపడగలిగారు. కాగా, కేబుల్ కార్ నిర్వహణ లోపం వల్ల గతంలో రెండు సార్లు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. 200 అడుగుల ఎత్తులో ఉన్న కైలాసగిరికి చేరుకునేందుకు రోప్‌వే కేబుల్ కార్ సదుపాయం ఉన్నప్పటికీ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

భారీ మొత్తంలో
జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
బొబ్బిలి, జనవరి 31: విజయనగరం జిల్లా బొబ్బిలిలో భారీ ఎత్తున జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. 29 బ్యాగుల్లో జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని చిన్న బజార్‌లో దాడులు నిర్వహించగా జి.తవిటయ్య వద్ద 3 వేల 200 జిలెటిన్ స్టిక్స్, 4 వేల ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, మరో 4వేల నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించాయన్నారు. గెంబలి లక్ష్మీనారాయణ వద్ద 2వేల 200 జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్లు 900, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు 4 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నవతా ట్రాన్స్‌ఫోర్ట్ సమీపంలో మరో 8 బ్యాగుల జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకొని ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుడు పి.సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీటన్నిటికి ఎటువంటి అనుమతులు లేవని ఎస్‌ఐ అమ్మినాయుడు విలేఖరులకు తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాపారులకు, ప్రజలకు ఆయన అవగాహన కల్పిస్తూ ఎక్కడైనా జిలెటిన్ స్టిక్స్ సమాచారం ఉంటే తక్షణం తమకు తెలియజేయాలన్నారు.

కేంద్రానికి కనువిప్పు కలిగించేందుకే..

అనంతలో రాహుల్ పర్యటనపై రఘువీరా స్పష్టీకరణ
వలసలు ఆపకపోతే ఉద్ధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరిక

హిందూపురం, జనవరి 31: కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కరవు పీడిత ప్రాంతాల్లో వలసల నివారణకు కనీస చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ కేంద్రానికి కనువిప్పు కలిగించేందుకు ఈ నెల 2వ తేదీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో పర్యటించనున్నట్లు పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. కరవు కాటకాలతో తల్లడిల్లుతున్న అనంతపురం జిల్లా లాంటి ప్రాంతాల్లో వలసలను ఆపేందుకు గత యుపిఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. మన్మోహన్, రాహుల్ పర్యటన గురించి ఆదివారం రఘువీరారెడ్డి జిల్లాలోని హిందూపురం, మడకశిర, పుట్టపర్తి నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశాలు, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే 17 లక్షల కుటుంబాలు పొట్టకూటి కోసం బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లాయన్నారు. ప్రధానంగా కరవు పీడిత ప్రాంతాలైన రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది కుటుంబాలు ఉపాధి పనులు లభించక చిన్నారులతో సహా వలస వెళ్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. వలసల నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని ఉంటే ఈ దుస్థితి ఏర్పడేది కాదన్నారు. ఎన్డీయే, టిడిపి ప్రభుత్వాలు సంపన్న వర్గాలకు వత్తాసు పలుకుతూ పేద ప్రజలను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బండ్లపల్లిలో జరిగే రాహుల్, మన్మోహన్‌సింగ్ పర్యటనకు జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గతంలో పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లకు ఉపాధి హామీ పథకంపై అజమాయిషీ ఉండగా ప్రస్తుతం జన్మభూమి కమిటీల పేరిట చంద్రబాబు ప్రభుత్వం పచ్చచొక్కాలకు పెత్తనం కట్టబెట్టిందని రఘువీరా రెడ్డి ధ్వజమెత్తారు.

విజ్ఞాన్ వర్సిటీలో విద్యార్థిని
అనుమానాస్పద మృతి

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్‌డిఒ, డిఎస్‌పి
కాల్‌డేటా ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్న పోలీసులు

చేబ్రోలు, జనవరి 31: గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో బిటెక్ 2వ సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన సంచలనం కలిగించింది. నాల్గవ అంతస్తు భవనం నుంచి దూకి చనిపోయిన మృతురాలి ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించకపోవడం పట్ల పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి చేబ్రోలు ఎస్‌ఐ కొరబండి ఆరోగ్యరాజు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం చిన్నారికట్ల గ్రామానికి చెందిన ఉడుముల గురవారెడ్డి వృత్తి రీత్యా న్యాయవాది. ఈయన గతంలో పిపిగా కూడా పనిచేశారు. తన కుటుంబంతో ఆయన కొంతకాలంగా దర్శిలో నివాసం ఉంటున్నారు. అయితే గురవారెడ్డి కొడుకు రుషీందర్ తాడేపల్లి కెఎల్ యూనివర్సిటీలో బిటెక్ 3వ సంవత్సరం చదువుతుండగా, చిన్న కూతురు హరిణి (19) వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో బిటెక్ 2వ సంవత్సరం చదువుతోంది. అదే యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్ రూమ్ నెంబర్ 7లో మరో ముగ్గురు విద్యార్థినులతో కలిసి ఉంటోంది. శనివారం రాత్రి 8.45 గంటల సమయంలో హరిణి హాస్టల్ భవనం నాల్గవ అంతస్తు కిటికీలో నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న హరిణిని చికిత్స నిమిత్తం యూనివర్సిటీ యాజమాన్యం గుంటూరులోని రమేష్ హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి 10.45 గంటల సమయంలో మృతి చెందింది. హాస్పిటల్ డాక్టర్ల ద్వారా సమాచారం తెలుసుకున్న చేబ్రోలు ఎస్‌ఐ ఆరోగ్యరాజు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు. ఆదివారం ఉదయం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో హరిణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. హరిణి మృతిని అనుమానాస్పద మృతిగా చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తెనాలి ఆర్‌డిఒ జి నరసింహులు, గుంటూరు సౌత్ డిఎస్‌పి శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి సంఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించారు. అదేవిధంగా హరిణితో పాటు రూమ్‌లో ఉంటున్న ముగ్గురు విద్యార్థినులతో పాటు మరికొంతమంది విద్యార్థుల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో హరిణి తన తండ్రి గురవారెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్ కాల్‌డేటా ద్వారా పోలీసులు మరికొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు.
యాజమాన్య నిర్లక్ష్యమే కారణం..
విజ్ఞాన్ యూనివర్సిటీ యాజమాన్యం, లేడీస్ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వలనే తన బిడ్డ హరిణి మృతి చెందిందని మృతురాలి తండ్రి గురవారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరిణి 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్‌లోనే ఉండి చదువుకుందని, కార్పొరేట్ యూనివర్సిటీలో చదివించడం వల్లే తన బిడ్డ తనకు దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

సమన్వయ
లోపం వల్లనే..

రాజధానిలో సమస్యలు?
రాజధానిలో సమస్యలు?
రాజధానిలో సమస్యలు?

ౄ రెవెన్యూ, సిఆర్‌డిఎ, ప్రజాప్రతినిధుల మధ్య అవగాహన లేమి ౄ సిఎం జోక్యం అనివార్యమంటున్న రైతులు

ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జనవరి 31: రాజధాని నిర్మాణాలపై నానాటికీ పెరుగుతున్న వ్యతిరేకతకు రెవిన్యూ, సిఆర్‌డిఎ అధికారుల పనితీరు, ప్రజాప్రతినిధుల అవగాహన లేమే ప్రధాన కారణంగా పేర్కొంటూ రైతులు ముఖ్యంగా మహిళలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సులు నిర్వహించిన సమయంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ పలుమార్లు సిఆర్‌డిఎ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా అధికారులు ముందుకు వెళ్తుండటంతో గ్రామాల్లో అసంతృప్తి రాజ్యమేలుతుందని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. భూసమీకరణ ప్రారంభించిన సమయంలో మంత్రులు గ్రామాల్లో స్వయంగా పర్యటిస్తూ స్థానిక ఎమ్మెల్యేకుప్రాధాన్యత ఇవ్వటంలేదని విమర్శలు వచ్చిన నేపథ్యంలోప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రకటించారు. అయినప్పటికీ ఎటువంటి ప్రాధాన్యత లభించటంలేదని మాస్టర్‌ప్లాన్ అవగాహన సదస్సుల్లో బహిర్గతమైంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సైతం తమకు సమాచారం లేదంటూ వ్యాఖ్యానించటంతో ప్రజల అసంతృప్తిపై అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. దీని కారణంగానే లింగాయపాలెంలో మంత్రులు స్వయంగా వచ్చి రైతుల సమస్యలను వారంలోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఎలా నమ్మాలంటూ ఎదురు ప్రశ్నించారు. రాజధాని నిర్మాణాలకు మిమ్మల్ని నమ్మి భూములివ్వలేదంటూ స్థానిక నాయకులు మంత్రులకు స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సిఆర్‌డిఎ అధికారులు ముందస్తుగా తమ దృష్టికి తీసుకు వస్తే ఎటువంటి వివాదాలకు తావులేకుండా పరిష్కరించేందుకు అవకాశం ఉండేదని ఎమ్మెల్యే చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచిన ఎక్స్‌ప్రెస్ హైవేలు గ్రామాల మధ్యగా వెళ్లటాన్ని జీర్ణించుకోలేని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రకటిస్తానన్న ప్యాకేజిపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. దీంతోగ్రామాల్లో మరింత ఆందోళన నెలకొంది. లింగాయపాలెం, ఐనవోలు, వెంకటపాలెం, ఉద్ధండరాయునిపాలెం గ్రామాల్లో మంత్రులు నిర్వహించిన రహస్య సమావేశాలు సత్ఫలితాలను ఇవ్వకపోవటానికి కారణం ప్యాకేజిపై స్పష్టత కొరవడటమేనని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. రెవిన్యూ సర్వేయర్లు జాయింట్ కలెక్టర్ సూచనల మేరకు గ్రామకంఠాల జాబితాను రూపొందించి 5 నెలలు గడుస్తున్నప్పటికీ సిఆర్‌డిఎ అధికారులు ప్రకటించకుండా జాప్యం చేయటంపై కూడా గ్రామాల్లో అసంతృప్తికి కారణంగా ఉంది. రెవిన్యూ, సిఆర్‌డిఎ అధికారుల్లో నెలకొనివున్న సమన్వయ లోపం, ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్న అవగాహన లేమి కారణంగా 29 గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మహిళలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై శాపనార్ధాలు పెడుతున్నారు. ఇప్పటికే తాడేపల్లి మండలంలోని పెనుమాక, ఉండవల్లి, మంగళగిరి మండలంలోని బేతపూడి, నిడమర్రు, ఎర్రబాలెం రైతులు, గ్రామాల ప్రజలు ప్రభుత్వం రాజధానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటి వరకు అన్నివిధాలా అనుకూలంగా వ్యవహరించిన తుళ్లూరు రైతులు, ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తే రాజధాని నిర్మాణాలపై ముందుకు వెళ్లటం జటిలమయ్యే పరిస్థితులున్నాయి. అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని గ్రామాల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత ముదిరిపాకాన పడకముందే స్పష్టమైన వైఖరితో రైతుల అనుమానాలను నివృత్తిచేసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు పొంచి ఉన్నాయి.

ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ నియామకంతో
పులకించిపోతున్న దుగ్గిరాల

దుగ్గిరాల, జనవరి 31: గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాష్ట్ర ఎన్నికల అధికారి కానున్నారన్న వార్తతో దుగ్గిరాల పులకించిపోతోంది. గ్రామానికి చెందిన రవీంధ్రనాథ్ చౌదరి, లక్ష్మిల కుమారుడు ఐఏఎస్ అధికారి కావటంతో గ్రామస్తులు ఎంతో ఆనందపడ్డారు. అనంతరం గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా విధులు చేపట్టిన సమయంలో మరింతగా సంతోషించారు. రాష్ట్ర నూతన ఎన్నికల అధికారిగా నియమితులయ్యారని తెలిసి ఆనందభరితులౌతున్నారు. జన్మనిచ్చిన ఊరికి వచ్చినప్పుడు విద్య నేర్చిన పాఠశాల దుస్థితిని చూసి చలించిన రమేష్‌కుమార్ నిమ్మగడ్డ ఫౌండేషన్ ద్వారా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పురాతన భవనాలకు మరమ్మతులు చేయించి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవనాలు నిర్మించటంలో కీలకపాత్ర పోషించారు. పాఠశాల శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించటంతోపాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మాజీ కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరులను దుగ్గిరాలకు తీసుకువచ్చి ఉత్సవాలకు గుర్తింపు, తద్వారా దుగ్గిరాల ఖ్యాతి రాష్టవ్య్రాపితం చేశారు. గవర్నర్ రాకతో దుగ్గిరాల ప్రధాన రహదారితో పాటు పలువీధులు ఎంతో బాగుపడ్డాయి. రమేష్‌బాబును స్ఫూర్తిగా తీసుకుని పూర్వ విద్యార్థులందరూ పాఠశాల అభివృద్ధికి రూ.52 లక్షలు వితరణగా ఇచ్చారు.