ఆంధ్రప్రదేశ్‌

విద్యుదాఘాతానికి ఏనుగు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలమనేరు, జూలై 21: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గొబ్బిళ్ల కోటూరు వద్ద ఆదివారం విద్యుదాఘాతానికి ఏ గున్న ఏనుగు మృతి చెందింది. వారం రోజుల కిందట ఇదే అటవీ ప్రాంతంలో మదపుటేనుగు దాడిలో గాయపడ్డ ఒక ఏనుగు మృతి చెందగా, ఆదివారం మరో ఏనుగు విద్యుదాఘాతానికి బలైన సంఘటన ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. కొద్ది రోజులుగా పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు తరచూ పంట పొలాలపై దాడులు చేయడం సర్వసాధారణమైంది. ఈనేపథ్యంలో శనివారం రాత్రి గొబ్బిళ్ల కోటూరు అటవీ ప్రాంతంలో ఏనుగులు ఆహారం కోసం గ్రామాల సమీపంలోని పొలాల్లోకి వచ్చాయి. తిరిగి అడవిలోకి వెళుతుండగా దారిలో విద్యుత్ తీగలు కిందకు ఉండడం, అదేచోట గున్న ఏనుగు తొండం పైకెత్తడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని స్థానికులు ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో ఈ ఏనుగు మృతి చెందిందని స్థానికులు విద్యుత్ శాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలమనేరు అటవీ పరిసర ప్రాంతాల్లో ఈ సంవత్సరంలో ఐదు ఏనుగులు పలు కారణాలతో మరణించాయని, వాటి పరిరక్షణకు అటవీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఏనుగుకు అటవీ అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు.
గున్న ఏనుగు మృతితో తల్లడిల్లిన తల్లి ఏనుగు
గొబ్బిళ్ల కోటూరు అటవీ ప్రాంతంలో విద్యుదాఘాతంతో గున్న ఏనుగు మృతి చెందడంతో తల్లి ఏనుగు తల్లడిల్లిపోయింది. గున్న ఏనుగు మృతి చెందిందన్న విషయం తెలియని తల్లి ఏనుగు తన బిడ్డను తనతోపాటు అడవిలోకి తీసుకెళ్లాలని ప్రయత్నించిన వైనం అందరినీ కలచి వేసింది. మృతి చెందిన గున్న ఏనుగు చుట్టు తిరుగుతూ దానిని లేపడానికి ఘీంకరిస్తూ శతవిధాలుగా ప్రయత్నించటం చూపరులను కంటతడి పెట్టించింది. సుమారు అరగంటపాటు మృతి చెందిన గున్న ఏనుగు కోసం తల్లి ఏనుగు తాపత్రయపడినా స్పందన లేకపోవడంతో ఆ తల్లి ఏనుగు ఘీంకరిస్తూ చివరకు అడవిబాట పట్టింది.

చిత్రం...విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన పిల్ల ఏనుగు ఎంతకూ లేవకపోవడంతో తల్లడిల్లుతున్న తల్లి ఏనుగు