రాష్ట్రీయం

మోదీ పాలన చూసే చేరికలు: కన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ పారదర్శక పాలన, అభివృద్ధిని చూసి ఎంతో మంది ఆకర్షితులై బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు షేక్ ఖాజా ఆలీ నేతృత్వంలో 300 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. నగరంలోని ఒక హోటల్‌లో జరిగిన చేరికల సందర్భంగా నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో కన్నా మాట్లాడుతూ ప్రధాని మోదీ ఐదేళ్ల పాలన పట్ల దేశ ప్రజలంతా సంతృప్తి చెందారన్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీలోకి చేరికలు పెరిగాయని అన్నారు. పార్టీలోకి వస్తున్న షేక్ ఖాజా ఆలీకి పార్టీ కండువా కప్పి హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పోలవరం ముంపు మండలానికి చెందిన వైసీపీ, జనసేన పార్టీల నాయకులు దొంతు యోగేశ్వరరావు, పాటిమి కృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు బీజేపీలో చేరారు. మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం, ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీఈఓల నిరసనకు సంఘీభావం
తొలగించిన ఎంపీఈఓలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఏపీ వ్యవసాయ, ఉద్యానశాఖ ఎంపీఈఓ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద రెండు వారాలుగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ నిరసన ప్రదర్శనను కన్నా లక్ష్మీనారాయణ సోమవారం ఉదయం సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా తొలగించడం వల్ల 4700 కుటుంబాలు వీధిన పడ్డాయని, పని చేస్తున్నవారిని తొలగించడం అన్యాయమని, వెంటనే తొలగించిన వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు.
3 లక్షల మంది రైతుల చేరికే లక్ష్యం
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 3 లక్షల మందిని బీజేపీలోకి సభ్యులుగా చేర్చాలని రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. బీజేపీ విజయవాడ నగర శాఖ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం సోమవారం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కన్నా మాట్లాడుతూ రైతులకు మునుపెన్నడూ ఇవ్వని రీతిలో బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా, భూసార పరీక్షా కార్డులు, వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధతు ధరలు పెంపు, ఫసల్ బీమా పథకం అమలు, కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అమలు చేయడం ద్వారా దేశంలోని 14.50 కోట్ల రైతులందరికీ ఏడాదికి రూ. 6 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. సభాధ్యక్షులుగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఏటుకూరి సూర్యనారాయణరాజు వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునిల్ డియోధర్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల అంజిబాబు, మారుతిరెడ్డి, భక్తసాయిరాం, ఉపాధ్యక్షులు వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న కన్నా