ఆంధ్రప్రదేశ్‌

గ్రామాలను దత్తత తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్) ఆగస్టు 27: విద్యార్థులు దగ్గరలోని గ్రామాలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధికి విశేష కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఆవరణలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా సిఎం చంద్రబాబునాయుడు మొక్కలు నాటారు. ఈసందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ వనం-మనం కార్యక్రమం ద్వారా ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించటం జరిగిందన్నారు. 5కోట్ల మంది ప్రజలు వనం-మనం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చెట్లు నాటటం, పరిసరాల పరిశుభ్రత, నీటి పరిరక్షణ ద్వారా రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి సంకల్పంచినట్లు ఆయన వివరించారు. ప్రతి 4వ శనివారం విధిగా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కృష్ణా పుష్కరాలల్లో ఏ విధంగా పనిచేస్తారో వనం-మనం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చదువుకున్నప్పుడే నిర్వహణ సామర్థ్యం పెంచుకోవాలని, అనుభవం రావాలంటే విద్యార్థి దశలోనే పనిచేసే విధానం ఉండాలన్నారు. విజయవాడ నగరాన్ని సుందరీకరణలో భాగంగా గోడలపై పోస్టరులు, అసంబద్ద రాతలను తొలగించటం జరిగిందన్నారు. ఆడపిల్లల రక్షణకు సాంకేతిక పరిజ్ఞానం విధిగా వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు.
విద్యార్థులు తమ తెలివితేటలను క్షేత్రస్థాయిలో వినియోగిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. సిద్ధార్థ ఆకాడమీ రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మక కళాశాల ఉండి మంచి విద్యతోపాటు, ఉత్తమమైన క్రీడాకారులను తీర్చిదిద్దే విధానాన్ని కళాశాల కమిటీని అభినందించారు. కళాశాల చాలా పరిశుభ్రంగా ఉందని, ఏడున్నర ఏకరాల స్థలంలో ఉన్న కళాశాలలో వర్షపునీరు బయటకు వెళ్లే ఆస్కారం లేదని వాటిని భూగర్భ జలంగా మార్చాలని సిఎం చంద్రబాబు సూచించారు. బిల్డింగులు కంటె చెట్లు చాలా బాగున్నాయని కళాశాలను కార్పొరేట్ కళాశాలగా తీర్చిదిద్దాలని సిఎం ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించాలని, రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటం జరుగుతోందన్నారు.
కృష్ణా పుష్కరాలకు దాదాపు 2కోట్ల మంది ప్రజలు వచ్చారని అయినప్పటికీ విజయవాడ నగరం ఎంతో పరిశుభ్రంగా ఉందని స్వచ్చ విజయవాడ చిరస్థాయిగా ఉండాలన్నారు. కళాశాలలో విద్యార్థులకు ప్లేస్‌మెంట్ వచ్చేలాగా కళాశాలను తయారు చేయాలని విద్యార్థుల కోసం కంపెనీలు ఎదురు చూడాలన్నారు. అంతకు ముందు కళాశాల ఆవరణలో చంద్రబాబు మొక్కను నాటారు.
శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళ కళాశాలలో శనివారం సాయంత్రం చంద్రబాబు అత్యాధునిక వసతులతో కూడిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండోర్ స్డేడియాన్ని మహిళ బ్యాడ్‌మింటన్ అకాడమీగా మార్చి అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలోనే వివిధ జిల్లాల నుండి ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి కళాశాలలో అడ్మిషన్ ఇచ్చి ఆకాడమీలో శిక్షణ ఇవ్వనున్నట్లు సిఎం తెలిపారు. అవసరమైతే సెంటర్ ఫర్ ఎక్సెలెన్‌గా మార్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ క్రీడలకు ఈ అకాడమీ నుంచే క్రీడాకారులు రావాలన్నారు. సెంటర్ ఫర్ ఎక్సెలెన్‌కు అవసరమైన బడ్జెట్‌ను విధి విధానాలను రూపొందించాలని క్రీడాశాఖ మంత్రి, శాప్ చైర్మన్‌లను సిఎం ఆదేశించారు. ప్రారంభం అనంతరం రాకెట్ చేతపట్టి సిఎం క్రీడాకారులతో కలిసి షటిల్ బ్యాట్‌మింటన్ ఆడారు.

చిత్రం.. విజయవాడ వనం - మనంలో మొక్క నాటుతున్న చంద్రబాబు * ఇండోర్ స్టేడియంను ప్రారంభించి షటిల్ ఆడుతున్న ముఖ్యమంత్రి